close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీవన్మరణ యాత్ర

జీవన్మరణ యాత్ర
- రావాడ శ్యామల

టఫటమని శబ్దం. ఒంటికున్న కట్లు తెగిపోతున్నట్లు... బంధనాలు తెంచుకున్నట్లు... ఆహా... శరీరం తేలిగ్గా, ఎంత హాయిగా ఉంది. పంజరం నుండి విడుదలైన పక్షిలా... స్వేచ్ఛగా... ఎగురుతున్నట్లు... అవున్నిజమే... ఎగురుతున్నట్లు. నేను నేలకు ఆనుకుని లేను. గాలిలో ఉన్నాను. ఆశ్చర్యంగా ఉంది. మంచం మీద నిద్రలో నేను... గాలిలో తేలియాడుతూ నేను... ఏమిటిది... రెండూ నేనెలా అవుతాను. అయోమయంగా చూస్తున్నాను.

అరవై ఏళ్ళ నా జీవితానుభవం చెబుతుంది.

‘సంధ్యా, నీ శరీరాన్ని వదిలేశావు’ అని.

అంటే... అర్థంకానట్లు ప్రశ్నార్థకం.

‘నువ్వు చచ్చిపోయావు’ అంతరాత్మ జవాబు. ఆత్మలో అంతరాత్మ!

మంచం మీద నిద్రలో ఉన్న నన్ను నేను చూసుకున్నాను. నిజమే... చలనం లేకుండా ఉన్నాను. వూపిరి ఆగిపోయింది. ఎస్‌... నేను చనిపోయాను. కన్‌ఫర్మ్‌ చేసుకున్నాను. శారీరక, మానసిక బాధల నుండి విముక్తి అయిపోయాను.

ఇంకా ఇంట్లో ఎవరికీ తెలియదు. తెల్లవారుతోంది. చిన్నకొడుకూ కోడలూ లేచాక వాళ్ళ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలని ఎగ్జయిటింగ్‌గా ఉంది.

అన్నట్లు నేను చనిపోయింది నిజమైతే... నన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదేమీ! యమభటులో... లేక స్వర్గం నుండి దేవదూతలో రావాలి కదా. యమభటులు రారు. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకూ నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు. కచ్చితంగా యమభటులు రారు. నేనిలా ఇక్కడే ఉండిపోయానంటే, ఇంకా నాలో కోరికలేమైనా మిగిలిపోయాయా... నాలో నేనే గొణుక్కుంటున్నాను.

అదిగో చిన్నకొడుకు లేచాడు. అలికిడి అవుతోంది. నాకు చాలా ఆత్రంగా ఉంది. నా రూమ్‌లోకి ఎప్పుడొచ్చి నన్ను చూస్తారో... కొడుకూ, కోడలూ లేచి ముఖం కడుక్కుని ‘టీ’ చేసి తీసుకువస్తారు. అప్పుడే చూస్తారు.

ఆరేళ్ళ నా మనవరాలు లాస్య కూడా లేచింది.

‘‘మమ్మీ, నానమ్మకి గుడ్‌మార్నింగ్‌ చెపుతాను’’ అంటూ తుర్రుమని నా గదిలోకి వచ్చింది. నన్ను... అంటే నా శరీరాన్ని కదిపింది... లేపుతోంది.

‘‘డాడీ... డాడీ... నానమ్మ ఒళ్ళు చూడూ... కూల్‌గా ఉంది’’ అని అరుస్తోంది.

కొడుకూ కోడలూ ఇద్దరూ పరుగెత్తుకు వచ్చారు. కొడుకు నా ముక్కు దగ్గర చెయ్యిపెట్టి చూశాడు. ‘‘అమ్మ చనిపోయింది’’ అన్నాడు నెమ్మదిగా. వాడి ముఖంలో విచారం లేదు. కంటినుండి ఒక కన్నీటిచుక్క రాలేదు. వాళ్ళకి పక్కనే ఉన్న నా రూపం కనబడటం లేదు. కానీ, నాకు అన్నీ కనిపిస్తున్నాయి. లాస్య నా శరీరం వంక భయంగా చూస్తోంది.

చిన్నకొడుకు సెల్‌లో అందరికి విషయం చెపుతున్నాడు. కోడలు లాస్యని తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి, నా రూమ్‌లోకి వచ్చింది.

నెమ్మదిగా నా తల ఎత్తి, నా మెళ్ళొ ఉన్న గొలుసు తీసుకుని వెళ్ళిపోయింది. కోడలు చేష్టలని గుడ్లప్పగించి చూడ్డం తప్ప ఏం చేయగలను. ఆ గొలుసు ఆయన చనిపోకముందు సంవత్సరమే కొన్నారు. అయిదు తులాలది. ఆరోజు సంఘటన ఇంకా బాగా గుర్తుంది. ‘ఇప్పుడు నాకెందుకు... ఎవరైనా చూస్తే నవ్వుతారు. ముసలి వయసులో ఈ షోకులేమిటి... పిల్లలకు ఏదైనా చేయిస్తే బాగుంటుంది కదా’ అన్నాను.

అంతే... ఒక్కసారిగా ఇంతెత్తున లేచారు. ‘నోర్ముయ్‌... వాళ్ళకి పెట్టాల్సింది బాగానే పెట్టాం. ఇది నీకోసం చేయించాను. నీకోసం... ఇదిగో నువ్వు చచ్చేవరకు ఇది మెడలో నుండి తీయకు. ఎవరికీ ఇవ్వకు తెలిసిందా...’

ఆయన మాటలకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఏమన్నానని అంతలా ఎగిరిపడ్డారు. ఉక్రోషంగా మనసులో అనుకున్నాను. నన్నా స్థితిలో చూసి ‘పిచ్చిదానా... నేను ఉన్నా లేకున్నా... నీ ఆస్తి ఇదేనే. నీ ఒంటిమీద వస్తువులే నీ ఆస్తి. వాటికోసమైనా పిల్లలు నిన్ను బాగా చూసుకుంటారు. అందుకేనే... అర్థం అయిందా... నిన్ను బాధపెడితే సారీ...’ మళ్ళీ పసిపాపని అనునయించినట్లు బుజ్జగించారు. ఆయనది ఎంత ముందుచూపో... ఎంత అనుభవంతో ఆ మాటలన్నారో... నేను నిజంగా పిచ్చిదాన్నే... ‘నా పిల్లలు అలాంటివాళ్ళేం కాదు. వాళ్ళు బంగారం... నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీవన్నీ అనుమానాలే...’ అని గొప్పలు పోయాను. ఈ నాలుగేళ్ళలో పిల్లల నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా తెలిసి బాధపడుతూనే ఉన్నాను.

చిన్నకొడుకు కోడలితో అంటున్నాడు- ‘‘అన్నయ్యకి ఫోన్‌ చేశాను. ‘ఇద్దరు కొడుకులమున్నాం. అమ్మ అంత్యక్రియలు గ్రాండ్‌గా చేయాలి. జరిగే ఖర్చంతా నేనే చూసుకుంటా’నన్నాడు.’’

‘‘హమ్మయ్య... పోన్లే... ఆ బాధ్యతలైనా తీసుకుంటున్నారు’’ వెటకారంగా అంది.

‘‘పెద్దక్కా, చెల్లీ ఇద్దరూ బయలుదేరి వస్తున్నారు’’ అన్నాడు.

కోడలు అప్పటికే నైటీ మార్చుకుని చీర కట్టుకుంది. ‘‘ముందు బయట అందరికీ చెప్పండి. శవాన్ని బయటకు తీయాలి. ఇంట్లోనే పోయిందావిడ. ఆవిడకేం బాగానే పోయింది. కానీ, ఇప్పుడు మనకొచ్చింది చావు, ఎలాంటి గడియల్లో ప్రాణం పోయిందో, ఏమిటో... మంచిదో కాదో... పంతులుగారిని అడగాలి. అసలే పిల్లలున్న ఇల్లు’’ చిరాగ్గా అంది. చివుక్కుమనిపించింది నాకు. ఈ నా శరీరం శవంగా మారిపోయింది... అదీ కొన్ని గంటల్లోనే. ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ... లేదంటే అది శవమే... నిజమే మరి!

‘అయ్యో, నేను కూడా గమనించలేదు. నేను చనిపోయేది- మంచి గఢియలో కావో... నా మూలంగా వీళ్ళు ఇబ్బందిపడాలి’ అనుకుని, నాకున్న పరిజ్ఞానంతో లెక్కలు వేసుకుని చూశాను. ‘ఆఁ... ఫరవాలేదు. మంచిరోజూ మంచి తిథిలోనే పోయాను. పోన్లే, పిల్లలకు ఇబ్బందిలే’దని వూరట చెందాను. పక్కవాళ్ళు వచ్చారు. నా శరీరాన్ని బయటకు తెచ్చిపెట్టారు. తల దగ్గర దీపం, అగరవత్తులు వెలిగించాలి. ఒక్కొక్కరూ వచ్చి చూసి వెళుతున్నారు. కొడుకు ఫ్రెండ్స్‌ వచ్చి వాణ్ణి పలకరించారు.

గంటలోనే దగ్గర్లోనే ఉన్న కోడలి తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చేశారు. ఆవిడ నా దేహం వంక అనేకంటే నా మెడవైపు చూసింది. కంగారుగా కూతురితో అంది ‘‘మెళ్ళొ గొలుసు ఏదీ...’’ ‘‘నేను తీసేశాను’’ అంది నిర్భయంగా.

‘‘అయితే ఫర్వాలేదు. మంచం పట్టకుండా మంచి చావే వచ్చిందిలే. మీ అత్త అదృష్టవంతురాలు’’ అంది. అమ్మాయిలిద్దరూ వచ్చారు. ఆటో దిగుతూనే శోకాలు. ఎంతైనా కూతుళ్ళు కూతుళ్ళే. ఇద్దరూ నా శవంమీద పడి ఏడుస్తున్నారు. అందరూ వాళ్ళని ఓదార్చుతున్నారు. ఒక గంట వరకూ ఏడ్చిఏడ్చి అలిసిపోయారు. నెమ్మదిగా అక్కడ నుండి లేచి రూమ్‌లోకి వచ్చి ఇద్దరూ గుసగుసలాడుకుంటున్నారు.

‘‘అక్కా చూశావా... అమ్మ మెళ్ళొ గొలుసు లేదు... చిన్నొదిన తీసేసి ఉంటుంది. అసలే కిలాడీది.’’ ‘‘అవునే... అయినా తల్లి ఒంటిమీద వస్తువులు ఆడపిల్లలకే వస్తాయి కదా. ఆవిడగారు ఎలా తీసుకుంటుంది. చూస్తాను. అమ్మ గాజులు, గొలుసు, తాడు, చెవి కమ్మలు, ముక్కుపుడక కలిపి పన్నెండు తులాలుంటాయి. ఇద్దరికీ చెరి ఆరు తులాలు వస్తాయి. వదిలిపెట్టకూడదు.’’ కలుక్కుమంది నా ఆత్మ మనసు.

‘వీళ్ళు వచ్చింది నన్ను ఆఖరిచూపు చూడటానికి కాదా! నా బంగారాలు... నా బంగారం కోసం వచ్చారా..!’ పక్క రూమ్‌లో చిన్నకొడుకూ కోడలూ గబగబా టిఫిన్‌ తింటున్నారు. ‘‘ఈ తతంగమంతా అయ్యేసరికి మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది. కాస్త తిను బాబూ..’’ అంటూ కోడలు తల్లి వాళ్ళకి కొసరి కొసరి వడ్డిస్తోంది. లాస్య ఉండుండి మౌనంగా ఏడుస్తోంది. టిఫిన్‌ చెయ్యమంటే చేయనని మారాం చేస్తోంది. వాళ్ళ అమ్మమ్మ బలవంతంగా గ్లాసుపాలు తాగించింది. ‘‘దాని కడుపు మాడితే అదే తింటుంది. ఉండనీ అమ్మా!’’ కోడలు కోపంగా అంది. బయటపెట్టిన నా శరీరాన్ని కిటికీలో నుండి తదేకంగా చూస్తూ కూర్చుంది లాస్య. బంధువులందరూ వచ్చారు. పది గంటలకి నా పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగిపోయాయి. అయినా నేను ఉన్నాను. నా ఆత్మ అలా గాలిలో తిరుగుతూనే ఉంది. శ్మశానం నుండి ఇంటికి వచ్చిన వెంటనే హడావుడిగా చిన్నకార్యం చేయడానికి తతంగం మొదలైంది. ఇంటి బయట వంట చేయిస్తున్నారు. బంధువులు వాళ్ళవాళ్ళ వూళ్ళు వెళ్ళిపోవాలి మరి.

శ్మశానం నుంచి వచ్చిన తర్వాత అది చనిపోయినవారి ఇల్లులా లేదు. నవ్వుకుంటూ, జోక్స్‌ వేసుకుంటూ అందరూ హడావుడిగా పనులు చేస్తున్నారు. పదకొండు రోజులకి పెద్దకార్యం చేస్తారు. ఆ రోజుకి అమెరికా నుండి పెద్దాడు వస్తాడు. వాణ్ణి చూసి నాలుగు సంవత్సరాలైంది. వాణ్ణి చూడాలని నా మనసు ఎన్నాళ్ళుగా కొట్టుమిట్టాడుతోందో... నాలుగు సంవత్సరాల క్రితం... ఆయన కర్మకాండలకి వచ్చాడు. తర్వాత వాడికి అక్కడే బాబు కూడా పుట్టాడు. మళ్ళీ ఆయనే మనవడిగా పుట్టాడని ఎంతో మురిసిపోయాను. మనవణ్ణి చూడాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది. పోనీ, ఇన్నాళ్ళకు వస్తున్నాడు. మనవణ్ణి తనవితీరా చూడొచ్చు. బయట కోడలు ‘‘ఒక్క చికెన్‌ తెప్పిస్తున్నారేంటీ... అత్తయ్యకి చేపలంటే ఇష్టమండీ... చేపలు తెప్పించండి’’ అంటూ ఆర్డర్‌ వేసి లోపలకొచ్చింది. లోపల కూతుళ్ళూ కోడలూ మధ్య రుసరుసలు... బంగారం కోసం. ‘‘ఇన్నాళ్ళూ ఆవిడకి చాకిరీ చేశాను. నాకు ఏమిచ్చిందావిడ. నాకు ఆడపిల్ల ఉంది. ఆ పిల్లంటే ఆవిడకు మక్కువ. అందుకే ఈమధ్య మాటిమాటికీ నా గొలుసు నీకేనే తల్లీ’’ అని దానితో అనేది.

‘నేనెప్పుడన్నాను’ - కోడలి మాటలకి ఉలిక్కిపడ్డాను.

‘‘అందుకే నేనే గొలుసు తీసుకున్నా. ఇక ఏటంటారూ...’’ అన్నట్లు వాళ్ళవైపు చూసింది. ‘‘అయినా మీకేం అన్యాయం చేయలేదుగా... గాజులూ, తాడూ, కమ్మలూ ఉన్నాయి. అవి తీసుకోండి’’ అని విసవిసా అక్కడ నుండి వెళ్ళిపోయింది. కూతుళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ‘అనుబంధం, ఆత్మీయతా అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం... వింత నాటకం...’ ఈ పాటలో ఎంత అనుభవసారం ఉంది. రెండు వాక్యాలల్లోనే జీవిత సారాంశం చెపుతుంది.

చిన్నకొడుకు అక్కా, చెల్లెలి దగ్గరకు వచ్చాడు.

‘‘అక్కా, అన్నయ్య ఫోన్‌ చేశాడు... సెలవు దొరకడం లేదు. నాన్న కర్మకాండలకి నేను ఎలాగూ దగ్గరే ఉన్నాను కదా... అమ్మది నువ్వు చూసుకో. నీ అకౌంట్‌లో వన్‌ లాక్‌ వేస్తాను. ఏ లోపం లేకుండా పెద్దకార్యం గ్రాండ్‌గా చెయ్యి. సంక్రాంతికే వస్తాను. ఇప్పుడు అమ్మ తాలూకా ఫొటోలు మెయిల్‌లో పెట్టమన్నాడు’’ అని వాళ్ళవైపు చూశాడు.

‘‘తమ్ముడూ, పెద్దకార్యనికి ఎంతమంది అవుతారు?’’

వాడు కొంచెంసేపు ఆలోచించి ‘‘దాదాపు ఒక అయిదొందల మంది అవుతారక్కా’’ అన్నాడు.

‘‘అయితే, అమ్మ జ్ఞాపకార్థం మనం రాగి గ్లాసులు ఇద్దాం. మా వూర్లో కాస్త రేటు తక్కువ కదా. గ్లాసు నూటయాభైలోపు ఉంటుంది. ఏమంటావూ...’’

‘‘ఎక్సలెంట్‌ అక్కా... ఈ స్టీలు పాత్రలు అందరూ ఇచ్చేవే. వాటికన్నా రాగి ఐటమ్స్‌ ఇస్తే గ్రాండ్‌గా ఉంటుంది.’’

‘‘మీల్స్‌ కూడా ప్లేటు నూటయాభైకి తగ్గకూడదు. ఏమంటావు తమ్ముడూ’’ అంది పెద్దకూతురు.

‘‘ఆ... అలాగే, మంచి వంటవాళ్ళని పిలిపిస్తాను. ఆమధ్య మా కొలీగ్‌ ఇంట్లో ఫంక్షన్‌ అయింది. వాళ్ళ భోజనాలు బాగున్నాయి. ఆ వంటవాళ్ళనే పిలిపిస్తాను’’ అన్నాడు వాడు.

‘అమ్మో... ఎంత ఖర్చుపెడుతున్నారు. రాగిగ్లాసులు తల్లి జ్ఞాపకార్థం ఉచితంగా వచ్చినవాళ్ళకు పంచుతాడా! పూజకోసం చిన్న రాగిచెంబు తీసుకురారా... ఇరవై, పాతిక ఉంటుంది’ అని నేనొకసారి అంటే... ‘నీవన్నీ దుబారా ఖర్చులే అమ్మా, ఎందుకు చెప్పు’ అని విసుక్కున్న కొడుకేనా... వీడు. తల్లికి కడుపునిండా భోజనం పెట్టలేని వీళ్ళు... ఆ తల్లి కార్యానికి వచ్చేవాళ్ళకి గొంతు వరకూ భోజనాలు పెట్టి, ఫ్రీగా గిఫ్ట్‌లు ఇచ్చి పంపిస్తారు. అంతా డాంబికాలే. నలుగురిలో గొప్పకోసం, తల్లిమీద కపటప్రేమ నటిస్తున్నారు. కోపం వచ్చింది నాకు.

‘‘పెద్దకార్యానికి, పెద్దన్నయ్య వస్తే బాగుణ్ణు’’ చిన్నకూతురంది.

‘‘వదినే వద్దని ఉంటుంది. వాడికోసం అమ్మ ఎంత కష్టపడింది. అన్నీ మర్చిపోయాడు. విశ్వాసం లేదు’’ పెద్దకూతురంది.

‘‘వాడికి పెళ్ళాం ఎంత చెపితే అంత. అన్నయ్య ఫారిన్‌ వెళ్ళడానికి ఉన్న ఎకరం పొలం అమ్మించి, నాన్నకి ఇష్టంలేకపోయినా ఎదిరించి మరీ వాడి చేతిలో పెట్టింది’’ చిన్నకొడుకు అన్నాడు.

‘‘అన్నయ్యకే ఏంటీ... చిన్నోడివి నీకు మాత్రం ఎంత చేయలేదు. మిషన్‌ మీద బట్టలు కుట్టి, ఆ డబ్బులు దాచి, నీ సరదాలు నాన్నకి తెలియకుండా తీర్చేది... మర్చిపోయావా. నీ ఇంజినీరింగ్‌కి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అమ్మి సమకూర్చింది. ఎంతైనా మగపిల్లలని బాగా చూసుకుంది అమ్మ’’ పెద్దది అంటోంది.

‘‘వూరుకో అక్కా, మీకు మాత్రం ఏం తక్కువ చేసింది. మంచి సంబంధమనీ - శక్తికి మించినదైనా... వాళ్ళ కన్నవారిచ్చిన ఆస్తులు అమ్మి... నాన్నను ఒప్పించి మరీ చేసింది. మీ పెట్టుపోతలలో ఎక్కడా తక్కువ చేయలేదు. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అమ్మవల్లే ‘కదా’.’’

‘‘అవును, అక్కకి మంచి జమిందారీ సంబంధం చూసి చేసింది. మీ ముగ్గురూ బాగున్నారు. నాకే అన్యాయం చేసింది’’ మూలుగుతూ అంది చిన్నది.

‘‘నోరు ముయ్యవే. అంతా నువ్వు కోరి తెచ్చుకున్నదే కదా. ఓరే, నీకు తెలియదుగానీ... ఏం జరిగిందంటే... నా క్లాస్‌మేట్‌ మునీర్‌ ఉన్నాడు చూడు... మాటిమాటికీ నోట్సు కోసమని ఇంటికి వచ్చేవాడు గుర్తుందా..? ఇదీ వాడూ ప్రేమలోపడ్డారు.’’

‘‘ఇది ఎప్పుడు జరిగిందక్కా...’’ కళ్ళు పెద్దవి చేసుకుని ఇంట్రెస్టుగా అడిగాడు.

‘‘ఇంటర్‌ చదువుతుందప్పుడు. ఇంట్లో ఒప్పుకోరని, ఇద్దరూ లేచిపోదామనుకున్నారు. ఎలా తెలిసిందోగానీ అమ్మకు తెలిసింది. మునీర్‌ వాళ్ళింటికి వెళ్ళి, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడటం వల్ల, వీళ్ళ ప్రయత్నం ఫలించలేదు. నాన్నకి తెలియకుండా దీన్ని చీవాట్లు పెట్టి, దారిలోకి తెచ్చింది. మళ్ళీ ఇది ఎటువంటి పిచ్చివేషాలు వేస్తుందోనని భయపడి, ఇంటర్‌ తర్వాత- నాన్న చదివిద్దామన్నా వినకుండా బ్యాంక్‌ ఎంప్లాయ్‌తో పెళ్ళి చేసింది. ఈరోజు ఇది ఇంత బుద్ధిగా కాపురం చేసుకుంటుందంటే అమ్మ చలవే కదా - పెద్ద చెపుతుంది నీతులు’’ వెటకారంగా అంది.

‘‘ఇంత జరిగిందా అక్కా, అసలు ఎవరికీ తెలియలేదు’’ ఆశ్చర్యంగా అన్నాడు చిన్నోడు.

‘‘నీకే కాదు... అమ్మకూ నాకూ తప్ప, అన్నయ్యకూ నాన్నకూ కూడా ఈ విషయం తెలియదు’’ అంది పెద్దకూతురు.

నాకు చాలా బాధ కలిగింది. తల్లిలా ఈ రహస్యం కడుపులో ఉంచుకోవాల్సిన పెద్దపిల్ల... ఇలా సమయం వచ్చింది కదా అని తమ్ముడిముందు చెల్లి గుట్టు రట్టు చేస్తుందా... ప్చ్‌!

నిజమే... వీళ్ళు మాట్లాడినవన్నీ నిజాలే. భగవంతునికీ భక్తునికీ అనుసంధానమైన పూజారిలా... నేను... ఆయనకూ పిల్లలకూ మధ్య అనుసంధానమై... చివరికి ఎవరికి ఏమీ కాకుండా మిగిలిపోయాను. నేను వాళ్ళ అవసరానికి పనికివచ్చే పరికరాన్ని... వాళ్ళ కోరికలు తీర్చే సాధనాన్ని అని గ్రహించడానికి చాలా ఏళ్ళు పట్టేసింది. మొద్దుమొఖాన్ని... బట్టలు కుట్టిన డబ్బులూ, ఆయన ఖర్చులకిచ్చినవీ దాచి, ఈ నలుగురు పిల్లల కోసమే- వీళ్ళ సంతోషం, సరదాల కోసమే ఆ డబ్బంతా ఖర్చుపెట్టాను. పుట్టినరోజులూ ఫ్రెండ్స్‌తో పార్టీలూ సిన్మాలకీ ఆయన ఇచ్చినదానికి రెట్టింపు డబ్బులు ఆయనకి తెలియకుండా ఇచ్చేదాన్ని. అప్పటివరకూ తండ్రి ఇచ్చిన డబ్బు చూసి ముడుచుకుపోయిన వాళ్ళ ముఖాలు వికసించిపోయేవి. ‘మా మంచి అమ్మ’ అని గట్టిగా కావలించుకునేవాళ్ళు. వాళ్ళ ముఖాల్లో ఆ సంతోషం చూడగానే నాకు వెయ్యిరెట్లు బలం వచ్చేది.

‘‘ఏమండీ, మీ అక్కాచెల్లెలితో ముచ్చట్లింక చాలుగానీ వంట అయిపోయింది. మీరు కాటికి అవి పట్టుకెళ్ళి వచ్చేస్తే... అందరి భోజనాలూ అయిపోతాయి. త్వరగా రండి’’ కోడలు వచ్చి అంది.

‘‘మీరు రండొదినా... మీ అమ్మకు ఆఖరుసారిగా తలో ముద్దా ఆకులో వడ్డించండి’’ అంది.

వండిన వంటలన్నీ కొద్దికొద్దిగా విస్తరాకుల్లో సర్దుతున్నారు. ‘‘చేపలు, చికెన్‌ కూర ఎక్కు వెయ్యమ్మా... అత్తయ్యకి నీసు అంటే ఎక్కువిష్టం’’ అంది కోడలు.

‘చేపముక్క ఒకటి చాలు. మళ్ళీ మీకు విరోచనాలు పట్టుకుంటే మేమెక్కడికి పరిగెత్తాలి. చికెన్‌ తింటే మలబద్ధకం. మళ్ళీ మీతో అదో ప్రాబ్లమ్‌. ఈ రెండు ముక్కలు చాలు’ అని ఆర్డరిచ్చే కోడలేనా ఇలా మాట్లాడేస్తోంది.

‘‘అమ్మమ్మా, ఈ ఆకులోవి ఎవరికి?’’ లాస్య అడిగింది.

‘‘మీ నాన్నమ్మకేనే... ఆవిడ అక్కడకొచ్చి ఇవి తింటుంది’’ అందావిడ.

విస్తరాకులో అన్నీ సర్ది, కండువాలో కట్టి, చిన్నకొడుకు భుజాన వేశారు. వాడు మరో పదిమందితో శ్మశానానికి బయలుదేరబోయాడు.

ఇంతలో ‘‘డాడీ... ఆగు డాడీ’’ అంటూ మనుమరాలు లాస్య పరుగున అక్కడికి వచ్చింది.

‘‘నానమ్మ అన్నం తిన్నాక, ఈ టాబ్లెట్లు వేసుకుంటుంది. లేకపోతే జొరం వస్తుంది. ఇవి ఇవ్వండి డాడీ’’ అని కొన్ని టాబ్లెట్లు తండ్రి చేతిలో పెట్టింది.

వాడు మౌనంగా వాటిని అందుకున్నాడు.

నా మనుమరాలి తలని అపురూపంగా నిమిరాను. క్రమంగా నా ఆత్మ...నా రూపం... గాలిలో కలిసిపోయింది. నాకర్థం అయింది... ‘నన్ను కడవరకూ ఎవరు ప్రేమిస్తున్నారో చూడాలని ఉంద’ని... రాత్రి జ్వరంతో ఉన్న నేను- దేవునికి చేసిన ఆఖరి ప్రార్థన అది. చూశాను... వెళ్ళిపోతున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.