close
సముద్రంలో షికారుకెళ్తే...

సముద్రంలో షికారుకెళ్తే...

ఇంద్రభవనాన్ని తలపించే పదిహేనంతస్తుల ఓడలో ఐదురోజుల ప్రయాణం మిగిల్చిన అనుభూతులనూ ఆ ఓడ గురించిన విశేషాలనూ వివరిస్తున్నారు అమెరికాలోని కనెటికట్‌కు చెందిన సుజాత. ఎప్పటినుంచో నౌకాయానం చేయాలన్నది నా కోరిక. దాంతో రాయల్‌ కరీబియన్‌ వాళ్ల ఆధ్వర్యంలో నడిచే ‘లిబర్టీ ఆఫ్‌ ద సీస్‌’ అనే నౌకలో ఐదు రోజులు ప్రయాణించడానికి టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం. మా నౌకాయానం ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌లో ప్రారంభమైంది. మేం హార్బర్‌కు వెళ్లి సెక్యూరిటీ చెకింగ్‌లన్నీ పూర్తి చేసుకున్నాం.

ఎంత పెద్ద ఓడో..!

మేం ప్రయాణించే ఓడవైపు చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది. 338.91 మీటర్ల పొడవూ 56.08 మీటర్ల వెడల్పులతో చాలా పెద్దగా ఉంది. అందులో 15 అంతస్తులు ఉన్నాయి. మొత్తం 3,634 మంది ప్రయాణించవచ్చు. వాళ్లలో నౌకా సిబ్బంది సంఖ్యే 1360. లోపలకు వెళ్లగానే ఏదో ఇంద్రభవనంలోకి అడుగుపెట్టామా అనిపించింది. క్రిస్మస్‌ సమయం కూడా కావడంతో లోపల అన్నీ విద్యుద్దీప కాంతులతో కూడిన మొక్కలూ పూలూ అలంకరించారు. నిజం చెప్పాలంటే ఇలలో స్వర్గం అంటే ఇదేనా అనిపించేంత అందంగా తీర్చిదిద్దారు. బయల్దేరాల్సిన సమయానికే సాయంత్రం నాలుగున్నర గంటలకే బయల్దేరింది. ఆరుగంటల ప్రాంతంలో కెప్టెన్‌ అందరినీ 4, 5 అంతస్తుల్లోకి రమ్మని చెప్పారు. అందరం అక్కడకు వెళ్లాక నౌకాయానంలో ఎలా ఉండాలీ, నౌకకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను వివరించారు. నౌక ఎక్కేముందే సామాన్లన్నీ సిబ్బందికి అప్పగించేశాం. మనం ముందే బుక్‌ చేసుకున్న గదుల వివరాలు తీసుకుని అక్కడకు చేరుస్తారు. గదులు కేటాయించేముందే నౌకలో ఉన్న అన్ని రోజులూ తినడానికీ తాగడానికీ ఓ క్రెడిట్‌ కార్డులాంటిది ఇచ్చారు. అది చూపిస్తే ఎక్కడైనా ఏదైనా తినొచ్చు, తాగొచ్చు.

ఎక్కడెక్కడ?
నౌకలో మొదటి అంతస్తులో సాధారణ రోగాలన్నింటికీ చికిత్స దొరుకుతుంది. 2వ, 3వ అంతస్తుల్లో సిబ్బంది గదులు ఉన్నాయి. 4వ అంతస్తులో కాసినో, స్టూడియోలు, ఆర్ట్‌ గ్యాలరీలు ఉన్నాయి. 5వ అంతస్తులో రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయి. 6 నుంచి 10 వరకూ విభాగాల వారీగా ప్రయాణికుల గదులు ఉంటాయి. అన్ని అంతస్తులకీ వీలుగా మెట్లూ లిఫ్ట్‌ సౌకర్యాలు ఉన్నాయి. 11వ అంతస్తులో ఈత కొలనులూ, భోజనశాలలతోపాటు స్పా, వ్యాయామశాల కూడా ఉన్నాయి. 12వ అంతస్తులో పిల్లలు ఆడుకోవడానికి రాక్‌ క్లైంబింగ్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టు, వాలీబాల్‌ కోర్టు, సర్ఫింగ్‌ విభాగాలు ఉన్నాయి. ఐస్‌క్రీమ్‌ పార్లర్లు కూడా ఉన్నాయి. ఎంత కావాలన్నా తినొచ్చు. 13వ, 14వ అంతస్తుల్లోనూ పిల్లల ఆటలకోసం విభాగాలు ఉన్నాయి. 15వ అంతస్తును మాత్రం నౌక ప్రధాన సిబ్బందికోసం కేటాయించారు.

ఓడలో ప్రయాణించేవాళ్లంతా కూడా 11వ అంతస్తులోని భోజనశాలలో తింటారు. అందులో ఉదయం 6 నుంచి 11 వరకూ అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ లంచ్‌, రాత్రి 6 నుంచి 9 వరకూ డిన్నర్‌ ఏర్పాట్లు ఉంటాయి. మాంసాహారం, శాకాహారం రెండూ ఉంటాయి. అలాగే ఇండియన్‌, చైనీస్‌, అమెరిన్‌ వంటకాలు ఉంటాయి. పండ్లూ సలాడ్లూ సరేసరి. మొత్తమ్మీద ఓడలో ఆహారానికిగానీ మంచినీళ్లకిగానీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మాకు ఇచ్చిన గది అన్ని సౌకర్యాలతో అందంగా ఉంది. బాల్కనీలో నిలబడితే సముద్రయానాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. టీవీలో కొన్ని ఛానల్స్‌తోపాటు నౌకకి సంబంధించిన ఛానల్‌ ఉంది. అందులో నౌక ఎక్కడ ఉంది, నౌకలో ఆ రోజు ఏం జరుగుతుంది...వంటి సమాచారం ఉంటుంది. రోజూ నౌకలో జరిగే కార్యక్రమాల గురించి రూంబాయ్‌ కూడా ఓ నోట్‌ పెడతాడు. అది చూసుకుని ఆ కార్యక్రమాలకు వెళ్లేవాళ్లం. ఏ ఇబ్బంది కలిగినా ఫోన్‌ చేస్తే సిబ్బంది వస్తారు.

సాయంత్రం స్నాక్స్‌ తినడానికి వెళ్లి నౌక మొత్తం చూసి వచ్చాం. మర్నాడు ఉదయం మా గదికి ఉన్న బాల్కనీలో నిలబడి సాగరంలో సూర్యోదయాన్ని చూశాం. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. నింగికీ నీటికీ తేడా తెలియని ఆ అనంత ప్రకృతిలో అప్పుడే నీళ్లమీదుగా పైకి తేలుతోన్న ఆ బాలభాస్కరుణ్ణి చూస్తే కలిగే ఆనందాన్ని ఏమని వర్ణించగలం? అక్కడ నుంచి కదలాలనిపించకపోయినా మెల్లగా గదిలోకి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని 8.30కల్లా అల్పాహారం ముగించుకుని మళ్లీ నౌక మొత్తం తిరిగాం. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని సాయంత్రం 5వ అంతస్తులో షాపులకు వెళ్లొచ్చాం. రాత్రికి ఐస్‌ స్కేటింగ్‌ షోకి వెళ్లాం. అది చాలా బాగుంది. ప్రతిరోజూ 12వ అంతస్తులో స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర 70, 80లనాటి థీమ్‌ పార్టీలతోపాటు వైట్‌ డ్రెస్‌ కోడ్‌ అనీ ఫార్మల్‌ నైట్‌ అనీ రోజుకో పద్ధతిలో పార్టీలు జరిగేవి. అవయ్యాక మా గది బాల్కనీలో కూర్చుని వెన్నెల్లో తడుస్తూ కెరటాల సవ్వడి వింటూ ఆనందించేవాళ్లం.

ఎంత బుల్లి దేశమో?
ఆ మర్నాడు ఉదయాన్నే అల్పాహారం తీసుకున్నాక బెలిజ్‌ అనే దేశం దగ్గర మా నౌక ఆగుతుందని చెప్పారు. అక్కడ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అయితే అన్నింటికీ వేర్వేరేగా డబ్బులు కట్టాలి. మేం ట్యూబింగ్‌కి కట్టాం. దానికోసం మమ్మల్ని ఉదయాన్నే నౌకలో ఉన్న కింది అంతస్తుకి రమ్మని పిలిచారు. మాలానే ట్యూబింగ్‌ బుక్‌ చేసుకున్న వాళ్లందరికీ ఓ గైడ్‌ని ఏర్పాటుచేశారు. అతను మమ్మల్ని నౌకలోంచి బెలిజ్‌ దేశంలోకి తీసుకువెళ్లాడు. అది చాలా చిన్న దేశం. కానీ చాలా అందమైన దేశం. ఒకప్పుడు అది కూడా బ్రిటిష్‌వాళ్ల పాలనలోనే ఉండేది. 30 ఏళ్ల కిందటే దానికి స్వాతంత్య్రం వచ్చింది. వాళ్ల కరెన్సీమీద మాత్రం ఇప్పటికీ రాణి విక్టోరియా బొమ్మే ఉంటుంది. మేం ట్యూబింగ్‌ చేయాల్సిన ప్రదేశానికి వెళ్లడానికి గంటన్నర సమయం పట్టింది. దారి పొడవునా బస్సులో గైడ్‌ వాళ్ల దేశ విశేషాల గురించి చెబుతూనే ఉన్నాడు. అక్కడ ఎక్కువగా మాట్లాడేది ఇంగ్లిష్‌ అయినప్పటికీ బెలిజియన్‌, స్పానిష్‌ కూడా వాడుకలో ఉన్నాయి. అక్కడ మాయన్‌ నాగరికతా, స్పానిష్‌ సంస్కృతీ కలగలిసి ఉన్నట్లు అనిపించింది. మేం బెలిజ్‌ సిటీ అనే ప్రాంతానికి వెళ్లాం. అక్కడ వర్షపాతం చాలా ఎక్కువ. వాళ్లకు కావలసిన అన్ని పంటలూ వాళ్లే పండించుకుంటారట. సిటీ జనాభా సుమారు 90 వేలు.

ట్యూబింగ్‌ చేశాం...

నది ఒడ్డునే ఉన్న ట్యూబింగ్‌ ప్రాంతానికి చేరగానే మాకు లైఫ్‌ జాకెట్లు, తలకి లైటు ఉన్న హెల్మెట్‌ ఇచ్చారు. కాస్త దూరం నడిచాక ఓ చీకటిగుహలోకి తీసుకెళ్లారు. అక్కడ హెల్మెట్‌ లైటు తప్పనిసరి. ఆ గుహ అంతా సున్నపురాయితో ఉంటుంది. అందులో బయటకన్నా వాతావరణం చాలా చల్లగా ఉంది. ట్యూబింగ్‌ చేస్తున్నంతసేపూ గైడ్‌ మాతోనే ఉండి అన్ని విశేషాలూ చెబుతూ అన్నీ చూపించాడు. ప్రాచీన మాయా కాలంనాటి తొమ్మిది గుహలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. నదీప్రవాహం ఆ గుహల గుండా పారుతుంటుంది. ఆ చీకటి గుహల్లో ఓ పెద్ద టైరులాంటి దానిలో కూర్చొని చేతులతో కొడుతూ ప్రయాణించడమే ట్యూబింగ్‌. అదయ్యాక మళ్లీ మమ్మల్ని ఓడ దగ్గర దింపారు. మేం దగ్గరలో ఉన్న షాపులకెళ్ళొచ్చాం. మేం గదిలోకి వచ్చేసరికి మా గది అంతా చక్కగా సర్ది ఉంది. మంచంమీద తువ్వాలుతో చేసిన కుందేలు బొమ్మ అమర్చి ఉంది. ఒక్కక్షణం దాన్ని చూడగానే నిజం కుందేలా అనిపించింది.

సముద్రంలో నడిచాం...

మర్నాడు మేం మెక్సికోలోని కొసుమెల్‌ నగరానికి వెళ్లాం. ముందురోజులానే మేం స్నార్కలింగ్‌ అనే కార్యక్రమానికి బుక్‌ చేసుకున్నాం. అంటే సముద్రం అడుగున ఉన్న చేపల్నీ ఇతర జీవుల్నీ చూపిస్తారన్నమాట. ముందుగా మమ్మల్ని అందరినీ నౌకలో కింది అంతస్తులోకి రమ్మని అక్కడనుంచి ఓ పడవలోకి ఎక్కించుకుని సముద్రంలోకి తీసుకెళ్లారు. లైఫ్‌జాకెట్లు ఇచ్చి అది ఎలా వేసుకోవాలో చెప్పారు. కళ్లజోడూ నోటికి ఓ గొట్టంలాంటిదీ కూడా ఇచ్చారు. ఆ బెంట్‌ గొట్టంతోనే శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్లలోకి దిగినప్పుడు ముఖం కిందకి పెట్టాలి. అలా చేస్తేనే ఆ గొట్టంతో వూపిరి అందుతుంది.

గైడ్‌ కూడా మాతోనే ఉండి సముద్రంలోపల ఉన్న రకరకాల చేపల్నీ ఇతర సముద్ర జీవుల్నీ చూపించాడు. సముద్రంలో అలా చేపల్లా ఈదుకుంటూ వెళ్లే ఆ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేం. నీళ్లంటే భయపడేవాళ్లు గైడ్‌కి చెబితే అతను పక్కనే ఉండి చేయి పట్టుకుని మనకు చూపిస్తాడు. సముద్రం లోపల రంగురంగుల చేపలు అటూఇటూ తిరుగుతూ ఉంటే ఓ క్షణం నేను సముద్రంలోనే ఉన్నానా లేక ఏ డిస్కవరీ ఛానెలో చూస్తున్నానా అనిపించింది. ఓ గంట తరవాత మళ్లీ పడవ ఎక్కి, సముద్రంలో మరో చోటుకి వెళ్లాం. అక్కడ ఇంకా చాలా రకాల చేపలని చూశాం. రెండు గంటలపాటు అలా ఎంజాయ్‌ చేశాక పైకి వచ్చాం. అక్కడ మా అందరికీ శీతలపానీయాలు ఇచ్చి మా నౌక దగ్గర దింపారు. మళ్లీ మేం గదికి వచ్చేసరికి అది చక్కగా అలంకరించి ఉంది. ఈసారి మంచంమీద తువ్వాలుని ఏనుగులా చుట్టి ఉంచారు.

ఓడలో పరుగులు!

భోజనాలు చేశాక నౌక బయలుదేరడానికి ఐదు గంటల సమయం ఉంది అని చెప్పడంతో చుట్టుపక్కల ప్రాంతాలు చూడ్డానికి వెళ్లాం. రెండు మైళ్ల దూరంలో డౌన్‌ టౌన్‌ ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్లి చిన్నచిన్న వస్తువులు కొన్నాం. ఆ రాత్రికి భోజనాలు ముగించుకుని ఐదో అంతస్తులోని షాపులకు వెళ్లి వచ్చాం.

మర్నాడు ఉదయాన్నే అల్పాహారం ముగించుకున్నాక నౌకా విశేషాల నోట్‌ చూసుకుని పది గంటలకు తువ్వాళ్లతో బొమ్మలు ఎలా చేస్తారో చూపించే కార్యక్రమం చూడ్డానికి వెళ్లాం. అక్కడ కుక్క, గొరిల్లా, గబ్బిలం, హంస.. ఇలా అన్నీ చూపించారు. తరవాత నౌకలో పరుగుపెట్టడానికి ఏర్పాటుచేసిన లైన్లమీద ఓ మైలు దూరం నడిచాం. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. భోజనాలు చేశాక 13వ అంతస్తులోని రాక్‌ క్లైంబింగ్‌, సర్ఫింగ్‌, పూల్‌ వాలీబాల్‌ ఆటలతో సరదాగా గడిపాం. నౌకలో ఫొటోలు తీసేవాళ్లతో మనం ఫొటోలు తీయించుకోవచ్చు. అలా తీసినవాటిని 4వ అంతస్తులో పెడతారు. వెళ్లి చూసుకుని నచ్చితే కొనుక్కోవచ్చు. లేదంటే వదిలేయవచ్చు. రాత్రికి 4వ అంతస్తులోని కాసినోకి వెళ్లి కాసేపు గడిపాం. ఆ రోజు మా ప్రయాణంలో చివరిరోజు కాబట్టి నౌకా సిబ్బంది అందరికీ చేయాల్సిన పనుల గురించి ముందుగానే చెప్పారు. నౌకాసిబ్బందితో సామాన్లు తెప్పించుకునేవాళ్లు ఆ ట్యాగ్‌ నింపి గది బయట పెట్టేస్తే అది వాళ్లు తీసుకుని మర్నాడు మన సామాన్లని భద్రంగా అందిస్తారు. మర్నాడు ఏడుగంటలకల్లా ఫ్లోరిడాకి చేరుకున్నాం. కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం తిని బయటకొచ్చాం. తనిఖీలన్నీ ముగించుకుని టాక్సీలో ఇంటికి చేరాం. ఇంతకుముందు ఎన్నో ప్రదేశాలకు వెళ్లినప్పుడు కలగని ఆనందం ఏదో ఈ నౌకాయానంలో ఉందనిపించింది. నావికులు సముద్రంలో ఎలా జీవిస్తారా అనిపించేది. కానీ సకల సౌకర్యాలూ ఉంటే అన్ని ప్రయాణాలకన్నా సముద్రయానమే హాయి... హాయి..!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.