close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పది లక్షల మందికి ప్రతిరోజూ భోజనం!

పది లక్షల మందికి ప్రతిరోజూ భోజనం!

  ‘అందరూ చదువుకోవాలి, అందరూ భోజనం చేయాలి’... ఇలాంటి మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో మాడిపోతూ స్కూళ్లకు దూరమవుతోన్న చిన్నారులు ఎంతోమంది. ఒక్కపూట భోజనం పెట్టగలిగినా చాలు, వాళ్లను రెండు పూటలా బడికి రప్పించొచ్చు. పదిహేడు దేశాల్లో ‘మేరీస్‌ మీల్స్‌’ అదే పనిచేస్తోంది. పది లక్షల మంది చిన్నారుల ఆకలి తీరుస్తూ, అక్షరాభ్యాసం చేయిస్తోంది.
కడుపు నిండా తిండి దొరుకుతుందని బడి మానేసి పనులకు వెళ్లే పిల్లలు మన పల్లెటూళ్లలో చాలామంది కనిపిస్తారు. అదే అన్నం హాయిగా స్కూలుకెళ్లి చదువుకున్నా దొరుకుతుందని తెలిస్తే ఎవరు మాత్రం ఆసక్తి చూపించరూ? ప్రపంచ వ్యాప్తంగా చదువుకు దూరమవుతోన్న పిల్లల్లో నూటికి 99శాతం మందికి పేదరికం, ఆకలి సమస్యలే కారణం. దానికి పరిష్కారం చూపిస్తే లక్షల మంది చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాది వేయొచ్చు. దాదాపు పన్నెండేళ్లుగా పదిహేడు దేశాల్లోని వేలాది పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పెడుతూ, స్కూళ్లను నిర్మిస్తూ పేద విద్యార్థులకూ చదువును చేరువ చేస్తోంది మేరీస్‌ మీల్స్‌. ఆ సంస్థ ద్వారా ప్రతిరోజూ కడుపు నిండా అన్నం తింటోన్న చిన్నారుల సంఖ్య సుమారు పది లక్షలు. స్కాట్లండ్‌కు చెందిన మాగ్నస్‌, ఫెర్గ్యూసన్‌ అనే ఇద్దరు అన్నదమ్ముల మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచన, ప్రస్తుతం భారత్‌తో సహా అనేక దేశాల్లో ఓ మహావృక్షమై విస్తరించింది.

యుద్ధ బాధితులకు సాయం
కేవలం ఇద్దరు వ్యక్తులు పది లక్షల మందికి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అనుకోకుండా ఈ అన్నదమ్ములు చేసిన ఓ సాయం వారి ప్రయాణాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం యూఎస్‌ఎస్‌ఆర్‌లో జరిగిన అంతర్గత యుద్ధాల కారణంగా బోస్నియా దేశంలో జనజీవనం ఛిద్రమైంది. ప్రజలు తిండికీ, గుడ్డకూ కరవై నానా ఇబ్బందులూ పడుతున్నారు. మాగ్నస్‌, ఫెర్గ్యూసన్‌ ఇద్దరూ చిన్నప్పుడు బోస్నియా చర్చిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఆ అనుబంధమే అన్నీ కోల్పోయిన ప్రజల కోసం ఏదైనా చేసేలా వారిని ప్రోత్సహించింది. వాళ్లకు ఆహారం, దుస్తులను అందించాలనే తమ ఆలోచనను వివరిస్తూ స్థానికంగా బాగా ప్రచారం చేశారు. స్పందనగా బోలెడన్ని దుస్తులూ, ఆహార పదార్థాలూ అందాయి. వాటన్నింటినీ ట్రక్కులో నింపుకొని బోస్నియాకు తీసుకెళ్లి పంచి తిరిగొచ్చారు.

ఆ పిల్లాడి మాటలవల్లే
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోకి అడుగుపెట్టడానికే అందరూ జంకుతున్న సమయంలో మాగ్నస్‌ సోదరులు చేసిన పని వాళ్లకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆ గుర్తింపును ఆస్వాదిస్తూనే తమ చేపల వ్యాపారంలో పడిపోయారు. అయినా బోస్నియా బాధితులకు అందించడానికి వచ్చే విరాళాలు మాత్రం ఆగలేదు. దాంతో పూర్తి స్థాయిలో బాధితులను ఆదుకునేందుకు ‘సర్‌’ (స్కాటిష్‌ ఇంటర్నేషనల్‌ రిలీఫ్‌)పేరుతో సంస్థను మొదలుపెట్టారు. రొమేనియా, క్రొయేషియా, లైబీరియా, బోస్నియా లాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఇళ్లు నిర్మించి, ఆహార, వైద్య సేవలను అందించేవారు. ఒకసారి ‘మలావి’లో యుద్ధ బాధితులను ఆదుకోవడానికి వెళ్లినప్పుడు ఎదురైన ఓ పరిణామం ఈ అన్నదమ్ముల ఆలోచనను పూర్తిగా మార్చేసింది. చావుకు దగ్గరగా ఉన్న ఓ ఎయిడ్స్‌ బాధిత మహిళ మాగ్నస్‌ సోదరుల కంటపడింది. ఆమె కొడుకు దగ్గరికి మాగ్నస్‌ వెళ్లి ‘నీకేం కావాలి’ అని అడిగితే ‘రోజూ అన్నం తినాలీ, ఏదో ఒక రోజు స్కూలుకెళ్లాలి’ అన్నాడట ఆ పిల్లాడు. ఆ మాటే ఆ అన్నదమ్ములను కొత్త బాటలో నడిపించింది. పిల్లల ఆహారం, చదువు దిశగా కృషి చేసేలా ప్రేరేపించింది. అలా మొదలైందే ‘మేరీస్‌ మీల్స్‌’.

మన దేశంలోనూ చురుగ్గా
ఆసియా, ఆఫ్రికా, యూరప్‌, ఉత్తర అమెరికా, కరేబియన్‌ దీవుల్లో పేదరిక సమస్యతో బాధపడుతున్న వేలాది గ్రామాల్లో మేరీస్‌ మీల్స్‌ పనిచేస్తోంది. స్కూళ్లలో మధ్యాహ్నం పూట భోజనం అందించడం మొదలుపెట్టిన నాటి నుంచీ ఆయా గ్రామాల్లోని స్కూళ్లలో హాజరీ రికార్డు స్థాయిలో పెరిగింది. లక్షలాది మంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించడం మానేసి స్కూళ్లలో చేర్పించడం మొదలుపెట్టారు. భారత్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో మేరీస్‌ మీల్స్‌ చురుగ్గా పనిచేస్తోంది. వరంగల్‌ జిల్లాలోని దర్మసాగర్‌ మండలంలోని గ్రామాలతో పాటూ చుట్టు పక్కల గ్రామాల్లోని స్కూళ్లలో పిల్లలు ఎలాంటి అటంకమూ లేకుండా చదువుకున్నారంటే అది మేరీస్‌ మీల్స్‌ చలవే. ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాల్లోనూ సంస్థే స్వయంగా భవనాలు నిర్మించి పాఠాలు చెప్పిస్తోంది. ‘బ్యాక్‌ప్యాక్‌ ప్రాజెక్టు పేరుతో ప్రైవేటు కార్పొరేట్‌ స్కూళ్లలోని విద్యార్థుల పాత బ్యాగులను సేకరించి వాటిలో పెన్నులూ, పెన్సిళ్ల లాంటి వస్తువులను నింపి సంస్థ ఏటా కొన్ని వేల స్కూళ్లకు అందిస్తోంది. ఎక్కడి వారికి అక్కడి స్థానిక ఆహారాన్నే కొని అందిస్తూ, స్థానిక వ్యాపారాల అభివృద్ధిలోనూ సహాయపడుతోంది.
సీఎన్‌ఎన్‌ హీరోస్‌, అవుట్‌స్టాండింగ్‌ యూత్‌ ఆఫ్‌ ది వరల్డ్‌-2005, ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులు ఈ అన్నదమ్ములను వరించాయి. ‘ఆ రోజు ఆ అబ్బాయి స్కూలుకి వెళ్లాలనుంది అని అడగకపోయి ఉంటే, ఇంతటి మహత్తర కార్యక్రమం మొదలయ్యుండేదే కాదు. ఇక జీవితంలో అలాంటి కోరిక కోరాల్సిన అవసరం ఏ చిన్నారికీ రాకుండా చేయాలనేదే మా ప్రయత్నం’ అంటారీ అన్నదమ్ములు. నెరవేరితే బాగుండు కదా.


 

కొత్త జీవితానికి ఆది ... ఉగాది!

  ఉగాది అంటే...కొత్త బెల్లమూ, కొత్త చింతపండూ, కొత్త పంచాంగమూ, కొత్త బట్టలే కాదు. మొత్తంగా సరికొత్త జీవితానికి ఆది...ఉగాది! లోపాల్నీ, బలహీనతల్నీ, భయాల్నీ వదిలేసుకుని మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవడమే సంవత్సరాది అంతరార్థం! ఆ సాధనలో భాగంగానే, మన పెద్దలు ఉగాది నియమావళిని రూపొందించారు.

గాది...యుగానికి ఆది. కలియుగం ప్రారంభమైన రోజు ఇదేనంటారు. చతుర్ముఖ బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టి మహత్కార్యాన్ని ఆరంభించాడని చెబుతారు. శకపురుషుడైన శాలివాహనుడు పట్టాభిషేకం చేసుకుందీ, శాలివాహన శకం మొదలైందీ ఉగాది నాడేనని ఐతిహ్యం. రావణ సంహారం తర్వాత...సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరుగు ప్రయాణమైందీ ఈరోజేనట. దశావతారాల్లో ఒకటైన...మత్సా్యవతారాన్ని శ్రీమహావిష్ణువు ధరించిన సుదినమూ ఇదే. కొత్త ఏడాదిలో...ఆధ్యాత్మిక భావనలతో, ఆరోగ్యవంతమైన అలవాట్లతో ఓ కొత్త జీవనశైలిని అలవరచుకోమని చెబుతుంది భారతీయ ధర్మం. ‘ధర్మసింధు’ సహా అనేకానేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఉగాదినాడు నిర్వర్తించాల్సిన ప్రాథమిక ధర్మాల్ని తెలియజేస్తున్నాయి.

ధ్వజారోహణం...
కర్మణ్యేవాధికారస్తే...నీకంటూ అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించడం వరకే నీ పని - అని హితవు చెబుతాడు గీతాచార్యుడు. కాబట్టే, సారథిగా మారి అర్జునుడి రథం తోలాడు. జెండాపై కపిధ్వజాన్ని అనుగ్రహించి ధర్మసంస్థాపనకు శ్రీకారం చుట్టాడు. ఆమాటకొస్తే, ప్రతి మనసూ కురుక్షేత్రమే. జీవన పోరాటంలో ధర్మానికి కట్టుబడిన ప్రతి పౌరుడూ పార్ధుడితో సమానమే. ‘నేను ధర్మబద్ధుడిని ప్రభూ!’...అని చాటుతూ ప్రతి ఇంట్లోనూ ఉగాదినాడు ‘భగవధ్వజారోహణం’ చేయాలని చెబుతారు పెద్దలు. ఇది ఉగాది తొలి నియమం.మనసు-శరీరం...ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఉగాది ‘తైలాభ్యంజనం’ అంతరార్థమూ అదే. తైలమర్దనం ద్వారా శరీరంలోని జడత్వం తొలగిపోతుంది. మనసుకూ హాయిగా అనిపిస్తుంది. ఆ చైతన్యాన్ని భౌతిక సుఖంగా భావించకూడదు, ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లించాలి. మూడోది ‘నవవస్త్రాభరణ ధారణం’...ఈరోజు కొత్తబట్టలు కట్టుకోవాలంటారు, స్తోమతను బట్టి కొత్త ఆభరణాలూ ధరించమంటారు. చక్కగా అలంకరణ చేసుకుంటే తనువు మురిసిపోతుంది. మనసూ సంబరపడిపోతుంది. ఆ నవోత్సాహాన్ని ఏడాదంతా కొనసాగించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. 

పూజాదికాలు..
అభ్యంజన స్నానంతో శరీరం పరిశుభ్రం అవుతుంది. పాత దుస్తులతో పాటూ మనలోని చెడునూ అహాన్నీ వదిలిపెట్టుకున్న భావన కలుగుతుంది. ఆ మనోస్థితితో ఏ పని తలపెట్టినా పరిపూర్ణమే. ఇప్పుడు, నాలుగో నియమం మొదలవుతుంది... ‘దమనేన బ్రహ్మపూజ’. సహజ సుగంధ పత్రాలతో దేవతల్ని అర్చించాలి. ఐదో నియమం...‘మహాశాంతి పూజ’! ఓం శాంతి...శాంతి...శాంతిః - అంటాం! నేను, నా కుటుంబం, మొత్తంగా ఈ ప్రపంచం - లోకాస్సమస్తా సుఖినోభవంతు అన్న సర్వహిత భావనకు ఇది తొలి అడుగు. ‘పంచాంగ పూజ’...ఆరో నియమం! పంచాంగం భవిష్యత్తుకు సంకేతం. పొలంలో విత్తు చల్లడం మొదలు ఇంట్లో శుభకార్యం దాకా - అన్నీ పంచాంగం ప్రకారమే జరుగుతాయి. ఏడాదంతా శుభాలను ఇవ్వమంటూ భవిష్యత్తు నిర్దేశకుడైన పరమాత్మను ప్రార్థించడమే పంచాంగపూజ. కొన్ని ప్రాంతాల్లో, ఉగాది మొదలు వసంత నవరాత్రులు జరుపుకునే సంప్రదాయం ఉంది. ఆ తొమ్మిది రోజులూ ‘వాసంత నవరాత్ర కలశపూజ’తో నియమబద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని ఈ నియమం ద్వారా చాటారు. 

ఆరోగ్యం కోసం..
‘నింబకుసుమ భక్షణం’... ఎనిమిదో నియమం! ఉగాది రోజున తప్పకుండా వేపపూవుతో చేసిన ఉగాది పచ్చడిని రుచి చూడాలి. ఆయుర్వేదంలో వేపకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక్క వేప చాలు...పాతిక రకాల రుగ్మతలు దరిదాపుల్లోకి కూడా రావని అంటారు. పచ్చడిలోని మామిడి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, జీలకర్ర అజీర్ణాన్ని హరిస్తుంది. బెల్లంలోనూ, చింతపండులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

సమాజం కోసం...
‘రాజ, మిత్ర సందర్శనం’ తొమ్మిదో నియమం. నేను, నా కుటుంబం అనుకుంటే మనిషి నూతిలోని కప్ప అవుతాడు. ఆత్మీయతల్ని పంచుకోవాలి. అనుబంధాల్ని పెంచుకోవాలి. మిగతా రోజుల్లో ఉరుకులూ పరుగులూ ఉండేవే. కనీసం పండగ పబ్బాల సమయంలో అయినా కలసి కబుర్లు చెప్పుకోవాలి, విందుభోజనాలు చేయాలి. పాఠాలు చెప్పిన గురువుల్నీ ఆపత్సమయంలో ఆదుకున్న పెద్దల్నీ దర్శించుకుని కృతజ్ఞతలు తెలియజేయాలి, పండగ శుభాకాంక్షలు చెప్పాలి. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష - అనుకుంటే సరిపోదు. సమాజం గురించీ ఆలోచించాలి. పదోది..‘ప్రపాదాన ప్రారంభం’. చలివేంద్రాల ఏర్పాటు కూడా పండగ రోజున మనం నిర్వర్తించాల్సిన ముఖ్య బాధ్యతే. ఆ స్తోమత లేదనుకుంటే... ఓ చిన్న గిన్నెలో నీళ్లు పోసి పక్షుల దాహం తీర్చవచ్చు. ఇక్కడ స్థాయి కాదు, ‘సంకల్పం’ ముఖ్యం! ఉగాది నియమాలన్నింటికీ ఇదే పునాది.


అడిగేయండి.. ఎవరినైనా ఏదైనా!

దీపికా పదుకొణెతో మాట్లాడాలా? విరాట్‌ కోహ్లిని ఏదైనా అడగాలా? అరవింద్‌ కేజ్రీవాల్‌కు సూటిగా ఓ ప్రశ్న సంధించాలా? మరి త్వరగా ప్రశ్నలను సిద్ధం చేసుకోండి. మీరు అడిగిన వాటికి నేరుగా జవాబులు చెప్పడానికి వాళ్లూ సిద్ధంగా ఉన్నారు. ‘ఫ్రాంక్లీ.మీ’... దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఎంతో మంది ప్రముఖులతో సాధారణ వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు వీడియోల ద్వారా సమాధానం చెప్పిస్తోంది.

టీవీలో విరాట్‌ కోహ్లి ఇంటర్వ్యూ వస్తుంటుంది. యాంకర్‌ ఏవేవో ప్రశ్నలు అడుగుతాడు. అందులో అభిమానులు ఎప్పట్నుంచో తెలుసుకోవాలని అనుకుంటున్న విషయం ప్రస్తావనకు