close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెల్లని రాత్రులు మురిపించాయి!

తెల్లని రాత్రులు మురిపించాయి!

‘మాటల్లో వర్ణించలేని ఘనతను మహావ్యక్తులే కాదు, మహానగరాలూ సొంతం చేసుకుంటాయనడానికి నిదర్శనమే రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌, మాస్కో నగరాలు. మొదటిది నాటి పాలకులైన జార్‌ చక్రవర్తుల రాచరిక వ్యవస్థకీ నిరంకుశత్వానికీ నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే, అందుకు నిరసనగా వెల్లువెత్తిన రష్యన్ల విప్లవానికీ కమ్యూనిస్టుల పాలనకీ చూడచక్కని ప్రతీకగా నిలుస్తోంది మాస్కో నగరం’ అంటున్నారు ఆ నగరాలను సందర్శించిన తణుకు పట్టణవాసి డా.వంక వసుంధర.

రష్యా చూడాలన్న కోరిక ఈనాటిది కాదు. మా నాన్నగారూ మామగారూ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన నేపథ్యం, వాళ్లిద్దరూ రష్యాను పర్యటించిన అనుభవాలను మాతో పంచుకోవడంతో అది బలీయంగా మారింది. ఆనాటి రష్యా ప్రభుత్వం నిబద్ధత కలిగిన నాయకులను ఎంతో గౌరవించి వారి పిల్లలకు రష్యాలో చదువుకొనే అవకాశం కల్పించేది. మావారు డా. రామదాస్‌, బంధువు నాయుడుగారు కూడా మాస్కోలోనే పది సంవత్సరాలు చదువుకున్నారు. అవన్నీ వినడంవల్ల మా కుటుంబసభ్యులం పదిమందిమి కలిసి దిల్లీ నుంచి రష్యా విమానయాన సంస్థ ఎయిరోఫ్లోట్‌లో మాస్కోకి బయలుదేరాం. అక్కడ తిరిగేందుకు రైల్వేటిక్కెట్లూ మ్యూజియం టిక్కెట్లూ ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ చేసుకున్నాం. ప్రజా రవాణా బాగుంటుందని తెలిసి మెట్రో పాస్‌ తీసుకున్నాం. మాస్కోలో మెట్రో రైలెక్కి సెంట్రల్‌ ప్లాజాకు వెళ్లాం. మూడు రైల్వేస్టేషన్‌లు ఒకేచోట ఉన్నాయక్కడ. ఒకటి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌కీ, మరొకటి కజాన్‌ పట్టణానికీ, ఇంకొకటి సైబీరియాకీ వెళతాయి.బుల్లెట్‌ రైల్లో 4 గంటల వ్యవధిలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్నాం. సిటీపాస్‌ తీసుకుని మూడు రోజులపాటు నగరాన్ని చూశాం. ఇది అందమైన పురాతన పట్టణం. ఈ చారిత్రక పట్టణంలోనే జార్‌ చక్రవర్తులమీద లెనిన్‌ ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. ఇక్కడే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్‌ నాజీ సైన్యానికి అతి పెద్ద ప్రతిఘటన ఎదురైంది. సుమారు పది లక్షలమందికి పైగా రష్యన్ల ప్రాణత్యాగం ఫలితంగా నాజీ సైన్యం వెనక్కి తిరిగింది. ప్రతి కుటుంబం నుంచీ ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించారన్న విషయం మా మనసుల్ని కలిచి వేసింది. ఆ సైనికులకోసం నిరంతరం వెలిగే జ్యోతి వద్ద వాళ్లకు సెల్యూట్‌ చేశాం.

ఈ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్యన్‌ జార్‌ చక్రవర్తులో ఒకరైన పీటర్‌ ద గ్రేట్‌ సుమారు 312 సంవత్సరాల క్రితం బాల్టిక్‌ సముద్రంమీద సాగే వాణిజ్యంపై అదుపు సాధించేందుకు మంచుతో గడ్డకట్టుకుపోయే నేవానదీ తీరంలో ఈ నగరాన్ని నిర్మించాడు. ఏమాత్రం నివాసయోగ్యంకాని అక్కడ నగరం నిర్మించాలనుకోవడం ప్రాణాలతో చెలగాటమే. అయినప్పటికీ ఆ నిరంకుశ చక్రవర్తి ఆజ్ఞ మేరకు 18 నెలలపాటు నిరవధిక శ్రమకోర్చి వేలమంది బానిసలు ఈ సుందర నగరాన్ని నిర్మించారట. వాళ్లలో 30 వేలమంది చలికి తట్టుకోలేక చనిపోయారట. ఆ విధంగా ఆవిర్భవించిన ఈ నగరం రష్యా సామ్రాజ్య రాజధానిగా మారింది. విశాలమైన వీధులూ అద్భుత వాస్తుతో కాంతులీనే ఎత్తైన కట్టడాలూ ఈ నగరం సొంతం. తరవాత కమ్యూనిస్టుల నిర్లక్ష్యానికి గురై, సాంస్కృతిక రాజధానిగా మిగిలింది. ఇప్పటికీ ఆరునెలలు మంచుతోనూ, మిగిలిన ఆరునెలలు నేవానదీ వరదలతోనూ ఉండే ఈ నగరంలో రెండు అడుగులు తవ్వితే చాలు, నీళ్లు ఉబికి వస్తాయి. అయితేనేం... ఏటా ఇక్కడ కనిపించే తెల్లని రాత్రులకోసం లక్షలాదిమంది సందర్శకులు తరలి వస్తుంటారు.

తెల్లని రాత్రులెన్నో...

మేం కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ తెల్లనిరాత్రుల్ని ఆద్యంతం ఆస్వాదించాం. రాత్రి 11 గంటలవరకూ బాగా వెలుతురు ఉండి ఓ గంటపాటు కొద్దిగా వెలుతురు తగ్గి, తిరిగి రాత్రి ఒంటి గంట నుంచి ఆకాశం ప్రకాశవంతమైపోయింది. వీటినే తెల్లని రాత్రులు అంటారు. ఉత్తర ధృవానికి బాగా దగ్గరగా ఉండటంవల్ల అక్కడ జూన్‌ రెండు మూడు వారాల్లో ఈ తెల్లని రాత్రులు వస్తాయి. గదిలో నిద్రపోతున్న మేం అప్పుడే తెల్లవారింది అనుకొని లేచి చూస్తే అప్పుడు రాత్రి రెండు గంటలు అయింది. వీటికోసమే ప్రపంచం నలుమూలల నుంచీ జూన్‌ నెలలో సందర్శకులు వస్తుంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు కలిసిపోయే ఈ రోజులంటే సందర్శకులతోపాటు స్థానికులకూ ఎంతో ఇష్టం. సాధారణంగా ఇవి జూన్‌ 21 ప్రాంతంలో వస్తాయి. అయితే మే నుంచి జులై వరకూ ఉన్న రాత్రులన్నీ దాదాపు కాంతిమంతంగానే ఉంటాయి. అందుకే వాళ్లకు వేసవిలో వీధిదీపాల అవసరం ఉండదు. అందుకు పూర్తి భిన్నమైన దీర్ఘరాత్రులు కూడా సెయింట్‌ పీటర్‌బర్గ్‌వాసులకు డిసెంబరులో ఎదురవుతాయి.

ఆ తరవాత రోజు విఖ్యాత హెర్మిటేజ్‌ మ్యూజియాన్ని సందర్శించాం. ఇది ఒకనాటి జార్‌ చక్రవర్తుల వింటర్‌ ప్యాలెస్‌. ఆనాటి వాళ్ల వైభవం ఇందులో కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. ఇక్కడ ప్రాచీన ఈజిప్షియన్‌ కాలం నుంచీ ఇరవయ్యో శతాబ్దం వరకూ అనేక కళాకృతులు ఉన్నాయి. ఇక్కడున్న 400 గదుల్లోని సుమారు 30 లక్షల కళాకృతుల్ని ఒక్కో నిమిషం చొప్పున చూడాలంటే దాదాపు అక్కడే 11 సంవత్సరాలు ఉండాల్సి వస్తుందన్నది ఓ అంచనా. ఈ మ్యూజియంలోని రెండో అంతస్తులో ఉన్న బంగారు నెమలి ఓ ప్రత్యేక ఆకర్షణ. జార్‌ చక్రవర్తి అంతరంగికులతో సమావేశమయ్యే గోల్డెన్‌ రూమ్‌ ఎంతో అందంగా ఉంది. మూడో అంతస్తులో వివిధ దేశాల నుంచి తెచ్చిన రాతి విగ్రహాలూ చిత్రపటాలూ ఉన్నాయి. వీటిలో భారత్‌, చైనా, జపాన్‌, ఈజిప్టు, మంగోలియా దేశాలకు సంబంధించిన వస్తువుల్ని వేర్వేరు గదుల్లో ఉంచారు. అక్కడ నుంచి దగ్గరలోని పుష్‌కిన్‌ అనే పట్టణానికి వెళ్లి అక్కడి కేథరిన్‌ రాణి ఆమె అభిరుచి ప్రకారం కట్టించిన కోటలో భద్రపరిచిన నగల్నీ, ప్రఖ్యాత లియోనార్డో డావించీ చిత్రపటాలనూ చూశాం.

మాస్కో... పచ్చని నగరం!

సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ నుంచి తిరిగి రైల్లోనే మాస్కోకి వచ్చాం. అక్కడ కూడా మెట్రో పాస్‌ తీసుకుని ప్రయాణించాం. రోజుకి 100 రూబుల్స్‌ టిక్కెట్‌తో మెట్రో రైలు, బస్‌, ట్రామ్‌లలో ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. మాస్కోలోని మెట్రో రైల్వేస్టేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి ఒక్కొక్కటీ ఒక్కో మ్యూజియం అనే చెప్పాలి. ఒక స్టేషన్‌కీ మరో స్టేషన్‌తో సంబంధం లేకుండా చక్కని చిత్రాలతోనూ అందమైన దీపాలతోనూ తీర్చిదిద్దారు. భూమికి రెండు కిలోమీటర్ల లోపలకి ఎస్కలేటర్‌ ద్వారా వెళ్లి రైలెక్కాం. ప్రతి రెండు నిమిషాలకీ రైలు వస్తుంది. రష్యన్‌ ప్రజలు ఎంతో అందంగా స్నేహపూరితంగా ఉంటారు. కానీ వాళ్లు రష్యన్‌ భాషలోనే మాట్లాడతారు. జాతి పట్లా భాష పట్లా వాళ్లకి ఉన్న అభిమానం చూసి ఎంతో ముచ్చటేసింది. భాష రాకున్నా వాళ్లు సైగల ద్వారానే సహాయం చేసేవారు. తరవాత మావారు చదువుకున్న రష్యన్‌ పీపుల్స్‌ ఫ్రెండ్‌షిప్‌ యూనివర్సిటీకి వెళ్లి వాళ్లు చదివిన కాలేజీని చూశాం. 90వ పడిలో ఉన్న వారి ప్రొఫెసర్‌ డా.పావ్లోవ్‌ గారిని కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అక్కడ పనిచేయగలిగినంత కాలం పనిచేయవచ్చు. రిటైర్మెంట్‌ వయసు ఉండదు.

మర్నాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్కోకి గుండెకాయ వంటి క్రెమ్లిన్‌ ప్యాలెస్‌కి వెళ్లాం. దాన్ని చూడటానికి ఓ రోజంతా పట్టింది. తరవాత క్రెమ్లిన్‌ లోపల ఉన్న పార్లమెంట్‌ భవనం, ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన అక్కడి చర్చిలను చూశాం. ప్రఖ్యాత రష్యన్‌ బ్యాలె నృత్యాన్నీ వీక్షించాం. అందులోని కళాకారులకు ఆరేళ్ల వయసు నుంచీ శిక్షణ ఇస్తారు. కాలి మునివేళ్లమీద వాళ్లు చేసే నృత్యం అత్యద్భుతంగా ఉంది.

క్రెమ్లిన్‌ మ్యూజియంలోని ఆర్మర్‌ ఛాంబర్‌లో ప్రవేశరుసుము 400 రూబుల్స్‌. అక్కడకు వెళ్లగానే కార్డ్‌లెస్‌ ఫోనులు ఇస్తారు. ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ నంబర్‌ నొక్కి వినవచ్చు. ఇందులో 9 భాగాలు ఉన్నాయి. 12 నుంచి 17వ శతాబ్దం వరకూ ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మొదటి, రెండో హాళ్లలో ఉన్నాయి. మూడో హాలులో నాటి ఆయుధాలూ సైనికులూ రాజులూ యుద్ధసమయంలో వాడిన లోహకవచాలూ ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో వేసుకునే దుస్తులమీద బంగారు, వెండి ఎంబ్రాయిడరీ ఎంతో అందంగా ఉంది. వాళ్లు పెట్టుకున్న కిరీటాల్లోని రత్నాలూ వజ్రాల పనితనం చూసి కళ్లు తిప్పుకోలేకపోయాం. తరవాత లెనిన్‌ మాసోలియంకి వెళ్లి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉన్న లెనిన్‌ భౌతికకాయాన్ని చూసినప్పుడు ఎంతో ఉద్వేగం కలిగింది. రష్యా విప్లవానికి ఆయన అందించిన నాయకత్వం, కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు మరోసారి గుర్తుకువచ్చాయి. తరవాతిరోజు మాస్కోలోని పార్కుల్ని సందర్శించాం. రెండో ప్రపంచయుద్ధంలో విజయానికి గుర్తుగా నిర్మించిన విక్టరీ పార్కునీ, రోదసిలో మొదట ప్రయాణించిన యూరీగగారిన్‌ గుర్తుగా కట్టిన గగారిన్‌ పార్కునీ చూశాం. తరవాతి రోజు ప్రపంచంలోని అన్నింటికన్నా ఎత్తైన మాస్కో టీవీ టవర్‌ చూడ్డానికి వెళ్లాం. దీని ఎత్తు 450 మీటర్లు. అక్కడి నుంచి నగరాన్ని చూసినప్పుడు అది ఎంతో పచ్చగా కనిపించింది. ప్రతి కిలోమీటరుకీ పైన్‌ చెట్లతో అడవిలా పెంచారు. ఆ పచ్చని అడవులు ఉండటంవల్లే అక్కడ వాతావరణ కాలుష్యం చాలా తక్కువ అనిపించింది.

రష్యన్లు మన భారతీయ సంస్కృతి అంటే ఎంతో ఇష్టపడతారు. ఓ అమ్మాయి మేం పెట్టుకున్న బొట్టుబిళ్లలు చూసి ఇష్టపడటంతో ఆమెకి ఓ ప్యాకెట్‌ ఇస్తే మాకు ఆనందంగా 500 రూబుల్స్‌ ఇవ్వబోయింది. నవ్వుతూ తిరస్కరించాం. ఒకప్పుడు అమెరికాకు దీటుగా ఉండే రష్యా ఇప్పుడు ఆర్థికంగా వెనకబడినప్పటికీ రష్యన్‌ ప్రజల దేశాభిమానం, శ్రమైకతత్వం, వాళ్లదైన సంస్కృతి కారణంగా అది ఇప్పటికీ గొప్పదే అనిపించింది. ఆ మధురమైన జ్ఞాపకాలతో రష్యాకి వీడ్కోలు చెప్పాం.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.