close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమరనాథుడి దర్శనం!

అద్వితీయం... అమరనాథుడి దర్శనం!

‘అదో రాతి గుహ... దానిమీదగానీ ఆ చుట్టుపక్కలగానీ ఎక్కడా మంచులేదు. కానీ గుహలోపల ఉన్న శిలావేదికమీద ఏ బ్రహ్మదేవుడో మంచుతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించినట్లుగా ధవళకాంతితో వెలిగిపోయే హిమలింగం... మహిమాన్వితమైన శివలింగం. అపురూపమైన ఆ అమరలింగ దర్శనం కోసమే అత్యంత కష్టమైన ఆ యాత్రకు సన్నద్ధమవుతారు భక్తులు... అదే అమరనాథ్‌ యాత్ర...’ అంటూ ఆ విశేషాలను వివరిస్తున్నారు కడపకు చెందిన కె.ఎల్‌.సంపత్‌కుమార్‌.

మార్గమధ్యంలో వచ్చే అడ్డంకులన్నింటినీ శివనామస్మరణతో అధిగమించగలమన్న నమ్మకంతో గతేడాది మేం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరాం. లింగ రూపంలో ఉన్న శివశక్తిని పూజించడం అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం అని మహాభారతంలో పేర్కొన్నాడు వేదవ్యాసుడు. ఏటా ఆషాడమాస శుక్ల పాడ్యమి నుంచి శ్రావణమాస శుక్ల పౌర్ణమి వరకూ భక్తులను ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ యాత్ర ఎన్ని రోజుల వరకూ ఉంటుందనేది వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది జులై రెండు నుంచి ఆగస్టు 29 వరకూ యాత్రకు అనుమతి ఉంది. అంటే 59 రోజులు. అయితే యాత్ర ప్రారంభ దినాల్లో వెళితేనే హిమలింగం పెద్దదిగా దర్శనమిస్తుంది. యాత్ర సమాప్తమయ్యే సమయానికి క్రమంగా మంచు కరిగి లింగాకారం అదృశ్యమైపోతుంది. మేం యాత్ర మొదలుపెట్టిన రెండో రోజునే హిమలింగ దర్శనంకోసం ఏర్పాట్లు చేసుకున్నాం. జనవరి తరవాత ప్రభుత్వం ఈ యాత్రా తేదీలను ఆయా వెబ్‌సైట్లలోనూ పత్రికల్లోనూ ప్రకటిస్తుంది. మనం అమరనాథ్‌జీ ట్రస్టువారి వెబ్‌సైట్‌ (www.shriamarnathjishrine.com) లోకి వెళితే అన్ని వివరాలూ తెలుసుకోవచ్చు.

ఖీర్‌ భవానీ...
జూన్‌ 22వతేదీన బెంగళూరు-నిజాముద్దీను రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో అనంతపురం నుంచి బయలుదేరి 24వ తేదీన దిల్లీకి చేరుకున్నాం. జమ్మూ- కాట్రాలోని వైష్ణోదేవి మాతా దర్శనం చేసుకున్నాం. 27వ తేదీ సాయంకాలానికి బస్సులో శ్రీనగర్‌ చేరాం. మర్నాడు ఉదయాన్నే ఉపాహారం తీసుకుని శ్రీనగర్‌ నుంచి అమరనాథ్‌ యాత్రకు బయలుదేరాం. దారిలో గండర్‌బాల్‌, కంగన్‌, గుండ్‌ మొదలైన గ్రామాలమీదుగా దాదాపు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులాములా అనే గ్రామం చేరుకున్నాం. అక్కడి ఖీర్‌భవానీ దేవాలయం కాశ్మీరు ప్రాంతంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ఒకటి. సహజమైన ఓ మంచునీటి బుగ్గతో ఏర్పడిన సరస్సు మధ్యలో ఈ ఆలయాన్ని చలువరాతితో నిర్మించారు. గర్భగుడిమీద బంగారు గుమ్మటం చూడ్డానికి ఎంతో బాగుంటుంది. గుడిలోని తులామాయిని పార్వతీదేవి అంశగా బావిస్తారు. ఈ దేవతకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ దేవతను ఖీర్‌ భవానీగా పిలుస్తారు. ఇక్కడి సరస్సులోని నీరు స్వచ్ఛంగా స్ఫటికంలా మెరుస్తూ కనిపిస్తుంది. ఆ నీటి రంగు మారితే కాశ్మీరుకి విపత్తు సంభవిస్తుందన్నది స్థానికుల విశ్వాసం. చివరిసారిగా కార్గిల్‌ యుద్ధ సమయంలో నీరు ఎరుపురంగులోకి మారిందని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో చీనార్‌ వృక్షాలు చాలానే ఉన్నాయి. పక్కపక్కనే ఉన్న రెండు చీనార్‌ వృక్షాల శిఖరాగ్రాల మధ్య భారతదేశపటం కనిపిస్తుంటుంది.

బంగారు రాదారి!
ఖీర్‌ భవానీ ఆలయంలో దాదాపు గంటసేపు ఉన్నాం. మధ్యాహ్న సమయానికి శ్రీనగర్‌ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొనేమార్గ్‌ చేరుకున్నాం. దారి పొడవునా ఓ వైపు సింధు నది, మరోవైపు హర్ముఖ పర్వత శ్రేణులూ... ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. సోనేమార్గ్‌ అంటే బంగారు పచ్చిక బయళ్లు ఉన్న రహదారి అని అర్థం. ఇది సముద్రమట్టానికి దాదాపు 2730 మీటర్ల ఎత్తులో ఉన్న అత్యంత అందమైన ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా పర్వతాలే. వాటి శిఖరాగ్రాలమీద మంచు మెరుస్తూ కనిపిస్తుంది. పూలతో నిండిన ఆల్విన్‌ వృక్షాలూ, చీనార్‌ చెట్లతో నిండిన పర్వతలోయలతో ఆ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంది. శిఖరాగ్రాలమీద ఉన్న మంచు కరిగి చిన్న చిన్న జలపాతాలు ఏర్పడి చూపరులను కట్టిపడేస్తుంటాయి. ఇక్కడి గడ్సర్‌, సట్సర్‌ సరస్సులు ఎంతో నిర్మలంగా ఉంటాయి. ఇక్కడి తేజివ్యాస్‌ అనే హిమానీనదం వేసవికాలంలో పర్యటకులకు అద్భుతమైన విడిదిగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే లఢక్‌కు వెళ్లే జోజిల్లా లోయ మార్గం ప్రారంభమవుతుంది. ఇక్కడి సింధునదీ తీరాన ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసి సాయంకాలం నాలుగు గంటలకు బాల్టాల్‌ అనే గ్రామం చేరుకున్నాం. అమరనాథ గుహ చేరడానికి ఇదే మా బేస్‌ క్యాంపు.

పవిత్రగుహను చేరాలంటే...
ఆ పవిత్ర గుహను చేరడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది పహల్‌గావ్‌ను బేస్‌క్యాంపుగా చేసుకుని వెళ్లేది. రెండోది బాల్టాల్‌ మీదుగా వెళ్లేది. పహల్‌గావ్‌ మార్గంలో గుహను చేరడానికి 47 కిలోమీటర్లు ప్రయాణించాలి. పరమశివుడు పార్వతీదేవిని ఈ మార్గం ద్వారానే తీసుకెళ్లి గుహలో తన అమరకథను వినిపించాడనీ, ఈ పహల్‌గావ్‌ దగ్గర తన వాహనమైన నందీశ్వరుడిని వదిలి నడక ద్వారా గుహను చేరాడనీ పురాణ కథనం. పహల్‌గావ్‌ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందనవాలీలో పరమశివుడు తన శిఖలోని చంద్రవంకని వదిలాడని అంటారు. అక్కడే మొదటిరాత్రి మజిలీ చేస్తారు. తరవాత 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషనాగ్‌ అనే సరస్సు ఒడ్డున శివుడు తన ఆభరణాలైన సర్పాలను వదిలాడట. అక్కడే రెండో రాత్రి మజిలీ. తరవాత మార్గంలో ఉన్న మహాగుణాస్‌ అనే పర్వతశిఖరాన వినాయకుడినీ, పంచతరణి వద్ద పంచ భూతాలనూ విడిచాడనీ అంటారు. ఇక్కడే మూడో మజిలీ. శంకరుని శిరస్సులోని ఐదు పాయల నుంచి జలధారలు ఐదు నదులుగా బయటకు వచ్చి ఏకనదిగా ప్రవహించాయనీ, అదే ఈ పంచ తరణి అనీ అంటారు. మహాగుణాస్‌ పర్వతశిఖరం ఎత్తు 14,800 అడుగులు. అక్కడ ఆక్సిజన్‌ సాంద్రత చాలా తక్కువ. కాబట్టి యాత్రికులు ఆరోగ్యవంతులైతేనే ఈ యాత్రకు బయలుదేరాలి. పంచతరణి నుంచి నాలుగోరోజున ఏడు కిలోమీటర్లు నడిస్తే అమరనాథగుహ వస్తుంది. దారిలో పంచతరణి, అమరావతి అనే నదులు కలిసే ప్రాంతం వస్తుంది. దీన్ని సంగం అని వ్యవహరిస్తారు. ఇక్కడే పరమశివుడు పార్వతీదేవి సమేతంగా స్నానం చేసి గుహలోకి ప్రవేశిస్తాడు. ఎవరూ తన అమరకథను వినకూడదనే ఉద్దేశంతో గుహ చుట్టూ కాలాగ్నిని సృష్టించాడనీ దాంతో గుహ చుట్టూ ఉన్న ప్రాంతం భస్మమైందనీ అంటారు. అందుకే ఇప్పటికీ గుహ చుట్టూ ఉన్న నేల తెల్లగా భస్మం రూపంలో ఉంటుంది. అలాంటి ఏకాంత ప్రదేశంలో శంకరుడు తన అమరకథను పార్వతీదేవికి వినిపించాడు. కానీ యాదృచ్ఛికంగా కాలాగ్నికి భయపడి ఆ గుహలో తలదాచుకున్న పావురాల జంట, ఆ కథను విని అమరత్వం పొందాయన్నది పౌరాణిక కథనం. ఇప్పటికీ ఆ పావురాల జంటను అక్కడ చూడవచ్చు.

బాల్టాల్‌ మార్గంలో...
దగ్గరదారి కావడంతో మేం బాల్టాల్‌ మార్గాన్ని ఎంచుకున్నాం. సాయంకాలం నాలుగు గంటలకు మా బస్సు బాల్టాల్‌ చేరింది. అక్కడ మాకు మా ట్రావెల్‌ ఏజెన్సీవారు ముందుగా ఏర్పాటుచేసిన టెంట్లలో వసతి కల్పించారు. అక్కడకు వెళ్లే సమయానికే దేశం నలుమూలలనుంచీ వచ్చిన స్వచ్ఛంద సేవాసంస్థల సభ్యులు ఉన్నారు. వాళ్లు యాత్రికుల సౌకర్యార్థం ఎన్నో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటినే ‘భాండార్‌’లని పిలుస్తారు. మేమంతా అక్కడే తిన్నాం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఓ సేవా సంస్థ గత 14 సంవత్సరాలుగా ఓ ఉచిత భోజనశాలను నిర్వహిస్తోంది. అక్కడ నుంచి అమరనాథగుహ దూరం 14 కిలోమీటర్లు. మా బృందంలోని 36 మంది యాత్రికుల్లో 28 మంది డోలీల్లోనూ, ఏడుగురు గుర్రాలమీదా, ఒకరు మాత్రం కాలిబాటనా వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. మర్నాడు వేకువజామునే మేం కాలకృత్యాలు తీర్చుకుని, దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని డొమాయిల్‌లో ఉన్న నీల్‌గ్రధ్‌ ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాం. ఉదయం అయిదు గంటల సమయానికి ఆ ప్రవేశద్వారాలు తెరిచారు. మా యాత్రా పర్మిట్లను పరిశీలించి అక్కడి సరిహద్దు రక్షణ సిబ్బంది మమ్మల్ని అమరనాథయాత్రకు అనుమతించారు. వెళ్లేదారిలో మంచినీళ్లూ, కాఫీ, టీలూ, తినడానికీ దొరుకుతాయి. ఎక్కడ మంచుపడుతుందో ఎప్పుడు వాన కురుస్తుందో తెలియదు కాబట్టి రెయిన్‌కోట్లూ, గొడుగులూ, ఉన్నిదుస్తులూ తీసుకెళ్లడం శ్రేయస్కరం. దారిపొడవునా సైనిక సిబ్బంది ఉంటారు. ఎత్తుకు వెళ్లేకొద్దీ మంచు ముసుగేసుకున్న పర్వతశిఖర సౌందర్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. దారిపొడవునా హిమానీ నదాలూ, నదులూ, చిన్న చిన్న జలపాతాలూ పలకరిస్తూ ఆహ్లాదాన్ని పంచిస్తాయి. నాలుగున్నర కిలోమీటర్ల దూరం గడ్డకట్టిన మంచుమీదే నడవాల్సి వచ్చింది. దాదాపు పది గంటల సమయానికి సంగం చేరాం. ఢోలీలో వెళ్లినా, గుర్రాలమీదెక్కినా అందరూ కూడా సంగం దగ్గర నుంచి రెండున్నర కిలోమీటర్లు నడవాల్సిందే. సంగం నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచాక సుమారు 300 మెట్లు ఎక్కి ఆ పవిత్రగుహను చేరుకున్నాం. ఇది సముద్రమట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. 60 అడుగుల పొడవూ, 30 అడుగుల వెడల్పూ, 15 అడుగుల ఎత్తూ ఉన్న ఆ గుహలోకి వెళ్లగానే కనిపించిన ఆ హిమలింగం, మమ్మల్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. దానికి పక్కనే మంచుతో ఏర్పడిన మరో రెండు చిన్న విగ్రహాలు కూడా కనిపించాయి. వీటిని పార్వతీదేవి, గణేశ మూర్తులుగా భావిస్తారు. ఆ పవిత్ర అమరనాథ గుహలో ఓ పావురాల జంటను చూశాం. నిజంగా సముద్రమట్టానికి అంత ఎత్తైన ప్రదేశంలో ఆ మంచు శిఖరాల మధ్య, సంవత్సరంలో దాదాపు 10 నెలలపాటు మనుష్య సంచారమే లేని చోట, ఆ పావురాలు అక్కడ ఉండటం ఆశ్చర్యకరమే. ‘ఏ జన్మ పుణ్యఫలమో ఆ అమరలింగేశ్వరుని దర్శించుకోగలిగాం’ అన్న సంతృప్తితో మేం వెనుతిరిగి సంగం వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది. బాల్టాల్‌ చేరేసరికి సాయంత్రం ఆరుగంటలు... ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని మర్నాడు ఉదయమే బస్సులో శ్రీనగర్‌కు తిరిగివచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.