close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వీళ్లు అనాథలు కారు..!

వీళ్లు అనాథలు కారు..!

మంచి ఉద్యోగం, చక్కని కుటుంబం... జీవితాన్ని సంతోషంగా గడిపేయడానికి ఇంతకన్నా ఏం కావాలి. అందుకే, ఆయనా తనకోసం ఇంకేం కోరుకోలేదు. కానీ తల్లిదండ్రులు లేని కొందరు చిన్నారులైనా తన బిడ్డలా సంతోషంగా ఉండాలని మాత్రం అనుకున్నారు. ఆ కోరికలోంచి పుట్టిందే ‘జీవని విద్యాలయ’.
ఈ భూమ్మీద ఎవరూ ఏదీ శాశ్వతం కాదు. చేసిన మంచి పనులు మాత్రమే చిరకాలం నిలిచి ఉంటాయి’ ఈ మాటలను చాలామంది చాలాసార్లు వినుంటారు, చదివి ఉంటారు. అనంతపురానికి చెందిన ప్రసాద్‌కూడా భగవద్గీతలోనూ, పుస్తకాల్లోనూ ఈ మాటలను చదివారు. కానీ అందరిలా దాన్నక్కడితో వదల్లేదు. ఫలితం... మనసులో సమాజానికి తనవంతుగా ఏదో చేయాలన్న తపన మొదలైంది. ఆ సమయంలోనే తను ఉపాధ్యాయుడిగా పనిచేసే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న కొందరు అనాథ పిల్లల్ని చూశారు. దగ్గర్లోని అనాథాశ్రమంలో ఉండే ఆ చిన్నారులు నా అనేవారు లేక పడుతున్న ఆవేదననూ కష్టాలనూ చూశాక తనేం చెయ్యాలో ప్రసాద్‌కు పూర్తిగా అర్థమైంది. అలా 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం గ్రామంలో ‘జీవని’ పేరుతో ఆశ్రమం ప్రారంభమైంది. అమ్మానాన్నాలేని పిల్లల్ని ఆ లోటు తెలియకుండా పెంచడంతో పాటు, వారికి విద్యాబుద్ధులను నేర్పించి మంచి జీవితాన్నివ్వడమే జీవని లక్ష్యం.

అమ్మానాన్నల్లా...
తల్లిదండ్రులిద్దరూ చనిపోయి అనాథలైన అయిదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న పిల్లలను ఇక్కడ చేర్చుకుంటారు. మొదట్లో ఇద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 35మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ప్రసాద్‌తో పాటు ఆయన భార్య సునంద, తల్లి నంజమ్మ, తండ్రి రామకృష్ణలు కూడా ఈ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అయినవారిలా ఆత్మీయతను పంచుతున్నారు. పెంచి పెద్ద చేయడంతో పాటు చదివించి జీవితంలో స్థిరపడేవరకూ వారి బాధ్యత మొత్తం జీవనిదే. ఆడపిల్లలకైతే పెళ్లి కూడా సంస్థే చేస్తుంది. క్రమశిక్షణ విషయంలోనూ ప్రసాద్‌ దంపతులు చాలా కచ్చితంగా ఉంటారు. అందుకే, ఉదయాన్నే లేచి యోగా చేయడం దగ్గర్నుంచి చదువూ భోజనం ఆటపాటల వరకూ అన్నీ ఓ క్రమపద్ధతిలో జరిగిపోతాయి. ఆదివారం ఆశ్రమాన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు, తోటపని కూడా ఉంటుంది. టీవీలో కూడా పిల్లలు చూడదగ్గ సినిమాలనే చూపిస్తారు. ఇక ఇక్కడుండే పెద్ద పిల్లలకు ఒక్కొక్కరికీ పాఠశాలలో, హాస్టల్లో గ్రంథాలయ నిర్వహణ, స్టోర్‌ ఇన్‌ఛార్జిలాంటి రకరకాలపనులను చెబుతారు. దాంతోపాటుగా ఏడేళ్లలోపు చిన్నారులను ఒక్కొక్కరినీ తమ్ముడుగా చెల్లెలుగా పరిచయం చేసి వారి బాగోగుల బాధ్యతలను అప్పగిస్తారు. అంటే అప్పటి నుంచీ వారికి సంబంధించిన అన్ని విషయాలనూ అన్నలూ అక్కలూ చూసుకుంటారన్నమాట. ఇక, జీవనిలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రసాద్‌ ఆశ్రమంలోనే జీవని విద్యాలయాన్ని ప్రారంభించారు. అయిదో తరగతి వరకూ ఉండే ఈ బడిలో నాణ్యమైన విద్యను అందించడం చూసి స్థానికులు కూడా తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పిస్తామని రావడంతో నామమాత్రపు ఫీజుతో వారికి కూడా విద్యా బోధన చేస్తున్నారు. అలా 150మంది వరకూ బయటి పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు.

మనసున్న మనిషి
మొదట్లో జీవనిని పూర్తిగా సొంత ఖర్చుతోనే నడిపేవారు ప్రసాద్‌. కానీ పిల్లల సంఖ్య పెరిగేసరికి తనకొచ్చే జీతం డబ్బులు సరిపోక ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ సమయంలోనే 2010లో కర్నూలును వరదలు ముంచెత్తడంతో స్థానిక ప్రజలకు సాయం చేయడానికి ప్రసాద్‌ కర్నూలు వెళ్లారు. అక్కడ తన స్నేహితుడు ఆలూరు సాంబశివారెడ్డిని కలిసినపుడు మాటల మధ్యలో అనాథాశ్రమం గురించి చెప్పారు. అనంతపురానికి సమీపంలో ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహిస్తున్న ఆయన మంచి మనసుతో జీవనికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. రూ.50 లక్షలతో రోటరీపురంలో సంస్థ పేరిట రెండెకరాల స్థలం కొని పాఠశాలనూ, వసతి గృహాన్నీ నిర్మించారు. ఇక, సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్‌ నిర్వహిస్తున్న ‘జీవని అనంతపురం.కామ్‌’ వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా సంస్థ గురించి తెలుసుకుని కూడా కొందరు విరాళాలు అందిస్తున్నారు. వారు అందించే ప్రతి రూపాయీ ఎలా సద్వినియోగం అవుతుందో తెలియజేయడానికి ఎప్పటికప్పుడు దాతల విరాళాలూ జమా ఖర్చుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. పరిశుభ్రమైన జీవని వసతి గృహం, సౌకర్యాలతో కూడిన పాఠశాల, విశాలమైన ఆటస్థలం, అక్కడి పిల్లలకు పెట్టే పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, వేడి నీళ్లు, క్రీడా సామగ్రి...లాంటి సదుపాయాలను చూస్తేనే జీవని నిర్వహణ ఎలా సాగుతుందనే విషయం అర్థమవుతుంది. కానీ దీనంతటికీ వెనుక ఉన్న ప్రసాద్‌ మాత్రం ‘ఇదంతా నా గొప్పతనం కాదు. స్నేహితులూ దాతలూ ఎంతో సహాయం చేస్తున్నారు. వారివల్లే సంస్థ నడుస్తోంది’ అంటారు. అదే ఆయన మంచితనం. అనాథ పిల్లల్ని చేర్చాలనుకునేవారూ వలంటీర్లుగా పనిచేయాలనుకునేవారూ 9505201111 నంబరును సంప్రదించొచ్చు.

- విజయ్‌ ఆదోని, ఈనాడు, అనంతపురం
ఫొటోలు: ఇ.శ్రీనివాసులు, న్యూస్‌టుడే, బుక్కరాయ సముద్రం

ఇదీ అభిమానమంటే!

సచిన్‌, ధోని, ద్రవిడ్‌, గంగూలీ... భారత క్రికెట్‌ జట్టులోకి ఇలాంటి ఎంతో మంది దిగ్గజాలు వచ్చి వెళ్లిపోతున్నారు. కానీ గత పదిహేడేళ్లుగా భారత జట్టుని అంటిపెట్టుకునే ఉంటోంది ‘భారత్‌ ఆర్మీ’. విదేశాలైనా, స్వదేశమైనా... టీమిండియా ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్లి తమదైన శైలిలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తోంది భారత్‌ ఆర్మీ. ప్రపంచంలోని అతిపెద్ద అభిమాన సంఘాల్లో ఇదీ ఒకటి. బర్మీ ఆర్మీ, బీగ్‌ బ్రిగేడ్‌, క్రికెట్‌ ఖోర్‌... ఇవీ ఒక్కో దేశాన్ని ప్రోత్సహించే అలాంటి అభిమాన బృందాలే.

టీట్వంటీ ప్రపంచకప్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను టీవీలో చూసిన వాళ్లెవరికైనా మధ్యమధ్యలో ‘భారత్‌ ఆర్మీ’ పేరుతో స్టేడియంలో సందడి చేసిన భారీ జాతీయ జెండా కనిపించే ఉంటుంది. ఆ జెండాను పట్టుకుని టీమిండియా జెర్సీలు ధరించిన కుర్రాళ్లు పాడిన పాటలూ, పెట్టిన కేరింతలూ వినిపించే ఉంటాయి. అంతకుముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో, దానికి ముందు ఆసియాకప్‌లో, ఆ మాటకొస్తే గత పదిహేడేళ్లుగా మనమాడిన ప్రతి మ్యాచ్‌లో ‘భారత్‌ ఆర్మీ’ అనే అభిమానుల బృందం మైదానంలో జట్టును ప్రోత్సహిస్తూనే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ అభిమాన సంఘాల్లో భారత్‌ ఆర్మీ ఒకటి. 1999లో ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటించినప్పుడు ఇంగ్లండ్‌ అభిమానులు తమ నినాదాలతో టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అక్కడే స్థిరపడ్డ రాకేష్‌, శైలిన్‌, హర్వీందర్‌, సుఖ్వీందర్‌ అనే నలుగురు స్నేహితులు ప్రత్యర్థి అభిమానులకు పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భిన్నంగా కనిపించేందుకు టీమిండియా జెర్సీలు తొడుక్కుని, తలకు మువ్వన్నెల జెండా రంగులను వేసుకున్నారు. ‘భారత్‌ ఆర్మీ’ అని తమ బృందానికి పేరు పెట్టుకుని భారత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవడం మొదలుపెట్టారు. జట్టు బాగా ఆడినా, ఆడకపోయినా ఒకే స్థాయిలో ప్రోత్సహించడం, ప్రత్యర్థులను నిందించకపోవడం వీరి ప్రత్యేకత. 

ఈ నలుగురు స్నేహితులూ ఓసారి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది కుర్రాళ్లు వీళ్ల బృందంలో చేరతామంటూ ముందుకొచ్చారు. అప్పుడే సభ్యుల సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశంతో తమ బృందం పేరుతో వెబ్‌సైట్‌ మొదలుపెట్టి ఆసక్తి ఉన్నవాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవచ్చు అంటూ భారత్‌ ఆర్మీ ఆహ్వానించింది. అలా క్రమంగా ఇంగ్లండ్‌తో మొదలై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దుబాయ్‌, భారత్‌లాంటి దేశాల నుంచి పదివేల మందికి పైగా అభిమానులు అందులో రిజిస్టర్‌ చేసుకున్నారు. విదేశాల్లో మ్యాచ్‌లు ఆడేప్పుడు వీళ్ల ప్రోత్సాహం జట్టుకు ఎంతోకొంత సానుకూలతగా మారుతుందని బీసీసీఐ కూడా గుర్తించింది. అందుకే ఈ బృందంలోని సభ్యులకు కొన్ని టికెట్లను ప్రతి మ్యాచ్‌లో కేటాయిస్తూ వస్తోంది. ప్రతి మ్యాచ్‌కూ ఆటగాళ్ల మీద నాలుగైదు లైన్లలో పాటలనూ నినాదాలనూ రూపొందించుకుని వాటినే పాడుతూ సభ్యులు సందడి చేస్తారు. అజహరుద్దిన్‌ నుంచి ధోనీ దాకా టీమిండియా కెప్టెన్లందరూ ‘భారత్‌ ఆర్మీ’కి టికెట్ల విషయంలో సాయం చేస్తూనే ఉన్నారు.

బర్మీ ఆర్మీ: క్రికెట్లో అన్ని అభిమాన సంఘాలకంటే ముందుగా ప్రాచుర్యంలోకి వచ్చిన బృందమిదే. ఇంగ్లండ్‌ జట్టును ప్రోత్సహించేందుకు పాల్‌ బర్నమ్‌ అనే వ్యక్తి 1994లో దీన్ని మొదలుపెట్టాడు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్‌ పర్యటించినప్పుడు ఈ బృందం చేసిన హడావుడి చూసి ఆస్ట్రేలియా మీడియానే వీళ్లకు ‘బర్మీ ఆర్మీ’(బ్రిటన్‌లో ప్రఖ్యాత టీవీ కార్యక్రమం పేరు) అన్న పేరు పెట్టింది. మైదానంలో ప్రేక్షకులు బొమ్మల్లా ఆటను చూస్తూ కూర్చోకుండా వాళ్లకు అప్పటికప్పుడు చార్టులూ, స్కెచ్‌లూ ఇచ్చి స్లోగన్లు రాయించి ప్రదర్శించడం, ప్రేక్షకులందర్నీ అలల ఆకారంలో కేరింతలు కొట్టించడం, ఒకేరకమైన నినాదాన్ని అందరితో పలికించడం లాంటి వినోదాత్మక పనులు చేస్తుంది. ఇంగ్లండ్‌ ఓటమి అంచుల్లో ఉన్నా ఆ జట్టును 22ఏళ్లుగా ‘బర్మీ ఆర్మీ’ ప్రోత్సహిస్తూనే ఉంది.

బీగ్‌ బ్రిగేడ్‌: న్యూజిలాండ్‌ జట్టు ఏ దేశంలో పర్యటించినా వాళ్లతో పాటు ‘బీగ్‌ బ్రిగేడ్‌’ అనే అభిమానుల బృందం కూడా కనిపిస్తుంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆ జట్టుతో కలిసి ప్రయాణిస్తోన్న ‘బీగ్‌ బ్రిగేడ్‌’ బృందం 90వ దశకం నాటి న్యూజిలాండ్‌ జట్టు దుస్తులూ, ఆహార్యంలోనే ఇప్పటికీ కనిపిస్తూ రావడం విశేషం. అప్పటి న్యూజిలాండ్‌ జట్టు బలంగా ఉండేదనీ, రానురానూ ఆటగాళ్ల ప్రదర్శన తగ్గిపోతోందనీ, పాత ఆటగాళ్లను అనుక్షణం గుర్తుచేయడానికే అప్పటి దుస్తులను ధరిస్తున్నామనీ సభ్యులు చెబుతారు.

 ది ఫ్యానటిక్స్‌: ఆస్ట్రేలియా జట్టును ఉత్సాహపరచడానికి ఏర్పడ్డ బృందమే ‘ది ఫ్యానటిక్స్‌.’ వీరివెంట రకరకాల వాద్య పరికరాలుంటాయి. బృందంలో గాయకులు కూడా ఉంటారు. పాటలూ, నినాదాలూ, సంగీతంతో మైదానాన్ని హోరెత్తిస్తుంటారు. ఇతర బృందాలతో పోలిస్తే వీళ్లకి దూకుడు ఎక్కువన్న పేరుంది.

స్తానీ ఆర్మీ: పాకిస్తాన్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పడ్డ అభిమాన బృందమిది. ఆసియాయేతర దేశాల్లో జరిగే మ్యాచ్‌లకే వీళ్లు హాజరవుతుంటారు. పాకిస్తాన్‌లోని ఒకప్పటి రాజులూ, వైద్యులూ, నావికులూ, పోలీసుల లాంటి భిన్న రంగాలకు చెందిన వ్యక్తుల ఆహార్యంలో వీళ్లు కనిపిస్తారు.

బంగ్లాదేశ్‌కు ‘అల్‌ ఖోర్‌ క్రికెట్‌’, దక్షిణాఫ్రికాకు ‘ప్రోటియాస్‌ ఫ్యాన్స్‌’... ఇలా క్రికెట్‌ ఆడే దాదాపు అన్ని దేశాలకూ ప్రత్యేక అభిమాన సంఘాలున్నాయి. మైదానం మధ్యలోకి అడుగు పెట్టకపోయినా ఆటగాళ్లతో పాటు ప్రయాణించే వీళ్లు జట్టులో పన్నెండో ఆటగాడిలాంటి వాళ్లన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.