close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కార్తిక సిరి... ఉసిరి..!

కార్తిక సిరి... ఉసిరి..!

ప్రకృతి దైవసృష్టి కాదు, ఆ దైవత్వంలో ప్రకృతీ ఓ భాగమే అంటారు కొందరు ఆధ్యాత్మికవాదులు. అందుకేనేమో అనాది నుంచీ మనిషి ఆ ప్రకృతిలోని చెట్టూచేమల్నీ పూజించడం అలవరచుకుని ఉంటాడు. అలా పవిత్రమైనవిగా పూజించే చెట్లన్నీ ఒక ఎత్తయితే, ఉసిరి చెట్టు ఒక్కటే మరో ఎత్తు. ఆధ్యాత్మిక భావనల్నీ ఔషధగుణాల్నీ పోషకఫలాల్నీ ఏకకాలంలో అందించే అద్భుతవృక్షమే ఈ ఉసిరి... కార్తికమాస సిరి..!

కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్‌ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్‌-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

పోషకాలూ ఉన్నాయ్‌!
వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.

ఆరోగ్యఫలం!
ఆయుర్వేదం ప్రకారం- ఉసిరి మూడు రకాల దోషాల్నీ తగ్గిస్తుంది. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదవైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే.

* ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.

* వీర్యసమృద్ధికీ ఉసిరి ఎంతగానో తోడ్పడతుందట.

* తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.

* వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.

* కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.

* నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.

* రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.

* కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికీ మంచి మందే.

* ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.

* ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

* కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి బాలమెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.

కేవలం ఆయుర్వేదనిపుణులే కాదు, అల్లోపతీ వైద్యులూ ఉసిరిని ఔషధగని అనే పేర్కొంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీవైరల్‌గుణాలు అధికంగా ఉన్నాయట. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తుందనీ గ్యాస్ట్రిక్‌ సమస్యల్నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తుందని తేలింది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్‌ స్రావాన్నీ ప్రేరేపిస్తుంది.. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వల్నీ తగ్గించడం ద్వారా హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఇందులో ఉన్నాయట. మొత్తమ్మీద ఉసిరిలో రోగనిరోధకశక్తి ఎక్కువన్నది స్పష్టమైంది. అందుకే మనదేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం రూపంలో నిల్వచేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. చూశారుగా మరి, తాజాగా, ఎండుపండుగా లేదా పొడిరూపంలో ఎలా తీసుకున్నా ఉసిరి... ఆరోగ్యసిరి..!

రంగురంగుల గూస్‌బెర్రీ..!
అచ్చంగా ఉసిరికాయల్ని తలపించేవే ఈ గూస్‌బెర్రీలు. వీటినే యూరోపియన్‌ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. వీటిని అలా పిలవడంవల్లే మన ఉసిరిని ‘ఇండియన్‌ గూస్‌బెర్రీ’ అని ప్రత్యేకంగా పిలుస్తారు పాశ్చాత్యులు. చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ ఈ ఐరోపా గూస్‌బెర్రీలు, పొదలకి కాస్తాయి. ఆకుపచ్చరంగుతో పాటు ఎరుపు, వూదా, పసుపు, తెలుపు... ఇలా రకరకాల రంగుల్లోనూ ఉంటాయివి. ఐరోపా, పశ్చిమాసియా దేశాలతోబాటు ఉత్తరభారతదేశంలోనూ హిమాలయశ్రేణుల్లోనూ కూడా ఈ గూస్‌బెర్రీలు ఎక్కువగా పెరుగుతాయి. చిత్రంగా మన ఉసిరిలానే వీటితోనూ నిల్వ పచ్చళ్లు పడతారు. మురబ్బా తయారుచేస్తారు. ఎండబెట్టీ తింటారు. జామ్‌లు చేస్తారు. జ్యూస్‌రూపంలో తాగుతారు. ఇతరత్రా పోషకాలు ఉసిరిలో మాదిరిగానే ఉన్నప్పటికీ సి-విటమిన్‌ శాతం మాత్రం గూస్‌బెర్రీలో తక్కువ. కానీ దీన్ని కూడా ఔషధఫలంగా ఉపయోగించడం విశేషం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.