close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెల్ఫీ మేనియా

సెల్ఫీ మేనియా

- లక్ష్మీ దిరిశాల

‘‘హేయ్‌ సాత్విక్‌, నేను పోస్టు చేసిన సెల్ఫీకి నువ్వెందుకు లైక్‌ కొట్టలేదు. నేనంటే నీకస్సలు ఇష్టంలేదు’’ బుంగమూతి పెట్టి మరీ సారిక అడిగేసరికి, సాత్విక్‌ ఏమి చెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.

ఎందుకంటే, అది సారిక ఒక పందితో తీసుకున్న సెల్ఫీ మరి. ఎలా ఉందీ అంటే ఏం చెప్తాడు పాపం. పిచ్చి మరీ ముదిరిపోయిందని పైకి చెప్పలేక, చెప్తే మళ్ళీ తనతో సారిక మాట్లాడటం మానేస్తుందని భయమేసి, రాని నవ్వు తెచ్చుకుంటూ ‘‘అది... నేను ఆఫీసు పనిలో బిజీగా ఉండి రెస్పాండ్‌ అవ్వలేదు సారిక డార్లింగ్‌, దానికేం సూపర్‌గా ఉంది. పందితో సెల్ఫీ దిగడమంటే మామూలు విషయమా! అసలు ఆ థాట్‌కే నీకు అవార్డు ఇవ్వాలి’’ అంటూ ఆ ఒక్క డైలాగ్‌తోనే సారికని ఫ్లాట్‌ చేసేశాడు.

‘‘ఓహ్‌! అవునా... అదే కదా... మీ ఆవిడ టాలెంట్‌ అంటే ఏంటనుకున్నావు. మా ఫ్రెండ్స్‌ అందరం ప్రతీవారం ఏదో ఒక థీమ్‌తో సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయాలని అనుకున్నామనీ, ఆ వారానికి మాగ్జిమమ్‌ లైక్స్‌ వచ్చినవారు విన్నర్‌ అవుతారనీ నీకు తెలుసు కదా. సో, ఈవారం నాకు ఎక్కువ లైక్స్‌ వచ్చాయి. నేనే విన్‌ అయ్యాను. సూపర్‌ కదా... పైగా నా పంది ఐడియాకి చాలా కామెంట్స్‌ వచ్చాయి తెలుసా. యు నో వాట్‌ - నేను సెల్ఫీలు అందంగా తీసుకోవడంలో ద బెస్ట్‌ అయిపోయానని అందరూ అంటున్నారు కనుక, సెల్ఫీ ఎలా తీసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తూ యూట్యూబ్‌లో ఒక వీడియో కూడా పెడదామనుకుంటున్నాను డియర్‌’’ అంటూ ఏదో ఇండియా ప్రపంచకప్‌ సాధించిన తీరులో సారిక తెగ సంబరపడిపోతోంది.

* * *

సాత్విక్‌ ఆఫీసుకి బయలుదేరుతుండగా ‘‘సాత్విక్‌, ఏం చేస్తున్నావమ్మా’’ అంటూ గోముగా సారిక అడిగేసరికి, దేనికో తనని బుక్‌ చేయాలనుకుంటోందని డిసైడ్‌ అయిపోయాడు.

‘‘ఏంటీ, షాపింగ్‌కి ఏమైనా తీసుకు వెళ్ళాలా, లేదా నీ ఫేవరేట్‌ రెస్టారెంట్‌లో టేబుల్‌ రిజర్వ్‌ చేయించాలా, అదీ కాదంటే లేటెస్ట్‌ మూవీ ఏదైనా చూడాలా’’ అనేసరికి-

‘‘ఇవేమీ కావు డార్లింగ్‌... అదీ... అదీ... ఈ వీక్‌ సెల్ఫీ థీమ్‌, కపుల్‌ సెల్ఫీ విత్‌ డిఫరెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ అని అనుకున్నాం. అందుకని నువ్వు నాకు కొంచెం కోఆపరేట్‌ చేస్తే ఈవారం కూడా నేనే విన్నర్‌ని అవుతాను’’ అంది సారిక.

‘‘సరే, ఏం చేయాలో చెప్పు. ఈ సెల్ఫీలూ, కుల్ఫీలూ నావల్ల కాదు. నువ్వెలా పోజ్‌ పెట్టాలో చెప్తే నేను అలా పెడ్తాను. ఇందులో నువ్వు అంత రిక్వెస్టింగ్‌గా అడగాల్సింది ఏముంది’’ అని సాత్విక్‌ అనగా-

‘‘నువ్వు ఎలా పోజ్‌ పెట్టాలో నేను చెప్తానులే కానీ, ఇందులో ఒక ట్విస్ట్‌ ఉంది డార్లింగ్‌. నీకు తెలుసు కదా, అందరిలా కాకుండా మేము కొంచెం వెరైటీ సెల్ఫీలు తీసుకుంటామని, లాస్ట్‌వీక్‌ నువ్వు నా క్రియేటివ్‌ థాట్‌ని చాలా మెచ్చుకున్నావు కూడా’’ అంటూ సారిక వయ్యారాలు పోతుంటే సాత్విక్‌కి మనసులో ఏదో అనుమానం మొదలైంది.

ఇది తప్పకుండా ఏదో తనకు ఫిట్టింగ్‌ పెట్టే వ్యవహారమే అని మనసులో కన్ఫర్మ్‌ అయిపోయి పైకిమాత్రం ‘‘చెప్పు డార్లింగ్‌, ఆ ట్విస్ట్‌ ఏంటి?’’ అన్నాడు.

‘‘మనం ఎప్పుడూ రెగ్యులర్‌గా తీసుకునే ప్లేసెస్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ఎవరి వూహకీ అందకుండా ఉండే ప్లేస్‌లో కపుల్‌ సెల్ఫీ తీసుకోవాలి. అందుకని ఎక్కడ తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచించి ఆలోచించి నాకు తలనొప్పి కూడా వస్తోంది. నువ్వేమైనా సజెస్ట్‌ చెయ్యరాదూ’’ కాస్త డల్‌గా అంది సారిక.

‘‘నీకంటే బెటర్‌గా క్రియేటివ్‌ థాట్స్‌ ఎవరికొస్తాయి డార్లింగ్‌. ఈరోజంతా థింక్‌ చేయి, సెల్ఫీ రేపు తీసుకుందాం, సరేనా’’ అని సాత్విక్‌, సారికకి కాస్త బూస్టింగ్‌ ఇచ్చేసరికి-

‘‘ఓకే, ఈరోజంతా నా క్రియేటివిటీకి పదునుపెట్టి ఒక బ్రహ్మాండమైన ప్లేస్‌ సెలెక్ట్‌ చేస్తాను. దెబ్బకి మళ్ళీ ఈ వీక్‌ కూడా నేనే విన్‌ అవ్వాలి’’ అంది కొంచెం ఉత్సాహంగా.

* * *

‘‘సారిక డార్లింగ్‌, ఈరోజు నీకోసమే నేను లీవ్‌ తీసుకున్నాను. సో, ఈరోజంతా నీ సేవలోనే. చెప్పు ఫైనల్‌గా ఏ ప్లేస్‌ డిసైడ్‌ చేశావు? లే, రెడీ అయిపో. నేను కూడా స్మార్ట్‌గా రెడీ అయి వస్తాను, వెళ్దాం’’ నిద్ర లేస్తూనే సారికని దగ్గరికి తీసుకుంటూ హుషారుగా అడిగాడు సాత్విక్‌.

‘‘ఉహూ, చెప్పను. అక్కడికి తీసుకువెళ్ళాక నువ్వే చూస్తావులే. అంతవరకూ సస్పెన్స్‌ ఉండనీ. బై ద వే, నీ మైండ్‌బ్లాక్‌ అవుతుంది తెలుసా, నా సూపర్‌ థాట్‌కి’’ అని సాత్విక్‌కి ముద్దుపెట్టి పైకిలేస్తూ ఇంకా హుషారుగా జవాబిచ్చింది సారిక.

‘‘ఓహ్‌, రియల్లీ! అంత మైండ్‌ బ్లోయింగ్‌ ప్లేస్‌ పైగా నాకు తెలీకుండా ఏముందబ్బా’’ నవ్వుతూ సాత్విక్‌ అడిగేసరికి-

‘‘జస్ట్‌ వన్‌ అవర్‌లో ఎలాగూ చూస్తావుగా, అంతదాకా సస్పెన్స్‌ ఉండనీ. పైగా నువ్వు ఎంత థ్రిల్‌ ఫీలయితే మన సెల్ఫీ అంత బాగా వస్తుంది డియర్‌’’ వూరించి రెడీ అవడానికి వెళ్ళిపోయింది సారిక.

‘‘ఆ... కారాపు సాత్విక్‌. ఇక్కడే... ఇక్కడే... మనం సెల్ఫీ తీసుకోవాల్సింది. కమాన్‌ త్వరగా కారు పార్కు చేసేసిరా. బ్యూటిఫుల్‌ కపుల్‌ సెల్ఫీ తీసుకుందాం. ఇంతకీ ఈ ప్లేస్‌ చూసి నీకు మైండ్‌ బ్లాక్‌ అయిందా లేదా? వండర్‌ఫుల్‌ ఐడియా కదా నాది. అసలు ఎవరూ కలలో కూడా వూహించరు కదా’’ ఫుల్‌స్టాప్‌ లేకుండా చెప్పుకుంటూ పోతూ ఉన్న సారికని ఏమనాలో కూడా తెలియక బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయాడు సాత్విక్‌.

ఎందుకంటే అదొక పెద్ద డంపింగ్‌ యార్డ్‌. ఆ వాసన, చెత్త, అక్కడి పరిసరాలు అన్నీ చూస్తుంటే సాత్విక్‌కి కడుపులో తిప్పుతోంది. సారిక థాట్స్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయని తెలుసు కానీ, ఈసారి మరీ ఇంత డిఫరెంట్‌గా ఉంటుందని తాను వూహించలేకపోయాడు. ‘ఈ సెల్ఫీల గోలేంటో అందులో మళ్ళీ తనని ఇన్వాల్వ్‌ చేయడం ఏమిటో’ అని మనసులోనే చికాకుపడుతూ ఉన్నాడు.

‘‘హేయ్‌ సాత్విక్‌, ఏమయింది... నువ్వేం మాట్లాడటం లేదేంటి? నా క్రియేటివ్‌ ఐడియాకి ఎలా మెచ్చుకోవాలా అని వర్డ్స్‌ వెతుక్కుంటున్నావు కదూ! కచ్చితంగా మరెవరికీ ఈ ఐడియా రాదు కదూ, చెప్పు డార్లింగ్‌’’ అని సారిక గట్టిగా సాత్విక్‌ని కదిపేసరికి, మెల్లగా సాత్విక్‌ తేరుకుని వస్తున్న కోపాన్ని అణచుకుని-

‘‘నిజంగానే నీ ఐడియాకి హ్యాట్సాఫ్‌ సారిక. అసలు ఇలాంటి గ్రేట్‌ ఐడియాస్‌ నీకే ఎందుకు వస్తాయా అని ఆలోచిస్తున్నాను. త్వరగా సెల్ఫీ తీసుకుంటే ఇక్కడినుంచి వెళ్ళిపోవచ్చు. నాకు ఈ బ్యాడ్‌ స్మెల్‌కి తల తిరుగుతోంది. ప్లీజ్‌, త్వరగా కానీయ్‌’’ అని కాస్త చిరాకు ప్రదర్శించగానే,

‘‘ఓకే... ఓకే... నాకూ అలాగే ఉందనుకో. కానీ, మనం విన్‌ అవాలంటే ఒక్కోసారి ఇలా విభిన్నంగా ఆలోచించక తప్పదు కదా డార్లింగ్‌. కొంచెం ఓపిక పట్టు’’ అంటూ ఒక అందమైన చెత్త సెల్ఫీ తీసింది సారిక.

* * *

‘సాత్విక్‌... సాత్విక్‌, ఈసారి కూడా నేనే విన్‌ అవుతానని నీకు చెప్పానా! అఫ్‌కోర్స్‌, ఇందులో నీ భాగం కూడా ఉందనుకో... కపుల్‌ సెల్ఫీలో మనమే ఫస్ట్‌ వచ్చాం. మా ఫ్రెండ్స్‌ అందరూ నా థాట్‌కి మైండ్‌ బ్లోయింగ్‌ అన్నారు తెలుసా! ఐ యామ్‌ సో హ్యాపీ డార్లింగ్‌. కమాన్‌ లెట్స్‌ సెలెబ్రేట్‌ దిస్‌. నేను చిటికెలో రెడీ అయిపోతా. నువ్వు కూడా ఫ్రెష్‌ అయితే డిన్నర్‌ బయట చేద్దాం, సరేనా’’ అంటూ సారిక అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి సోఫాలో డల్‌గా కూర్చున్న సాత్విక్‌తో చాలా సంతోషంగా చెప్పింది.

కానీ, సాత్విక్‌ సెలెబ్రేట్‌ చేసుకునే మూడ్‌లో అసలు లేడు. దేనిగురించో డీప్‌గా ఆలోచిస్తూ ఉన్నాడు.

‘‘సాత్విక్‌, నేను చెప్పింది వింటున్నావా... ఏమాలోచిస్తున్నావ్‌?’’ అని గట్టిగా సారిక అడిగేసరికి సాత్విక్‌ ఈ లోకంలోకి వచ్చి,

‘‘ప్లీజ్‌ సారిక, డోంట్‌ డిస్టర్బ్‌ మీ. లీవ్‌ మీ అలోన్‌. నా మూడ్‌ ఏమీ బాగోలేదు. ఇప్పుడు నేనేదీ వినే పరిస్థితి లేదు.’’

‘‘ఓహ్‌... ఏమైంది. అదేంటో నాకూ చెప్పొచ్చుగా. ఏదైనా షేర్‌ చేసుకుంటేనే కదా బాధ తగ్గుతుంది. మార్నింగ్‌ ఆఫీసుకి బాగానే వెళ్ళావు కదా, ఇంతలో ఏమైంది? ప్లీజ్‌ చెప్పు డియర్‌’’ సారిక రిక్వెస్టింగ్‌గా అడిగింది.

‘‘ఏం చెప్పమంటావు. మా ప్రాజెక్ట్‌ లీడర్‌ మోహన్‌ వాళ్ళమ్మాయి చైత్ర ఉంది కదా, అదే నీకు కూడా తెలుసు కదా. ఎయిత్‌క్లాస్‌ చదువుతోంది. చాలా ఇంటెలిజెంట్‌ అమ్మాయి, అలాగే మంచి ఏక్టివ్‌ కూడా అని, పైగా లాస్ట్‌ ఇయర్‌ ఆఫీసు ఫ్యామిలీ గెట్‌ టు గెదర్‌లో ఆల్‌రౌండర్‌ ప్రైజ్‌ కూడా గెల్చుకుంది కదా...’’ సాత్విక్‌ చెప్తుండగా మధ్యలోనే-

‘‘హా... అవును, తను నాకు బాగా గుర్తుంది. ఆరోజు తనని చూసి మనకి కూడా అలాంటి పాప పుడితే బాగుంటుందని నీతో అన్నాను కదా. చాలా ఏక్టివ్‌. సరే చెప్పు’’ అంది సారిక.

‘‘అదే, ఇప్పుడా అమ్మాయే కొద్దిరోజులుగా డల్‌గా ఉంటోందట. ఏక్టివ్‌నెస్‌ అంతా పోయిందట. స్టడీస్‌లో వెనుకబడిపోయిందట. వాళ్ళ డాడీ చాలా బాధపడుతూ చెప్పారు ఈరోజు.

తన ఫ్రెండ్‌ ఎవరో ఈమధ్య సెల్ఫీల పిచ్చి అంటించిందట. చైత్ర కొంచెం రంగు తక్కువ ఉంటుంది కదా, అందుకే సెల్ఫీలు తీసి ఫేస్‌బుక్‌లో పెడుతుంటే తన ఫ్రెండ్స్‌లా తనకి ఎక్కువ లైక్స్‌ రావడంలేదు అని బాగా డిప్రెస్‌ అయిపోతోందట. ‘తను వాళ్ళ దృష్టిలో అందమైన పాపే అనీ, అయినా అందంకంటే తన దగ్గర కావాల్సిన టాలెంట్‌ ఉందనీ’... ఇలా ఎన్ని రకాలుగా వాళ్ళ డాడీ నచ్చచెప్తున్నా ఆ అమ్మాయి వినిపించుకోవడం లేదట. ఎంత టాలెంట్‌ ఉన్నా తనకి సరైన అందం లేకపోవడం వల్ల తననెవరూ లైక్‌ చేయడం లేదని ఏడుస్తుందట. ఆయనకి ఏం చేయాలో పాలుపోక, పాపం ఆఫీసు వర్క్‌ మీద కూడా సరిగ్గా కాన్సంట్రేట్‌ చేయలేకపోతుంటే ఈరోజు నేను ఏమయిందని అడిగితే ఇదంతా చెప్పుకొచ్చారు.’’

సారిక ఏదో స్పందించేలోపుగానే సాత్విక్‌ మళ్ళీ అందుకుని ‘‘అయినా, ఈ సెల్ఫీ కనిపెట్టినవాళ్ళని తన్నాలి ముందు. సెల్ఫీతో జనాలు మరీ సెల్ఫిష్‌గా తయారయిపోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌ వచ్చేశాయి. ఈ చిన్న ఫ్యామిలీస్‌లో కూడా ఎవరికివారే యమునా తీరే అన్నట్లు ఎవరి గ్యాడ్జెట్స్‌ వాళ్ళు పట్టుకుని బిజీగా ఉంటూ అనుబంధాలూ ఆప్యాయతలూ మర్చిపోతున్నారు. కనీసం ఇంతకుముందు ఇంట్లోవాళ్ళనో లేదా బయటకి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగో ఫొటోలు తీయించుకునేవాళ్ళం. కానీ, ఇప్పుడదీ క్రమేపీ పోతోంది. ఎవరి అవసరం లేకుండానే మనంతట మనమే ఫొటో తీసేసుకుంటున్నాం. పైగా వీటికోసం సెల్ఫీ స్టిక్‌లూ, కుల్ఫీ స్టిక్‌లూ అనుకుంటూ ఎవడి వ్యాపారం వాడిది. కాకపోతే ఒక విచిత్రమేమిటంటే మనం తీసుకున్న సెల్ఫీలకి మాత్రం జనాల అభిప్రాయాలూ ప్రశంసలూ కావాలి. ఒక పక్క గ్లోబలైజేషన్‌ వల్ల ప్రపంచమంతా ఒక కుగ్రామంలా అయిపోతుందని మేధావులంతా అంటున్నారు. కానీ, మనిషి చూస్తే టెక్నాలజీ పేరుతో అంతకంతకీ ముడుచుకుపోయి ఇంట్రావెర్ట్‌ అయిపోతున్నాడు. ఇంట్లో వైఫై రాకపోయినా మొబైల్‌ ఛార్జ్‌ అయిపోయినా అదేదో కొంపలు మునిగిపోయే విషయంలా ఫీలయిపోయి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం టెక్నాలజీయే బ్యాడ్‌ అనడం లేదు. దాని ఉపయోగాలు దానికి ఉన్నాయి. ఎన్నో మంచి పనులకి కూడా ఉపయోగించుకుంటున్నాం. కానీ దేనికైనా ఒక పరిమితి ఉంటుంది కదా. ఇప్పటికీ మన కంటనీరు తుడవాలంటే మనకి ఒక మనిషి కావాలి తప్ప టెక్నాలజీ కాదు. మన బాధల్నీ సంతోషాల్నీ మనుషులతోనే పంచుకోగలం తప్ప ఏ గ్యాడ్జెట్స్‌తోనూ చెప్పుకోలేం. ఎవరో మహానుభావుడు అన్నట్లుగా, నిజంగానే మనం మనుషుల్ని వాడుకుని, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం’’ తన ఆవేదననీ అసహనాన్నీ సారిక ముందు పరిచి పెట్టేశాడు సాత్విక్‌.

ఎప్పుడూ ఏదో ఒకటి వాదించే సారిక ఈసారి ఒక బొమ్మలా చూస్తూ ఉండిపోయింది తప్ప ఏమీ మాట్లాడలేక పోయింది. ఎందుకంటే, సాత్విక్‌ చెప్పినవన్నీ నిజాలే కనుక.

‘‘ఆ అమ్మాయికి కౌన్సెలింగ్‌ ఇప్పించమని చెప్పాను. ఐ హోప్‌ షి విల్‌ బి బెటర్‌ సూన్‌’’ నిట్టూర్చాడు సాత్విక్‌.

* * *

కొన్ని రోజులు గడిచాక, ‘‘హేయ్‌ సారిక, ఏంటి అలా డల్‌గా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా అయిందా? లేదంటే కొంపదీసి నీ కుల్ఫీ, అదే... సెల్ఫీ... ఎవరికైనా నచ్చలేదా ఏంటీ?’’ సారికని ఆటపట్టిస్తూ అడిగాడు సాత్విక్‌ ఈవెనింగ్‌ ఆఫీసు నుంచి రాగానే. సారిక ఏదో పరధ్యానంలో ఉండి సరిగ్గా వినిపించుకోక అలాగే ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ‘‘సారిక డార్లింగ్‌, నిన్నే... ఏమాలోచిస్తున్నావ్‌? మళ్ళీ నాకు ఏమైనా ఫిట్టింగ్‌ పెట్టాలని చూస్తున్నావా ఏంటి? మీ సెల్ఫీల గోలలో నన్ను ఇరికించకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ అర్భకుడిని ఇలా వదిలెయ్‌ తల్లీ’’ సారికని పట్టుకుని మళ్ళీ ఉడికించాడు సాత్విక్‌.

అప్పటికి పరధ్యానంలోంచి బయటికి వచ్చిన సారిక ‘‘అబ్బ, అదేంలేదు సాత్విక్‌. ఇక మేము ఏ సెల్ఫీ పోటీలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఈరోజుతో దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశాం. నువ్వు బిందాస్‌గా ఉండు’’ అంది.

  సారిక ఇచ్చిన ఈ సడెన్‌ రెస్పాన్స్‌కి సాత్విక్‌ ఒక్కసారే ఆశ్చర్యపోయి ‘‘కమ్‌ అగైన్‌... మీరు సెల్ఫీ పోటీలు ఆపేశారా... దేవుడా! ఇది కలా నిజమా! నన్నొక్కసారి గిల్లవా సారికా ప్లీజ్‌’’ అనేసరికి, సాత్విక్‌ని గట్టిగా గిల్లుతూ...

‘‘నువ్వేమీ అంత ఆశ్చర్యపోవక్కర్లేదు, నేను చెప్పేదీ నిజమే... నువ్వు వింటున్నదీ నిజమే. అసలు ఆరోజు నీ ఆవేదనని అంతా నాతో షేర్‌ చేసుకున్న దగ్గరనుంచీ నేను ఈ సెల్ఫీ పోటీలో అంత ఫ్రీక్వెంట్‌గా ఏమీ పార్టిసిపేట్‌ చేయడం లేదు. ఫ్రెండ్స్‌ రీజన్‌ అడుగుతున్నా ఏదో బిజీ అని చెప్పి ఎస్కేప్‌ అవుతున్నా. కానీ, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్‌కి మేమందరం చాలా కదిలిపోయాం. మేం సరదాగా స్టార్ట్‌ చేసిన సెల్ఫీ కాంటెస్ట్‌ వల్ల ఒకరు బలైపోయారు. ఈ వీక్‌ ఏదైనా అడ్వెంచరస్‌ సెల్ఫీ అనే థీమ్‌ డిసైడ్‌ చేసుకున్నాం. మా ఫ్రెండ్‌కి బెస్ట్‌ఫ్రెండ్‌ ఒకబ్బాయి కదిలే ట్రైన్‌ మీద నిలబడి సెల్ఫీ తీసుకుందామని ట్రై చేస్తుండగా పైన ఉన్న ఎలక్ట్రికల్‌ వైర్‌ తగిలి షాక్‌ కొట్టి పాపం అక్కడికక్కడే చనిపోయాడట. దాన్ని ఎవరో సెల్‌తో షూట్‌ చేశారు. పైగా ఇంటర్నెట్‌లో కూడా పెట్టారు. అసలే మేము మా ఫ్రెండ్‌ చనిపోయిన బాధలో ఉంటే మీడియావాళ్ళు తమ ఛానళ్ళ రేటింగ్‌ కోసం ఆ వీడియోని తీసుకుని పదేపదే చూపిస్తూ ఆ బాధని ఇంకా డబుల్‌ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్‌ ఇంకెంత బాధపడతారో కదా. ఈమధ్య ఇదొకటి బాగా ఎక్కువైపోయింది. అసలే ఇటువంటి దుర్ఘటనలు జరిగి ఆప్తులను కోల్పోయి వారి బంధువులూ స్నేహితులూ బాధపడుతుంటే ఆ సంఘటనల్ని వీడియోలు తీసి వాటిని అదే పనిగా టీవీలో చూపిస్తూ సామాజిక మీడియాలో పెడుతూ ఇంకా చిత్రవధకి గురిచేస్తున్నారు. అసలు వాళ్ళ పర్సనల్‌ డిసాస్టర్‌ని పర్మిషన్‌ లేకుండా వీళ్ళు ఎలా చూపిస్తారు? దుర్ఘటనలో చనిపోయిన మనిషికి ప్రైవసీ అనేది అవసరం లేదా? టెక్నాలజీ వల్ల ఈ జాడ్యం కూడా ఈమధ్య ఎక్కువైపోతోంది. మా ఫ్రెండ్స్‌ అందరం దీని గురించే ఇందాక చర్చించుకున్నాం. ఆరోజు నువ్వు నాతో షేర్‌ చేసుకున్న పాయింట్స్‌ కూడా మా డిస్కషన్‌లో భాగంగా చెప్పాను. అలా అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సారిక చాలా బాధపడుతూ, ఆవేశపడుతూ చెప్పేసరికి... సాత్విక్‌- ‘‘ఓహ్‌... ఐ యామ్‌ సో సారీ, ఇంత జరిగిందా! టూ బ్యాడ్‌... పాపం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో కదా. జీవితాంతం వాళ్ళకి నరకమే. తన ఆత్మకి శాంతి కలగాలనీ తన పేరెంట్స్‌కి దేవుడు ధైర్యం ఇవ్వాలనీ కోరుకుంటున్నాను’’ అన్నాడు.

‘‘సాత్విక్‌, ఇప్పుడే నాకో ఆలోచన వచ్చింది. సెల్ఫీల వల్ల కలిగే ప్రమాదాలూ, టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోకపోతే వచ్చే నష్టాలూ... వీటన్నిటి గురించీ డీటైల్డ్‌గా స్టడీ చేసి మనిద్దరికీ ఎలాగూ వీకెండ్‌ టూడేస్‌ హాలిడే కాబట్టి ఒక్కో కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్‌ పర్మిషన్‌తో స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్‌ క్లాస్‌ తీసుకుందాం. ఇలా చేయడం వల్ల అందరూ మారకపోయినా, కొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినా మంచిదే కదా. మనమూ సమాజానికి ఎంతో కొంత మేలు చేసినట్లుగా ఉంటుంది కదా, ఏమంటావు సాత్విక్‌’’ అని సారిక అడిగేసరికి, సాత్విక్‌ మనసులోనే సారికని చాలా మెచ్చుకుని, ‘నా సారికేనా ఇంత బాధ్యతగా మాట్లాడుతోంది. ఒక చేదు సంఘటన మూలంగా తనలో ఎంత మార్పు’ అని ఆశ్చర్యపోతూ-

‘‘నువ్వు చెప్పడమూ, నేను కాదనడమూనా డార్లింగ్‌... తప్పకుండా చేద్దాం. ఇంకా మన ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి వాళ్ళని కూడా ఈ మంచి పనిలో పార్టిసేపేషన్‌ తీసుకోమందాం. మనమంతా ఒక టీమ్‌లా ఏర్పడి స్టూడెంట్స్‌కి చక్కగా అర్థమయ్యేలా వాళ్ళకేదో లెక్చర్‌ ఇస్తున్నట్లు కాకుండా ఒక ఫ్రెండ్‌లా మన అనుభవాలను అంటే- చదివినవీ చూసినవీ అన్నీ డిస్కస్‌ చేద్దాం. అన్నట్లు, చెప్పడం మర్చిపోయాను... మా బాస్‌ కూతురికి కౌన్సెలింగ్‌ ఇప్పించడంతో త్వరగానే కోలుకుందట. మళ్ళీ మునుపటిలాగే చాలా ఏక్టివ్‌ అయిపోయిందట. ఆయన ఎంతో సంతోషంగా చెప్పారు నాతో. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా’’ అన్నాడు.

‘‘వెరీగుడ్‌. ఆరోజు నువ్వు ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది. బట్‌ గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌. షి ఈజ్‌ బ్యాక్‌. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్‌’’ అంది సారిక.

‘‘అయితే, ఈ హ్యాపీనెస్‌ ప్లస్‌ మనం ఒక మంచి డెసిషన్‌ తీసుకున్న సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుందామా మరి’’ అని కన్ను కొడుతూ సాత్విక్‌ అడగ్గా,

‘‘బాబోయ్‌! ఆ మాటే నువ్వు అనొద్దు. సెల్ఫీ కాదు కదా, ఇకనుంచి నాకిష్టమైన కుల్ఫీ గురించి విన్నా నాకు భయమేసేలా ఉంది’’ నవ్వుతూ అంది సాత్విక్‌ని హత్తుకుంటూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.