close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిర్వాకం

నిర్వాకం
- తులసి బాలకృష్ణ

నిహ్‌...ర్వాహ్‌...ఖం...’’మెళ్ళొ వేలాడేసుకున్న ఓ పెద్ద సైజుడోలుని పైకీ కిందకీ ఎగరేస్తూన్నట్టు... తన బొజ్జని పెద్ద కుదుపుకి గురిచేస్తూ, భుజాలు ఎగరేస్తూ, భార్య మొహం మీదకు హస్తాన్ని గురిపెట్టి, వెటకారంగా ఆపుకోలేనంతగా నవ్వి, గుక్క తిరిగాక మళ్ళీ రిపీట్‌ చేస్తూ ‘‘నిర్వాకవాఁని...’’ అని ముక్తాయింపిచ్చాడు పరబ్రహ్మం.

భర్త వెటకారాలకు అలవాటుపడిపోయిన సుశీలమ్మ రొటీన్‌ ప్రతిస్పందననే ఇప్పుడూ కనబరచింది. ‘‘పోనీలెండి, నాకున్న తెలివితేటలంతే మరి. నేనేవన్నా మీలా శాస్త్రాలూ గ్రంథాలూ పుక్కిట పట్టేసినదాన్నా... సమాజ పోకడల్ని ఔపోసన పట్టేసినదాన్నా? ఎంతటి కార్యాన్నయినా సమర్థవంతంగా నిర్వహించగల శక్తీ, తెలివితేటలూ, నేర్పూ ఉన్నదాన్నా..? ఏదో వానాకాలపు చదువుదాన్ని, లోకజ్ఞానం లేనిదాన్ని’’ అంటూ తన అసమర్థతని ఒప్పుకుంటూన్న దానిలా తలొంచుకుంది.

సహ ధర్మచారిణి ఓటమిని అంగీకరించగానే మంటమీద ‘పుల్కా’లా ఉబ్బెత్తున పొంగింది పరబ్రహ్మం ఛాతీ. ఎప్పట్లాగే అవకాశాన్ని సద్వినియోగపరుచుకోదలచి, పేరుపేరునా ఆవిడ పుట్టింటి సభ్యులందర్నీ, ఆవిడ తాలూకు బంధువులందర్నీ, హోల్‌సేల్‌గా ఆవిడ మొత్తం వంశాన్నే... ఎందుకూ పనికిరానివాళ్ళనీ ‘ప్రపంచ పరమ మూర్ఖుల సంఘం’ ప్రధాన ఎగ్జిక్యూటివ్‌ బాడీ మెంబర్స్‌ అంతా వాళ్ళ కుటుంబం నుంచే ఎన్నుకోబడతారనీ... నోటి దురద తీరేంతవరకూ... నిఘంటువుల్లోని ఎగతాళి పదాలనన్నింటినీ ఉపయోగిస్తూ తిట్టిపోశాడు. ఆపైన- అర్ధాంగి మొహం ఉక్రోషంతో అరుణ వర్ణాన్ని సంతరించుకోవడం, ఆమె గుండెలు ఓర్చుకోలేని బాధతో ఎగసిపడుతూండటం క్రీగంట గమనించి, ‘హమ్మయ్య, ఇక చాలు’ అని తృప్తిగా నిట్టూర్చి, పడక్కుర్చీలో వెనక్కి జార్లపడ్డాడు.

ఎవరినన్నా తను తీసిపారేసినప్పుడు- వాళ్ళు కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ, తన ముందు తలొంచుకుంటే, పరబ్రహ్మంలో చెప్పలేనంత ఆనందం. ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌లా లోనుండి గింగిరాలు తిరుగుతూ పైకి ఎగదన్నుతుంది. అప్పుడు ఆ ఆనందం అన్నమయ్య కీర్తన రూపాన్ని సంతరించుకుని, అలవోకగా ‘హమ్మింగ్‌’గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.

ఆయనగారు తిట్ల పంచాంగం విప్పకముందు జరిగింది ఏమిటంటే- జన్మకో శివరాత్రిలా... పొరబాటునైనా భర్తగారి నుంచి, ఓ మెచ్చుకోలు మాట లభిస్తుందేమోనని సుశీలమ్మ ఆశించడం ఆవిడకి ఈ ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఆవిడ వల్ల జరిగిన అపరాధం... కూరగాయల కావిడి వాడి దగ్గర తను కొన్న కూరల్లో తాజాగా లేతగా గుండ్రంగా చిన్నగా నిగనిగలాడుతూ నోరూరిస్తూ ఉన్న వంకాయల్ని చూపిస్తూ ‘‘మీకిష్టమైన గుత్తి వంకాయ కూర చేద్దామని కొన్నానండి. తాజాగా ఎంత బావున్నాయో చూడండి బుజ్జిముండలు. ఏరిఏరి తీశాను’’ అంటూ మురిపెంగా అనడం.

బొజ్జ నిమురుకుంటూ అరుగు మీద పడక్కుర్చీలో శయనించి, తన వంశంలోని వాళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళొ తలుచుకుంటూ, తన ఆటోబయోగ్రఫీలోని ఘనకార్యాలని నెమరువేసుకుంటూన్న శ్రీవారు... తన భార్య మెచ్చుకోదగ్గ పనిచేయడం భరించలేకపోయాడు. కాయల్ని వేళ్ళతో అటూ ఇటూ చెదరగొడ్తూ... ‘ఒఖ్క కాయన్నా పుచ్చుది దొరక్కపోతుందా’ అని కోడిగుడ్లంతేసి కనుగుడ్లతో వెతికేసి, ఒక్కటీ దొరక్క, చివరికి తొడిమ ఓ పిసరు పైకి మడతపడ్డ ఓ కాయని దొరకబుచ్చుకుని ‘‘ఇటువంటి చచ్చు కాయల్నా నువ్వు కొన్నది? పైగా ఈ పనికి నా అంతటివాడి మెప్పు కూడా కావాలా... నిర్వాకం’’ అంటూ రెండు దీర్ఘ వాయిదాలలో వెటకారం చేసి, నోరు ఎత్తలేని భార్య సంపూర్ణంగా చిన్నబుచ్చేసుకుందని రూఢిగా నమ్మకం కుదిరాక, అమందానంద కందళిత హృదయారవిందుడై తృప్తిపడ్డాడు. ఆ తర్వాత ఆమె వండిపెట్టబోయే ‘గుత్తొంకాయ కూర’ని తలుచుకుంటూ... బొజ్జ భూగోళంలా ఉబ్బేంతగా తను భోంచేయబోయే మృష్టాన్నాన్ని తలుచుకుంటూ, అర్ధ నిమీళిత నేత్రుడై, అన్నమాచార్య కీర్తన అందుకున్నాడన్నమాట.

తల వంచుకుని, కొంగుతో ముక్కు రుద్దుకుంటూ, కూరలబుట్టతో లోపలికి నడిచింది సుశీలమ్మ. మరో అరగంటకి లోనుండి పిల్లతెమ్మెరలు భుజాన మోసుకొస్తూన్న కమ్మని గుత్తొంకాయ కూర తాలూకు సువాసనలని ఆ భోజనప్రియుడు ఆస్వాదిస్తూన్న సమయంలో... నెమ్మదిగా... పిల్లిలా... భయంభయంగా... అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు - పట్నంలో ఇంజినీరింగ్‌ చదువుతూ సెలవులకు ఇంటికొచ్చిన పెద్దకొడుకు రామం.

పడక్కుర్చీని పటపట లాడిస్తూ తన భారీ కాయాన్ని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టి ‘‘చదువెలా వెలగబెడ్తూన్నావోయ్‌ వెధవాయ్‌’’ అని జూలో ఉరంగుటాన్లా చూస్తూ, కొడుకు మీదకు ప్రశ్నని సంధించాడు పరబ్రహ్మం.

‘‘కాలేజీలో రెండో స్థానంలో ఉన్నాను నాన్నగారూ’’ అని కొడుకు వినయంగా అంటూండగానే ‘‘ఏం రోగం? మొదటిస్థానం ఏ అంట్ల వెధవకి దానం ఇచ్చావ్‌? వెధవ నిర్వాకం నువ్వూ... నా కొడుకువేనా నువ్వసలు? అబ్బ తెలివితేటల్లో నూరో వంతయినా అబ్బనివాడివి నువ్వేం కొడుకువిరా చవటా? ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అని నీలాంటివాళ్ళ గురించే లోకులనేది. ఈమాత్రం నిర్వాకానికి పట్నం కూడా ఎందుకూ... గోచీ పెట్టుకుని గేదెల్ని మేపుకో’’ ...ఈ ధోరణిలో అనర్గళంగా ఆ మహానుభావుడి తిట్ల పురాణం మరోగంట సాగిపోయేదే కానీ... ఇంతలో-

‘‘బెమ్మంగారూ!’’ అంటూ మర్యాదతో తడిసిన, వినయ విదేయతలతో నిండిన, భక్తీ ప్రపత్తులలో ములిగిన పిలుపు-పరబ్రహ్మం తల పొత్రం రాయిలా గుమ్మంవైపు తిరిగింది.

వీధిగుమ్మంలో ముకుళించిన హస్తాల్తో నిలబడి ఉన్నాడు వీరభద్రం. పాతిక మైళ్ళ దూరంలో ఉన్న తమ ఇరవై ఎకరాల మాగాణిని కౌలుకి ఇచ్చింది అతనికే. అతన్ని చూస్తూనే పరబ్రహ్మం మొహం ప్రొద్దుతిరుగుడు పువ్వులా వికసించింది. తల తిరిగి ఉన్న దిక్కు భారీ శరీరం మొత్తాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా తిప్పి ‘‘రా భద్రం, రా... రా...’’ అని ఆత్మీయంగా ఆహ్వానించాడు.

‘‘అయ్య అయ్య’’ అంటూ చేతులు జోడించి ఉంచే ముందడుగు వేశాడు వీరభద్రం.

రైల్వేగేటు రెక్కలా తల వాల్చుకుని ఉన్న రామం, తన తల గుమ్మడికాయ సైజుకి వాచిపోయే ప్రమాదం తప్పినందుకు ఆనందిస్తూ, ఆపద్బాంధవుడిలా వచ్చి కాపాడిన వీరభద్రానికి లోలోనే శతకోటి నమస్కారాలు పెట్టుకుంటూ లోపలికి జారుకున్నాడు.

‘‘అయ్యా, బెమ్మంగారూ... ఎడ్లబళ్ళూ, బస్సులూ అయితే తవఁరికి ఇబ్బందిగా ఉంటదన్జెప్పి పట్నం నుంచి టాక్సీని తెప్పించి నాతో తీసుకొచ్చాను... బయల్దేరండి అయ్యగారూ... పొలం సూద్దురుగాని’’ అన్నాడు వీరభద్రం వినయంగా.‘‘ఎందుకయ్యా భద్రం నేను రావడం? పంటమ్మిన డబ్బులూ, పాతిక బస్తాల ధాన్యమూ నాకు పంపించేస్తే సరిపోయేదిగా?’’ అని మొహమాటం నటిస్తూ పరబ్రహ్మం అంటూండగానే-

‘‘అమ్మమ్మా... ఎంతమాట అయ్యగారూ! అది తవఁరి బూవిఁ. ఏడాదికోపాలన్నా తవఁరు ఆ వూరొచ్చి, పొలంలోని ఆ మట్టిని తవఁ పయిత్రవైన సేతులతో తడివితేగానీ నాకు తురుప్తిగా ఉండదండి’’ అన్నాడు వీరభద్రం తల వంచి.

అతని అభిమానానికి శాస్త్రి కళ్ళలో చెమ్మ వూరింది. అతని భారీ శరీరం పులకలతో ఝల్లుమంది. చుట్టుకొలత ఆరంగుళాలు పెరిగింది.

తల తిప్పి భార్యనుద్దేశించి ‘‘ఇదుగో, పెద్ద చెంబుతో మన వీరభద్రానికి మాంఛి చి..ఖ్కటి మజ్జిగ పంపించూ’’ అని హుకుం జారీ చేసి ‘‘అలా అరుగు మీద కూర్చో భద్రం, రెండు నిమిషాల్లో వస్తాను’’ అని చిన్నపాటి కులుకు సాయంతో లోపలికి నడిచాడు ఠీవీగా.

‘‘పర్లేదు అయ్యగారూ’’ అంటూ చేతులు కట్టుకుని నిలబడే ఉన్నాడు వీరభద్రం, అదే వినయ విధేయతలతో.

***

తనకోసం తీసుకొచ్చిన టాక్సీలో పంట సొమ్ము వసూలు చేసుకురావడానికి దర్జాగా వీరభద్రంతో వెళ్ళి, రెండు రోజులుండి... తిరిగి అదే టాక్సీలో అంతకుమించిన దర్జాతో తిరిగొచ్చాడు పరబ్రహ్మం తన గ్రామానికి. అసూయ పడుతూనూ, ఆశ్చర్యంగానూ వీధి పొడవునా జనమంతా నోళ్ళు వెళ్ళబెట్టుకుని తనవైపే చూస్తూండగా టాక్సీ ఠీవిగా దిగి, లోపలికొచ్చి, భార్యాపిల్లల వైపు కనుబొమ్మలెగరేస్తూ చూస్తూ గర్వంగా నవ్వాడు. తండ్రికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళందిస్తూ ‘‘అక్కడ వీరభద్రం మిమ్మల్ని మర్యాదగా చూశాడు గదండీ నాన్నగారూ?’’ అనడిగింది పెద్దకూతురు.

ఆ పిల్లంటే పరబ్రహ్మానికి చాలా ప్రేమ. ఆమె ఒక్కర్తెతోటే సరిగా మాట్లాడతాడా మానవుడు. ‘‘అలాంటిలాంటి మర్యాదా... ఓర్నాయనో- చుట్టుపక్కల పల్లెల వాళ్ళనందర్నీ పిలిచి ‘మా అయ్యగారు’ అంటూ పరిచయం చేసి, ‘ఈరు అన్ని శాస్త్రాలూ సదివేరు. మా గొప్ప పండితులు తెల్సా? పెపంచకంలో ఈరికి తెలీని ఇసయం ఉండదు’ అంటూ... ఓహ్‌... ఏం పొగిడాడనుకున్నావు? అదంతా ఓ ఎత్తు! ఈ రెండ్రోజులూ నన్ను బలవంత పెట్టి తినిపించిన భోజనాలు ఓ ఎత్తు! ముప్పూటలా కమ్మని పప్పు, పులుసులు, దప్పళాలు, నాలుగయిదు రకాల కూరలు, పచ్చళ్ళు, బొంతరిటి పళ్ళు, గడ్డ పెరుగు, రకరకాల రసాల మావిడిపళ్ళు... ఓహ్‌... ఇక నెయ్యి... విస్తరిలో నేతిగిన్నె గభాలున బోర్లించెయ్యడమే! ఏం మర్యాద... ఏం మర్యాద! ఓహోహో’’ అని తృప్తిగా పొగిడి, భార్యతో ‘‘ఒసేవ్‌, ఇదిగో పంట తాలూకు డబ్బు... జాగ్రత్తగా పెట్టు. తెలివి తక్కువ పీనుగవి. ఏ చూరులోనో, పోపులపెట్టెలోనో పెట్టక బీరువాలో దాచు. రేపు బ్యాంకులో వేయిద్దాం. నాల్రోజుల్లో పది బస్తాల ధాన్యం కూడా పంపిస్తానన్నాడు’’ అంటూ నోట్లని ఆమె చేతికి అందించాడు.

సుశీలమ్మ లోపలి గదుల్లోకి నడిచి, నోట్లని లెక్కపెట్టింది. పదివేలు! విస్తుపోయింది. ‘పుష్కలంగా నీరందే ఆ మాగాణి పొలాల్లో ఈ ఏడాది పంట బాగా పండిందని చెప్పుకుంటున్నారు. ఇరవై ఎకరాల మీద తమకి దక్కింది పది బస్తాల ధాన్యం, పదివేల రొఖ్కమూనా?!’ యాంత్రికంగా బయటకు నడిచింది. అక్కడ- అప్పుడే వచ్చిన సర్పంచ్‌ పెద్దిరాజుతో ముచ్చట్లాడుతున్నాడు పరబ్రహ్మం.

‘అయితే వెళ్ళి పొలం మీద పంట డబ్బు తీసుకొచ్చారన్నమాట. కానీ, ఈ ఏడాది అటేపు పంట బాగా పండిందంటన్నారుగదండీ. అంత తక్కువ లెక్క ముట్టసెప్పడం ఏటీ మీకు అతనూ? మోసం చేసినట్టున్నాడండీ బ్రెమ్మంగారూ’’ అంటున్నాడు పెద్దిరాజు.

‘‘ఛఛ, ఎంతమాట రాజుగారూ! వీరభద్రం ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు. అందులోనూ నేనంటే అపారమైన గౌరవాభిమానాలు అతనికి’’ అంటూండగానే- తలుపు చాటున నిలబడ్డమేగానీ, ఎన్నడూ పెద్దిరాజు గార్లాంటి మోతుబర్లుండగా గడప దాటి బయటకు వచ్చెరుగని సుశీలమ్మ, చరచరా బయటకు వస్తూ, భర్త మాటలకు వత్తాసు పలుకుతూన్నదాన్లా ‘‘అందులోనూ కమ్మని పప్పూ దప్పళాలూ, నాలుగయిదు రకాల కూరలూ పచ్చళ్ళూ, గడ్డ పెరుగూ, బొంతరిటి పళ్ళూ మామిడిపళ్ళూ, గిన్నెలతో నెయ్యీ... వీటన్నిటితో రెండ్రోజులపాటు షడ్రసోపేతమైన భోజనం... అదంతా లక్షల ఖరీదు చెయ్యదూ? ...అధమ పక్షం ఓ లక్షయినా చెయ్యదంటారా? అందులోనూ వీరభద్రం మావారి పట్ల ప్రదర్శించే వినయ విధేయతల ఖరీదు మాటేవిటీ? చదువుకోనిదాన్ని నాకు లోకజ్ఞానం లేకపోయినా, పురాణాలూ కావ్యాలూ పుక్కిట పట్టినవారూ, ప్రపంచం తిరిగి అపారమైన లోకజ్ఞానం, తిరుగులేని వ్యవహార దక్షతా అలవరుచుకున్నవారూ అయిన మావారు ఏ కార్యమైనా విజయవంతంగా ముగించుకురారుటండీ రాజుగారూ మీ అమాయకత్వంగానీ!?’’ అనేసరికి, ఈ హఠాత్పరిణామానికి కొయ్యయిపోయాడు పరబ్రహ్మం.

పెద్దిరాజు కూడా ముందు విస్తుపోయి, తర్వాత ఆమె మాటల్లోని వ్యంగ్యంతో కూడిన ఆక్రోశం అర్థంచేసుకుని, పరబ్రహ్మాన్ని మందలించే ధోరణిలో ‘‘మాలాంటోళ్ళు అంటే అన్నారంటారు గానీ బ్రెమ్మంగారూ... మొదట్నుంచీ ఇట్టా బోయనాలకీ, పొగడ్తలకీ లొంగిపోయే కదండీ... మీలాంటోళ్ళు మీ పెద్దలయిన గొప్పగొప్ప పండితులు గౌరవంగా అప్పటి రాజుల దగ్గర్నుంచి కాళ్ళు కడిగించుకుని బహుమానంగా సంపాయించి పెట్టిన బూవుఁల్నీ, ఇళ్ళనీ పోగొట్టుకుని, ఉజ్జోగాల కోసం కడుపులు పట్టుకుని దేశాలట్టుకుపోతాందీ? బోయనం మీద మీకుండే ఆ రందిని కనిపెట్టి, కడుపునిండా ఫుల్లుగా బెమ్మాండమైన బోయనం ఎట్టేసి, ఎకరాలెకరాల ఫలసాయం కొట్టేసాడా ఈరబద్రం. ఏలలోనో లచ్చల్లోనో బొక్కేట్టేశాడు అంతే. అది మీ బుర్రకెక్కలేదు. ఎక్కదు! ఆ ఇసయం మీ ఇంటి పరిత్తితి చూస్తాంటేనే అర్థమవుతాంది... పెతీ ఏడూ తవఁరిట్టాగే బోయనాలకీ, పలకరింపులకీ లొంగిపోయి, పుల్లయ్య యవ్వారం సేసుకొత్తున్నారని. ఇప్పటి వరకూ తవరి నిర్వాకం సాలుగానీ, ఇంటి పెత్తనం ఆ తల్లికి వప్పసెప్పండి ఇహనుంచైనా. కొంతయినా తెలివిగా నడుపుకొస్తది. పిల్లలు ఈదిన పడకుండా ఉంటారు. బాధ్యత తెలుసుకోవాల. తవఁరేం సిన్నపిల్లోడు కాదు కదా! పనులు సక్కబెట్టుకు వచ్చే లోకజ్ఞానం పెంచుకోండి కొంచెం. కుటుంబాన్ని ఈదిలోకి పడేసే పరిత్తితి తెత్తానంటే వూళ్ళొ మాలాటోల్లం సూత్తా వూరుకోం మరి’’ అని బెదిరింపు ధోరణిలో బుద్ధిచెప్పి, చరచరా బయటకు నడిచాడు బుర్రమీసాల కొసలు సవరించుకుంటూ.

ఆవేశం తగ్గి, ఒళ్ళు తెలిసి, పైట భుజాల మీదకు నిండుగా లాక్కున్న సుశీలమ్మకీ, అమాయకపు చూపుల్తో నిలబడి ఉన్న పిల్లలకీ... తమ ఇంటి పెద్ద(పులి)కి ఈ డోసు చాలు అనే భావన... లోలోన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెద్దిరాజు మాటలు అభయంగా కూడా తోచసాగాయి.

మెదడుకి ‘ఫినాయిల్‌ సర్వీసింగ్‌’ అయిన భావన కలిగి, కమ్మని భోజనాలతో భోజనప్రియుడైన తనని... ప్రతీ ఏటి మాదిరిగానే బురిడీ కొట్టించిన వీరభద్రం - ఆకాశం ఎత్తున బకాసురుడి వారసుడిలా నిలబడి తనని చూస్తూ హేళనగా నవ్వుతూన్నట్లు అనిపిస్తూండగా... తన ధర్మపత్ని ముందు తను వామనుడిని అని అర్థమై... తన నిర్వాకం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని తన అసమర్థతని చూపులతోనే అంగీకరిస్తూ... బేలగా... సర్కస్‌ రింగ్‌లో పెద్దపులిలా... బంకర్‌లో దొరికిపోయిన సద్దాం హుస్సేన్‌లా... పదేళ్ళొచ్చినా పక్క తడుపుకునే కుర్రాడిలా... అవాక్కయిపోయి, చేష్టలుడిగి గుడ్లు మిటకరించి చూస్తూ ఉండిపోయాడు పరబ్రహ్మం.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.