close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆస్తులా? అనుబంధాలా?

ఆస్తులా? అనుబంధాలా?
- టి.కొండబాబు

స్తుల పంపకం అనగానే శ్యాంబాబులో కలవరం మొదలైంది. అన్నయ్య తన వాటా పంచుకుపోతే ‘తను సేద్యం చేయడానికి మిగిలే భూమి ఎంత? దానితో నా కుటుంబం గడిచేదెట్లా?’ అని ఆలోచనలోపడ్డాడు. ఇదే ఆలోచనతో ఉన్న శ్యాము భార్య సత్యవతి ‘మీ అన్నయ్యను ఖర్చుపెట్టి పైచదువులు చదివించారు కదా, మీకు చదువు ఖర్చు అవ్వలేదు కాబట్టి మనకు ఎక్కువ వాటా కోరండి’ అని సలహా ఇచ్చింది. అది కొంతవరకు సరైందే కానీ ఇట్లా కోరితే తన అన్నయ్య ఎక్కడ బాధపడతాడోనని తటపటాయించాడు శ్యాము. ‘మీరు అడగకపోతే... పంపకాల రోజున మా మేనమామని పిలిపిస్తాను. మన తరఫున ఆయనే అడుగుతాడు’ అని ఆమె సలహా ఇచ్చింది. అన్యమనస్కంగానే ‘సరే’ అన్నాడు శ్యాము.

అమరావతి దగ్గర దిడుగు వెంకయ్య, లక్ష్మి దంపతులది. తమకున్న ఐదు ఎకరాల పొలాన్ని సాగుచేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలు రాంబాబు, శ్యాంబాబులను చదివించుకున్నారు. పెద్దవాడు రాము చదువుకుని హైదరాబాద్‌లో ఒక మాదిరి ఉద్యోగం చేస్తున్నాడు. శ్యాము చదువంటే బద్దకం చూపాడు. తన కొద్దిపాటి చదువుకు ఏ ఉద్యోగమూ రాక, వయసు మీదపడిన తన తండ్రికి బదులు తనే ఇప్పుడు పొలం సాగుచేస్తున్నాడు. చిన్నతనంలో అన్నదమ్ములిద్దరూ చిన్నచిన్న విషయాలకు కొట్లాడుకున్నా, ఎప్పుడూ కలిసిమెలిసే ఉండేవారు. రాము పెళ్ళయ్యేంతవరకు జీతంలో తన ఖర్చుల వరకు ఉంచుకుని మిగతా మొత్తం తన తల్లిదండ్రులకే పంపించాడు. శ్యాము తను వ్యవసాయంలో సంపాదించినదంతా తన అన్నలాగే తల్లిదండ్రులకే ఇచ్చేవాడు. పెళ్ళిళ్ళు అయ్యాక రాము ఇప్పుడు తన సంపాదన అంతా తనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. శ్యాము ఉమ్మడి పొలాన్ని సాగుచేస్తూ జీవిస్తున్నాడు. తన అన్న కుటుంబం వాడుకకు సరిపడా ధాన్యం మాత్రం పంపిస్తున్నాడు. ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు. వెంకయ్య, లక్ష్మి దంపతులు ఎప్పుడైనా పెద్దకొడుకు దగ్గరకు వెళ్ళి రెండుమూడు నెలలు ఉండి వచ్చేవారు. అలాగే రామువాళ్ళు పండగకూ పబ్బానికీ తమ వూరు వచ్చేవారు. తల్లిదండ్రులతో, తమ్ముడువాళ్ళతో ఆనందంగా గడిపి వెళ్ళేవారు. ఆ నాలుగు రోజులూ ఇల్లు సందడిగా ఉండేది. తోడికోడళ్ళు ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. ఆ నాలుగు రోజులూ ఖర్చుల విషయంలో అన్నదమ్ములిద్దరూ సందర్భాన్నిబట్టి పెట్టేవారు. మేనత్తల రాకపోకలూ, పెట్టుపోతలూ సహజంగా వూరిలో ఉన్న శ్యాము దగ్గరే జరిగేవి. తమది ఉమ్మడి కుటుంబమని లక్ష్మమ్మ ఇరుగుపొరుగుకు చెప్పుకుని మురిసిపోయేది. బయటకు కనపడకపోయినా వెంకయ్య కూడా తన పిల్లలను చూసుకుని ఆనందించేవాడు.

 పిల్లలకు పిల్లలు పుట్టారు... వారూ పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి కొడుకులకు ఆస్తులు పంచి ఇవ్వాలని అనుకుంది లక్ష్మమ్మ. భార్య నిర్ణయానికి వెంకయ్య కూడా సరేనన్నాడు. ఆ మాటే వాళ్ళు పిల్లలకూ చెప్పారు. అలాగేనన్నారు వారు.

ఆరోజే ఆస్తి పంపకాలు. రాము భార్య ఇందిర పిలవడం వల్ల ఆమె మేనమామ కూడా వచ్చాడు. కోడళ్ళ మేనమామలిద్దరూ రావడం చూసి, ఏం పంచాయతీ అవుతుందో ఏమోనని భయపడి లక్ష్మమ్మ కూడా కాస్త మాటా మంచీ తెలిసిన తన అన్నయ్య సుబ్బారావును పిలిపించింది. బయట నుంచి వచ్చిన చుట్టాలందరూ పరస్పరం పలకరించుకున్నారు. పైకి మామూలుగా ఉన్నా అందరిలో చిన్న కలవరం కనపడుతోంది. పంపకాలు మొదలయ్యాయి. లక్ష్మమ్మే తన తరఫునా, తన భర్త తరఫునా పంపకం మొదలుపెట్టింది. ‘‘ఇందులో పెద్ద సమస్యేముంది! పది సెంట్ల భూమిలో కచ్చితంగా మధ్యలో ఉన్న ఇల్లు చెరిసగం... ఐదు ఎకరాల పొలం చెరి సగం... రెండు ఎద్దులు చిన్నవాడికి, రెండు ఆవులు పెద్దవాడికి, రెండు దూడలు చెరొకటి. నా నగలు తూకం వేసి చెరి సగం’’ అని చెప్పిందామె. అందరూ ఒక నిమిషం మౌనంగా ఉన్నారు.

తర్వాత చిన్నకోడలు సత్యవతి మేనమామ నోరు విప్పాడు. ‘‘పెద్దవాడికి పైచదువులకు ఖర్చయింది. చదువు ఖర్చు లేదు కాబట్టి చిన్నవాడికి ఎక్కువ వాటా ఇవ్వడం న్యాయం’’ అన్నాడు.

ఈ మాటతో లక్ష్మమ్మ కలవరంగా చూసింది. పెద్ద కోడలు ఇందిర మేనమామ జోక్యం చేసుకుంటూ ‘‘రాముకు చదువు అబ్బింది కాబట్టి చదివించారు. శ్యాము కూడా చదువుకుని ఉంటే చదివించేవారు. కాబట్టి ఇది అర్థంలేని వాదన. పైగా పెద్దవాడికి ‘జ్యేష్టుడి వాటా’ అదనంగా రావాలి. అది మన సంప్రదాయం. లక్ష్మమ్మగారు ఎందుకో ఈ విషయం మరిచిపోయారు’’ అన్నాడు.

సత్యవతి మేనమామ మళ్ళీ నోరు విప్పాడు ‘‘జ్యేష్టుడి వాటా అనేది కేవలం సంప్రదాయం. ఇద్దరికీ ఇష్టమయితేనే సంప్రదాయాన్ని పాటించాలి. ఒకవేళ పాటించినా నామమాత్రంగానే పాటించాలి. ఆ పేరుతో కొడుకుల విషయంలో పక్షపాతం చూపించకూడదు. ఈ రోజుల్లో చట్టప్రకారం ఇద్దరికీ సమానంగానే పంచుతున్నారు. కాకపోతే చిన్నవాడికి పొలం మీదనే బతుకుతెరువు. పెద్దవాడికి ఉద్యోగం మీద ఆదాయం ఉంది కాబట్టి ఉద్యోగాన్ని కూడా ఆస్తిగా భావించి, పొలంలో కానీ, ఇంటి స్థలంలోగానీ చిన్నవాడికే ఎక్కువ వాటా ఇవ్వాలి’’ అన్నాడు. వీరి వాదనలతో శ్యాము మొహం కలతగా మారిపోయింది. రాము నిర్భావంగా వింటున్నాడు.

‘‘అదెట్లా కుదురుతుందండీ? తండ్రికి ఉద్యోగం ఉండి, అది వారసత్వ హక్కుతో కొడుకుకు వస్తేనే దానిని ఆస్తిగా పరిగణించాలి. తను శ్రమపడి చదువుకుని సంపాదించుకున్న ఉద్యోగం అది. కాబట్టి ఉద్యోగాన్ని వారసత్వ ఆస్తిగా చూడకూడదు. పెళ్ళయిన ఈ పదేళ్ళూ పెద్దవాడు ఉమ్మడి ఆస్తుల వూసు లేకుండా బతికాడు. చిన్నవాడేమో ఇంతకాలం ఉమ్మడి పొలంపై బతికాడు. ఉమ్మడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి వాస్తవం మాట్లాడాల్సి వస్తే జ్యేష్ట వాటాతోపాటు ఈ పదేళ్ళ పొలం కౌలు, ఇంటి అద్దె కూడా జమ కట్టాలి’’ అన్నాడు ఇందిర మేనమామ. ఈ మాటతో అందరిలో ఆందోళన మొదలయింది.

‘‘ఇప్పటివరకూ తల్లిదండ్రుల బాధ్యతను, వారికి రోగం వచ్చినా రొష్టు వచ్చినా చూసినవాడు చిన్నవాడు. మేనత్తలకు పెట్టుపోతలు చూసినవాడు చిన్నవాడు. మరి దాని సంగతేంటి?’’ అన్నాడు సత్యవతి మేనమామ.

‘‘ఏడాదికి నాలుగైదు నెలలు పెద్దవాడు కూడా తల్లిదండ్రులను తీసుకెళ్ళి చూశాడు. పైగా చిన్నవాడి దగ్గర జరగని పట్నవాసపు తిండీ బట్టా పెద్దవాడి దగ్గరే జరుగుబాటయ్యేవి’’ అన్నాడు ఇందిర మేనమామ. ఈ వాదనంతా వినేవారికి ఉత్కంఠగా ఉంది. వెంకయ్య, లక్ష్మమ్మ మాత్రం ఆందోళనగా వింటున్నారు. ఈ పంచాయతీ ఎటుపోయి ఎటు వస్తుందోననే భయం వారిలో మొదలయింది. అప్పుడు నోరు విప్పారు - లక్ష్మమ్మ వాళ్ళన్నయ్యా - రాము, శ్యాము వాళ్ళ మేనమామ సుబ్బారావు. ‘‘పెద్దలు, మీ ఇద్దరిలో వాదనా పటిమ ఉంది. మరి తల్లిదండ్రుల పోషణ పరిస్థితి ఏమిటి?’’ అని అడిగాడు. ఆ విషయం స్ఫురణకు రాగానే లక్ష్మమ్మ కూడా వారివైపు చూసింది.

‘‘ఏముంది... చెరొకచోటా ఉంటారు’’ అన్నాడు సత్యవతి మేనమామ.

‘‘ఇంతకాలం కలిసి ఉన్నవారిని వృద్ధాప్యంలో విడదీస్తారా? ఒక్కొక్కరి దగ్గర కొన్నాళ్ళు ఉండటం సబబు’’ అన్నాడు పెద్దకోడలి మేనమామ.

‘‘ఈయన పట్టణంలో ఎక్కువ రోజులు ఉండలేరు’’ అని వెంకయ్య గురించి ఆందోళనగా చెప్పింది లక్ష్మమ్మ.

‘‘అట్లా అయితే, ముసలి వాళ్ళిద్దరూ ఇంటిముందు ఖాళీ స్థలంలో చిన్నగుడిసె వేసుకుని వండుకుంటారు’’ అని సర్దుబాటు చేశాడు సత్యవతి మేనమామ.

ఈ వాదప్రతివాదాలు వింటున్న లక్ష్మమ్మ ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేసింది. ‘‘ఏ న్యాయం, చట్టం వద్దు. నేను చెప్పినట్లు చేయండి. మా పెద్దవాళ్ళ బతుకు అంటారా... ఎట్లాగో గడిచిపోతుంది’’ అంది ఏడుస్తూనే. అందరూ ఆమెవైపు చూశారు.

‘‘ఏడ్చినంత మాత్రాన ఏడ్చినవారు చెప్పినదీ, లేదా వారి వాదన సరైనదీ అవ్వదు లక్ష్మమ్మగారూ, మీరేడవకండి’’ అన్నాడు సత్య మేనమామ.

ఇందిర మేనమామ మళ్ళీ మధ్యలోకొచ్చాడు. ‘‘అవునమ్మా, ఈరోజు రూపాయి రేపు పాపాయి. అందుకే న్యాయంగా పంచాలి’’ అన్నాడు.

‘‘మనుషుల మధ్య ప్రేమబంధాలను ఆర్థిక సంబంధాలు బలహీనపరుస్తాయి. వాస్తవంగా ఈ సమస్యను వాళ్ళమ్మా నాన్నా లేదా అన్నదమ్ములిద్దరే పరిష్కరించుకోవాలి. వేరేవాళ్ళు తల దూరిస్తే ఎవరికి వారు తమదే న్యాయం అన్నట్లు చెపుతారు. మీరు చేస్తున్న వాదనలో మీ మేనకోడళ్ళపై ప్రేమ కనపడుతున్నది కానీ ధర్మం కనబడటంలేదు. ఇందాక మీరన్న న్యాయం, సంప్రదాయం, చట్టం కూడా పక్కకు వెళ్ళిపోయాయి. చివరిగా మానవత్వపు విలువలు కూడా మంటగలిసిపోతున్నాయి. నా ఇద్దరు మేనల్లుళ్ళకు చదువులో తేడాలుండవచ్చు కానీ సంస్కారంలో తేడా లేదనుకుంటున్నాను. సంస్కారమంటే ఏమిటో కాదు... వాళ్ళు నేర్చుకున్న మంచీ చెడూ. అలాగే వారిమధ్య పరస్పరం ఉన్న ప్రేమలోనూ తేడా లేదు. భవిష్యత్తుపై భయం ఉంటే ఉండవచ్చు కానీ, వారి సంస్కారమూ, వారి మధ్యగల ప్రేమే సమస్యను పరిష్కరిస్తాయి. ఆ ప్రేమే న్యాయాన్నీ, సంప్రదాయాన్నీ, చట్టాన్నీ నిలబెడుతుంది. వారే పంచుకుంటారు. ఏమిరా ఏమంటారు?’’ అని వారివైపు చూశాడు సుబ్బారావు.

‘‘వారే పంచుకుంటారు. కానీ పెద్ద మనుషులుగా మనం న్యాయాన్యాయాలు చెప్పాలిగా’’ అన్నాడు సత్య మేనమామ. వెంటనే ఏదో తర్కం గుర్తొచ్చినట్లు మళ్ళీ తనే అందుకుని ‘‘ఇంకోమాట, పండగకూ పబ్బానికీ రాము కుటుంబం కూడా ఇక్కడకు వచ్చేది. వారి తిండి ఖర్చులన్నీ కూడా శ్యామునే భరించేవాడు’’ అన్నారాయన. ఆయన మాటలు పూర్తయీ కాకుండానే శ్యాము పెద్దపెట్టున ఏడుస్తూ ‘‘ఇక ఆపండి’’ అంటూ ముందుకొచ్చాడు.

‘‘మా అన్నయ్య మాతో కలిసుండే నాలుగు దినాలను కూడా లెక్కలేస్తారా? ఇక్కడకు రావడంవల్ల వాళ్ళు ఎంత ఆనందం పొందుతారో తెలియదు కానీ మా అన్నయ్యా, వదినా పిల్లలూ ఇక్కడకు రావడంవల్ల నేను పొందే ఆనందానికి ఏ ఆస్తులూ సరిపోవు. సరిగ్గా చదువుకోక బతుకుతెరువు సరిగ్గాలేని నేను, నాకు న్యాయం చేయమని కోరాను కానీ, మా అన్నదమ్ముల్ని వేరు చేయాలని అనలేదు. మా అమ్మానాన్నా మొత్తం ఆస్తి మా అన్నయ్యకిచ్చినా నాకిష్టమే. లేదా పెద్దవాడిగా మా అన్నయ్యే నాకు ఏది ఇస్తే అదే తీసుకుంటాను. ఈ ఇల్లు కూడా ఇద్దరికీ పంచినా, నా వాటా ఇల్లు మాత్రం ఎప్పటికీ మా ఉమ్మడి కుటుంబానిదే! మా అన్నయ్యవాళ్ళు ఎప్పుడూ నా దగ్గరకే రావాలి. నాకు కావలసింది అదే. ఆస్తి కాదు’’ అంటూ ఏడుస్తూ భావావేశంతో కింద కూర్చుండిపోయాడు. దీంతో వాతావరణం మొత్తం మారిపోయింది.

శ్యాము భార్య కూడా ఏడుస్తూ వచ్చి ‘‘తప్పయింది మామయ్యా, నేను మిమ్మల్ని పిలవాల్సింది కాదు. నా తోడికోడలి పిల్లలు ‘చిన్నమ్మా’ అని పిలిచే పిలుపుకంటే, నా కూతురూ కొడుకూ వారిని అన్నా, అక్కా అని పిలిచే పిలుపుకంటే మాకు ఈ ఆస్తి ఎక్కువ కాదు... మా అత్తామామలు కూడా కాదు, ఎంతో చదువుకుని మాకు మంచీ చెడూ చెపుతూ మాపై ఎంతో ప్రేమ చూపించే మా బావగారు ఏమిస్తే అదే మాకు ఆస్తి’’ అందామె. పెద్దకోడలు కూడా కన్నీళ్ళతో వచ్చి మరిదినీ తోడికోడలినీ అల్లుకుపోయింది.

‘‘అదికాదే అమ్మాయ్‌’’ అని మేనమామలు ఏదో మాట్లాడబోతే ‘ఇక మాట్లాడవద్దు’ అన్నట్లు దండం పెట్టారు ఇద్దరు తోడికోడళ్ళు.

మౌనంగా చూస్తున్న రాము కళ్ళలోంచి నీళ్ళు రాలడం వాళ్ళ మామయ్య చూశాడు. ఆయన చూపును అర్థంచేసుకుని రాము మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘నా తమ్ముడు ఏమిటో నాకు తెలుసు. నా మరదలూ తెలుసు. నాకు చెల్లెలులేని లోటు తీరుస్తున్నది తను. మా అమ్మానాన్నలు మా కుటుంబానికే ఆస్తి. అయితే నావరకు మాత్రం నా తల్లిదండ్రులకంటే కూడా నాకు నా తమ్ముడే ముఖ్యం. ఎందుకంటే వాడు నాకంటే చిన్నవాడు కాబట్టి. వాడి బాగోగుల బాధ్యత, నేను బతికినంత కాలం నాదేనని నేను మనసా వాచా కర్మణా నమ్ముతాను. అలాగే మా నలుగురు పిల్లలు కూడా వారి తరం వరకైనా ఒకే కుటుంబంగా కలిసే పెరగాలి. మొత్తం మా కుటుంబానికి, మా పిల్లలతో సహా మా అందరికీ మా అమ్మానాన్నలే ముఖ్యం. మా మామయ్య చెప్పినట్లు మా పంపకాలు మేము చేసుకోగలం. కానీ పెద్దవారు మాట్లాడుతున్నారు... వారి జోక్యం అవసరమని పిలిపించారంటే ‘ఏం మాట్లాడతారా?’ అని ఎదురుచూశాను. ఇదీ ఒకందుకు మంచిదే అయింది. డబ్బు సంబంధాలే మాట్లాడుకుంటే అవి ఎంత ఈసడింపుగా ఉంటాయో తెలిసింది’’ అంటూ ఒక సెకను ఆగాడు, అందరూ శ్రద్ధగా వింటున్నారు.

‘‘ఇక ఎట్లా పంచుకుంటారో చెప్పురా పెద్దోడా’’ అని లక్ష్మమ్మ మధ్యలో అందుకుంది అసహనంగా... అదేదో తేలిపోతే బాగుణ్ణని.

‘‘అమ్మా, ఈ విషయాలు మీకు కూడా తెలియాలి. ఎందుకంటే మేము అడగకుండానే ఆస్తులు పంచాలని అనుకున్నారు మీరు. నువ్వు ఆవులనూ దూడలనూ ఎద్దులనూ కూడా విడదీసి పంచావు. మీ గురించేమో ‘ఎట్లాగో బతుకుతాములే’ అని చెప్పావు. ఇది సరైంది కాదు. అందుకే మీకూ అర్థంకావాలి. అమ్మా, నీకు చదువు లేకపోయినా నీకు తెలిసిన జ్ఞానంతో మమ్మల్ని ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేదానివి. ఇట్లా ఎన్నో విషయాలు నీకు మంచి అని తోచినవి చెప్పేదానివి. కొట్టేదానివి, తిట్టేదానివి. ఆ తిట్లలో కూడా నేను మంచిని ఏరుకునేవాడిని. ఎందుకు కొట్టావో అర్థంచేసుకునే ప్రయత్నం చేసేవాడిని. అందుకే మేము ఎంతోకొంత విలువలతో పెరిగాం. మీరంటే ఇప్పటికీ మాకు ప్రేమ, ఇష్టం. అట్లా అని ఇప్పటికీ మీరు చెప్పినదే సరైనది అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మీ జ్ఞానంకంటే ఎన్నో రెట్లు మా జ్ఞానం ఎక్కువ. మంచివాడి జ్ఞానం మంచి చేస్తుంది. చెడ్డవాడి జ్ఞానం చెడు చేస్తుంది. పెంచినది మీరు కాబట్టి మాది మంచి జ్ఞానమే అనుకుంటున్నాను’’ అన్నాడు. అందరూ ఇంకా అతను ఏం చెపుతాడా అని ఎదురుచూస్తున్నారు.

‘‘ఇందాక చట్టం, సంప్రదాయం, న్యాయం-ధర్మం అని మాట్లాడారు. చట్టం ఏమి చెపుతుందంటే... ఎవరి చదువుతో, ఏ సంప్రదాయంతో, రాతకోతలు లేని ఏ నేపథ్యంతో సంబంధం లేకుండానే ఏదైనా చెరిసగంగా పంచాలనే చెపుతుంది. ఇక సంప్రదాయం అనేది ఒక కాలంనాటి అవసరాల కోసం పుట్టింది. దాని ప్రకారం పెద్దవాడికి కాస్త ఎక్కువ జ్యేష్ట వాటా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు అరడజను మంది సంతానం ఉంటే చివరివాడి పెళ్ళయ్యేవరకూ పెద్దవాడి శ్రమ ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయేది కాబట్టి, విడిపోయాక తన పిల్లల కోసం సంపాదించుకునే వయసును కోల్పోతాడు కాబట్టి, వాడికి అన్యాయం జరక్కుండా జ్యేష్ట వాటా అని పెట్టారు. ఈ సంప్రదాయం అన్ని సందర్భాలకూ సరికాదు. సంప్రదాయంలో తప్పనిసరిగా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులపై గౌరవం, అన్నపై గౌరవం, తమ్ముడిపై ప్రేమ, తోడికోడళ్ళు అక్కాచెల్లెళ్ళుగా ఉండటం, పిల్లలపై సమదృష్టి... ఇవన్నీ! ఇవి డబ్బును మించినవి. ఇక న్యాయం విషయానికి వద్దాం. నా చదువుకు అయిన ఖర్చును లెక్కిస్తున్నారు. కనీస చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. పైగా నేను మెరిట్‌ స్టూడెంట్‌ని. స్కాలర్‌షిప్పులతో చదువుకున్నాను. నాకోసం కుటుంబం ఖర్చు చేసినది పెద్దగా లేదు. నా గురించి వదిలేసినా, ఒకవేళ అప్పుచేసి చదివించినా కూడా పిల్లలకు కనీస చదువు తల్లిదండ్రుల బాధ్యతే! పైచదువులు మాత్రం పిల్లల బాధ్యతే! పని చేసుకుంటూ చదువుకోవాలి. చదువుకున్నవారికి చదువు చెప్పించడమంటే, చదువు అబ్బని వారికి అన్యాయం చేసినట్లు కాదు. మా కుటుంబంలోనయితే చదువును అశ్రద్ధ చేసి మా తమ్ముడు తప్పు చేశాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే... ఇప్పుడు మా పిల్లలకు కూడా తెలియాలని. నలుగురికీ తీర్పు చెప్పే మీకు ఏది న్యాయమో అర్థంకావాలని. ఇక న్యాయం అర్థాన్ని ఇలా కాదు చూడాల్సింది. ఒకరి అవసరాల నుంచి చూడాలి... అదీ స్వచ్ఛందంగా. నా తమ్ముడికి ఉద్యోగం లేదు కాబట్టి వాడి ఉపాధికి పొలం అవసరం. కానీ, నా వాటా పొలం నేను తీసుకుంటే వాడు బతకడం కష్టమవుతుంది. వాడి అవసరాన్ని చూసి ఇవ్వదలుచుకుంటే నా అంతట నేనే ఇవ్వాలి. అదీ ధర్మమంటే!

ఇక చాలా వాదనలు వచ్చాయి. అందరికీ ఒక విషయం చెప్పదలిచాను... నేనూ నా తమ్ముడూ ఎవరి సంపాదనతో వాళ్ళం బతుకుతున్నాం కానీ ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే! ఉమ్మడి ఆర్థిక బాధ్యతలలో ఎవరం ఎంత భరించగలిగితే అంత భరిస్తూ వచ్చాం. నేను ఇక్కడకు రావడమంటే ‘మా ఇంటికి వస్తున్నా’ననే అనుకుంటాను తప్ప, మా తమ్ముడి దగ్గరకు మాత్రమే అనుకోను. మా చిన్నప్పుడులాగే మా అమ్మా, మా నాన్నా, నేనూ, నా తమ్ముడు... ఇదే నా భావన. నా పిల్లలలో కూడా ఆ భావనను పెంచాను. మా పెళ్ళిళ్ళు అయ్యేంతవరకూ మా సంపాదనంతా మా అమ్మానాన్నలకే ఇచ్చాం. నిజానికి నేను ఈ వూరిలోనే ఉన్నట్లయితే పెళ్ళయ్యాక కూడా అదే పని చేసేవాడిని. కానీ పట్నంలో అద్దె ఇంటికి, నా ఖర్చులకు బొటాబొటి సరిపోతోంది. ఇక, మా ఆస్తుల విషయానికి వస్తే పంపకం లాంఛనమే! ఆస్తి పంపకం జరిగినా అంతా ఇప్పుడున్నట్లే కొనసాగుతుంది. జ్యేష్ట సంప్రదాయం మాకు అవసరం లేదు. నాలుగైదేళ్ళు మినహా మామధ్య సంపాదించే కాలంలో కూడా పెద్ద తేడా లేదు. నావరకు నేను ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని భావిస్తున్నాను. నా తరం వరకూ ఇంటిలో, పొలంలో సగభాగంపై నాకు హక్కు ఉంటుంది తప్ప మొత్తం పొలం నా తమ్ముడి సాగులోనే ఉంటుంది. ఆదాయమంతా తన కుటుంబం గడవటానికీ, మరీ ముఖ్యంగా పిల్లల చదువులకే ఖర్చు పెట్టుకోవచ్చు. ఎప్పటిలా తిండిగింజలు తప్ప నాకు ఇతరత్రా వచ్చే ఏ ఆదాయం అవసరం లేదు. మా పిల్లల అందరి చదువులూ పూర్తయ్యాకే ఆస్తులను భౌతికంగా విడదీసి పంచుకుంటాం. అప్పటివరకూ మాది ఉమ్మడి కుటుంబమే! మా అమ్మానాన్నలు ఎప్పటిలాగా మాతోనే ఉంటారు. ఇది నా భార్యకూ పిల్లలకూ కూడా సమ్మతమని భావిస్తున్నాను. పిల్లలకు చదువులివ్వాలి తప్ప ఆస్తులు కాదు. తమ పిల్లలు బతకలేరనే అపనమ్మకంగలవారే పిల్లలకు ఆస్తులు కూడబెట్టి ఇస్తారనేది నా నమ్మకం’’ అని ముగించాడు. అందరి ముఖాలూ వికసించాయి.

ఆ ఆనందంతో లక్ష్మమ్మ ఒక మాటంది- ‘‘ఒరేయ్‌, నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. అందుకే నేనూ సంప్రదాయాన్ని పాటించదలుచుకుంటున్నాను. ఎప్పుడైనా పంచుకోండి... ఇంటి స్థలంలో ఒక సెంటు, పొలంలో పది సెంట్లు నా పెద్దకొడుక్కి ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను’’ అంది.

‘‘అలాగేనమ్మా, మీరు మాత్రం ఆస్తులు పంచే పేరుతో మమ్మల్ని వేరు చేయకండి. అన్నయ్య చెప్పిన రోజున నువ్వు చెప్పినట్లే జ్యేష్ట వాటా ఉంటుంది సరేనా!’’ అన్నాడు శ్యాము అన్నయ్య వైపు ప్రేమగా చూస్తూ. తేలికపడిన మనసులతో అందరూ ఆనందంగా భోజనాలకు కదిలారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.