close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరిష్వంగం

పరిష్వంగం
- జవ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్‌

‘‘హాఁతుమ్‌ బిల్‌కుల్‌ వైసీహో... జైసా మైనే సోచా థా..!’’ అంటూ చంద్రబింబం లాంటి ఆమె మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని, వెన్నెల లోగిళ్ళ వంటి ఆ కళ్ళని ముద్దాడబోతుంటే నాకందకుండా తామరతూడుల్లాంటి చేతులడ్డంపెట్టి, ఎక్కుపెట్టిన విల్లులా పూర్తిగా వెనక్కి వంగింది ‘దేవసేన’. అంతగా వెనక్కి వంగడంతో తల నుంచి వెనుక కాలిమడమలను తాకుతున్నట్టున్న ఆమె ‘జడ’ ఆ వింటికి ‘నారి’లా ఉంది. చటుక్కున ఎడమ చేతితో ఆమె నడుమును పట్టుకుని పడిపోకుండా ఆపాను. ‘‘అన్నీ ఘనమైనవే ఇచ్చిన ఆ బ్రహ్మ ఇక్కడికొచ్చేసరికి ఎందుకింత పిసినారి అయిపోయాడో?’’ అన్నాను సన్నటి ఆమె నడుము వైపు చూస్తూ... ముందుకు వాలబోతూ...

ఒక్కసారిగా నన్ను వెనక్కితోసి నిలబడింది తను. కంగారుగా చుట్టూ చూసి అంది- ‘‘కొన్ని కోట్లమంది మగవాళ్ళని సృష్టించిన ఆ బ్రహ్మే నీ దగ్గరకొచ్చేసరికి ‘పోకిరీ’ అయిపోలేదూ..!? ఇది పార్కనీ, చుట్టూ జనం ఉన్నారనీ కూడా మరచిపోయి, ఆ పాటలేమిటి? అసలు దానర్థమేమిటి?’’

‘‘ఏముంది, నా ప్రేయసి ఎలా ఉండాలని వూహించుకునేవాడినో నువ్వు అచ్చం అలాగే ఉన్నావని అర్థం!’’

‘‘బావుంది. ఎప్పట్నుంచేమిటి ఇలాంటి పిచ్చి వూహలు..?’’ అడిగింది నా పక్కనే చతికిలబడుతూ.

ముందు కొద్దిగా సిగ్గూ, సంకోచం కలిగాయి కానీ ధైర్యం తెచ్చుకుని చెప్పాను.

‘‘బహుశా మనం ఎయిత్‌క్లాస్‌ చదువుతున్నప్పుడనుకుంటాను మన యాన్యువల్‌ రిజల్ట్స్‌ వచ్చిన మూడోరోజు మీ ఇంట్లో నీకోసం ఏదో ఫంక్షన్‌ చేశారు. వూరందరికీ భోజనాలు కూడా పెట్టి గిఫ్ట్స్‌ కూడా పంచారు. ఆ ఏడు స్కూల్‌ ఫస్ట్‌ నువ్వేననుకో... కానీ, ఆ మాత్రానికే వూరందరికీ భోజనాలు పెట్టెయ్యాలా - మీ నాన్నకి బడాయి కాకపోతే’’ అంటూ ఓరగా తన వైపు చూశాను. ఆమె మొహం ఎర్రగా కందిపోవడం, ముక్కుపుటాలు అదరడం కనబడుతోంది. ఇంకొంచెం ఉడికించాలనిపించింది.

‘‘మీ ఇంజనాయిలు మావయ్య కొబ్బరాకుల్తో కుస్తీ పట్టడం కూడా చూశాను. అదుగో అప్పటినుంచే ఇలాంటి పిచ్చి ఆలోచనలొచ్చేవి. ఫ్యూచర్లో నువ్వెలా ఉంటావో వూహించుకుంటూ, రకరకాలుగా నీ పోట్రైట్‌లు కూడా వేసుకున్నాను - తిండీ, నిద్రా కూడా మానుకుని. ఇప్పుడు అచ్చం అలానే ఉన్నావ్‌ తెల్సా!’’

‘‘తిండీ నిద్రా మానుకుని కాదు, చదువూ సంధ్యా మానుకుని. చిన్నప్పట్నుంచే ఇలాంటి వెధవ్వేషాలున్నాయన్నమాట’’ అంటూ షర్ట్‌ మీద నుంచే నా నడుముపై చర్మాన్ని మెలితిప్పి వదిలింది.

ఆ పార్కులో జనం ఝడుసుకుంటారేమో అనైనా ఆలోచించకుండా ఒక్క గావుకేక వేశాను.

నిజంగానే ఆ పార్కు ఒక క్షణం నిశ్చేష్టమైపోయింది. కొన్ని జంటలు ముసిముసి నవ్వులు నవ్వాయి.

‘‘నిజం దేవసేనా... అసలు నేను చదువుకున్నదే నీకోసం. ఎయిత్‌, నైన్త్‌ కలిసి చదివాం. టెన్త్‌లో నీదో సెక్షన్‌ నాదో సెక్షన్‌ అయిపోతే, ప్రిన్సిపాల్‌ని చదువు మానేస్తానని బెదిరించి, నువ్వున్న సెక్షన్‌లోకి మార్పించుకున్నాను. ఇంటర్‌లో నాకు బైపీసీ ఇష్టమైనా, నువ్వు యంపీసీ తీసుకున్నావని, నేనూ దానికే మారాను. నువ్వు ఎంసెట్‌ రాస్తే నీ కోసమే నేనూ రాశాను. నువ్వు నాకంటే నాలుగడుగులు ముందు నడుస్తుంటే- నీ జడ పట్టుకుని, నీ అడుగులో అడుగువేస్తూ నేనూ నీ వెనుకే నడవాలని, మా అమ్మా నాన్నలతో చెప్పి, మీ అమ్మానాన్నలకు ఎన్నో రాయబారాలు పంపి, రికమండేషన్లు చేయించి ఒప్పించగలిగాను. నా అదృష్టంకొద్దీ మన కులాలూ, మతాలూ, నక్షత్రాలూ, గ్రహాలూ, ఉపగ్రహాలూ అన్నీ కలిసి రావడంవల్ల లైన్‌ క్లియర్‌ అయింది. కానీ ఆ శుభఘడియలకింకా నెలరోజుల వ్యవధి ఉన్న కారణంగా అప్పుడప్పుడూ సరదాగా కలుసుకోవడానికి ఇదుగో ఈ పార్కులే శరణమయ్యాయి’’ అన్నా బాధగా.

‘‘సరే, నీ వీర విజయగాథ బాగానే ఉంది కానీ, ఎవరైనా భార్య చేతిని పట్టుకునో, పైటచెంగు పట్టుకునో నడుస్తానంటారు కానీ ఇదేమిటి సిల్లీగా... జడ పట్టుకుని నడవడం! అదేమన్నా గుర్రం కళ్ళెమా?’’ అంది దేవసేన చిరుకోపంగా.

‘‘గుర్రం కళ్ళెమో, ఏనుగు తొండమో అని కాదు... నీ జడకుచ్చులు, నా మెడ కుచ్చులు... కనుక... నీ వెనుక... నా నడక...’’ అని పాడి, ‘కనుక’ అన్నాను మళ్ళీ- తనకి దగ్గరగా జరుగుతూ. ‘‘ఇదేకాదు మరో సిల్లీ కోరిక కూడా ఉండిపోయింది. తిట్టననీ, తీరుస్తాననీ వరమిస్తే చెబుతా.’’

‘‘నువ్వు బాగా చెడిపోయావ్‌ కార్తీక్‌! అది కూడా ఏదో చెత్త కోరికే అయుంటుంది. ముందు చెప్పు, ఏ సంగతీ తర్వాత చూస్తాను.’’

‘‘టెన్త్‌లో ఉండగా ఏదో పుస్తకంలో ‘కళత్రపుత్ర పరిష్వంగం - కోటి స్వర్గసుఖాలకి సమానం’ అని చదివాను. పరిష్వంగం అంటే ఏమిటో అర్థంకాలేదు. మన తెలుగు టీచర్‌ లలితా మేడమ్‌ని అడిగితే చెంప ఛెళ్ళుమనిపించి ‘పోయి చదువుకో వెధవా’ అన్నారు. అప్పుడావిడ- స్టోర్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్నార్లే’’ అన్నాను చెంప తడుముకుని.

దేవసేన కిలకిలా నవ్వేసింది. నవ్వీనవ్వీ కళ్ళవెంట నీళ్ళు కూడా వచ్చాయ్‌ తనకి.

‘‘ఆ దెబ్బతో ఆ మాటకి అర్థం తెలుసుకోవాలనే కోరిక పెరిగిపోయింది. రిటైర్డ్‌ తెలుగుసారింటికి వెళ్ళి అడిగితే నవ్వుతూ చెప్పారు- ‘పరిష్వంగం’ అంటే కౌగిలి! తన భార్యనీ, కొడుకునీ ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు- ఆ సుఖం కోటి స్వర్గసుఖాలకి సమానం అని అర్థం- అన్నారు.

నాకు అప్పుడే పుత్రుడు ఎలానూ లేడు. కనీసం అందాకా ఎవరైనా కళత్రాన్ని కౌగిలించుకుని, ఆ సుఖమేమిటో చూడాలనే కోరిక పుట్టింది. ఇందులో చెడు ఉద్దేశమేమీ లేదు- కేవలం కౌగిలింత, ఓన్లీ హగ్‌..!’’

‘‘నీ మొహంలా ఉంది నీ భాష కూడా! ఎవరైనా కళత్రాన్ని కౌగిలించుకోవడమేమిటి... పిచ్చిమాటలూ నువ్వూ.’’

‘‘అందుకే మరి! నువ్వు ఒక్కసారి పర్మిషనిస్తే- ప్లీజ్‌ దేవసేనా... నేనింకే పాడుపనీ చేయను.’’

నా మాట పూర్తవకముందే ఆ పార్కు మళ్ళీ ఉలిక్కిపడేలా నా చెవి మెలిపెట్టి వదిలింది, ఆ అందాల రాక్షసి.

‘‘నెల రోజుల్లో పెళ్ళి పెట్టుకుని, నువ్వు ఫోన్‌చేసి బతిమాలావు కదాని నీతో పార్కుకి రావడమే బుద్ధితక్కువ పని’’ అంటూ కోపంగా లేచి స్కూటీ స్టార్ట్‌ చేసుకుని వెళ్ళిపోయింది.

‘నిజమే... నెలరోజుల్లో పెళ్ళి పెట్టుకుని అనవసరంగా నోరు జారానా?’ అని లెంపలేసుకున్నాను.

***

ప్రేమికుల లెక్కల్లో క్షణమొక యుగమైతే... ఇరవై అయిదు లక్షల తొంభైరెండువేల యుగాల తర్వాత ఆ శుభఘడియ రానేవచ్చింది. మేళతాళాల మధ్య మేం ఒకటైపోయాం. ఆ మొదటిరాత్రి, దివి నుంచి దిగివచ్చిన దేవతలా ఉంది దేవసేన. పాము కుబుసంలా మిలమిలా మెరుస్తున్న తెల్లటి బట్టల్లో, చేతిలో పాలగ్లాసుతో గదిలోకి వచ్చింది. నేను ముగ్ధుణ్ణయిపోయి కళ్ళప్పగించి చూస్తుంటే, పైపన్ను తళుక్‌ మనేలా మనోహరంగా నవ్వింది. తనకి పైపలువరుసలో కుడివైపున పంటిపైన అదనంగా మరో పన్ను వచ్చింది. బహుశా ఆ పన్నువల్లే తన అందం రెట్టింపయిందేమోనని నా అనుమానం. ఆ పన్నన్నా, నల్లత్రాచులాంటి ఆ జడ అన్నా, నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న ‘పరిష్వంగం’ గుర్తొచ్చింది నాకు. నెమ్మదిగా తన చేతిలోని గ్లాసందుకుని టీపాయ్‌ మీద పెట్టి నెమ్మదిగా తనని నా గుండెలకు హత్తుకున్నాను. ఎన్నో ఏళ్ళ కోరిక తీరుతున్నదన్న ఎగ్జయిట్‌మెంట్‌తో నా చేతులు వణుకుతున్నాయ్‌. ఒళ్ళంతా విద్యుత్‌ ప్రవహిస్తున్నట్టుంది. కళ్ళముందు కోటి ఇంద్రధనుస్సులు - మనసులో కోటి వసంతాలు! గదిని అలంకరించిన మల్లెలూ, సంపెంగల సుగంధాలు కానీ... ఆమె శరీరం నుంచి వస్తున్న వలపు పరిమళాలు కానీ... నాలో ఏ ఇతర వాంఛలూ రగిలించడం లేదు. ఏదో తెలియని అలౌకిక భావన కలుగుతోంది. ఇదేనా పరిష్వంగం అంటే!? ఎప్పుడో నానుంచి విడిపోయిన నా సగభాగమేదో తిరిగి నాలో ఐక్యమైపోతున్నట్టు... రెక్కలొచ్చి మబ్బుల్లో ఎగురుతున్నట్టు!

అలా ఎంతసేపు నిశ్చలంగా, నిష్కామంగా ఉండిపోయానో నాకు తెలియదు. కాలం ఆగిపోయినట్టనిపించింది. నిజమే కళత్ర పరిష్వంగంలో కోటి స్వర్గాల సుఖముంది. కాలాన్ని ఆపేసే శక్తీ ఉంది.

కానీ, మర్నాడు తెల్లవారిన దగ్గర్నుంచీ కాలం మళ్ళీ ఎప్పటిలాగే పరుగందుకుంది. అది కూడా మధ్యాహ్నం పన్నెండు వరకే. ఆ తర్వాత సాయంత్రం అయిదింటి వరకూ చాలా నెమ్మదిగా! ఈ కాలం అనేది ఒక్కొక్కసారి వేగంగా మరోసారి నెమ్మదిగా ఎందుకు కదులుతుందో నాకర్థం కావడంలేదు. మొత్తంమీద చూస్తే మాత్రం చాలా వేగంగానే కదులుతున్నట్టనిపిస్తోంది.

నార్త్‌లో గడిపిన రెండు నెలల హనీమూన్‌ ట్రిప్‌ రెండురోజుల్లో అయిపోయినట్టనిపించడానికి అదే కారణం! చూస్తుండగానే కాలం గిర్రున తిరిగి వెడ్డింగ్‌ యానివర్సరీ రోజు కూడా వచ్చేసింది. ఆరోజు మా రెండు కుటుంబాల్లోనూ పండుగలానే గడిచింది. కానీ, లంచ్‌ చేస్తూ చేస్తూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర్నుంచి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వాష్‌బేసిన్‌ వైపు పరుగెత్తింది దేవసేన. నేను కంగారుపడ్డాను. అమ్మ నవ్వింది.

హాస్పిటల్లో లేడీ డాక్టర్‌, మాకు కంగ్రాట్స్‌ చెప్పి ‘‘మళ్ళీ వెడ్డింగ్‌ యానివర్సరీకల్లా, మీ ఇద్దరిమధ్యా ఓ క్యూట్‌ బేబీ ఉంటుంది’’ అంది నవ్వుతూ.

‘కళత్ర పరిష్వంగం కోసం సుమారు ఎనిమిదేళ్ళు ఎదురుచూశాను. పుత్ర పరిష్వంగం కోసం మరో తొమ్మిది నెలలు ఆగాలన్నమాట! ఇది కూడా క్షణమొక యుగంలాగే’ అనుకున్నాను మనసులో.

***

ఒకరోజు తెలతెలవారుతుండగా మా మావగారు ఫోన్‌ చేశారు. అమ్ములికి డెలివరీ అయిందనీ, అబ్బాయనీ!‘అమ్ములు’ దేవసేన ముద్దుపేరు.

వెంటనే అమ్మా నేనూ కారులో హాస్పిటల్‌కి చేరుకున్నాం. నాన్నగారు లేరు వైజాగ్‌ వెళ్ళారు. బాబు అందంగా, హెల్దీగా ఉన్నాడు. ఆ పసిగుడ్డుని ఎత్తుకోవడానికి నాకు భయంవేసింది. మునివేళ్ళతో ముట్టుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అమ్మ ఎత్తుకుని ‘‘తల్లి పోలికలు ఉన్నాయిరా, అదృష్టవంతుడే’’ అంది.

‘‘ఏదీ... దానిమ్మగింజల్లాంటి పళ్ళూ లేవు, అదనంగా పైపన్నూ లేదు’’ అన్నాను నవ్వుతూ.

కొంతసేపటికి పెద్దవాళ్ళందరూ రూమ్‌ బయటికి వెళ్ళిపోయారు - మమ్మల్ని ఒంటరిగా వదిలి.

‘‘చాలా థాంక్స్‌ డియర్‌! చక్కని కొడుకునిచ్చావ్‌. కూతురైనా ఓకే ననుకో, హెల్దీగా ఉంటే చాలు. ఇప్పుడు నీ పైపన్నునొకసారి ముద్దు పెట్టుకుని థాంక్స్‌ చెప్పాలని ఉంది’’ అన్నాను కాస్త ముందుకు వంగుతూ.సిగ్గూ, ప్రేమా కలిపి చిరుకోపంతో చూస్తూ ‘‘నీకా అవకాశం ఇస్తే ఏడాది తిరక్కుండానే మళ్ళీ ఇదే స్థితిలో ఈ బెడ్‌మీదే ఉంటాన్నేను’’ అంది దేవసేన నవ్వుతూ.

‘‘అటువంటి పని మాత్రం చెయ్యకండమ్మా, ఆరోగ్యం పాడవుతుంది. బిడ్డకీ బిడ్డకీ మధ్య ఎడం ఉండాలి’’ అంది నర్సు. ఎప్పుడొచ్చిందో నా వెనుక నిలబడి ఉంది.

‘‘మా ఇంటికీ, మా అత్తారింటికీ మధ్య ఐదారు కిలోమీటర్లుంది. ఈ బిడ్డని మా ఇంట్లోనూ, రెండో బిడ్డని అత్తగారింట్లోనూ ఉంచితే- ఆ ఎడం సరిపోతుందా?’’ అని అడిగాను నర్సుని అమాయకపు ఫోజుతో! ముందు బిత్తరపోయింది నర్సు. ‘‘బిడ్డకీ బిడ్డకీ ఎడం అంటే - కాన్పుకీ కాన్పుకీ అని సార్‌’’ అని అటు తిరిగింది. ‘‘ఎందుకైనా మంచిది, ఈయన్తో జాగ్రత్తగా ఉండండమ్మా’’ అని నా భార్యకి సలహా ఇచ్చి వెళ్ళిపోయింది.

‘‘హాస్పిటల్‌లో కూడా పోకిరీ మాటలేనా’’ అంటూ నవ్వింది దేవసేన.

***

ఇరవైఒకటవ రోజున బాబుని వూయల్లో వేశారు. మా అత్తగారింట్లో పెద్ద హడావుడే జరిగింది.

నెట్‌లో సెర్చ్‌ చేసి బాబుకి ‘పీయూష్‌’ అనే పేరు సెలెక్ట్‌ చేసుకుంది దేవసేన. ఆ పేరు నాకూ నచ్చింది.

ఇంతవరకూ బాబుని అరచేతుల్లోకి ఎత్తుకోవడమే తప్ప, తృప్తిగా గుండెలకు హత్తుకోనేలేదు నేను. కారణం- వాడింకా ముట్టుకుంటే కందిపోయేలాగే కనబడుతున్నాడు. ఎత్తుకుంటే నలిగిపోతాడేమో అని నా భయం.

‘‘ధృతరాష్ట్ర కౌగిలిలా... నన్ను నలిపేసినట్టు నలిపెయ్యకూడదు కానీ మామూలుగా ఎత్తుకోవచ్చు’’ నా చెవిలో గుసగుసలాడింది దేవసేన, అంటూనే బాబుని నాకందించింది. ఎంతో అపురూపంగా అందుకున్నాను నేను.

పీ..యూ..ష్‌..! నా రక్తం! నా చదువుకీ, తెలివికీ, మా వంశానికీ, మా ఆస్తికీ వారసుడు. అందంగా, ఆరోగ్యంగా పుట్టినప్పటికంటే ఒళ్ళొచ్చి, బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. చాలాసేపు కళ్ళారా తనివితీరేలా చూసుకున్నాను- చేతుల్లోనే ఉంచుకుని. పుత్ర పరిష్వంగం కోసం నా హృదయం తహతహలాడసాగింది. వాణ్ణి నెమ్మదినెమ్మదిగా నా గుండెలకు ఆనించుకున్నాను. తర్వాత మరికొంచెం గట్టిగా! నా మనసు ఉప్పొంగిపోతోంది. వాడి శరీరం నుంచి ఏ పౌడర్లూ, స్నోలూ, అత్తర్లూ ఇవ్వలేని అద్భుతమైన వాసన... పసివాసనేదో వెలువడి స్వర్గాన్ని కళ్ళముందుకు తెస్తోంది. ‘వాడు నా కొడుకు... నేను వాడి తండ్రిని’ అన్న భావనతో, గర్వంతో నా మనసు నిండిపోయింది. ఎప్పుడో ఎక్కడో నేను దాచుకున్న అమూల్యమైన, అఖండమైన సంపదేదో ఇన్నాళ్ళకు నా చేతికొచ్చిన అద్భుతమైన తృప్తి! నిజమే ఇది కోటి స్వర్గసుఖాలకి సమానమే!

హమ్మయ్య, కళత్రపుత్ర పరిష్వంగాలు రెంటినీ అనుభవించాను అన్న తృప్తి కలిగింది. పుట్టినప్పుడు గుండెలకు హత్తుకున్నప్పుడూ ఇంతటి ఆనందాన్ని కలిగిస్తారు కాబట్టేనేమో... పెద్దయ్యాక గుండెలమీద వాళ్ళు తన్నినా, అప్పటి ఆ అనుభూతి మెత్తగా అడ్డుపడి కన్నవాళ్ళు వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉంటారు అనిపించింది.

ఆఫీసు నుంచి ఫోన్‌ వచ్చింది. సుధీర్‌ చేశాడు. ‘‘సార్‌, ప్రమాదం జరిగిపోయింది. దుర్గాప్రసాద్‌గాడు మన టెండర్‌ లీక్‌ చేసేశాడు. నక్షత్ర అపార్ట్‌మెంట్స్‌ కోసం టెండర్‌ వేయడానికి నిన్న మీరు రఫ్‌ వర్క్‌ చేసిన కాగితాలు డస్ట్‌బిన్‌లోంచి తీసి, పెనెన్సులా బిల్డర్స్‌కి ఫోన్‌లో డీటెయిల్స్‌ చెబుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నేను కోపం ఆపుకోలేక గట్టిగానే కొట్టేశాను. మీరొకసారి వస్తారా?’’

నా గుండెలు దడదడలాడాయ్‌ ‘‘వాడేమంటున్నాడు?’’ అడిగాను నీరసంగా.

‘‘ఏమంటాడు... అడ్డంగా దొరికిపోయాడుగా- బహుశా నాలుగేళ్ళక్రితం లీకైన టెండర్‌ వెనుక కూడా వీడి హస్తమే ఉందేమో!?’’ అన్నాడు సుధీర్‌.

నా మెదడు మొద్దుబారిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాను. కొన్ని క్షణాల తర్వాతగానీ నా బుర్ర పనిచేయలేదు. గబగబా నాన్నగారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాను. ‘నేనూ వస్తా పద’ అంటూ నాన్నగారూ బయలుదేరారు.

దుర్గాప్రసాద్‌కి పంతొమ్మిదేళ్ళుంటాయ్‌. తండ్రి లేడు, తల్లి మా ఇంట్లోనే మా అమ్మకు సాయంగా ఉంటోంది. కొడుకు క్రికెట్‌ పిచ్చిలోపడి టెన్త్‌ తప్పాడనీ, చెడు సావాసాలు ఎక్కువయ్యాయనీ, వాడికి ఏదైనా పని ఇప్పించమనీ బతిమాలితే... మా ఆఫీసులోనే పెట్టుకున్నాం. బాగానే ఉండేవాడు... మరి ఎందుకిలా చేశాడో! నా ఆలోచనలు పరిపరివిధాలుగా పోతున్నాయ్‌.

నాలుగేళ్ళక్రితంనాటి సంగతి గుర్తొచ్చింది. అప్పుడప్పుడే పైకి వస్తున్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాది. ఎలా లీకైందో ఒక పెద్ద టెండర్‌ చేజారి, పది లక్షలు లాస్‌ వచ్చింది. తట్టుకోలేని ఆవేశంతో నాన్నగారికి పెరాల్సిస్‌ కూడా ఎటాకయింది. వెంటనే అలర్ట్‌ అవడం వల్ల గండం గడిచింది. బహుశా ఆ లాస్‌కి కూడా వీడే కారణమన్న విషయం గుర్తొచ్చి ఎర్రబడ్డ నా మొహాన్నీ, స్టీరింగ్‌ మీద బిగుసుకుంటున్న నా చేతుల్నీ గమనిస్తున్న నాన్నగారు నా భుజం మీద చేయివేసి నెమ్మదిగా తట్టారు.

‘‘కూల్‌డౌన్‌ కార్తీక్‌... కూల్‌డౌన్‌! ఆవేశం తెచ్చుకోకు. ఆవేశం- ఆలోచనని చంపేస్తుంది. ఓర్పు- విలువని బతికిస్తుంది’’ అన్నారు. ఆయనకి నా కోపం గురించీ, జేబులోని నా రివాల్వర్‌ గురించీ తెలుసు.

‘‘నాన్నగారూ, వాడెంత నమ్మకద్రోహం చేశాడో చూశారుగా?’’ అన్నాను తల తిప్పకుండానే.

‘‘నిజమే, వాడు చాలా ద్రోహమే చేశాడు. కానీ, ఒకటి ఆలోచించు- వాడివల్ల మనకు డబ్బు మాత్రమే లాస్‌. భగవంతుడి దయవల్ల, అది మనకు పెద్ద సమస్యేమీ కాదు. కానీ వివేకం కోల్పేతే, నీ భవిష్యత్తే పాడైపోతుంది. వాడి తల్లి మన ఇంట్లో ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తోంది నమ్మకంగా. ఆవిడ కోసమైనా మనం వాణ్ణి క్షమించలేమా? అంతేకాదు, శిక్షించగలిగిన శక్తి ఉండి కూడా క్షమించగలగడమే చాలా గొప్ప! మరో విషయం, టెండర్‌ లీకైందని మనం భయపడక్కర్లేదు. పెనెన్సులా వాళ్ళు మనకన్నా ఐదు, పదివేలు మాత్రమే తక్కువ కోట్‌ చేస్తారు. మనం పాతికవేలు తగ్గించి కోట్‌ చేద్దాం. అదృష్టవశాత్తు మనం ఇంకా టెండర్‌ సబ్మిట్‌ చేయలేదు కనుక, ఆ అమౌంట్‌కి టెండర్‌ మనకే వస్తుంది గ్యారంటీగా’’ అన్నారు.

***

ఆఫీసు పార్కింగులో కారాపి విసురుగా డోర్‌ తీసి దిగుతుంటే ‘‘రివాల్వర్‌ డాష్‌బోర్డ్‌లో పెట్టెయ్‌’’ అన్నారు సంకోచిస్తూనే. రివాల్వర్‌ తీసి డాష్‌బోర్డ్‌లో పెట్టేశాను.

మేం వెళ్ళేసరికి హాల్లో మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు దుర్గాప్రసాద్‌. అతని ఒంటిమీద షర్ట్‌ లేదు. శరీరం నిండా బెల్ట్‌ దెబ్బల తాలూకు ఆనవాళ్ళతో కొత్తరకం కట్లపాములా ఉన్నాడు వాడు. కళ్ళ నుంచి ఇంకా నీళ్ళు కారుతూనే ఉన్నాయి.

సుధీర్‌, గోపీ, లక్ష్మణ్‌, రామాంజనేయులు వాడి చుట్టూ నిలబడి ఉన్నారు. అందరి మొహాలూ కోపంతో జేవురించి ఉన్నాయి. వాళ్ళందరికీ మా సంస్థ మీదా, మా నాన్నగారిమీదా చాలా గౌరవాభిమానాలున్నాయి. జరిగిన మోసం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరి చేతుల్లోనూ ప్యాంట్‌ బెల్టులున్నాయి.

ఎందుకో నా ఒళ్ళు జలదరించింది. నన్ను చూడగానే దుర్గాప్రసాద్‌ భయంతో వెర్రికేకలు వేశాడు. సుధీర్‌ చేతిలోని బెల్ట్‌ అందుకుని ఒక్కో అడుగూ ముందుకు వేస్తుంటే, నేను కూడా కొడతానో, లేక ఆ బెల్ట్‌ మెడచుట్టూ బిగించి చంపేస్తానో అని భయపడిపోతూ వాడు ఒక్కో అడుగూ వెనక్కి వేయసాగాడు.

చుట్టూ ఉన్నవాళ్ళందరూ కూడా కళ్ళు పెద్దవిచేసి, వూపిరి బిగపట్టి చూస్తూండిపోయారు.

వెనుక గోడ అడ్డు రావడంతో దుర్గాప్రసాద్‌ ఆగిపోయాడు. నేను చేతిలో బెల్ట్‌ కిందపడేసి రెండుచేతులూ ముందుకు చాపాను. పీక పిసుకుతాననుకున్నాడేమో రెండు చేతులూ జోడించి నా కాళ్ళమీద పడిపోయాడు వాడు.

చాచిన చేతులు అతని భుజాల మీద వేసి లేపి నిలబెట్టాను. ‘‘ఏరా, మీ అమ్మకి మా ఇంట్లో ఆశ్రయమిచ్చాం. నీకు ఉద్యోగమిచ్చాం. మీ చెల్లెలికి వైద్యం చేయించి హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం తప్పు కదూ?’’ అన్నాను అనునయంగా.

వాడి కళ్ళు ధారలుగా వర్షిస్తున్నాయి. మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. మళ్ళీ కాళ్ళమీద పడబోతుంటే లేపి, వాడి వీపు చుట్టూ చేతులు పోనిచ్చాను. నా కోపమంతా ఆవిరైపోతుంటే... నెమ్మదిగా దగ్గరకు... ఇంకా దగ్గరకు... నా గుండెలకు దగ్గరగా..! వాడు భోరుమంటూ నన్నల్లుకుపోయాడు. అభయం ఇస్తున్నట్టు హృదయానికి హత్తుకున్నాను.

ఇదీ పరిష్వంగమే..! శత్రుపరిష్వంగం..! చిత్రమేమిటంటే, కళత్రపుత్ర పరిష్వంగం కోటి స్వర్గాల సుఖాన్నిస్తే... ఈ శత్రు పరిష్వంగం, కోటి స్వర్గాలను జయించిన విజయోత్సాహాన్నిస్తోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిన భావనని కలిగిస్తోంది. నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ చిన్నవాళ్ళైపోయి, తలలు బాగా వెనక్కి వాల్చి, ఎదిగిపోయిన నన్ను నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్న అనుభూతి కలుగుతోంది.

కళత్ర, పుత్ర పరిష్వంగం కన్నా ఈ శత్రు పరిష్వంగమే ఎక్కువ మధురం అనిపిస్తోంది.

శిక్షించగలిగీ క్షమించడంలో ఉన్న ఔన్నత్యమేమిటో అనుభవంలోకి వస్తోంది.

‘థాంక్స్‌ నాన్నగారూ’ అనుకున్నాను మనసులో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.