close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోనప్ప... ఓ మంచి ‘నాయకుడు’

కోనప్ప... ఓ మంచి ‘నాయకుడు’

రాజకీయ నాయకులంటే పదవిలో ఉండగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటారనేది సామాన్యుల భావన. ఆ ఎమ్మెల్యే మాత్రం తనకు చేతనైన సాయం చేయాలని చూస్తారు. పేదల దాహార్తి తీరుస్తారు. విద్యార్థులకు చదువుల్లో చేయూతనిస్తారు. ప్రజల కష్టాలను తనవిగా భావించి ముందడుగు వేస్తారు.
చెట్టునిబట్టే కాయ. జీవిత చరమాంకంలో ఉన్న ఆ తల్లిని చివరి కోరిక ఏమిటని అడిగితే... ‘మన కుటుంబానికి ఏలోటూ లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. మనకు ఉన్నదాంట్లో కొంత మొత్తంతో శ్రావణ మాసంలో ఆసుపత్రుల్లో నిరు పేదలకు భోజనం పెట్టించు’ అని తనయుడికి చెప్పిందట. ఆ తల్లి కోనేరు కృష్ణవేణి. ఆ తనయుడు ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు శాసన సభ్యుడు కోనేరు కోనప్ప. అలా తల్లి కోరిక మేరకు 2010 శ్రావణ మాసంలో సిర్పూరు నియోజకవర్గానికి ప్రధానకేంద్రమైన కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులూ, వారి కుటుంబ సభ్యులకు తన ఇంటి వద్దే భోజనం తయారు చేయించి అందించారు కోనప్ప. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడంతో ఆ తల్లి ఎంతో సంతోషించింది. అదే ఏడాది ఆమె అనారోగ్యంతో చనిపోయినా తల్లి కోరిక మేరకు అన్నదానాన్ని మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

వేసవిలో అంబలి
అన్నదానం కలిగించిన ఆత్మ సంతృప్తి స్ఫూర్తిగా వేసవిలో దాహంతో అలమటించే ప్రజల కోసం ‘అంబలి’ పంపిణీ చేయాలనుకున్నారు కోనప్ప. 2011 వేసవిలో రైతుల దగ్గర ఐదు క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణం, అంబేడ్కర్‌ చౌరస్తాలలో తొలిసారిగా అంబలిని పంపిణీ చేశారు. స్పందన బాగా ఉండటంతో ఆ సంవత్సరం మొత్తం 70 క్వింటాళ్ల జొన్నలు కొని వివిధ చోట్ల అంబలి పంచారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఏటా (2012లో 110, 2013లో 120, 2014లో 150 క్వింటాళ్లు) తెల్ల జొన్నలను కొనుగోలు చేసి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని వారాంతపు సంతల్లోనూ అంబలి పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది 265 క్వింటాళ్ల జొన్నలు కొన్నారు కోనప్ప. ప్రతిరోజూ తన ఇంటి దగ్గర ఉదయం 6నుంచి 9గంటల వరకు అంబలి పంపిణీ చేస్తారు. గత నెల 4నుంచి 11వ తేదీ వరకూ చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం ఆదిలాబాద్‌ వచ్చిన యువకులకు అంబలి పంపిణీ చేసి దాహార్తి తీర్చారు.

హైదరాబాద్‌లోనూ!
కోనప్పది ఉమ్మడి కుటుంబం. ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టినా భార్య, సోదరులూ, మరదళ్ల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ అంబలి తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 15 మంది కూలీలకు మూడు నెలలపాటు వేతనాలిచ్చి ఈ పనులు చేయిస్తారు. రాత్రి 12గంటల వరకూ అంబలి తయారీ చేసి మర్నాడు ఉదయం పదింటికల్లా పంపిణీ కేంద్రాలకు చేరుస్తారు. ఈ ఏడాది అంబలి పంపిణీని హైదరాబాద్‌కూ విస్తరించారు. ఏప్రిల్‌ 27న రాజధానిలో జరిగిన తెరాస ప్లీనరీ సమావేశాలపుడు ఐదు క్వింటాళ్ల అంబలి తయారుచేయించి కాగజ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. అంబలికి తోడు మూడు డ్రమ్ముల మామిడికాయ పచ్చడిని తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం ఆ అంబలి పంపకంలో ఓ చేయివేసి కోనప్ప సేవాభావాన్ని ప్రశంసించారు. అప్పుడే హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అంబలి పంపిణీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ బాధ్యతల్ని నగరంలో ఉంటున్న కోనప్ప తనయుడికి అప్పగించారు. ప్రస్తుతం గాంధీ, నిమ్స్‌, నిలోఫర్‌, ఉస్మానియా ఆసుపత్రుల్లో రోగులకూ, వారి బంధువులకు అంబలి పంపిణీ చేస్తున్నారు. కేవలం అంబలి పంపిణీయే కాదు.. రుచికి మామిడి పచ్చడిని కూడా పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది 14 క్వింటాళ్ల మామిడి కాయల్ని పచ్చడి తయారీకి కొన్నారు.

విద్యార్థుల కోసం...
సిర్పూరు కాగితంమిల్లు గత సెప్టెంబరులో మూతపడింది. దాంతో సిబ్బంది పిల్లలు 1500 మందిది పాఠశాల ఫీజు కట్టలేని పరిస్థితి. ఎమ్మెల్యే కోనప్ప ఆ బాధ్యతను తీసుకున్నారు. స్కూల్‌ యాజమాన్యాలతో మాట్లాడి ఫీజుల్లో తగ్గింపు ఇవ్వమని కోరారు. మిగిలిన రూ.30లక్షల రూపాయల్ని కొంత మంది దాతల సహకారంతో చెల్లించారు. మొన్నటి విద్యా సంవత్సరంలో సిర్పూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో పరీక్షలకు ముందు మూడు నెలలపాటు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించారు. మొన్నటి చలికాలంలో నియోజకవర్గ పరిధిలో 28 ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న 4,200 మంది విద్యార్థులకు రూ.25 లక్షలు పెట్టి నాణ్యమైన రగ్గులు అందించారు.

‘అంబలి తయారీ, పంపిణీ ఎంతో వ్యయప్రయాసతో కూడుకున్నవైనా... నిరుపేదల దాహార్తి తీర్చుతుంటే ఎంతో సంతృప్తి కలుగుతుంది. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడడం ఒక ప్రజా ప్రతినిధిగా నా బాధ్యతని భావించి స్పందించాను’ అని చెబుతారు కోనప్ప.
ఇన్ని విధాలుగా సాయపడుతున్న నాయకుణ్ని ప్రజలు దూరం చేసుకోగలరా!

- కె.పూర్ణచందర్‌, ఈనాడు, ఆదిలాబాద్‌ డెస్క్‌
ఫొటోలు: శ్రీనివాస్‌రావు

మానసిక సమస్యలకు స్నేహహస్తం

డిప్రెషన్‌... భారత్‌లో 20శాతానికి పైగా జనాభా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. ఆ సమస్యతోనే స్నేహితురాలు ఆత్మహత్యచేసుకుని చనిపోవడం చూసింది రిచాసింగ్‌. అందుకే... ముందు ముందు అలాంటి ప్రాణాలను కొన్నింటినైనా కాపాడాలని నిర్ణయించుకుందామె. అలా మొదలైందే ‘యువర్‌దోస్త్‌.కామ్‌’.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2011 నాటికి భారత్‌లో డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు 15శాతం. ఆశ్చర్యపోయేవిధంగా ఆ సంఖ్య 2015 నాటికి 20శాతానికి పెరిగింది. పైకి ‘మానసిక కుంగుబాటు’ ఓ జబ్బులా కనిపించదు. కానీ ఈ సమస్యతో 15-20 మధ్య వయస్కులైన యువతీ యువకులు ప్రతి ఐదు నిమిషాలకూ ఒకరు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. పరీక్షల్లో ఫెయిలయ్యామనో... ఆఫీసులో ఒత్తిడిని భరించలేకో... ప్రేమలో ఓడిపోయామనో... ఏదో కారణంతో కుంగుబాటుకు గురవడం, ఆత్మహత్యలు చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పటికీ మన సమాజం ‘మానసిక కుంగుబాటు’ను ఓ సమస్యలా గుర్తించకపోవడం బాధాకరమైన విషయం. దేశంలో ఉన్న ప్రభుత్వ మానసిక వైద్యశాలల సంఖ్య 50కి తక్కువ ఉన్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని కోట్లమందికి ఎదురవుతున్న ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలనుకుంది ఐఐటీ గువాహటి విద్యార్థిని రిచాసింగ్‌. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే యువర్‌దోస్త్‌.కామ్‌. మానసికంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా ఈ వెబ్‌సైట్‌లోని నిపుణులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. పనిలోనూ, చదువులోనూ, ప్రతిభను నిరూపించుకునే సమయంలోనూ, కుటుంబం, వివాహ బంధాల్లో ఎదురయ్యే సమస్యలతోనూ, సామాజిక పరమైన ఒత్తిళ్లు, ఆందోళనలతో కుంగుబాటుకు గురవడం అందరిలోనూ సాధారణమే. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలున్నపుడు వెంటనే డాక్టర్‌ దగ్గరికి వెళ్తారు, దాని గురించి వివరించి చెబుతారు. మానసికంగా పడుతున్న ఇబ్బందిని చెప్పుకోడానికి మాత్రం చాలామంది ముందుకురారు. ఒకవేళ డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా బిడియంతో మనసు విప్పి మాట్లాడలేరు. కానీ వైద్యుడి ఎదురుగా కూర్చున్నప్పుడు చెప్పలేనివారు కూడా ఫోన్లో అయితే చెప్పగలుగుతారు. దానికీ ఇబ్బంది పడతారనుకుంటే ఈమెయిల్‌లో మరింత సులభంగా మనసు విప్పగలరు. యువర్‌దోస్త్‌ చేస్తున్నదీ ఇదే. మొబైల్‌ ఆప్‌ లేదా వెబ్‌ పోర్టల్‌... దేని ద్వారా అయినా ఈ సైట్‌లోకి ఉచితంగా లాగిన్‌ అవ్వొచ్చు.

లక్షమందికి పైగా
యువర్‌దోస్త్‌లోని 200 మందికి పైగా నిపుణుల బృందంలో సైకాలజిస్టులూ, సైకోథెరపిస్టులతో పాటు శిక్షణ పొందిన కౌన్సెలింగ్‌ నిపుణులూ ఉంటారు. చదువు, ఉద్యోగం, వ్యక్తిగతం, ప్రేమ, కుటుంబం, పిల్లలూ ఇలా ఏ విషయానికి సంబంధించిన ఒత్తిడి గురించైనా ఈ సైట్‌లోని వైద్యులతో నేరుగా చాటింగ్‌ చెయ్యొచ్చు. అలాకాదనుకుంటే ఈమెయిల్‌ తరహాలో అక్కడున్న మెసేజ్‌ బాక్సులో మన సమస్య గురించి రాయొచ్చు. దానికి పరిష్కారాన్ని సూచిస్తూ కౌన్సెలింగ్‌ నిపుణులు మళ్లీ మెసేజ్‌ను పంపిస్తారు. అది మన లాగిన్‌ పేజీలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి అందరూ చూస్తారేమో అని భయపడాల్సిన పనికూడా లేదు. కావాలనుకుంటే ఫోన్‌లోనూ, వీడియో చాట్‌ ద్వారానూ మాట్లాడ్డానికి వైద్యుల అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. మనం మాట్లాడే సమయాన్ని బట్టి దీనికి కొంత ఫీజుని చెల్లించాల్సుంటుంది. ఈ వెబ్‌సైట్‌లోని నిపుణులను ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు. కౌన్సెలింగ్‌ తీసుకున్న వ్యక్తులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిపుణులకు రేటింగ్‌ ఇస్తారు. దాంతో మిగిలినవారికి కూడా మెరుగైన వైద్యులను ఎంపిక చేసుకోవడం సులభమవుతుంది. యువర్‌దోస్త్‌.కామ్‌ ద్వారా ఇప్పటికే లక్షమందికి పైగా తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. గ్రామాలూ పట్టణాలూ అనే తేడాలేకుండా ఎక్కడున్నవారైనా ఏ సమయంలో అయినా ఆన్‌లైన్‌ద్వారా నిమిషాల్లో మానసిక వైద్యుడిని సంప్రదించే వీలుండడంతో ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే ఈ సైట్‌ ఎంతో ఆదరణ పొందింది. అందుకే, స్నేహితులు పునీత్‌ మనుజ, ప్రాకార్‌ వర్మలతో కలసి బెంగళూరుకి చెందిన రిచాసింగ్‌ ప్రారంభించిన ఈ స్టార్టప్‌ రెడ్‌బస్‌ వ్యవస్థాపకుడు ఫణీందర్‌ శామా, అప్రమేయ రాధాకృష్ణ(ట్యాక్సీ ఫర్‌ ష్యూర్‌), అనీష్‌ రెడ్డి (క్యాపిల్లరీ)లాంటి వ్యాపారవేత్తలనూ ఆకర్షించింది. ప్రారంభమైన కొన్ని నెలల్లోనే యువర్‌దోస్త్‌ దాని అభివృద్ధికి ఏంజిల్‌ ఫండింగ్‌ ద్వారా రెండున్నర కోట్ల రూపాయలను సమకూర్చుకుంది.

నెల నెలా నలభై శాతం
‘క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సమయంలో అవకాశం రాదేమోననే ఒత్తిడిని తట్టుకోలేక నా స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మా కాలేజీలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా మానసిక వైద్యులూ కౌన్సెలింగ్‌ నిపుణులూ ఉంటారు. కానీ ఆమె కనీసం పక్కనున్న మాకు కూడా ఏమీ చెప్పుకోలేదు. ఆ ఒత్తిడితోనే ప్రాణాలు తీసుకుంది. అప్పుడే కుంగుబాటు అనేది ఎంత పెద్ద సమస్యో అర్థమైంది. అసోచామ్‌ నివేదికల ప్రకారం గత ఎనిమిదేళ్లలో కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఈ సమస్య 50శాతం పెరిగింది. దేశంలో ఏడుకోట్ల మంది మానసిక కుంగుబాటుకు గురౌతున్నారు. కానీ కుంగుబాటుకు గురైనవారిలో అయిదుగురిలో నలుగురు కౌన్సిలింగ్‌ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అందుకే, అందరికీ అందుబాటులో ఉండేలా బిడియం లేకుండా ఎవరైనా తమ సమస్యను చెప్పుకునే అవకాశాన్ని కల్పిస్తూ యువర్‌దోస్త్‌.కామ్‌ని ప్రారంభించా. దేశంలోని ఎంతోమంది ప్రముఖ సైకియాట్రిస్టులూ సైకోథెరపిస్టులను కలిసి ఒత్తిడి, కుంగుబాటు సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి అధ్యయనం చేసి ఈ వెబ్‌సైట్‌ని డిజైన్‌ చేశాం’ అంటుంది రిచాసింగ్‌. ఈ వెబ్‌సైట్‌లో సలహాలు పొందుతున్నవారు నెల నెలా నలభైశాతం పెరుగుతున్నారంటేనే అది ఎంతగా ఉపయోగపడుతోందో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.