close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గురుదక్షిణ ఇలా ఇచ్చాడు!

గురుదక్షిణ ఇలా ఇచ్చాడు!

ఐదేళ్ల వయసులో ఆ అబ్బాయి వెట్టి కూలీ. ఏడేళ్ల వయసులో అతడో అనాథ విద్యార్థి. పందొమ్మిదేళ్లకు అదే కుర్రాడు స్కూలు టీచర్‌. ఇరవై రెండేళ్లు వచ్చేసరికి ప్రపంచంలో మలాలా లాంటి అత్యంత ప్రభావశీలురైన ఏడుగురు వ్యక్తుల్లో ఒకడు. ఓం ప్రకాశ్‌... ఎంతో మందిని చదివిస్తున్నాడు. మరెంతో మందిలో చదువుకోవాలన్న కోరిక రగిలిస్తున్నాడు.
బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌... అంతకుముందు వరకూ నిశ్శబ్ద విప్లవంలా దేశమంతా విస్తరించిన ఈ సంస్థ, కైలాష్‌ సత్యార్థికి నోబెల్‌ బహుమతి వచ్చాకే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. సత్యార్థి స్థాపించిన ఆ సంస్థ ద్వారా విద్యార్థులుగా మారిన వలస కూలీలూ, డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న బానిస చిన్నారులూ ఎంతోమంది. అలాంటి ఆణిముత్యాల్లో ఒకడే ఓం ప్రకాశ్‌. అతడికి ఐదేళ్ల వయసున్నప్పుడు తండ్రి చేసిన అప్పులు తీర్చలేదని తీసుకెళ్లి ఓ భూస్వామి తన దగ్గరే వెట్టి చాకిరీ చేయించుకోవడం మొదలుపెట్టాడు. రెండేళ్ల పాటు ఆ పొలం గట్ల మధ్యే ప్రకాశ్‌ గడిపేశాడు. ఆ పిల్లాడి గురించి తెలిసిన బచ్‌పన్‌బచావో ఆందోళన్‌ కార్యకర్తలు వెంటనే అక్కడికి బయల్దేరారు. భూస్వామికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అతడు వినకపోవడంతో పోలీసుల సాయంతో ఆ అబ్బాయిని విడిపించి రాజస్థాన్‌లోని బాలాశ్రమ్‌కు తీసుకెళ్లారు.

ఆశ్రమంలోనే బాల్యం
బచ్‌పన్‌ ఆశ్రమానికి చేరుకోగానే ప్రకాశ్‌కు ఎదురుగా సత్యార్థి కనిపించాడు. అందరూ ‘భాయ్‌ సాబ్‌’ అని అతడిని పిలుస్తుండటంతో, ప్రకాశ్‌ కూడా భాయ్‌ సాబ్‌ అంటూ సత్యార్థి దగ్గరకు వెళ్లి తన కథంతా చెప్పాడు. సత్యార్థి అతడికి కొత్త బట్టలు ఇప్పించి, భోజనం పెడుతూ అక్కడే ఉంచుకున్నాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ప్రకాశ్‌ ఆశ్రమంలో ఆర్నెల్లు గడిపేశాడు. ఏ పిల్లాడైనా వచ్చి ఆరునెలలు పూర్తికాగానే, అతడిని ఇంటికి తీసుకెళ్లి, స్కూల్లో చేర్పించి, చదువుకు కావల్సిన ఆర్థిక సాయం అందించి రావడం బచ్‌పన్‌ బచావోలో మొదట్నుంచీ పాటిస్తోన్న విధానం. ప్రకాశ్‌కి కూడా ఆర్నెల్లు పూర్తికాగానే తల్లిదండ్రులకు అప్పగించడానికి సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ ప్రకాశ్‌ వెళ్లనని మొండికేశాడు. అక్కడికి వెళ్తే తండ్రి పనికి పంపిస్తాడనీ, తాను ఆశ్రమంలోనే ఉంటానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి కరిగిపోయిన సత్యార్థి ప్రకాశ్‌ను తమ దగ్గరే ఉంచుకోవడానికి అనుమతించాడు.

చిన్నప్పుడే పెద్ద గుర్తింపు
గంధపు చెట్ల మధ్య ఉంటే ఆ తావి ఎంతో కొంత శరీరానికి అంటినట్లు, సత్యార్థి ప్రభావం ప్రకాశ్‌పైన బాగానే పడింది. తన అదృష్టం బావుండీ హాయిగా చదువుకోగలుగుతున్నాడు. కానీ కర్మాగారాల్లో, నిర్మాణ కూలీలుగా చాకిరీ చేస్తోన్న పిల్లలు చాలామందే ఉన్నారు. వాళ్లకూ చదువుకునే అవకాశం దక్కాలని ప్రకాశ్‌ అనుకునేవాడు. తండ్రులు మద్యానికి బానిసలు కావడం వల్లే తప్పులూ, అప్పులూ, బానిస జీవితాలూ అన్నది ప్రకాశ్‌కు అనుభవం బోధించిన పాఠం. అందుకే తన బృందంతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ బెల్టుషాపుల సమాచారాన్ని పోలీసులకు ఇచ్చేవాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా చదువు చెబుతారనీ, భోజనం పెడతారనీ ఇంటింటికీ తిరిగి చెబుతూ పిల్లలను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపేలా చూసేవాడు. ఫ్యాక్టరీలూ, షాపుల్లో పనిచేసే పిల్లలను తనతో పాటూ ఆశ్రమానికి తీసుకెళ్లేవాడు. ఈ పనులన్నింటికీ అతడికి చిన్నవయసులోనే గుర్తింపు దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్‌ పీస్‌ అవార్డ్‌’ లభించింది. నోబెల్‌ గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ఫ్రెడ్రిక్‌ చేతుల మీదుగా దాన్ని అందుకున్నాడు.

చదివిస్తూ...చదువుకుంటూ
సత్యార్థి దేశవ్యాప్తంగా చదువుకు దూరమవుతోన్న పిల్లల కోసం పనిచేస్తుంటే, ప్రకాశ్‌ తానుండే ద్వారపూర్‌ పరిసరాల్లోని పిల్లల కోసం పనిచేయాలనుకున్నాడు. సరైన ధ్రువపత్రాలు లేక విద్యార్థిగా ప్రకాశ్‌ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకే పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు, రేషన్‌కార్డు లాంటి వాటిపైన తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవాడు. తరచూ ఆస్పత్రులకు వెళ్తూ అక్కడ పుట్టిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకునేలా చూసేవాడు. బాలాశ్రమ్‌ చుట్టుపక్కల మూడొందల గ్రామాలను బాల కార్మికుల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రకాశ్‌ కీలక పాత్ర పోషించాడు. అదే అతడికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెటింది. ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోన్న ప్రకాశ్‌ తన కాలేజీ చుట్టుపక్కల చాలా మంది వలస కార్మికుల పిల్లలు అల్లరిచిల్లరిగా తిరగడం గమనించాడు. కాలేజీ యాజమాన్యాన్ని ఒప్పించి ఓ గది తీసుకొని ఆ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా ఇప్పుడదో చిన్నస్థాయి స్కూలులా మారింది. ఆ చొరవే నెదర్లాండ్స్‌కు చెందిన కిడ్స్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ను ఆకర్షించింది. ‘ప్రపంచంలో ప్రభావశీలురైన యువత’ పేరుతో అందించే అవార్డుకు అతడిని ఎంపిక చేసింది. మలాలా యూసఫ్‌ జాయ్‌తో పాటూ ప్రపంచవ్యాప్తంగా మరో ఐదుగురు యువతీ యువకులతో కలిసి ప్రకాశ్‌ ఆ పురస్కారాన్ని అందుకున్నాడు.
‘నేను ఆదరించిన పిల్లలు బాగా చదువుకుంటే చాలనుకున్నా. కానీ ప్రకాశ్‌ తాను చదువుకోవడంతో పాటు కొన్ని వందల మందికి ఆ భాగ్యాన్ని కల్పించాడు. నాకు దక్కిన అత్యుత్తమ గురుదక్షిణ అదే. అతడి విజయం నోబెల్‌ కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చింది’ అంటాడు సత్యార్థి. నిజమే... పిల్లల భవిష్యత్తు కంటే నోబెల్‌ ఏమంత గొప్పది కాదు కదా..!


భద్రమైన ఈ-మెయిల్‌... ప్రోటాన్‌

గూగుల్‌, యాహూ, మైక్రోసాఫ్ట్‌... ఈ-మెయిల్‌ సేవల్ని అందించే ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. మెయిల్స్‌లోని సమాచారాన్ని తెలుసుకునే అవకాశం వీటికి ఉంటుంది. ఇదేమీ రహస్యం కాదు. మెయిల్‌ ఖాతా తెరిచేటపుడు నిబంధనల్ని చదివితే ఆ విషయం తెలుస్తుంది. వారిలా కాకుండా మెయిల్స్‌ని మూడో కంటికి తెలియకుండా పంపిస్తామంటూ వచ్చిందే ‘ప్రోటాన్‌ మెయిల్‌’.

-మెయిల్‌ గోప్యత, భద్రత... సామాన్యులకి ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ కొన్ని వ్యాపార సంస్థలూ, దేశాలూ ముఖ్యమైన, రహస్య సమాచారాన్ని మెయిల్‌ చేయాల్సి వచ్చినపుడు అది ఇతరులకి తెలిసే ప్రమాదం ఉంది. చాలా వరకూ ఈ-మెయిల్‌ సంస్థల సర్వర్లు అమెరికాలోనే ఉంటున్నాయి. అక్కడి ‘నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ’, ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌’లు కూడా ఈ-మెయిళ్లని గమనిస్తూ, వివిధ దేశాలకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు అమెరికాకి చెందిన ప్రజా వేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ మూడున్నరేళ్ల కిందట వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే స్విట్జర్లాండ్‌లోని‘సెర్న్‌’ సంస్థలో శాస్త్రవేత్తలైన జాసన్‌ స్టాక్‌మ్యాన్‌, ఆండీ యెన్‌, వెయ్‌ సన్‌లకు గోప్యంగా పంపగలిగే ఈ-మెయిల్‌ సర్వీసుని ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.

స్విట్జర్లాండ్‌లో సర్వర్‌...
ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఈ-మెయిల్‌ సర్వీసులు పోస్టు కార్డులాంటివి. ఎవరైనా చూసుకునే వీలుంటుంది. బదులుగా ఒక సీల్డ్‌ కవరు లాంటి ఈ-మెయిల్‌ను తేవాలనుకున్నారు జాసన్‌, ఆండీ, వెయ్‌లు. మూడేళ్ల కిందట అందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి ‘ప్రోటాన్‌ మెయిల్‌’ని తీసుకొచ్చారు. అందుకోసం సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి పరంగా ఆ శాస్త్రవేత్తల త్రయం తీవ్రంగా కృషి చేసింది. తమ ప్రయత్నం గురించి వార్తల్లో తెలిపి ఆర్థిక సాయం చేయమని కోరింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అందుకు సానుకూలంగా స్పందించడంతో ఇప్పటివరకూ వారికి రూ.35 కోట్లు విరాళాల రూపంలో అందాయి. ‘ఇప్పటికే మనలో చాలామంది ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. భవిష్యత్తు తరాలు మనకంటే ఇంకా ఎక్కువ సమయం గడుపుతాయి. రానున్న రోజుల్లో వ్యక్తిగత భద్రత ఎంత క్లిష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పరిష్కారంగా చౌకైన, భద్రమైన ఈ-మెయిల్‌ను రూపొందించాలనుకున్నాం. అదే ప్రోటాన్‌ మెయిల్‌. దీన్లో మెయిల్‌ పంపిన క్షణంలోనే ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. ఒక ప్రత్యేక పాస్‌వర్డ్‌ ద్వారా ఆ మెయిల్‌ని తెరిచే వ్యక్తికి మాత్రమే అందులోని విషయం తెలుస్తుంది’ అని చెబుతాడు యెన్‌. ప్రోటాన్‌ మెయిల్‌ సంస్థ సర్వర్‌ స్విట్జర్లాండ్‌లో ఉంది. ఆ దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే చట్టాలు ప్రపంచంలో మిగతా దేశాలన్నింటికంటే పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి గోప్యతను సులభంగా పాటించే అవకాశం వారికి ఉంటుంది. ఒకవేళ అక్కడి న్యాయ స్థానాలు ఈ-మెయిళ్ల సమాచారాన్ని అడిగినా తమ సాంకేతికతలో ఆ సమాచారం దాచడం వీలుకాదని స్పష్టంగా చెబుతామంటున్నారు వ్యవస్థాపకులు.

రెండు పాస్‌వర్డ్‌లు
ప్రోటాన్‌మెయిల్‌ రెండేళ్ల కిందట అందుబాటులోకి వచ్చింది. అప్పట్నుంచీ తరచూ దాన్ని మెరుగుపరుస్తూ వస్తున్నారు. ప్రోటాన్‌ ఖాతా వినియోగానికి రెండు పాస్‌వర్డ్‌లు ఉంటాయి. ఒకటి లాగిన్‌ అవడానికి. రెండోది మెయిల్స్‌ తెరవడానికి. ప్రోటాన్‌ మెయిల్‌ నుంచి ఇతర సంస్థలకీ, అలాగే ఇతర మెయిల్స్‌ నుంచి దీనికీ ఈ-మెయిల్స్‌ పంపుకోవచ్చు. దీన్నుంచి పంపే ఇతర సంస్థల మెయిల్స్‌కీ కావాలంటే పాస్‌వర్డ్‌ని పెట్టొచ్చు. అవతల వాళ్లు ఆ పాస్‌వర్డ్‌ని ఉపయోగిస్తేకానీ మెయిల్‌ తెరుచుకోదు. మెయిళ్లని నిర్ణీత సమయం తర్వాత డిలీట్‌ అయ్యేలా పెట్టొచ్చు. ప్రోటాన్‌ మెయిల్స్‌ మాత్రమే కాదు ఇతర మెయిల్స్‌కి పంపినవి కూడా ఇలా డిలీట్‌ అయ్యేట్టు సెట్‌ చేసుకోవచ్చు. ప్రోటాన్‌ మెయిళ్లలో గోప్యతకి భంగం కలిగించే దుష్టశక్తుల్ని ఎదుర్కోవడానికి నిత్యం ఆన్‌లైన్‌ పహారా కాస్తారు. ప్రోటాన్‌ మెయిల్స్‌ పనిచేయడానికి ఏ విధమైన ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌లు వాడుతున్నదీ ఆ శాస్త్రవేత్తలు చెబుతారు.

ప్రస్తుతం ఉన్న చాలా ఈమెయిల్‌ సంస్థలు ఖాతాదారుల్ని ఉండే చోటు, వయసు, ఆడా/మగా, ఫోన్‌ నంబరు... ఇవన్నీ అడుగుతాయి. ఆ సమాచారాన్ని ప్రకటనల సంస్థలకు అందించి లాభాలు పొందుతాయి. అంటే, మనకు సేవలు ఉచితమే కానీ దాని ద్వారా వారికి పరోక్షంగా ఆదాయం వస్తుంది. ప్రోటాన్‌ మెయిల్‌ ఖాతా తెరవడానికి మనం ఎక్కడివారిమన్న వివరాలు ఇవ్వనవసరంలేదు. ఫోన్‌ లేదంటే ఈ-మెయిల్‌ ఏదో ఒకటి ఇస్తే చాలు... పాస్‌వర్డ్‌ మర్చిపోయినపుడు అది అవసరం పడుతుంది. అందుకే వీరికి ప్రకటనల సొమ్ము రాదు. నిర్వహణ ఖర్చుల కోసం ఖాతాదారుల్నే కొంత మొత్తం చెల్లించమంటోంది. అదే సమయంలో విరాళాలు చెల్లించలేని వారికి కూడా 500 ఎం.బీ. స్టోరేజీ సామర్థ్యంతో సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. ఈ మధ్యనే మెయిల్‌ డిజైన్‌, స్టోరేజీ, నచ్చిన డొమైన్‌ పెట్టుకోవడం... లాంటి సౌకర్యాలు అందిస్తూ వాటికి కొంత మొత్తం చెల్లించమంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ప్రోటాన్‌ మెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రోటాన్‌ నుంచి ప్రస్తుతానికి మెయిల్‌ మాత్రమే ఉంది. భవిష్యత్తులో సెర్చింజిన్‌, చాటింగ్‌, డేటా స్టోరేజీ లాంటి సదుపాయాల్నీ అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. అవి కూడా గోప్యతని పాటిస్తూ, ప్రకటనలు లేకుండా ఉంటాయట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.