close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గింజలు తినండొహో..!

గింజలు తినండొహో..!

‘మీ గుండె ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రోజూ గుప్పెడు గింజలు తినండి అంటున్నారు వైద్యులూ పోషకనిపుణులు. గింజల్లోని అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తాయట. అందుకే ఒకప్పుడు అక్కడక్కడా మాత్రమే కనిపించే డ్రైనట్స్‌, ఈ మధ్య అన్ని దుకాణాల్లోనూ సందడిచేస్తూ, ఇంటింటా స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి.

బాదం... చాలా బలం..!
సూపర్‌ నట్స్‌గా చెప్పే బాదంలో సుగుణాలెన్నో. తల్లిపాలలోని ప్రొటీన్లు వీటిల్లో దొరుకుతాయి. బాదంలోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కోలన్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయనీ పిత్తాశయంలోని రాళ్లనూ తొలగిస్తాయన్నది సరికొత్త పరిశోధన. మిగిలినవాటితో పోలిస్తే బాదంలో శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతం తక్కువ. రోజూ కాసిని బాదంపప్పుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడంవల్ల బరువు తగ్గుతారు. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి తద్వారా రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. బాదంలో ఎక్కువగా ఉండే ఇ-విటమిన్‌ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మ సౌందర్యాన్నీ పెంచుతుంది.

భల్లే భల్లే పల్లీ
లెగ్యూమ్‌ జాతికి చెందినప్పటికీ పోషకాల కారణంగా వీటినీ నట్స్‌ జాబితాలోకే చేర్చేశారు. శరీరభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలంటే శక్తితోపాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ పోషకాలు కీలకం. ఇవన్నీ పల్లీల్లో పుష్కలం. ఎ, బి, సి, ఇతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ; ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌...వంటి 26 రకాల ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. వంద గ్రా. పల్లీల్లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన నియాసిన్‌ 85 శాతం లభ్యమవుతుంది. పల్లీల్లోని రెస్‌వెరాట్రల్‌ అనే పాలీఫినాలిక్‌ యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్లనీ హృద్రోగాలనీ నరాల వ్యాధుల్నీ అల్జీమర్స్‌నీ వైరల్‌ ఇన్ఫె క్షన్లనీ నిరోధిస్తుంది. పోతే హీమోఫీలియా, రక్తహీనత ఉన్న రోగులకి పల్లీ చేసే మేలెంతో..!

కొవ్వును తగ్గించే పీకాన్స్‌
తియ్యని రుచితో ఉండే వీటిల్లో కూడా అక్రోట్లలో మాదిరిగానే అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఎక్కువ. ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువ. వీటిల్లో ఉండే స్టెరాల్స్‌కి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉందన్నది జార్జియా యూనివర్సిటీ నిపుణుల కొత్త పరిశీలన. నాడీవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తాయీ గింజలు. వీటిల్లో ఎక్కువగా ఉండే ఎలాజిక్‌ ఆమ్లం క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతుంది.

మెదడుకు మేత... అక్రోట్లు
ఆల్ఫా లినోలిక్‌ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు ఇవొక్కటే. ఇది పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలోని మెలటోనిన్‌ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ తెలివితేటల్నీ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్‌నీ నిరోధిస్తాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యానికి మేలుచేస్తాయనీ, గర్భిణులు రోజూ కాసిని అక్రోట్లను తినడంవల్ల పిల్లల మెదడు పనితీరు కూడా బాగుంటుందనీ హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పోషక నిపుణుల పరిశీలనలో తేలింది. వీటిల్లోని బయోటిన్‌ (బి7) జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇంకా ఫైటోస్టెరాల్స్‌ ఒత్తిడినీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటాయి.

పైన్‌... ఆకలిమందు
అందంకోసం పెంచుతారనుకునే పైన్‌ చెట్ల గింజలూ అద్భుత పోషకనిల్వలే. ఓలియాక్‌ ఆమ్లం వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటంవల్ల ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిల్లోని పినోలెనిక్‌ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందన్నది కొత్త పరిశీలన. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకివి ఎంతో మేలు. కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ, ల్యూటెన్‌లు వీటిల్లో ఎక్కువ. విటమిన్‌ డి, ఐరన్‌ కూడా ఎక్కువే.

బ్రెజిల్‌ నట్‌... ఒక్కటి చాలు!
రోజుకి ఒక్కటి లేదా రెండు తిన్నా చాలు... శరీరానికి అవసరమయ్యే రోజువారీ సెలీనియం నూటికి నూరుశాతం దొరుకుతుంది. ఎముక, ప్రొస్టేట్‌, రొమ్ముక్యాన్సర్లు రాకుండా ఉండేందుకూ థైరాయిడ్‌ హార్మోన్‌ పనితీరుకీ హృద్రోగాలూ కాలేయ వ్యాధులు రాకుండా ఉండేందుకూ ఈ సెలీనియం ఎంతో అవసరం. పుండ్లు త్వరగా తగ్గేందుకూ ఇది సాయపడుతుంది. ఆహారం ద్వారా జింక్‌ తీసుకోలేనివాళ్లకు అది అందేలా చేస్తుంది. అయితే సెలీనియం ఎక్కువైనా కష్టమే కాబట్టి వీటిని అతిగా తినకూడదు. అమెజాన్‌ అడవుల్లో ఎక్కువగా పెరిగే బ్రెజిల్‌నట్స్‌ బీకాంప్లెక్స్‌కీ మంచి నిల్వలు. స్థానికులకు ఇవే శక్తి వనరులు.

కంటికి కాసిని పిస్తా...
పిస్తా పప్పుల్లేని కుల్ఫీని వూహించలేం. స్వీట్లూ ఐస్‌క్రీముల్లోనే కాకుండా రోజూ కాసిని పిస్తా గింజల్ని తినడంవల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్‌- ఇ, పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లూ, కెరోటిన్లూ హానికారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్లూ ఇన్ఫెక్షన్లూ రాకుండా కాపాడతాయి. ఈ నట్స్‌లోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యంలో వచ్చే కంటి కండరాల బలహీనతను అడ్డుకుంటాయి. కాపర్‌, మాంగనీస్‌... వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంవల్ల ఆర్థ్రైటిస్‌, పక్షవాతం, మతిమరుపు, అలర్జీలు, జీవక్రియా లోపాలూ తలెత్తకుండా ఉంటాయి.

జీడిపప్పూ తినొచ్చు...
‘అమ్మో జీడిపప్పే, కొలెస్ట్రాల్‌’ అనేస్తుంటారంతా. కానీ ప్రకృతి ఇచ్చిన గొప్ప విటమిన్‌ మాత్రలివి. ఐరన్‌, జింక్‌లకు మంచి నిల్వలు. రక్తహీనతని తగ్గిస్తాయి. పుష్కలంగా ఉండే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోబాటు వయసుతోపాటు వచ్చే మతిమరుపునీ తగ్గిస్తుంది. ఎముకలూ చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం నాడీకణాలూ రక్తనాళాలూ కండరాలూ కుంచించుకుపోకుండా చూస్తుంది. అదే లోపిస్తే కాల్షియం ఆయా కణాల్లోకి చొచ్చుకుపోయి బీపీ, తలనొప్పి, మైగ్రెయిన్‌... వంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. మెనోపాజ్‌ తరవాత నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ కాసిని జీడిపప్పు తింటే సమస్య తగ్గుతుంది. ఇందులోని ప్రొయాంథోసైనడిన్స్‌ కోలన్‌ క్యాన్సర్‌నూ నిరోధిస్తాయి. వీటిల్లో కొద్దిపాళ్లలో ఉండే జియాజాంథిన్‌ రెటీనా కండరాల్లోకి చేరి కళ్లను హానికరమైన అతినీలలోహితకిరణాల నుంచి రక్షిస్తుంది.