close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడ ట్రాఫిక్‌ లైట్లు ఉండవు!

అక్కడ ట్రాఫిక్‌ లైట్లు ఉండవు!

‘ట్రాఫిక్‌ లైట్లు లేని దేశ రాజధాని నగరాన్ని ఎవరూ ­హించ లేరు కదా. కానీ అలాంటి నగరమూ ఉంది. కూడళ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కట్టిన అందమైన నిర్మాణంలో తెల్లని గ్లోవ్స్‌ వేసుకున్న పోలీసు చేయి ఎప్పుడు ­పుతాడా అని అక్కడి వాహనదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పాదచారులు వెళుతుంటే ఎవరూ ఆగమని చెప్పకుండానే కారును టక్కున ఆపేసే గొప్ప చోదకులు. వాళ్లే భూటాన్‌ వాసులు...’ అంటూ అక్కడి మనుషుల గురించీ ఆ ప్రాంత విశేషాల గురించీ వివరిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ముదిగంటి సుజాతారెడ్డి.

మేం ఐదుగురు స్నేహితులం. సారా, సునీత, యశోధర, నూర్జహాను, నేను కలిసి భూటాన్‌, సిక్కింలను సందర్శించడానికి బయలుదేరాం. మాతోబాటు ఇంకో ఇరవై ఒక్కమంది సందర్శకులూ ముగ్గురు వంటవాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలెక్కి రెండు రోజులు ప్రయాణం చేసి న్యూజల్‌పాయ్‌గుడి స్టేషన్‌ చేరుకున్నాం. పశ్చిమబెంగాల్‌కు ఉత్తరాన ఉన్న జల్‌పాయిగుడి నుంచే సిక్కిం, భూటాన్‌ వెళ్లే మార్గాలున్నాయి. ఆ రాత్రి జల్‌పాయిగుడి హోటల్‌లో ఉండి తెల్లవారి బస్సులో భూటాన్‌ బయలుదేరాం. భూటాన్‌ సరిహద్దులో ఉన్న జైగావ్‌కు ఆనుకునే ఫెంట్‌షోలింగ్‌ అనే పట్టణం ఉంది. ఇక్కడే మా ఐడీ కార్డులు చూపిస్తే భూటాన్‌కు వీసాలు ఇచ్చారు. ఆ రాత్రి అక్కడే హోటల్‌ ఆర్కిడ్‌లో ఉండి తెల్లవారుజామున రెండు చిన్న బస్సుల్లో భూటాన్‌ బయలుదేరాం. అక్కణ్ణుంచి భూటాన్‌ రాజధాని ‘థింఫు’కు సుదీర్ఘప్రయాణం.

వంద రూపాయలు చాలా తక్కువ!
భూటాన్‌ హిమాలయ పర్వతాలతో నిండిన భూభాగం. బస్సులో నుంచి చూస్తే ఎత్తైన పర్వతాలూ సమున్నతంగా లేచిన పర్వత శిఖరాలూ అంతం కనిపించని లోయలూ వాటినిండా పొదలూ వృక్షాలూ... రోడ్డుపక్కన ఉన్న ఎత్తయిన చెట్లు చూడాలంటే తలలు ఎత్తి చూడాల్సిందే. ఆ పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ సాయంత్రానికి థింఫూ నగరానికి చేరుకున్నాం. ఇదే భూటాన్‌ రాజధాని నగరం. చాలా చిన్నది. జనాభా కేవలం 20 వేలే. ఇక్కడే రాజకుటుంబీకులు నివసించే అధికార భవనం కూడా ఉంది. హోటల్‌లో దిగి కొందరు విశ్రాంతి తీసుకుంటే మిగిలినవాళ్లం షాపింగ్‌కు బయలుదేరాం. భూటాన్‌లో చైనాలో తయారైన వస్తువులేగాక బంగ్లాదేశ్‌లో తయారైన నాణ్యమైన దుస్తులు కూడా దొరుకుతాయి. భూటాన్‌ కరెన్సీని గుల్ట్రమ్‌ అని పిలుస్తారు. దీని విలువ భారతీయ రూపాయితో సమానం. భూటాన్‌లో మన డబ్బులు తీసుకుంటారుగానీ తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ల కరెన్సీ నోట్లనే ఇస్తారు. అక్కడ వస్తువుల ధర వంద రూపాయలతోనే ఆరంభమవుతుందా అనిపించింది. ఎందుకంటే వంద రూపాయలకు తక్కువ ధర ఉన్న వస్తువులే కనిపించలేదు. అక్కడ తయారైన హస్తకళాకృతుల దుకాణాలు చాలానే ఉన్నాయి. కానీ ధరలు మాత్రం చాలా ఎక్కువే.

నవ్వుతూనే ఉంటారు...
ఎటు చూసినా పచ్చని కొండలూ లోయలతో నిండిన అందమైన బుల్లి దేశమే భూటాన్‌. సుమారు 38వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ దేశ జనాభా దాదాపు ఎనిమిది లక్షలలోపే. వాళ్లకి పరిశుభ్రత చాలా ఎక్కువ. బోట్‌- అంత్‌ (టిబెట్‌ అంత్య భాగం అని అర్థం) అన్న సంస్కృత శబ్దమే భూటాన్‌గా మారిందట. భూటాన్‌ వాసులకు సోమరితనం అస్సలు ఉండదు. క్రమశిక్షణతో సౌమ్యంగా కనిపిస్తారు. వాళ్ల నవ్వు మొహాలే ఆ దేశానికి అలంకారాలు. అందుకే ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉండే దేశాల్లో అదీ ఒకటి. అక్కడి రోడ్లు సన్నగా ఉంటాయి. అందుకేనేమో కార్లు కూడా అన్నీ చిన్నగానే ఉన్నాయి. ఎంతదూరమైనా నడిచి వెళ్లడం భూటాన్‌ ప్రజల అలవాటు. అదే వాళ్లను ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.

థింఫూ నగరం చూడ్డానికి చాలా అందంగా ఉంది. భూటాన్‌లో భవంతులన్నీ ప్రత్యేకమైన వాస్తుశైలితో కనిపిస్తాయి. నగిషీలు చెక్కిన చెక్క తలుపులూ కిటికీలమీద చూడచక్కని చిత్రాలూ వాళ్ల కళానైపుణ్యానికీ సౌందర్య దృష్టికీ అద్దం పడతాయి. వేర్వేరు జాతులకు చెందిన 23 భాషలు భూటాన్‌లో ఉన్నాయి. 1907లో వాంగ్‌చుంగ్‌ అనే నాయకుడు ఆ జాతులన్నింటినీ ఏకం చేసి తాను రాజు అయ్యాడు. అప్పట్నుంచీ భూటాన్‌ రాచరికపాలనలోకి వచ్చి ఓ దేశంగా గుర్తింపుపొందింది. ఎన్నో రాజ్యాలను చేజిక్కించుకున్న బ్రిటిష్‌వాళ్లు భూటాన్‌ను మాత్రం తమ పాలనలోకి తెచ్చుకోలేకపోయారు. బహుశా దోచుకోదగ్గ సంపదేమీ ఆ కొండల్లో కనిపించలేదేమో. ప్రస్తుతం భూటాన్‌ పార్లమెంట్‌ పాలనలోనే ఉంది. రాజు సర్వోన్నత పదవిలో ఉన్నా ఇంగ్లాండ్‌ తరహా ప్రజాస్వామ్యపాలన ఉంది.

ప్రజల్లో 80 శాతం బౌద్ధులు కాగా పదిహేను శాతం హిందువులు. ఐదుశాతం క్రిస్టియన్లూ ముస్లింలూ... ఇలా అన్య మతస్తులూ ఉన్నారు. మతమేదయినా భూటాన్‌ ప్రజలంతా ప్రశాంత స్వభావం కలవారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. క్రీ.శ. ఏడో శతాబ్దంలో టిబెట్‌ను పాలించిన సాంగ్‌సాన్‌ గోంపో కారణంగానే భూటాన్‌లోకి బౌద్ధం ప్రవేశించింది.

అమ్మాయిలే వారసులు!
అక్కడి కుటుంబ వ్యవస్థ మాత్రం కాస్త విభిన్నంగా అనిపించింది. అమ్మాయిలే వాళ్లకు వారసులు. తల్లిదండ్రుల ఇల్లు అమ్మాయిలకే చెందుతుంది. అబ్బాయి తనకి తాను స్వయంగా బతకాల్సిందే. ఎక్కువమంది భార్య ఇంటికే వెళ్లిపోతారు. ప్రేమ పెళ్లిళ్లు ఉన్నప్పటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలే ఇప్పటికీ అక్కడి సంప్రదాయం. బహుభార్యత్వం అక్కడ ఆమోదించదగ్గ విషయమే. గతంలో పాలించిన జిగ్మె సింఘె వాంగ్‌చుక్‌కి నలుగురు భార్యలు. అందరూ అక్కచెల్లెళ్లే. భూటాన్‌లో ధూమపానం నిషేధం. టొబాకొ యాక్ట్‌ ఆఫ్‌ 2010ను అనుసరించి ప్రపంచంలో పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఇదే. ఇక్కడ ఎక్కువగా ఎర్రబియ్యాన్నే పండిస్తారు. వాటినే తింటారు.

ప్రేమనదులు!
థింఫూలో మూడు రోజులు ఉన్నాం. అక్కడి నుంచే ఒకరోజు పునాఖా పట్టణాన్ని కూడా చూసి వచ్చాం. థింఫూ నగరానికి పూర్వం పునాఖా భూటాన్‌ రాజధానిగా ఉండేది. అది కూడా అందమైన నగరం. ఇక్కడే మాచో, పోచా అనే నదుల సంగమ ప్రదేశం ఉంది. మాచో, పోచోలు ప్రేమికులని భూటాన్‌ ప్రజల విశ్వాసం. వాళ్ల కలయికే ఈ సంగమం. థింఫూ నుంచి పునాఖాకు కేవలం 72 కిలోమీటర్లే దూరం. అయినప్పటికీ వాతావరణంలో రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ వేసవిలో చాలా వేడిగానూ చలికాలంలో నులివెచ్చగానూ ఉంటుందట.

నాలుగ్గంటలకే నల్లమబ్బులు!
భూటాన్‌లో ఎప్పుడు చూసినా ఆకాశంలో మబ్బులు నృత్యం చేస్తున్నట్లే ఉంటాయి. పైగా అవి కొండలకు కిందుగా కనిపిస్తూ మనల్ని అచ్చెరువొందిస్తాయి. నేలమీద సెలయేళ్లు గలగలా పారుతూ నదులు ఉరకలెత్తుతూ కనిపిస్తాయి. అందుకే అక్కడ నీటి కరవూ కరెంటు కోతలూ ఉండవు. ఈ రెండూ వినగానే ఆ దేశం నిజంగా స్వర్గమే అనిపించింది.

పునాఖాలో పరిపాలనా భవనాన్ని చూసి, మేం తిరిగివచ్చేటప్పుడు సాయంత్రం నాలుగే అయింది. ఆ సమయానికే నల్లని మేఘాలు ఆవరించి జల్లులు మొదలయ్యాయి. దానికి తోడు పొగమంచు. ఒకవైపు ఏ లోయలో బస్సు పడిపోతుందోనన్న ఆందోళన వెంటాడినా, మరోవైపు ఆ వాతావరణంలో ప్రయాణం థ్రిల్లింగ్‌గానూ ఆనందంగానూ అనిపించింది. అదే భూటాన్‌ గొప్పతనం.

గురు రింపోచే బౌద్ధారామం!
మేం బస్సులోనుంచే పారో కొండను సందర్శించాం. ఎనిమిదో శతాబ్దానికి చెందిన గురు రింపోచే (గురు పద్మశాంభవ) ఆడపులిమీదెక్కి పారోలోని ఎత్తైన ఓ కొండమీదకు వెళ్లి అక్కడ ఉన్న స్థానిక రాక్షసుణ్ణి అంతమొందించి, అక్కడే కొన్ని నెలలపాటు ధ్యానం చేశాడట. ఆయన ఆవాసం ఏర్పరచుకున్న ఆ ప్రాంతంలోనే ఆ బౌద్ధగురువు ఆరామాన్ని నిర్మించారు. భూటాన్‌లోని పవిత్ర స్థలాల్లో ఇదీ ఒకటి. దీన్నే తగత్‌ షాంగ్‌ గోంఫా లేదా టైగర్స్‌ నెస్ట్‌ మొనాస్ట్రీ అనీ పిలుస్తారు. కానీ మేం అంత ఎత్తుకి ఎక్కలేక వెళ్లలేదు. దాని సమీపంలో కొండ దిగువన కూడా బౌద్ధగురు పద్మశాంభవ దేవాలయం ఉంది. భారతీయుడైన పద్మశాంభవ గురు భూటాన్‌లో బౌద్ధమతాన్ని వ్యాపింపజేశాడనీ ఆయన తరవాత పాకిస్తాన్‌ నుంచి ఉదయన అనే బౌద్ధగురువు కూడా వచ్చి ప్రచారం చేశాడనీ ఆలయంలోని బౌద్ధసన్యాసి చెప్పాడు. కానీ భూటాన్‌లో పద్మశాంభవుని గుడులే కనిపిస్తాయి.

మర్నాడు థింఫూలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్‌కు వెళ్లాం. అక్కడ మనదగ్గర దొరికే అన్ని రకాల కూరగాయలూ దొరుకుతాయి. ఆపిల్‌, పియర్స్‌, పీచ్‌, అరటి...వంటి పండ్లన్నీ ఉన్నాయి. థింఫూలో చూడదగ్గ మరో అతిముఖ్య ప్రదేశమే టాషిచొజాంగ్‌ కోట. ఇది నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిపాలనా భవనాల్లో ఇదే ప్రధానమైనది. రాజసింహాసనం కూడా ఇక్కడే ఉంటుంది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఎక్కువగా ఇక్కడే ఉంటాయి.

అక్కడి నుంచి భూటాన్‌ జాతీయ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాం. అక్కడ వాళ్ల జాతీయ జంతువు టాకిన్‌ను చూశాం. అది గొర్రె-ఆవు రూపాల సమ్మేళనంగా అనిపించింది. హిమాలయాలకు చెందిన ఈ జంతువు ఒక్క ఈ ప్రాంతంలోనే కనిపిస్తుందట.

అతి పెద్ద బౌద్ధ విగ్రహం!
థింఫూ దగ్గరలోనే ఉన్న ఎత్తైన కొండమీద భారీ బుద్ధుని విగ్రహాన్ని నిర్మించారు. దీన్ని చైనా దేశం భూటాన్‌కు బహుమతిగా అందించిందట. 169 అడుగుల ఎత్తైన ఇత్తడి విగ్రహం ఇది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బౌద్ధ విగ్రహం ఇదే. ఈ ఒక్క విగ్రహం నిర్మాణానికే సుమారు 282 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. బుద్ధుడు పద్మాసనంలో ఉన్న ఈ విగ్రహం బంగారుపూతతో చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. దీన్ని చూడ్డానికే పర్యటకులు ఎందరో ఇక్కడకు వస్తారు. ఈ విగ్రహంతోబాటు ఎనిమిది అంగుళాల ఎత్తున్న విగ్రహాలు లక్షా, 12 అంగుళాల ఎత్తున్న విగ్రహాలు ఇరవై అయిదు వేలూ అక్కడ రూపొందిస్తున్నారు. వీటన్నింటినీ రాగితో చేసి వాటికి బంగారుపూత పూసి ప్రతిష్ఠిస్తారట. ఇవి పర్యటకులను మంత్రముగ్థులను చేస్తున్నాయి. అక్కడ ఉన్న ఓ బోర్డుమీద దీన్ని ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంగా పేర్కొన్నారు. బుద్ధా పాయింట్‌గా పిలిచే ఈ మెగా ప్రాజెక్టు కోసం సుమారు ఆరువందలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట. అక్కడ ఎటుచూసినా కాషాయం, ముదురు ఎరుపురంగు దుస్తులు ధరించినబౌద్ధ సన్యాసులు కనిపిస్తారు. వాళ్లు నివసించడానికి అక్కడ ఎన్నో మొనాస్ట్రీలు ఉన్నాయి. అక్కడి నుంచి జైగావ్‌ ద్వారా మేం సిక్కిం చేరుకున్నాం. అక్కడ చూడదగ్గవన్నీ చూసి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.