close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆవుల నేస్తం... షబ్బీర్‌ భాయ్‌

ఆవుల నేస్తం... షబ్బీర్‌ భాయ్‌

పశువుల కొట్టాంలో ముసలిదైపోయిన ఆవుని వూరికే పోషించలేని పరిస్థితి. అమ్మేద్దాం అంటే అది ఏ కసాయి వాడి చేతిలో పడుతుందో అని భయం... మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా వాసులు మాత్రం ఇలాంటి ఆలోచన రావడం ఆలస్యం వెంటనే ఆవుని తోలుకెళ్లి షబ్బీర్‌ సయ్యద్‌కు అప్పగించేస్తారు. ఆయన ఆవుల్ని ప్రాణంలా చూసుకుంటారు మరి.
హిందువులు ఆవును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, పూజిస్తారు. ఆ కారణంతోనే మాంసం కోసం వాటిని వధించడాన్ని తట్టుకోలేరు. మహారాష్ట్రకు చెందిన షబ్బీర్‌ సయ్యద్‌ కుటుంబం కూడా అంతే. ఆవుల మీదున్న ఆ ప్రేమే వాళ్లు తమ బతుకు తెరువు కోసం కాక వాటి బతుకు గురించి ఆలోచించేలా చేస్తోంది. స్థానిక బీడ్‌ జిల్లాలోని దహివండీగ్రామానికి చెందిన ఈ కుటుంబం ఆధ్వర్యంలో 165కు పైగా ఆవులూ ఎద్దులూ ఉన్నాయి. ముసలివయ్యాక వచ్చే సహజ మరణమే అయినా తమ దగ్గరున్న పశువుల్లో ఏది దూరమైనా వారికి కన్నీరాగదు. ఎందుకంటే వాళ్లు వాటిని పశువుల్లా కాకుండా తమ కుటుంబంలో ఓ భాగంగా చూస్తారు. ‘ఆవులు పాలిచ్చి ఓవైపు కడుపు నింపుతాయి. మరోవైపు పాలను అమ్మడం ద్వారా కుటుంబం ఆర్థికంగానూ నిలదొక్కుకుంటుంది. ఎద్దులు వ్యవసాయ పనుల్లో ఎంతో చేదోడుగా ఉంటాయి. కానీ దేనికైనా వయసూ ఒంట్లో శక్తీ ఉన్నంత వరకే విలువ. పనిలేని వాటిని పాత సామాన్ల కొట్టుకి తరలించినట్లు ముసలివైపోయిన ఆవుల్ని తక్కువ ధరకి ఎవరో ఒకరికి అమ్మేస్తారు యజమానులు. ఆ తర్వాత అవి మాంసం విక్రయదారుల చెంతకు చేరతాయి. నిజానికి ఒకప్పుడు మా కుటుంబం మాంసం విక్రయించే వృత్తిలోనే ఉండేది. అది వంశపారంపర్యంగా మా కుటుంబ వృత్తి. పైగా అదే మా జీవనాధారం. కానీ మనిషికి ఇంత ఉపకారం చేసే ఆవులూ ఎద్దుల మాంసాన్ని అమ్ముతున్నందుకు మానాన్న చాలా బాధపడేవారు. పైగా గ్రామస్థులు కూడా మాకు పశువులంటే జాలి లేదన్నట్లు మాట్లాడేవారు. దాంతో 45ఏళ్ల కిందట ఆయన ఆ వృత్తిని వదిలేశారు. అంతేకాదు, వధించడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆవుల్ని కొని పోషించడం మొదలు పెట్టారు’ అంటూ తమ గోసేవ వెనక ఉన్న కథను చెబుతారు 55 ఏళ్ల షబ్బీర్‌.

తండ్రి బాటలోనే...
పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా షబ్బీర్‌కి కూడా తండ్రిలానే పెద్ద మనసుంది. అందుకే, ఆయన బాటలో నడుస్తూ 1972లో మాంసం విక్రయదారుల నుంచి పది ఆవులను కొన్నాడు. గొప్ప విషయం ఏంటంటే... ఆదాయానికి మరో ఉపాధి మార్గం లేకపోయినా వీళ్లు ఆవుల పాలను కూడా అమ్మరు. వాటికి పుట్టిన దూడల్ని మాత్రం పెద్దవయ్యాక స్థానికంగా ఉండే రైతులకు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. ఎందుకంటే ముసలివయ్యాక వాటిని తిరిగి తమకే అప్పగించాలని షబ్బీర్‌ రైతుల దగ్గర లిఖిత పూర్వక హామీ తీసుకుంటారు. కొన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పశువులను మాంసం కోసం విక్రయించకూడదనే ముందు జాగ్రత్త ఇది. మూగ జీవాల ప్రాణాలను కాపాడ్డానికి షబ్బీర్‌ పడుతున్న ఈ తాపత్రయాన్ని చూసే చుట్టుపక్కల గ్రామాలలోని రైతులు కూడా తాము పోషించలేని ముసలి ఆవుల్నీ ఎద్దుల్నీ వీరి దగ్గరకు తీసుకొచ్చి వదులుతున్నారు. అలా గత నలభయ్యేళ్ల నుంచీ ఆయన దగ్గరికొచ్చే పశువుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ప్రస్తుతం 165కు చేరింది. ఎప్పటికప్పుడు వృద్ధాప్యం వల్ల కొన్ని చనిపోతుంటే మరికొన్ని కొత్తవి వస్తూనే ఉంటాయి. పది ఆవులుంటేనే వాటికోసం పూర్తి సమయాన్ని కేటాయించాలి. అలాంటిది ఇన్ని ఆవుల పెంపకం అంటే ఎంత పెద్ద విషయమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, షబ్బీర్‌తో పాటు ఆయన భార్య అష్రబి, కొడుకులు రంజాన్‌, యూసఫ్‌, కోడళ్లు రిజ్వాన్‌, అంజుమ్‌లు కూడా పశువులను మేతకు తోలుకెళ్లడం, నీళ్లు పెట్టడం ఇతర పనులన్నింటిలో పాలుపంచుకుంటారు. అంతేకాదు, ఈ కుటుంబంలోని ఎవ్వరూ పశుమాంసాన్ని తినరు.

అదే మా సంతోషం...
రోజంతా ఆవుల సేవలోనే ఉండే వీరికి వేరే పని చెయ్యడానిక్కూడా కుదరదు. ఈ పశువుల పేడను ఎరువుకోసం అమ్మడం ద్వారా వచ్చే ఆదాయమే వీరికి జీవనాధారం. ఈరోజుల్లో కూడా వారి దగ్గర కనీసం ఫోను సౌకర్యం లేదంటే ఆ కుటుంబం ఎంత పేదరికంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘ఆర్థికంగా మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఎన్నో మూగజీవాల ప్రాణాలను నిలబెడుతున్నామన్న తృప్తి పేదరికంలో కూడా మమ్మల్ని సంతోషంగా ఉంచుతోంది. అయితే, మా బాధంతా పశువుల గురించే. కొంతకాలంగా స్థానికంగా నీటి సమస్య బాగా పెరిగిపోయింది. ఒక్కో ఆవుకు తాగడానికి ప్రతిసారీ 10-15లీటర్ల నీళ్లు కావాలి. ఆ లెక్కన రోజుకి మొత్తం పశువులకు సుమారు 1500 లీటర్ల నీళ్లు అవసరమవుతున్నాయి. పైగా నీటి సమస్య వల్ల చుట్టుపక్కల పచ్చగడ్డి కూడా తగ్గిపోతోంది. దాంతో పశువులు బలహీనం అయిపోతున్నాయి. అలాంటివి దూడలకు మాత్రం పాలెలా ఇవ్వగలవు... గత ఐదేళ్లలో 12 పశువులు చనిపోయాయి. సరైన పోషకాహారం ఉంటే అవి మరికొన్ని రోజులు బతికేవేమో’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తారు షబ్బీర్‌ కొడుకు యూసఫ్‌. ఎంతైనా ఆ కుటుంబానిది చాలా పెద్ద మనసు..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.