close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీలైతే నాలుగు మాటలూ..

వీలైతే నాలుగు మాటలూ.. కుదిరితే కప్పు కాఫీ..!

‘అమ్మా, కాఫీ...’ బెడ్‌మీద నుంచే ఓ పొలికేక...‘హాయ్‌ అనూ... ప్లీజ్‌, నాతో ఓ కాఫీ’...‘తలనొప్పిగా ఉంది గురూ. స్ట్రాంగ్‌ కాఫీ పడాల్సిందే’...ఇలా లేచింది మొదలు మళ్లీ నిద్రపోయేవరకూ కాఫీకోసం కలవరించేవాళ్లు కోకొల్లలు. మధురమైన దాని రుచీ ఆ పరిమళమూ అలాంటివి మరి. ఈ నెల 29న అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా మనం కూడా పొగలు కక్కే ఫిల్టర్‌ కాఫీని చప్పరిస్తూ ఆ కబుర్లు చెప్పుకుందాం...

అనుదినమ్మునూ కాఫీయే అసలు కిక్కు...
కొద్దిగానైనా పడకున్నా పెద్ద చిక్కు...’ అంటూ కాఫీకి జేజేలు పలుకుతూ దండకాలూ పాటలూ పద్యాలూ రాసే కవివర్యులు మనదగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో. మధురమైన దాని పరిమళం గాల్లో అలా తేలి వస్తే చాలు... మనసు ఉప్పొంగిపోయే కాఫీప్రియులకు కొదవేముంది? అందుకే నాటి కాఫీ క్లబ్‌ల నుంచి నేటి కెఫెల వరకూ ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

‘వీలైతే నాలుగుమాటలూ కుదిరితే కప్పు కాఫీ’ అంటూ నేటి యువతకి కెఫెలు కాలక్షేప వేదికలైతే కావచ్చేమోగానీ ఒకప్పుడు భావుకులకైనా విప్లవవాదులకయినా కాఫీ హౌస్‌లే చర్చావేదికలు. నురుగుతో పొంగే కాఫీ పడితేనే విప్లవ కవితైనా భావుకతైనా గోదారిలా ఉప్పొంగేదన్నమాట. కవిశ్రేష్ఠులనేముందీ... పొద్దుపొద్దున్నే ఇంత చద్ది తిని పనులకు పోయే పల్లె జనం సైతం వేడి కాఫీ గొంతు దిగందే పడక దిగనంతగా దానికి దాసానుదాసులైపోయారు. ఆ కాఫీగింజల్లో ఏం మహాత్మ్యం ఉందో తెలీదుగానీ, ఒకసారి అలవాటుపడ్డవాళ్లు మానేయడం కుదరదంటే కుదరదు. అదిచ్చే ఆ కిక్కూ ఆ ఉత్తేజమూ అలాంటివి మరి. ఓ చుక్క గొంతులోకి ఇలా దిగిందో లేదో మెదడు పాదరసంలా పనిచేస్తుంది. డోపమైన్‌ విడుదలై ఆనందం వెల్లువెత్తుతుంది. అసలు కాఫీ ప్రపంచానికి పరిచయమైందే అలా...

వేల సంవత్సరాల క్రితం ఇథియోపియాలోని ఓ మేకలకాపరి, ఎర్రని బెర్రీలు తిని ఉత్సాహంగా గంతులేస్తోన్న మేకల్ని చూసి, వాటి ఆనందానికి కారణమైన కాఫీ మొక్కను గుర్తించాడట. అలా వెలుగులోకి వచ్చిన కాఫీని ఎస్‌ప్రెసో, కెపచీనొ, కెఫె లాటె, ఐస్‌డ్‌ కాఫీ... ఇలా భిన్న రుచుల్లో ఆనందంగా చప్పరించేయడం ప్రారంభించారు. డికాక్షన్‌ తీసే విధానం, దాని పాళ్లూ బట్టి కాఫీ రుచులు పలు రకాలన్నమాట. మెషీన్‌ కాఫీలన్నీ ఎస్‌ప్రెసో కాఫీ అనుకుంటారు. కానీ, అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతల దగ్గర మరిగించిన నీటిని కేవలం 18 నుంచి 25 సెకన్లలో కలిపే మెషీన్‌ నుంచి తీసి నురుగుతో అందించే చిక్కని డికాక్షనే ఎస్‌ప్రెసో కాఫీ. ఇందులో పాలు కలపరు. ఎస్‌ప్రెసో కాఫీలో రుచికి తగ్గట్టుగా వేడినీళ్లు కలుపుకునేవే అమెరికానొ, బ్లాక్‌కాఫీలు. కప్పులో సగం ఎస్‌ప్రెసో కాఫీ పోసి దానిమీద ఆవిరితో కూడిన నురుగుపాలు పోసేదే కెపచీనొ. కెపచీనోలోనే మరిన్ని పాలు పోస్తే అది కెఫె లాటె(లాటె అంటే ఇటలీలో పాలు అని అర్థం). నాలుగు వంతుల ఎస్‌ప్రెసోకి ఒక శాతం పాలు పోస్తే అది కెఫె మకియాటో. ఎసెప్రెసోలో చల్లని పాలు కలిపి చేసేది లాటె ఫ్రెడొ. ఇందులో ఐస్‌ వేసి షేక్‌ చేస్తారు. ఒకవంతు ఎస్‌ప్రెసో మరోవంతు చాకొలెట్‌ సిరప్‌, రెండుమూడు వంతులు నురుగుపాలు పోసి చేసేదే మోకా కాఫీ. ఇంకా కాక్‌టెయిల్‌ లాంటి ఎస్‌ప్రెసో గ్రనీటా, చల్లని ఫ్రాపె, ఫ్రాపెచీనొ... ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఇన్‌స్టెంట్‌ కాఫీలూ వచ్చాయి. పాలూ కాఫీ డికాక్షన్‌తోబాటు రకరకాల సుగంధద్రవ్యాలను కలిపి చేసుకునే ఫ్లేవర్డ్‌ కాఫీలూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారతీయ ఫిల్టర్‌ కాఫీ ఒకెత్తు. అందుకే ‘స్టీలు ఫిల్టర్ల పళ్లెంబులోనున్న రంధ్రాలలో నుండి నీ సారమంత సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసామిరంగ నిజంగానే చచ్చేవిధంగా’ అనేశాడో కాఫీ ప్రియకవి. జై జై కాఫీ..!

కాఫీ కాలక్షేపం!
కాఫీ తయారీ అనేది ఇథియోపియా సంస్కృతిలో ఓ భాగం. ప్రతిరోజూ తాజా కాఫీగింజల్ని కడిగి వేయించి పొడి చేసి దాన్నుంచి కాఫీ తయారుచేసి కప్పులో పోయడం వరకూ ఓ వేడుకలా చేస్తారు. ఇదంతా చిన్నవయసు నుంచే అమ్మాయిలకు తల్లులు నేర్పిస్తుంటారు. పైగా కాఫీలో పంచదార, ఉప్పుతోపాటు వెన్న కూడా వేసి అందిస్తారు. నిజానికి కాఫీగింజల్ని వేయించేటప్పుడే కాస్త ఉప్పు జోడిస్తే చేదు ఉండదట. పైగా రుచిగానూ ఉంటుందంటారు కాఫీరుచుల నిపుణులు.

* టర్కీ, గ్రీసు దేశాల్లో అతిథులను కాఫీతోనే స్వాగతిస్తారు. అమెరకన్లయితే 65 శాతంమంది బ్రేక్‌ఫాస్ట్‌తోబాటు కాఫీ తాగుతారు.

* ప్రపంచవ్యాప్తంగా రోజుకి 50వేల కోట్ల కప్పుల కాఫీని సేవిస్తున్నారు.

* నిత్యావసర వస్తువుల్లో నూనె తరవాత అత్యధికంగా అమ్ముడుపోయేదీ కాఫీ గింజలే.

* కెఫీన్‌ ఎక్కువగా కావాలనుకునేవాళ్లు తక్కువగా వేయించిన గింజల్ని కొనుక్కుని పొడిచేసుకోవాలి. బాగా వేయిస్తే కెఫీన్‌ శాతం తగ్గుతుంది.

* సుమారు వంద కప్పుల కాఫీ తాగితే అది విషంగా పరిణమిస్తుంది.

* ఇది నరాలమీద ప్రభావం చూపిస్తుందన్న కారణంతో 15వ శతాబ్దంలో ముస్లిం పాలకులు కాఫీమీద నిషేధం విధించారట.

ఖరీదైన కాఫీ!
ప్రపంచంలోకెల్లా ఖరీదైన కాఫీలు చాలానే ఉన్నాయి. అవి పెరిగే ప్రాంతం, గింజల రుచిని బట్టి వాటి ధర కిలో లక్ష రూపాయల వరకూ పలుకుతుంటుంది. అయితే పునుగు పిల్లులకూ ఏనుగులకూ కావాలని గింజల్ని తినిపించి అవి విసర్జించిన గింజల్ని కడిగి ఎండలోపెట్టి తయారుచేసే కాఫీ ఓ కప్పు తాగాలన్నా వేల రూపాయలు చెల్లించాల్సిందే. సుమత్రాలోని పునుగు పిల్లులు తిని విసర్జించిన బెర్రీల నుంచి తయారుచేసే కొపి లూవాక్‌ కాఫీ ఖరీదు కప్పు ఆరు వేల రూపాయలు. ఇక ఏనుగుల తిని విసర్జించిన బెర్రీలతో తయారుచేసే బ్లాక్‌ ఐవరీ కాఫీ తాగాలంటే కప్పుకి మూడు వేల రూపాయలు పైనే బిల్లు కట్టాలి.

ఆరోగ్యం కోసం...
ఓ కప్పు కాఫీలో రోజువారీ అవసరమయ్యే రిబోఫ్లేవిన్‌లో 11 శాతం, పాంటోథీనిక్‌ ఆమ్లం 6 శాతం, మాంగనీస్‌ 3 శాతం, పొటాషియం 3 శాతం, నియాసిన్‌, మెగ్నీషియం 2 శాతం దొరుకుతాయి.

* కెఫీన్‌ నరాలను ప్రేరేపించడం ద్వారా శక్తినీ ఉత్తేజాన్నీ ఉల్లాసాన్నీ కలిగిస్తుంది.

* కాఫీలో అత్యధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌, డిమెన్షియా, హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ. డిప్రెషన్‌నీ తగ్గిస్తుంది. ఫలితంగా ఆత్మహత్యల శాతమూ తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అయితే కాఫీ అలవాటున్నవాళ్లలో చాలామంది ఆల్కహాల్‌, సిగరెట్లూ, మాంసాహారం కూడా ఎక్కువగా తీసుకుంటారు. వాటి కారణంగానే ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది.

* రోజుకో కప్పు కాఫీ తాగే అలవాటుంటే కాలేయానికి సంబంధించిన సిరోసిస్‌ అనే వ్యాధి వచ్చే అవకాశం తక్కువట. అలాగే కాలేయ, చర్మసంబంధ క్యాన్సర్లూ రావట.

* జీవక్రియా వేగాన్ని కెఫీన్‌ 3 నుంచి 11 శాతం పెంచుతుంది.

* వ్యాయామానికి ముందు కాఫీ తాగితే మంచిదట. అందులోని కెఫీన్‌ అడ్రినలిన్‌ శాతాన్ని పెంచుతుంది. ఫలితంగా కొవ్వు కణజాలం నుంచి కొవ్వు ఆమ్లాలు విడుదలై రెట్టించిన ఉత్సాహంతో వ్యాయామంచేసేలా చేస్తాయి.

* పంచదారలేని కాఫీ రోజూ ఓ కప్పు తాగితే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ పేర్కొంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.