close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒకే గూటి పక్షులు

ఒకే గూటి పక్షులు

- సన్నిహిత్‌

ర్కింగ్‌డేస్‌లో నేను తొందరగా ఇంటికి రావడం అనేది కల్ల. షాపింగ్‌కి వెళ్ళాలి అన్న ప్రోగ్రాం ఉండబట్టి, అదీ నా భార్య ఎప్పటినుండో పోరుతుంది కాబట్టి ఆఫీసు నుండి తొందరగా వచ్చాను. అయితే మేము షాపింగ్‌కి వెళ్ళేది ఎక్కడో దూరంగా ఉండే షాప్‌కి కాదు. మా ఇంటినుండి అరగంట ప్రయాణం చేస్తే వచ్చే మార్కెట్‌కి. అయినా హడావుడి తప్పదు. ఇంటికి రాగానే నేనూ, నా భార్యా, మా అబ్బాయీ అందరం గబగబా రెడీ అయి కార్లో కూలబడ్డాం. టైము సాయంత్రం సుమారు ఆరు గంటలు కావస్తోంది. శీతాకాలపు చలిగాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. చీకటి పడటం ప్రారంభించింది.  కొంతదూరం వెళ్ళాక ‘‘డాడీ, నాకు ఆకలేస్తోంది’’ అంటూ మా అబ్బాయి రాగం అందుకున్నాడు.

‘‘ఓరి నీ దుంపతెగ, మధ్యాహ్నం భోంచేయలేదా?’’ అంటూ విసుక్కున్నాను.

‘‘చేశాను డాడీ, అయినా ఆకలేస్తోంది’’ అంటూ సాగదీశాడు.

‘‘బకాసురుడి తమ్ముడివిరా నువ్వు’’ అని నేను జోక్‌ చేస్తే-

‘‘ఎందుకు వెయ్యదు? స్కూలు ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుంటే అలాగే వేస్తుంది ఆకలి’’ అంటూ వాళ్ళమ్మ నెమ్మదిగా చివాట్లు పెట్టసాగింది.

కారుని జాగ్రత్తగా డ్రైవ్‌ చేయసాగాను. ఆఫీసులు వదిలే టైము కావడంతో ట్రాఫిక్‌ చాలా హెవీగా ఉంది. అసలు ఇలాంటి షాపింగ్‌ ప్రోగ్రామ్‌లు ఏ ఆదివారమో పెట్టుకుంటే బాగుంటుంది. కానీ, మా ఆవిడ దానికి విరుద్ధం. వారమంతా ఇంటి పనులతో అలసిపోయిన ఆమె ఆదివారం మాత్రం పూర్తిగా రెస్ట్‌ తీసుకుంటుంది. టీవీలో వచ్చే బ్లాక్‌బస్టర్‌ సినిమాల్ని సంతృప్తిగా చూడవచ్చని ఆమె ఆశ. పైగా ఆరోజు ఎలాగూ నేను ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంటి పనులన్నీ చూసుకుంటాననే ధీమా!

షాపింగ్‌మాల్‌ దగ్గరికి చేరుకున్నాక ముందు మావాడి ఆత్మారాముణ్ణి శాంతింపచేద్దామని పూనుకున్నాం. కారుని మాల్‌ పక్కనే ఉన్న ఒక టిఫిన్‌ సెంటర్‌ ముందు పార్క్‌ చేసి లోనికి దారితీశాం.

టిఫిన్‌ సెంటర్‌ చాలా రష్‌గా ఉంది. ఆకలిగొన్న మాలాంటి వాళ్ళతో కిటకిటలాడుతూ, సోమాలియాలోని అన్నార్తులని గుర్తుకు తెస్తోంది. కూపన్‌లు తీసుకునే దగ్గర నుండి, ఫుడ్‌ ఐటమ్స్‌ కలెక్ట్‌ చేసుకునే కౌంటర్‌ వరకూ అన్నీ బెల్లంముక్క చుట్టూ ముసిరిన ఈగల లాంటి మనుషులతో కళకళలాడుతున్నాయి. ఎక్కడా కూర్చోడానికి సీటు కూడా లేదు. అందరూ సీట్ల కోసం టిఫిన్‌ ప్లేట్లు పట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు. కొంచెం ఖాళీ కాగానే ఆ సీట్లో కూర్చుని తింటున్నారు.

నేను మాకు కావాల్సిన ఫుడ్‌ ఐటమ్స్‌కి టోకెన్లు తీసుకుని, పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలా టిఫిన్‌ తీసుకునే గుంపులో చొరబడ్డాను. కౌంటర్‌ లోపల ఉన్న అబ్బాయి ఒక్కొక్కరికి వారివారి ఐటమ్స్‌ నెమ్మదిగా ఇస్తున్నాడు. ఇంతలో అతడు తెస్తున్న ఒక వడ జారి నేలమీద పడిపోయింది. దాన్నే తీసి మళ్ళీ ప్లేట్లో వేసి ఒక కస్టమర్‌కి ఇచ్చేశాడు. అది చూసిన నాకు కొంచెం అసహ్యం వేసింది. కానీ, ఇలాంటివి వాళ్ళకి సర్వసాధారణం. కాసేపటికి నాకు టిఫిన్‌ ప్లేట్లు చేతికిచ్చాడు. అవి తీసుకుని ఆ గుంపులో నుండి బయటపడి మావాళ్ళ దగ్గరికి వచ్చాను. పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. సీట్‌ కోసం వాళ్ళు ఇంకా వెయిట్‌ చేస్తున్నారు.

ఇంతలో మేము నిల్చున్న దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది. చూడ్డానికి కొంచెం లోయర్‌ మిడిల్‌క్లాస్‌ మనుషుల్లా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో కూడా టిఫిన్‌ ప్లేట్లు ఉన్నాయి. మాలాగే సీట్‌ కోసం వెదుకుతున్నారు. ఆ కుటుంబం యజమాని తనవాళ్ళను తొందరగా ఒక సీట్లో కూర్చోబెట్టి సంతోషపెడదామని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో మాకు ఒక ఖాళీ టేబుల్‌ దొరికింది. వెంటనే సర్దుకుని కూర్చున్నాం. ఆ కుటుంబ యజమాని మావైపు నిరాశగా చూశాడు. అదేమీ పట్టించుకోకుండా ఆకలిగొన్న పులుల్లా మేము టిఫిన్‌లమీద పడ్డాం.

ఒక నిమిషం తర్వాత మా పక్కనే ఏదో మూట పడినట్లు ‘దబ్బు’మన్న సౌండ్‌ వచ్చింది. అదిరిపడి చూశాం. పేద కుటుంబ సభ్యులలోని అమ్మాయి కిందపడి నిస్సహాయంగా కొట్టుకుం టోంది. ‘అయ్యయ్యో’ అంటూ చుట్టూ జనం మూగారు. ‘అమ్మాయికి కళ్ళు తిరిగినట్లున్నాయి... కొంచెం సీటు ఇవ్వండి ఎవరైనా’ అని గుంపులో నుండి ఎవరో అన్నారు. మేము అందరమూ టిఫిన్‌ ప్లేట్లు చేత్తో పట్టుకుని సీట్లో నుండి లేచిపోయాం. పేద కుటుంబ యజమాని ఆ అమ్మాయిని లేపి మా సీట్లో కూర్చోబెట్టాడు. చుట్టూ జనం రకరకాల సలహాలు ఇస్తూ తమ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకెవరో కొంచెం మంచినీళ్ళు తాగించారు. కాసేపటికి ఆమె సర్దుకుని నార్మల్‌ అయింది. మేము కొంచెం దూరంగా వెళ్ళి నిలబడే తినటం ప్రారంభించాం. తింటూ తింటూ ఆమె వైపు చూసి ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే కాసేపటి క్రితం కళ్ళు తిరిగి పడిపోయి అసహాయ స్థితిలో ఉన్న ఆమె ఇప్పుడు ఏమీ జరగనట్లు నవ్వుతూ తన వాళ్ళతో మాట్లాడుతోంది. ఇంతకుముందు కిందపడి గిలగిలా కొట్టుకున్న దాఖలాలేమీ లేవు. కన్నుకొట్టి ‘చూశావా, సీటు ఎలా సంపాదించానో!’ అంటూ తన వాళ్ళకి చెప్పి గర్వపడుతోంది. ఒళ్ళు మండిపోయింది నాకు. ఆమె మీద అసహ్యం వేసింది. టిఫిన్‌ తినడం ముగించి షాపింగ్‌మాల్‌లోకి వెళ్ళాం. గంటసేపు తిరిగి తిరిగి కావాల్సినవన్నీ కొనుక్కుని బయట కారు దగ్గరకి వచ్చి షాకయ్యాం.

***

మా కారు ఫ్రంట్‌ వీల్‌ టైర్‌కి తాళం వేసి ఉంది. తియ్యడానికి కుదరదు. చుట్టూ చూశాను. కొంచెం దూరంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కనిపించాడు. అతని దగ్గరకు వెళ్ళి ‘‘ఎందుకు లాక్‌ చేశారు?’’ అని కోపంగా అడిగాను.

‘‘మీ కారు ‘నో పార్కింగ్‌’ ప్లేస్‌లో ఉంది, బోర్డు కనపడ్డంలేదా?’’ విసురుగా చెప్పాడు. జాగ్రత్తగా చూశాక ‘నో పార్కింగ్‌ బోర్డు’ కనపడింది.

‘‘ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి కదా, నా కారుకే ఎందుకు లాక్‌ వేస్తారు? అన్ని కార్లకూ వెయ్యొచ్చు కదా?’’ లాజికల్‌గా అడిగాను.

కొంచెం తత్తరపడ్డాడు ఆ కానిస్టేబుల్‌.

‘‘నా దగ్గర ఒకటే లాక్‌ ఉంది సార్‌, అందుకే మీ కారుకి వేశాను. ఫైన్‌ కట్టండి’’ అంటూ బిల్‌బుక్‌ తీశాడు. నాకు అర్థమైంది. ఒక వంద రూపాయల నోటు అతడి చేతిలో పెట్టాను. వెంటనే నా కారుకి ఉన్న లాక్‌ తీసేసి ఇంకో కారుకి వేశాడు.

ఆ తర్వాత కారులో ఇంటికొస్తుండగా జరిగిన సంఘటనలన్నీ కళ్ళముందు కదిలాయి. కిందపడిన వడని ప్లేట్లో వేసి కస్టమర్‌కి నీట్‌గా సర్వ్‌ చేసిన హోటల్‌ అబ్బాయీ, మూర్ఛ వచ్చినట్లు నటించి కూర్చోడానికి సీటు సంపాదించిన పేద అమ్మాయీ, కార్లకి తాళాలు వేసి డబ్బులు దండుకుంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబులూ వీళ్ళందరినీ చూసి అసహ్యమేసింది నాకు. ‘ఎదుటివాళ్ళ అవసరం మీద ఆడుకుంటూ, మోసం చేస్తూ ఎలా బతుకుతారు వీళ్ళు ఛీఛీ’ అనిపించింది.

***

ఆఫీసులో సీరియస్‌గా పనిచేసుకుంటున్నాను. ఇంతలో నా టేబుల్‌ మీద ఫోన్‌ రింగయింది. లిఫ్ట్‌ చేసి ‘‘హలో’’ అన్నాను.

‘‘ఆ... నేనయ్యా మీ డైరెక్టర్‌ని. నువ్వు అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాల్సిన పనిపడింది. మనం ఈమధ్యనే హెడ్‌క్వార్టర్స్‌కి పంపించిన ప్రాజెక్ట్‌ ప్రపోజల్లో హెడ్డాఫీసు వాళ్ళకి ఏవో డౌట్స్‌ ఉన్నాయట. నాకు వెళ్ళడానికి కుదరదు. నువ్వెళ్ళి అవన్నీ క్లారిఫై చేసి రావాలి’’ అని ఆర్డర్‌ వేశాడు.

‘‘అలాగే సార్‌’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాను.

హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ రంగ సంస్థలో కొంచెం పెద్ద పొజిషన్‌లోనే ఉన్నాను. చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం. అందుకే బాస్‌ అడగ్గానే ఢిల్లీ వెళ్ళడానికి ఒప్పుకున్నాను. వెంటనే ట్రావెల్‌ ఏజెంట్‌కి ఫోన్‌ చేసి, మరుసటి రోజు ఢిల్లీకి ఫ్లయిట్‌లో వెళ్ళిరావడానికి ‘బిజినెస్‌’ క్లాస్‌లో టికెట్స్‌ బుక్‌ చేయమని చెప్పాను. ఎందుకంటే నా ఎలిజిబిలిటీ ప్రకారం బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం చేయవచ్చు. ఆ తర్వాత ఆఫీసు పని చేయడంలో మునిగిపోయాను.

ఇంటికొచ్చాక నా భార్యతో ఢిల్లీ ప్రయాణం గురించి చెప్పాను. ‘‘అరె, ఢిల్లీ వెళుతున్నారా? అయితే, కరోల్‌బాగ్‌ మార్కెట్‌లో మాకు కావాల్సిన షాపింగ్‌ అంతా చేయండి’’ అని ఆర్డర్‌ వేసింది.

‘‘అలాగే మేడమ్‌’’ అని గట్టిగా నవ్వేశాను.

ఇంతలో మా ట్రావెల్‌ ఏజెంట్‌ ఫోన్‌ చేశాడు. ‘‘సార్‌, బిజినెస్‌ క్లాస్‌లో మీకు టికెట్స్‌ బుక్‌ చేశాను. రేపొద్దున వాటిని కేన్సిల్‌ చేసి ఎకానమీ క్లాస్‌కి బుక్‌ చేస్తాను’’ అని చెప్పాడు.

నాకు అర్థమైంది అతడు చెప్పేది. ‘‘సరే, అలాగే... కానీ, నా సెల్‌కి టికెట్‌ డిటెయిల్స్‌ ఎస్సెమ్మెస్‌ చెయ్యి’’ అని చెప్పి కట్‌ చేశాను.

మరుసటిరోజు ఎయిర్‌పోర్ట్‌కి ఆటోలో వెళ్ళి ఎకానమీ క్లాస్‌లో ట్రావెల్‌ చేసి ఢిల్లీ చేరుకున్నాను. అక్కడ దిగగానే ఆఫీసువాళ్ళు పంపించిన కారులో హెడ్డాఫీసుకు వెళ్ళాను. మధ్యాహ్నం వరకు పని చూసుకుని తర్వాత ఆఫీసు కారులోనే కరోల్‌బాగ్‌ వెళ్ళి షాపింగ్‌ చేశాను. తర్వాత సాయంత్రానికల్లా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి మళ్ళీ ఎకానమీ క్లాసులోనే ట్రావెల్‌ చేసి హైదరాబాద్‌ చేరుకున్నాను. అక్కడి నుండి ఇంటికి ఆటోలో వచ్చేశాను.

ఇంటికి రాగానే నా భార్య ‘‘షాపింగ్‌ ఏం చేశారండీ’’ అంటూ బ్యాగ్‌ మీద పడింది. పిల్లలు నన్ను ‘‘డాడీ’’ అంటూ ప్రేమగా చుట్టేశారు. తర్వాత డిన్నర్‌ చేస్తుండగా మా ట్రావెల్‌ ఏజెంట్‌ ఫోన్‌ చేశాడు.

‘‘సార్‌, వచ్చేశారా?’’ అంటూ అభిమానంగా అడిగాడు. వాడి అభిమానానికి కారణం నా టికెట్స్‌ బుకింగ్‌ వల్ల వచ్చే కమీషన్‌ అని నాకు తెలుసు.

‘‘ఆ.. వచ్చేశాను. నువ్వు కేన్సిల్‌ చేసిన బిజినెస్‌ క్లాస్‌ టికెట్స్‌ నా మెయిల్‌ ఐడీకి పంపించు రేపు అవి అకౌంట్స్‌ సెక్షన్‌లో బిల్లు క్లెయిమ్‌ చేయడానికి కావాలి’’ అని చెప్పి పెట్టేశాను. డిన్నర్‌ పూర్తయ్యాక కాసేపు టీవీ చూసి నిద్రకు ఉపక్రమించాను.

***

ఆఫీసుకి వెళ్ళేటప్పటికి మా బాస్‌ నన్ను ఆనందంగా రిసీవ్‌ చేసుకున్నాడు.

‘‘మన హెడ్డాఫీసు చీఫ్‌ చాలా సంతోషపడిపోయాడయ్యా. వెరీగుడ్‌ జాబ్‌, వెల్‌డన్‌’’ అని అభినందించాడు.

‘‘థ్యాంక్యూ సార్‌’’ అని చెప్పి, నా క్యాబిన్‌కి వచ్చి ఇంటర్నెట్‌ నుండి నా బిజినెస్‌ క్లాస్‌ టికెట్స్‌ ప్రింట్‌ తీశాను. వెంటనే అకౌంట్స్‌ ఆఫీసర్‌ని పిలిచి నా టికెట్స్‌తోపాటు ట్రావెలింగ్‌ వివరాలు రాసిన అప్లికేషన్‌ ఇచ్చి క్లెయిమ్‌ చేయమని చెప్పాను. నేను రాసిన వివరాలను పరిశీలనగా చూడసాగాడు అకౌంట్స్‌ ఆఫీసర్‌.

‘‘ఫ్లయిట్‌ టికెట్స్‌, టాక్సీ బిల్లులు కలిపి ఈసారి చాలానే అయింది సార్‌. సరేలెండి, నేను బిల్లును అప్రూవ్‌ చేస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్నగా నవ్వుకున్నాను నేను. ఈ ట్రిప్‌ వల్ల నాకు చాలా లాభం. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికీ రావడానికీ ఆటోలో వెళ్ళినప్పటికీ, టాక్సీలో వెళ్ళానని రాశాను. ఢిల్లీలో తిరగడానికి ఆఫీసు కారు వాడినప్పటికీ టాక్సీలో తిరిగానని రాశాను. ఫ్లయిట్‌ టికెట్స్‌ బిజినెస్‌ క్లాస్‌వి పెట్టాను. అవి కేన్సిల్‌ చేసి ఎకానమీ క్లాసులో వెళ్ళిన సంగతి దాచేశాను. పైగా మా ఆఫీసులో కేవలం టికెట్స్‌ మాత్రమే ఇస్తే సరిపోతుంది. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వనక్కరలేదు. అందులోనూ నాలాంటి సీనియర్‌ ఆఫీసర్స్‌ బిల్లులని ఎవడూ పెద్దగా పట్టించుకోడు. అదీ నా ధీమా! ఏదైతేనేం మొత్తానికి నాకు చాలా లాభం. మా ట్రావెల్‌ ఏజెంట్‌కి ఎకానమీ టికెట్స్‌ కోసం ఇవ్వాల్సిన డబ్బులు పోగా ఇంచుమించు నాకు ముప్ఫైవేల దాకా మిగులుతుంది. ఇక కంపెనీకి చేసే మోసం అంటారా... ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇట్‌ ఈజ్‌ పార్ట్‌ ఆఫ్‌ ద గేమ్‌! అందుకే లైట్‌ తీసుకోవడం బెటర్‌.

***

యథావిధిగా నా జీవితం సాగిపోతూ ఉంది. ఒక నెలరోజుల తర్వాత నా ఢిల్లీ ట్రిప్‌ తాలూకా బిల్లు సెటిల్‌ అయి, బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. అనుకున్నట్టుగానే ట్రావెల్‌ ఏజెంట్‌కి ఇవ్వాల్సింది పోగా నాకు ముప్ఫైవేల దాకా మిగిలింది. ఇంటికి వెళ్ళాక నా భార్యతో గర్వంగా ‘‘ఈసారి ఢిల్లీ ట్రిప్‌ వల్ల మనకు ముప్ఫైవేలు లాభమోయ్‌’’ అని చెప్పాను.

‘‘ఓహ్‌... అలాగా! ఇంకేం, ఆ డబ్బుతో షాపింగ్‌ చేద్దాం’’ అని సంతోషపడిపోయింది.

తర్వాత కొన్ని రోజులకి మేము అందరం మళ్ళీ ఒక సాయంత్రం షాపింగ్‌కి వెళ్ళాం. అక్కడికి చేరగానే మా పిల్లలు ‘‘డాడీ, ఆకలి...’’ అంటూ గోల చేశారు. కారుని ధైర్యంగా ‘నో పార్కింగ్‌’ జోన్‌లో పార్క్‌ చేసి, టిఫిన్‌ సెంటర్‌కి వెళ్ళాం. అయితే, ఈసారి ఎటువంటి వింత క్యారెక్టర్స్‌ అక్కడ తగల్లేదు. టిఫిన్‌ తిన్నాక షాపింగ్‌ పూర్తి చేసుకుని కారు దగ్గరికి వచ్చేటప్పటికి వూహించినట్టుగానే ఫ్రంట్‌వీల్‌కి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లాక్‌ వేశాడు. అయినా నేను కంగారుపడలేదు. ఎందుకంటే, ఒక వంద కొడితే వాడే తాళం తీస్తాడు. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌.

‘‘సార్‌, కారు ‘నో పార్కింగ్‌’ జోన్‌లో పెట్టారు. ఫైన్‌ కట్టండి’’ అంటూ బిల్లు బుక్‌ తీశాడు.

‘‘నాకు తెలుసులేవయ్యా, ఎందుకు హడావుడి చేస్తావు. ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకో’’ అంటూ అతని చేతిలో పెట్టి, ‘‘అయినా, నీ పనే బాగుందయ్యా... ప్రతిరోజూ బోలెడంత కలెక్షన్‌’’ అని నవ్వేశాను. అతడు కొంచెం దెబ్బతిన్నట్టు నన్ను తేరిపార చూశాడు. బహుశా నేను ఆఫీసు పక్షినని అర్థం అయినట్లుంది. అందుకే-

‘‘మీలాంటి వాళ్ళతో పోలిస్తే మాదెంత సార్‌... మా కలెక్షన్‌ అంతా వందల్లో, మీది వేలల్లోనూ, లక్షల్లోనూ - ఇంకా చెప్పాలంటే బడా నాయకులకి కోట్లల్లోనూ ఉంటుంది కదా. మేము చిన్నవాళ్ళం సార్‌, మేం కూడా బతకాలి కదా సార్‌. ఈ మాత్రం సైడ్‌ ఇన్‌కమ్‌ కూడా లేకపోతే ఎండల్లో వానల్లో పడి ఈ జాబ్‌ ఎవడు చేస్తాడు?’’ అంటూ నాకు తత్త్వం బోధించాడు. తర్వాత కారుకు వేసిన తాళం తీసి మమ్మల్ని వదిలి వేరే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. నాలో ఏదో చిన్న కదలిక.

ఇంటివైపు కారు డ్రైవ్‌ చేస్తూ ఆలోచనల్లో పడ్డాను. క్రితంసారి వచ్చినప్పుడు ‘తమ అవసరం కోసం ఎదుటివాడిని మోసం చేసే’ వ్యక్తులను చూసి అసహ్యించుకున్నాను. కానీ, నేను కూడా ఆ గూటి పక్షినేనని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నాకు గుర్తు చేశాడు. ఈ సమాజానికి కనపడకుండా స్వేచ్ఛగా విహరిస్తున్న నాలోని మరో వ్యక్తిని నాకు పరిచయం చేశాడు. అందుకే... ఈసారి నామీద నాకే అసహ్యం వేస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.