close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అడుగు తడబడితే అగాథంలోకే..!

అడుగు తడబడితే అగాథంలోకే..!

‘మంచునదిమీద అడుగులేయాలి. కొండల అంచుల్లో ప్రయాణించాలి. లోయల్లో ప్రవహించే నదులను దాటాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే కొండలమీద నుంచి వీచే చలిగాలులను తట్టుకుంటూ ముందుకు సాగడం మరో ఎత్తు. అయితేనేం, ఆ కష్టనష్టాలన్నీ ఆ అద్భుత దృశ్యాన్ని చేరుకునేవరకే. గంగమ్మ దివి నుంచి భువికి దిగిన ఆ ప్రదేశాన్ని చూడగానే అన్నీ మరచిపోతాం... ఆ అద్భుత ప్రకృతిలో మైమరిచిపోతాం...’ అంటూ గంగోత్రి నుంచి గోముఖ్‌ వరకూ సాగిన తమ సాహస ప్రయాణం గురించి చెప్పుకొస్తున్నారు ఖమ్మంవాసి కె. ప్రభాకర్‌ రావు.

ఉత్తరాఖండ్‌లో ఉన్న చార్‌థామ్‌లో ఒకటైన గంగోత్రి నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ముందుగా రుషీకేశ్‌ నుంచి సుమారు ఆరు గంటలు ప్రయాణం చేసి ఉత్తరకాశీ చేరుకున్నాం. అక్కడ నుంచి మరో ఆరు గంటలపాటు గంగానది వెంబడే ప్రయాణించాక గంగోత్రికి చేరుకున్నాం. ఇది సముద్ర మట్టానికి సుమారు పదివేల అడుగుల ఎత్తులో ఉంది. గంగానదీ జన్మస్థానమైన గోముఖ్‌, గంగోత్రికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన యాత్ర. అందరూ అక్కడకు వెళ్లలేరు. అక్కడకు కాలినడక తప్ప మరో మార్గం లేదు. అందుకేనేమో శంకరాచార్యులవారు ఆనాడే గంగామాత మందిరాన్ని గంగోత్రిలో కట్టించారేమో అనిపించింది. అయినప్పటికీ కొందరు ఆధ్యాత్మిక భావనతోనూ మరికొందరు సాహసంకోసమూ అన్నట్లు గోముఖ్‌ ట్రెక్‌కు వెళుతున్నారు.

మంచునదిమీద ప్రయాణం!
గోముఖ్‌ ట్రెక్‌కు వెళ్లేవాళ్లు ఉత్తరకాశీలోగానీ గంగోత్రిలోగానీ అనుమతి తీసుకోవాలి. దీనికి ముందు ‘ఈ యాత్రకు సంబంధించిన అన్ని ప్రమాదాలకూ నేనే బాధ్యుడను’ అన్న సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ ఇవ్వాలి. ట్రెక్‌కు అవసరమైన ఉన్నిబట్టలూ గ్లౌజులూ మంకీక్యాప్‌లూ జెర్కిన్లూ బూట్లూ రెయిన్‌కోట్లూ చేతికర్రలూ గ్లూకోజులూ ఆహారమూ మందులూ అన్నీ సర్దుకున్నాం. ఉదయం ఆరుగంటలకే బయలుదేరి ఓ కిలోమీటరు ప్రయాణం చేశాక గంగోత్రి జాతీయపార్కుకి చేరుకున్నాం. అక్కడ భద్రతాసిబ్బంది అనుమతి పత్రాలను చూసి యాత్రకు సంబంధించిన కొన్ని హెచ్చరికలు చేసి, అనుమతిని ఇచ్చారు. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ప్రయాణించి బోజ్‌బసకు చేరుకున్నాం. ఈ ప్రయాణం దాదాపు ఎనిమిది గంటలు సాగింది. ఈ మార్గంలో ఆహారంకానీ ఇతర తినుబండారాలుకానీ ఏమీ లేవు. పూర్తిగా అటవీప్రాంతం. జలపాతాల వద్ద నీళ్లను బాటిళ్లలో నింపుకున్నాం. కానీ ఆ నీళ్లు తాగలేనంత చల్లగా ఉన్నాయి. వాటిల్లో కాస్త గ్లూకోజ్‌ కలుపుకుని కొంచెం కొంచెంగా తాగుతూ మందుకు వెళ్లాం. దారంతా కొండలూ లోయలతో అత్యంత ప్రమాదభరితంగా ఉంది. వాటిని ఎక్కుతూ దిగుతూ జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాం. కొన్నిచోట్ల ఈ మార్గం కొండల అంచుల్లో అడుగున్నర మాత్రమే ఉంటుంది. ఈ మార్గం పక్కనే వందల అడుగుల లోతులో కనిపించే లోయల్ని చూడగానే ఒక్కోసారి గుండెల్లో దడ పెరిగిపోయేది. దీనికి తగ్గట్లు మరోపక్క విపరీతమైన చలిగాలులు వీచేవి. ఎలాగోలా ఆ మార్గం దాటి కాస్త ముందుకు వెళ్లాం. అసలు కష్టం అప్పుడే కనిపించింది. అదే గ్లేసియర్‌(హిమనీనదం) మీద ప్రయాణం. ఈ గ్లేసియర్‌ కింది నుంచి నీరు విపరీతమైన వేగంతో ప్రవహిస్తూ గంగానదిలో కలుస్తుంటుంది. కానీ నీరు మాత్రం కనిపించదు. నీటి ప్రవాహ శబ్దం మాత్రం వినిపిస్తుంది. కొండల్లో ఏర్పడ్డ గ్లేసియర్స్‌పై ప్రయాణం చేసేటప్పుడు ఏమాత్రం ఆదమరిచినా గ్లేసియర్స్‌ నుంచి జారి గంగానదిలో పడే అవకాశం ఉంది.

వాటిమీద నడిచేటప్పుడు మన చేతిలోని కర్రను గ్లేసియర్‌మీద గట్టిగా గుచ్చాలి. ఈ కర్రకు కిందిభాగాన కొనదేలిన ఇనుపరేకు ఉండటంవల్ల గ్లేసియర్‌ పై భాగాన ఉన్న మంచులో ఏమాత్రం మెత్తదనం ఉన్నా అది అందులోకి తేలికగా దిగిపోతుంది. అప్పుడు అది ప్రమాదకర ప్రదేశం అని గ్రహించాలి. ఆదమరిచి అక్కడ అడుగుపెడితే మనం కూడా గ్లేసియర్‌ పై నుంచి మెత్తటి మంచులో నుంచి కిందకు జారి గ్లేసియర్‌ కింద ప్రవహించే నీటిలో కలిసిపోతాం. మెత్తని మంచుతో మూతబడిన వూబిలాంటిది అన్నమాట. ఈ విధంగా ప్రతీ అడుగునూ పరీక్షించుకుంటూ ఓ కిలోమీటరు మేర గ్లేసియర్‌ మీద ప్రయాణించి దాన్ని దాటాం. దానిమీద ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అక్కడ వీచే విపరీతమైన చలిగాలులవల్ల చేతివేళ్లూ కాళ్లూ మొద్దుబారిపోయి స్పర్శను కోల్పోయే ప్రమాదం ఉంది. గ్లేసియర్‌మీద ప్రయాణం చేసిన మార్గం కొంతసేపటికి కరిగే మంచు కారణంగా మూసుకుపోయి, అంతకుముందు అసలక్కడ మార్గం లేనట్లే అనిపిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ ప్రయాణించాల్సిందే.

నదులూ దాటాం!
తరవాత గంగానదిని కలిసే ఉపనదుల్లో ప్రయాణించడం కూడా క్లిష్టంగానే ఉంటుంది. ఇవి కొండమార్గానికి కొన్ని వందల అడుగుల కిందనున్న లోయలో ప్రవహిస్తూ ఉంటాయి. ముందుగా కొండ మార్గం నుంచి లోయలోకి దిగాం. ఈ లోయమార్గం పూర్తిగా బండరాళ్లతో నిండి ఉంది. ఇక్కడ మార్గం అంతా రాళ్లతో నిండి ఉంటుంది. ఉపనదిని దాటడానికి సుమారు ఇరవై అడుగుల పొడవుగల రెండు కర్రల్ని నది ఉపరితలానికి సుమారు పది అడుగులపైన కట్టి ఉంచారు. ఈ కర్రలపై ఒకరు ఆ ఉపనదిని పూర్తిగా దాటాక మాత్రమే మరొకరు వెళ్లాలి. అలా జాగ్రత్తగా ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ నుంచి మళ్లీ బండరాళ్లమీద ప్రయాణం చేస్తూ లోయ నుంచి కొండమార్గానికి చేరుకున్నాం. ఆ మార్గానికి చేరడానికి ముందు రెండుమూడుచోట్ల సుమారు నాలుగైదు అడుగుల ఎత్తులో నిటారైన గోడలా ఉంది. ఈ మార్గం కొంతవరకూ సురక్షితమే. కొన్ని ప్రాంతాల్లో అడుగున్నర వెడల్పు ఉన్న రాళ్ల దారిలో ప్రయాణించాం. అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే మాత్రం ఓ సెకనులోనే కాలు ఏ రాయికో తగిలి లోయలో పడే అవకాశం ఉంటుంది. అలా చూడాలనుకుంటే నిలబడి మాత్రమే చూడాలి. ఇక్కడున్న నునుపైన ఏటవాలు రాళ్లమీద నడిచేటప్పుడు కాళ్లు జారుతూ ఉంటాయి. ఇలా కొంత దూరం ప్రయాణించాక గంగాప్రవాహానికి కొన్ని వందల అడుగుల ఎత్తున కొండ అంచున రెండు అడుగుల మార్గంలో ప్రయాణించాం. ఈ కొండలన్నీ మట్టికొండలే. ప్రతి యాత్రికుడూ ప్రాణాలకు తెగించి ఈ మట్టికుప్పలపైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ బోజ్‌బస అనే ప్రాంతానికి చేరతాం. ఇక్కడ నుంచి గోముఖ్‌ సుమారు నాలుగు కిలోమీటర్లు. కొండప్రాంతాల్లో మధ్యాహ్నం తరవాత వాతావరణం క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. మబ్బులు మూసుకురావడం, చలిగాలులు వీస్తూ ఉండటం, మంచు కురవడం, వర్షం పడుతూ ఉండటం... లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆరోజు బోజ్‌బసలోనే బస చేశాం. ఇక్కడ కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. వీటిల్లో బాహ్య ప్రపంచంతో సంబంధం లేని బాబాలు ఉంటారు. వాళ్లలో ఒకరైన నిర్మలదాస్‌ బాబా గత ఇరవైఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. మేం ఈయన ఆశ్రమానికే వెళ్లాం. ఆయన ఎంతో ఆదరాభిమానాలతో మా యోగక్షేమాలు తెలుసుకుని కేవలం ఐదు నిమిషాల్లో మాకు తాగడానికి వేడినీళ్లూ తినడానికి కొన్ని పండ్లూ ఇచ్చారు. ఆ రాత్రికి ఆయనే మాకు భోజనం ఏర్పాటుచేశారు. భోజనానికి ముందు ఆయన మాతో సుమారు మూడుగంటలపాటు అనేక భక్తి గీతాలను భజన చేయించారు. మైనస్‌ డిగ్రీల చలిలో పడుకోవడానికి వెచ్చని పడకను కూడా ఏర్పాటుచేశారు. మర్నాడు ఉదయం ఐదుగంటలకు ఆయనే మమ్మల్ని లేపి తాగడానికి వేడినీళ్లూ పొగలు కక్కే బ్లాక్‌ టీ లాంటి పానీయాన్ని ఇచ్చారు.

దివి నుంచి భువికి!
ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసరికి కొండంతా రాత్రి కురిసిన మంచుతో నిండి ఉంది. అక్కడ నుంచి గోముఖ్‌కు బయలుదేరాం. ఆ అడవి ప్రాంతంలో మాకిచ్చిన ఆతిథ్యానికి ఆయన మా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మాకు ప్రయాణం గురించి సూచనలు చేస్తూ బయటకు పంపించారు. ఇక్కడ నుంచి గోముఖ్‌కు వెళ్లే మార్గం కాస్త సురక్షితంగా ఉన్నప్పటికీ ఓ కిలోమీటరు మాత్రం చాలా క్లిష్టంగానే సాగింది. ఎట్టకేలకు గోముఖ్‌ చేరుకున్నాం. మంచుతో కప్పబడిన గోముఖ్‌ పర్వత శిఖరాలపై భానుడి లేలేత కిరణాలతో కనిపించే అందాలను చూడగానే మేం పడ్డ శ్రమ అంతా మరిచిపోయి ఆనందించాం. అక్కడి జలప్రవాహాన్ని చూస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని జటాఝూటం నుంచి గంగ ప్రవహిస్తున్నట్లే అనిపించింది. గోముఖం ఆకారంలో ఉన్న పర్వతం నుంచి గంగ ఉద్భవించిన ప్రాంతమే ఈ గోముఖ్‌. ఈ పర్వత శిఖరాలను మేఘాలు తాకుతూ ఉంటే దివి నుంచి భువికి దిగడం అంటే ఇదేనేమో అనిపించింది. అలా చూస్తూ ఉంటే స్థలపురాణం గుర్తుకొచ్చింది. కపిల మహారుషి కోపాగ్నికి భగీరథుని పూర్వికులు భస్మమైపోతారు. భగీరథుడు వాళ్ల పాపవిముక్తికోసం తాను గంగలో స్నానమాచరించడం ఒక్కటే మార్గమని తెలుసుకుని ఆమెకోసం కఠోరమైన తపస్సు చేయగా, స్వర్గంలో ఉండే గంగామాత కరుణించి నదీప్రవాహంగా మారి, భూమిమీదకు దిగి వస్తుంది. అందులో భగీరథుడు స్నానమాచరించి తన పూర్వికుల పాపాలను ప్రక్షాళన గావించడమేగాక, వారికి స్వర్గప్రాప్తి కలిగించాడట. అలాంటి పవిత్ర గంగ దివి నుంచి భువికి దిగిన ప్రాంతమే గోముఖ్‌. ప్రచండవేగంతో ప్రవహించే గంగను పరమేశ్వరుడు తన శిరస్సుపైకి తీసుకొని, ఉద్ధృతమైన ఆ ప్రవాహవేగాన్ని సాధారణ స్థాయికి తగ్గించి గంగకు ‘భగీరథీ’± అని నామకరణం చేసిన ప్రాంతం కూడా ఈ గోముఖే. పురాణాల్లో శివుని శిరస్సుమీద గంగ ఉన్నట్లే శివుని నివాసస్థలమైన కేదార్‌నాథ్‌కు పైనే ఈ గోముఖ్‌ ఉంటుంది. ఈ విషయాలన్నీ గుర్తుచేసుకుంటూ అత్యంత శీతలమైన గంగానదీ జలాల్లో స్నానం చేసి అక్కడకు కొద్దిదూరంలో ఉన్న శివాలయానికి వెళ్లాం. ఆలయం లోపల నిర్మల్‌దాస్‌ బాబా ధ్యానంలో ఉన్నారు. మేం దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడుగానీ దైవదర్శనం చేసుకున్నప్పుడుగానీ ఆయన మమ్మల్ని గమనించనంతగా ధ్యానంలో ఉన్నారు. గంభీరమైన ముఖవర్ఛస్సుతో ఉన్న బాబాను చూస్తుంటే ఈయనేనా మాకు రాత్రి ఆతిథ్యమిచ్చిన వ్యక్తి అనిపించింది. ఆయనకు మరోసారి నమస్కరించి వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.