close
పరిమళమె... పరవశమె..!

పరిమళమె... పరవశమె..!

పరిమళమె..గాలి అలలపై తేలివచ్చే గులాబీల సుగంధంలా... మసకచీకటివేళ మత్తెక్కించే మల్లెల సువాసనలా... పండువెన్నెల్లో మైమరపించే సంపెంగల మత్తులా... మంచువాకిలిని ముద్దాడే పారిజాతాల గమ్మత్తులా... చినుకుతాకిడికి మురిసిన మట్టివాసనలా... చింతనిప్పుల్లోని సాంబ్రాణి ధూపంలా... ఆహా... ఎంత బాగుందీ... ఈ పరిమళం!

మంచి దుస్తులు వేసుకోవడమే కాదు, సుగంధాల్నీ వెదజల్లాలి... అన్న ఆకాంక్ష అందరిలో పెరుగుతోంది. అందుకే డియోడరెంట్లు, కొలోన్‌లు, ట్వాలెట్‌లు, పెర్‌ఫ్యూమ్‌లు... ఇలా రకరకాలుగా పరిమళాల మార్కెట్‌ గుబాళిస్తోంది. గులాబీ అత్తర్లు ఇంకా కనిపించినా, డిజైనర్లు రూపొందించే సిగ్నేచర్‌ సెంట్‌లనే నేటితరం ఇష్టపడుతోంది. జివొడా, ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్సెస్‌, ఛానెల్‌, డియోర్‌, బాస్‌, కార్టియర్‌, కాల్విన్‌క్లెయిన్‌, విక్టోరియాస్‌ సీక్రెట్‌... ఇలా ఎన్నో బ్రాండ్‌లు పెర్‌ఫ్యూమ్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.

పరిమళాలను పూలూ, పండ్లూ, ఆకులూ, చెట్టు బెరళ్లూ, కాండాలూ, జిగురూ, జంతుభాగాలూ... వంటి వాటి నుంచి తీసిన గాఢ నూనె లతో తయారుచేస్తారు. ఎక్కువగా గులాబీ, మల్లె, సంపెంగ, నారింజ, లావెండర్‌ పూలూ; వట్టివేళ్లూ; గంధపుచెక్కలూ; కస్తూరి, సివెట్‌ జంతువుల మలగ్రంథుల నుంచీ సుగంధద్రవ్యాలను తీసి పెర్‌ఫ్యూమ్స్‌ తయారుచేస్తారు. కలిపే పదార్థాలను బట్టి సెంట్లను ఫ్లోరల్‌, వుడీ, గ్రీన్‌, ఓషియానిక్‌, స్పైసీఫ్రూట్‌, ఓరియంటల్‌ సెంట్లు అనే ఆరు రకాలుగా విభజించారు. ఎందుకంటే ఒక పరిమళంలో అది పువ్వు, పండు, ఆకు... ఇలా ఏదైనాగానీ కనీసం 10 నుంచి 250 రకాల వాసనలు కలగలిసి ఉంటాయి. అంటే సంగీతంలోని రాగాల మాదిరిగానే పరిమళాల్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయన్నమాట. వీటినే నోట్స్‌ అంటారు. సీసా మూత తీయగానే మైమరిపించే సువాసనే టాప్‌నోట్‌. ఇది ఐదూపది నిమిషాలే ఉంటుంది. పెర్‌ఫ్యూమ్‌ చల్లుకున్న పది నుంచి ఇరవై నిమిషాల తరవాత వచ్చేది మిడిల్‌ నోట్‌. ఇది మెల్లగా ఆవిరై బేస్‌నోట్‌లోకి దిగుతుంది. మనం వాడే పరిమళ స్వభావాన్ని నిర్ణయించేది ఇదే. పరిమళం తయారు చేసేటప్పుడే ఈ మూడు నోట్‌లూ ఎలా ఉండాలో నిర్ణయిస్తారు.

పరిమళాల తయారీలో పుష్పతైలాల్ని భిన్న మోతాదుల్లో వాడుతుంటారు. దీన్నిబట్టి వీటిల్లో రకాలున్నాయి. 2 నుంచి 5 శాతం మాత్రమే పూల నూనె ఉండేవాటిని కొలోన్‌లనీ, 5 నుంచి 10 శాతం గాఢ తైలం ఉంటే ఓ డె ట్వాలెట్‌లనీ, 10 నుంచి 15 శాతం ఉంటే ఓ డె పెర్‌ఫ్యూమ్‌ అనీ, అదే 15 నుంచి 40 శాతం ఉంటే అసలైన పెర్‌ఫ్యూమ్‌లనీ అంటారు. అందుకే వాడే పూల నూనెలను బట్టి పరిమళం ధర ఆధారపడి ఉంటుంది. ఇటీవల రసాయనాలతోనూ సింథటిక్‌ పరిమళాలను రూపొందిస్తున్నారు. సహజమైనవాటితో పోలిస్తే వీటి ధర తక్కువ. అందుకే ప్రతిఒక్కరూ నచ్చిన పరిమళంతో గుమ్మెత్తిపోతున్నారు.

మీకు తెలుసా...
ప్రపంచవ్యాప్తంగా పరిమళాలది 11 వేల కోట్ల మార్కెట్టు. అందులో మనది రూ.1388 కోట్లు.

* సెంట్లకు వేడి, సూర్యరశ్మి తగలకూడదు. అల్యూమినియం డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే సుదీర్ఘకాలం సువాసనలు వెదజల్లుతుంటాయి.

* వాసనలకు జ్ఞాపకం ఎక్కువ. అందుకే అవి చిరకాలం గుర్తుండిపోతాయి. అబ్బాయిలు తమ తండ్రులు వాడిన పరిమళాలనే వాడేది ఇందుకే.

* సెంట్ల తయారీని ఆయా కంపెనీలు రహస్యంగా ఉంచుతాయి. కలిపే పదార్థాల పాళ్ల లేబుల్‌ ఉన్నప్పటికీ పెద్ద ఉపయోగం ఉండదు.

* ఒకేసారి మూడు పరిమళాల కన్నా ఎక్కువ వాసన చూస్తే ముక్కు సరిగ్గా పనిచేయదు. కాస్త సమయం ఇవ్వడం లేదా గట్టిగా వూపిరి పీల్చి వదిలాక మళ్లీ చూడాలి.

* వాసనలు మనసుని ప్రభావితం చేస్తాయి. లావెండర్‌ హాయిగా సేదతీరిస్తే, సిట్రస్‌ వాసనలు జ్ఞానేంద్రియాల్ని మేల్కొలుపుతాయి.

* ప్రస్తుతం ఉన్న అన్నింటిలోకీ ‘ఓ డె కొలోన్‌ 4711’ పాతది. 1796లో దీన్ని స్త్రీపురుషులిద్దరికోసమూ తయారుచేశారు. దీన్ని నెపోలియన్‌ ఆయన భార్య జోసెఫీన్‌ వాడేవారు.

* టుటాంక్‌మన్‌ ఫారో చక్రవర్తి శవపేటికలో 3 వేల అత్తరుసీసాలు ఉంచారట.డియోడరెంట్లకీ

పరిమళాలకీ ఏమిటి తేడా?
తినే ఆహారం, ఒంటితీరు... తదితర కారణాలవల్ల స్వేదం నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆ చెమట వాసననీ ఒంటిమీద పెరిగే బ్యాక్టీరియానీ నిరోధించేదే డియోడరెంట్‌. ఇందులో గాఢతైలం 6- 15 శాతం మాత్రమే ఉంటుంది. ఆల్కహాల్‌ గాఢత కూడా తక్కువ. అదే పెర్‌ఫ్యూమ్‌లలో వాసన తైలం, ఆల్కహాల్‌ల గాఢత ఎక్కువ. ఇది కూడా దుర్వాసనను అడ్డుకోవడంతోబాటు ఎక్కువసేపు శరీరంమీద ఉండి సువాసనల్ని వెదజల్లుతుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే చెమటవాసనను అడ్డుకోవడమే డియోడరెంట్‌ పనయితే, ఒంటిని పరిమళభరితం చేసేదే పెర్‌ఫ్యూమ్‌.

సెంటు ఎక్కడ పూయాలి?
నాడీ కేంద్రాల దగ్గర. నులివెచ్చని ఆ శరీరభాగాలకు అత్తరు రాస్తే అది ఎక్కువసేపు సువాసనల్ని వెదజల్లుతూ ఉంటుంది. అందుకే మెడ దగ్గర, ఛాతీమీద, చెవివెనక, మోచేతులు, మోకాళ్లు, మణికట్టు దగ్గర పూస్తే రోజంతా ఉంటుంది. తక్కువ వాసన వచ్చే బాత్‌ ఆయిల్‌, షవర్‌ జెల్‌, బాడీ లోషన్లను ఉదయం, ఓ డె ట్వాలెట్‌ను మధ్యాహ్నం, ఓ డె పెర్‌ఫ్యూమ్‌, పెర్‌ఫ్యూమ్‌లను సాయంత్రం వాడమన్నది నిపుణుల సూచన.

* పొడి చర్మంమీదకన్నా జిడ్డు చర్మంమీద పరిమళం ఎక్కువసేపు ఉంటుంది.

* పెర్‌ఫ్యూమ్‌ని దుస్తులమీద కాకుండా నేరుగా ఒంటికే పూయాలి. పూసేముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా వాడాలి. అప్పుడే అది ఒంటికి పట్టి రోజంతా ఉంటుంది. దుస్తులమీద వేస్తే ఘాటుగా ఉండటంతోబాటు మరకలు పడుతుంది.

* వెంట్రుకలమీద పెర్‌ఫ్యూమ్‌ ఎప్పుడూ స్ప్రే చేయకూడదు. అందులోని ఆల్కహాల్‌వల్ల జుట్టు పాడవుతుంది.

* పెర్‌ఫ్యూమ్‌ని మణికట్టుమీద పూసి రుద్దకూడదు. అందులోని నోట్‌లన్నీ శరీరతైలాలతో కలగలసిపోయి సువాసనని దెబ్బతీస్తాయి.

* ఉద్యానవనాలకు వెళ్లేటప్పుడు పూల పరిమళాలు వాడకపోవడమే మంచిది. కీటకాలూ ఈగలూ చుట్టుముట్టే అవకాశం ఉంది.

* వేసవి, వర్షాకాలంలో పరిమళం తక్కువ పూయాలి. కాలాన్ని బట్టి పరిమళం వాసనా మారుతుంది. మరో విషయమేంటంటే సెంటుని కొనేటప్పుడు తోడుగా ఒకరు ఉండాల్సిందే. పూసుకున్నవాళ్లకన్నా పక్కవాళ్లకే ఆ వాసన బాగా తెలుస్తుంది.

ఖరీదైనది
నిన్నటివరకూ ప్రపంచంలోకెల్లా ఖరీదైన పరిమళం క్లైవ్‌ క్రిస్టియన్‌ నం.1. ఇంపీరియల్‌ మెజెస్టీ. బ్రిటిష్‌ డిజైనర్‌ క్లైవ్‌,ల డిజైన్‌ చేసిన ఈ బాటిల్‌ ధర కోటీ ముప్ఫై లక్షల రూపాయలు. ఏడాదికి కేవలం పది సీసాలే చేస్తారు. ఇందులో 16.9 ఔన్సులు మాత్రమే ఉంటుంది. విక్టోరియా మహారాణి ఆదేశాల మేరకు తయారుచేసిన ఈ సెంటులో 200 రకాల పదార్థాలు ఉంటాయి. బకారెట్‌ క్రిస్టల్‌తో తయారైన ఈ సీసా మూత ఐదు క్యారెట్ల వజ్రంతో విక్టోరియా రాణి కిరీటాన్ని పోలి ఉంటుంది. ఇటీవల దీన్ని తలదన్నుతూ డికెఎన్‌వై కంపెనీ గోల్డెన్‌ డెలీషియస్‌ మిలియన్‌ పేరుతో ఓ సెంటుని తయారుచేసింది. ధర సుమారు రూ.6.2 కోట్లు. అత్తరు సంగతెలా ఉన్నా ఆ సీసాకి పొదిగిన 2,909 రత్నాలే ఇందుకు కారణం.

మగవాళ్లకేనా?!
పరిమళాల ప్రకటనల్లో అబ్బాయి నుంచి వచ్చే సెంటు వాసనకి అమ్మాయిలు వెనకే వెళ్లిపోతుంటారు. కాస్త అతిశయోక్తిగానే అనిపించినా ఇది నిజమే. మగవాళ్ల ఒడ్డూపొడుగూ కన్నా వాళ్లు వాడే పరిమళానికి స్త్రీలు ఎక్కువ ఆకర్షితులవుతారన్నది ఓ అధ్యయనం. నిజానికి ఈ సెంటు అమ్మాయిలకు ఇష్టం, అది అబ్బాయిలకు ఇష్టం అని కచ్చితంగా చెప్పలేరట. అదంతా మార్కెటింగ్‌ మాయ. మగవాళ్ల పరిమళాల్లో 33 శాతం కొనేదీ ఆడవాళ్లే. అత్యధికంగా అమ్ముడుపోయే మగవాళ్ల పరిమళాలను ఎక్కువ ఇష్టపడేదీ మహిళలే. ఆఘ్రాణశక్తీ ఆడవాళ్లకే ఎక్కువ. అందుకే వాసనలను గుర్తించేవాళ్లలో మహిళలదే అగ్రాసనం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.