close
కొత్త కుండీ... బాగుందండీ!

కొత్త కుండీ... బాగుందండీ!

ఇంటికి అందాన్నిచ్చేవి పచ్చని మొక్కలయితే, అవి ఆరోగ్యంగా పెరిగేందుకు పనికొచ్చేవే కుండీలు. అవి ఈ మధ్య బాగా తెలివిమీరిపోయాయి. ఓ వారం రోజులు మనం ఇంట్లో ఉన్నా లేకున్నా అవే ఆ మొక్కల ఆలనాపాలనా చూసుకుంటున్నాయి. ఆధునిక సొబగుల్నీ సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్నీ కలబోసుకుని మొక్కల పెంపకంలో కీలకపాత్ర పోషిస్తోన్న ఆ కొత్త కుండీల కథేంటో కాస్త తెలుసుకుందామా...

ఒకప్పుడు టెర్రకోట కుండీలే అందరికీ తెలుసు. ఈ మధ్య వాటితోపాటు బంకమన్నువీ సిమెంటువీ ప్లాస్టిక్‌వీ ఆక్రిలిక్‌వీ సెరామిక్‌వీ చెక్కవీ రాళ్లవీ ఇలా చాలానే వస్తున్నాయి. ఆపై వీటికి రంగుల చిత్రాలూ బొమ్మలూ అలంకరించడంతోబాటు మొజాయిక్‌ రాళ్ల సొగసుల్నీ అద్దుతున్నారు. కొన్ని కుండీలమీదయితే డిజిటల్‌ ఫొటోలనూ అంటించేస్తున్నారు. అవి పాడవకుండా పారదర్శక ప్లాస్టిక్‌ లేదా ఆక్రిలిక్‌ కుండీలనూ వాటికి తొడిగేస్తున్నారు. మరికొన్ని కుండీలయితే ఫర్నిచర్‌ లుక్‌నీ సొంతం చేసుకుంటున్నాయి. కుండీని జరిపి నేలను శుభ్రం చేయక్కర్లేకుండానూ లేదా స్టూలో స్టాండో అవసరం లేకుండానూ వాటికే కాళ్లూ చేతులూ వచ్చేస్తున్నాయన్నమాట. పెంపుడు జంతువులు పడుకునేలానూ, పండ్లూ కూరగాయల్లాంటివి పెట్టుకునేలానూ డిజైన్‌ చేసిన కుండీలూ వస్తున్నాయి. నిజానికి కుండీలను గృహాలంకారంలో భాగంగా వాడటం 18వ శతాబ్దం నుంచీ వాడుకలో ఉంది. అప్పట్లో జోసియా వెడ్జ్‌వుడ్‌ రూపొందించిన పింగాణీ కుండీలను టేబుల్‌మీద అలంకరించేవారట. మొత్తమ్మీద ఇంట్లో మొక్కలు పెంచుకోవడం పెరగడంతో పూలతొట్టెలు అటు అందాన్నీ ఇటు సరికొత్త సాంకేతిక హంగుల్నీ సంతరించుకుని కొత్తకొత్తగా మెరుస్తున్నాయి.

పచ్చని దీపం...
కొన్ని రకాల మొక్కలు కాంతి తగలకపోతే సరిగ్గా పెరగవు. అలాంటివాటికోసం స్టూడియో సులబ్‌ కంపెనీ తయారుచేసినవే ఈ ఎల్‌ఈడీ లైట్‌ పాట్‌లు. ఇవి బెడ్‌ల్యాంప్‌లా పనిచేస్తూనే మొక్క పెరుగుదలకీ తోడ్పడతాయి.

సంచీ మొక్కలివి...
మొక్క వేరుకి చక్కగా గాలాడేలా చేసినవే ఈ ఫ్యాబ్రిక్‌ కుండీలు. వ్యర్థపదార్థాలతో తయారుచేసిన ఈ బయోడిగ్రేడబుల్‌ సంచీల్లో మొక్క చక్కగా పెరగడమే కాదు, నీటిని బయటకీ రానివ్వదు. అందుకే దీన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

రంగుల్లో వెలుగుతాయి...
బెడ్‌ల్యాంప్‌తో పనిలేకుండా చీకట్లో మెరిసే కుండీల తయారీ కూడా ఇటీవల పెరిగింది. స్వీడన్‌కు చెందిన నోలా కంపెనీ తయారుచేసిన రంగురంగుల స్కూప్‌ మూన్‌లైట్‌ ప్లాంటర్స్‌ కళ్లను కట్టిపడేస్తాయి. రోటో మౌల్డెడ్‌ పాలీ ఇథిలీన్‌తో తయారైన కుండీలయితే రీఛార్జబుల్‌ బ్యాటరీలూ లేదా విద్యుచ్ఛక్తితోనూ వెలుగులు విరజిమ్ముతాయి. రిమోట్‌తో కావలసిన రంగుల్లోకి మార్చుకునేలా రూపొందించిన ఈ కుండీలను రాత్రి పార్టీల్లో అమరిస్తే అతిథులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇవే కాదు, ఛార్జింగ్‌లూ బ్యాటరీలతో పనిలేకుండా కుండీల్లో అమర్చిన సోలార్‌ సెల్‌ ద్వారా పగలు కాంతిని గ్రహించి రాత్రిళ్లు కాంతిని వెదజల్లే ఫైర్‌బాక్స్‌ సోలార్‌ పవర్‌ కుండీలు వస్తున్నాయండోయ్‌.

డిజిటల్‌ పాట్‌
మీ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో లేదో తెలియజేసేదే ఈ డిజిటల్‌ పాట్‌. ఇందులో అమర్చిన ఎల్‌సీడీ తెర, కుండీలోని మట్టి స్థితినీ నీటి శాతాన్నీ వాతావరణంలోని ఉష్ణోగ్రతనీ తేమనీ కూడా చూపిస్తుంది.

కుషనూ కుండీనే
ఇంటి మూలల్లోనో కిటికీల్లోనే కాకుండా సోఫాలూ టేబుళ్లమీదా ఎక్కడైనా అలంకరించుకునేవే గ్రీన్‌బొ కంపెనీ రూపొందించిన ఈ ఫియోరినా ఫ్లవర్స్‌ పిల్లోలు. ఇందులో మొక్కను పెట్టే కుండీతోపాటు దాని అడుగున ఓ కప్పులాంటిది కూడా ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేసుకోవచ్చు. మాసిపోతే ఈ దిండుకుండీని కూడా ఎంచక్కగా ఉతికేయవచ్చు సుమీ.

నీళ్లు కావాలీ... కావాలీ..!
కుండీల్లో మొక్కలు పెంచుకునేవాళ్లందరికీ ఒకటే సమస్య. అవి ఎండిపోకుండా సరైన సమయంలో నీటిని పోయడం. ఓ వారంపదిరోజులు ఎటైనా వెళితే వచ్చేసరికి మొక్కలన్నీ వాడిపోవడం ఖాయం. అందుకే పోసిన నీటిని నిల్వచేసుకుని అవసరమైనంత మేరకే మొక్కకు అందించే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కుండీలు ఎక్కువగా వస్తున్నాయి.

రోగికి గ్లూకోజ్‌ ఎక్కించినట్లుగా మొక్కకు పోషకాలతో కూడిన నీటిని అందించేలా డిజైన్‌ చేసినవే ఐ.వి. ప్లాంట్‌ పాట్స్‌. లండన్‌కు చెందిన విటమిన్‌ కంపెనీ రబ్బర్‌ గ్లాస్‌తో రూపొందించిన ఈ కుండీలు, చూడ్డానికి స్టైలిష్‌గా ఉంటాయి. వీటిల్లో బాటిల్‌గానీ కవర్‌గానీ అమర్చిన ఓ లోహపు స్టాండ్‌ ఉంటుంది. దానికున్న స్క్రూ ద్వారా నీళ్లు మొక్కకు చేరే వేగాన్ని నియంత్రించుకోవచ్చు.

‘ఉడుతా ఉడుతా వూచ్‌... ఎక్కడికెళతావోచ్‌’ అని పాట పాడుకుంటూ మరీ ఈ లాగ్‌ అండ్‌ స్క్విరల్‌ కుండీలో నీళ్లు పోయొచ్చు. క్వాలే డిజైన్‌ కంపెనీ తయారుచేసిన ఈ కుండీ రిజర్వాయర్‌లో ఓ ఉడుత ఉంటుంది. నీళ్లు పోయగానే అది పైకి వస్తుంది. అలా వస్తే ఇక నీళ్లు చాలన్నమాట. నీళ్లు అయిపోతుంటే అది క్రమంగా కిందకి వెళ్లిపోతుంది. మొత్తంగా కిందకి వెళ్లిపోతే నీళ్లు పోసే సమయం ఆసన్నమైందని అర్థం. ఇవే కాదు, మూత ఉన్న టెర్రకోట పాట్స్‌, నీళ్లు ఎంతున్నాయో కనిపించేలా చేసిన పాలీప్రొపిలీన్‌ ప్లాస్టిక్‌ కుండీలూ, గోడకి అమర్చే రెయిన్‌పాట్‌లూ...ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. నీటిని కొంచెకొంచెంగా అందిస్తూ అయిపోయిన విషయాన్ని మనకు సూచించేలా రూపొందించినవే ఈ కుండీలన్నీ.

సరాగాల తోటలో...
జపాన్‌కు చెందిన జెవీసీ కంపెనీ ‘కిరికబు’ పేరుతో తయారుచేసిన ఈ స్పీకర్‌ కుండీల్లో అన్నివైపులనుంచీ ధ్వని వచ్చేలా వూఫర్‌ కూడా అమర్చి ఉంది. ఏమాత్రం భయపడకుండా వీటిల్లో ఎంచక్కగా నీళ్లు కూడా పోసుకోవచ్చట. టీవీ, ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ దేనికైనా అనుసంధానించుకోవచ్చు.

ఒక కుండీ... బోలెడు మొక్కలు..!
ఉన్న కొద్ది స్థలంలోనే ఎక్కువ కుండీలను పెట్టుకోవడం కష్టమనుకునేవాళ్లకోసం రకరకాల మొక్కలను పెంచుకునేలా ఒకదానిమీద ఒకటి లేదా ఒకదానిపక్కన ఒకటి అతుక్కుని ఉండే బహుళ అరల కుండీలూ వస్తున్నాయి. ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు, ఇంట్లో ఓ ఉద్యానవనం ఉన్నట్టే ఉంటుంది మరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.