close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంస్థ వయసు ఆర్నెల్లు..సంపాదన 20వేల కోట్లు!

సంస్థ వయసు ఆర్నెల్లు..సంపాదన 20వేల కోట్లు!

పది నెలల క్రితం మనుగడలో లేని ఓ సంస్థ బయోటెక్‌ చరిత్రను తిరగరాసింది. 33కోట్ల రూపాయల పెట్టుబడితో మొదలైన సంస్థ షేర్లు పబ్లిక్‌ ఇష్యూలో 20వేల కోట్ల రూపాయలకు అమ్ముడై చరిత్ర సృష్టించాయి. ఆ గణాంకాలు ప్రపంచ ఫార్మా దిగ్గజాలనే విస్మయపరిచాయి. ఆ సంస్థ పేరు ‘యాక్సోవెంట్‌’. దాని వ్యవస్థాపకుడు 29ఏళ్ల కుర్రాడు వివేక్‌ రామస్వామి... ఓ భారతీయుడు.
మూడేళ్ల వయసు కూడా లేని ఐటీ కంపెనీలు వందల కోట్లు పలకడం, బుడిబుడి అడుగులేస్తోన్న మొబైల్‌ అప్లికేషన్లు వేల కోట్లకు అమ్ముడవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎంతో పోటీ ఉన్న ఫార్మా రంగంలో అలాంటి అమ్మకాలను వూహించడం కూడా కష్టమే. సరైన దారిని ఎంచుకుంటే అదేమీ అసాధ్యం కాదని నిరూపించాడు వివేక్‌ రామస్వామి. గత డిసెంబర్‌లో యాక్సోవెంట్‌ పేరుతో బయోటెక్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని వేధిస్తోన్న అల్జీమర్స్‌కు మందును అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. ఆ పరిశోధనలో అతడి సంస్థ సాధించిన ప్రగతి వల్ల సంస్థ విలువ అమాంతం పెరిగిపోయింది.

* నిజానికి అల్జీమర్స్‌కు మందు తయారీ కోసం జరిగిన పరిశోధనల్లో 99శాతం విఫలమయ్యాయి. ప్రముఖ బయోటెక్‌ సంస్థ ‘గ్లాక్సో స్మిత్‌కైన్‌’ కూడా ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేసి అల్జీమర్స్‌ గుళికలను ఓ దశ వరకూ అభివృద్ధి చేసి, అంతకుమించి ప్రగతి సాధించలేక అక్కడితో ఆపేసింది. వివేక్‌ రామస్వామి ఆ ప్రగతిని గమనించి, ఆ ఫార్ములాను సుమారు రూ.33కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. యాక్సోవెంట్‌ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థలో కేవలం ఆ ఒక్క ఔషధం మీదే పరిశోధనలు చేయించడం మొదలుపెట్టాడు. సుమారు ఏడొందల మందిపైన నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్‌ü్సలో ‘యాక్సోవెంట్‌’ గుళికలు స్పష్టమైన ఫలితాల్ని నమోదు చేశాయి. దాంతో మార్కెట్‌ వర్గాల్లో ఆ మందుపైన ఆసక్తి పెరిగింది.
* అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాల్లో రానున్న రెండు దశాబ్దాల్లో అల్జీమర్స్‌ బాధితుల సంఖ్య బాగా పెరగనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అల్జీమర్స్‌ పరిశోధనలో ‘యాక్సోవెంట్‌’ సాధించిన ప్రగతి భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో పెరిగింది. అదే సరైన సమయం అనిపించి వివేక్‌ ‘యాక్సోవెంట్‌’ను స్టాక్‌మార్కెట్‌లో పబ్లిక్‌ ఇష్యూకు పెట్టాడు. అతడు వూహించిన దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా సంస్థ షేర్లన్నీ సుమారు 19,980 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అప్పటికి సంస్థ వయసు ఆర్నెల్లు.
* తమిళనాడుకు చెందిన వివేక్‌ కుటుంబం అమెరికాకు వలసవెళ్లింది. వివేక్‌ తండ్రి అక్కడ జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంస్థలో పనిచేసేవాడు. తల్లి సైకియాట్రిస్ట్‌. జూనియర్స్‌ విభాగంలో వివేక్‌ జాతీయస్థాయి టెన్నిస్‌ క్రీడాకారుడు. పియానో వాయించడంలోనూ అతడికి పట్టుంది. తల్లి రోగులకు అల్జీమర్స్‌ చికిత్స చేస్తున్నప్పుడు, ఓ థెరపీలో భాగంగా రోగుల ముందు కూర్చొని వివేక్‌ పియానో వాయించేవాడు. అలా ఆ వ్యాధిపైన చిన్నవయసులోనే అతడికో అవగాహన వచ్చింది. తరవాత సైన్స్‌కు సంబంధించిన పరిశోధనా రంగంలో పనిచేయాలనిపించి హార్వర్డ్‌ యూనివర్సిటీలో బయాలజీ డిగ్రీలో చేరాడు.
* హార్వర్డ్‌లో చదువుతున్నప్పుడే స్నేహితుడితో కలిసి ‘స్టూడెంట్‌బిజినెస్‌.కామ్‌’ అనే ఓ సంస్థను వివేక్‌ నెలకొల్పాడు. యేల్‌, మసాచుసెట్స్‌, కేంబ్రిడ్జ్‌ లాంటి యూనివర్సిటీల విద్యార్థుల ఆలోచనలను వ్యాపారవేత్తలూ, ఇన్వెస్టర్ల దగ్గరకు తీసుకెళ్లి, ఆ ఆలోచనలు సంస్థలుగా మారేందుకు సాయం చేయడం వివేక్‌ సంస్థ పని. ఓ పక్క సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే, ఫైనలియర్‌ కోర్సులో హార్వర్డ్‌లోనే తొలి స్థానంతో డిగ్రీ పూర్తిచేశాడు. పరిశోధకుడిగా అవకాశం రావడంతో, తన సంస్థను అమ్మేసి ఆ ఉద్యోగంలో చేరాడు.
* వివేక్‌కు బయాలజీపైన మంచి పట్టుంది. స్టెమ్‌ సెల్స్‌ ఆధారంగా మనుషులూ, పక్షుల లక్షణాలతో ఉండే కొత్త జీవుల్ని సృష్టించే అంశంపైన పరిశోధనలు చేసి కొన్ని పత్రాలనూ ప్రచురించాడు. కాలేజీ రోజుల్లోనే వ్యాపారాన్ని అతడు నిర్వహించిన తీరు నచ్చి ‘హెడ్జ్‌ ఫండ్స్‌’ అనే ఫైనాన్స్‌ సంస్థ అతడికి మంచి జీతంతో ఉద్యోగం ఇవ్వడానికి ముందుకొచ్చింది. తన రంగంలో స్థిరపడాలంటే కనీసం పదేళ్లు పడుతుందనిపించి, వచ్చిన అవకాశం వైపే వివేక్‌ మొగ్గు చూపాడు.
* హెడ్జ్‌ ఫండ్స్‌లో ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నా బయాలజీపైన వివేక్‌కున్న ఆసక్తి తగ్గలేదు. తాను సంపాదించే డబ్బులన్నింటినీ రకరకాల మందుల అభివృద్ధిపైన పరిశోధనలు జరుపుతోన్న సంస్థల షేర్లు కొనడానికే ఖర్చు చేసేవాడు. అవి మంచి లాభాల్నే తెచ్చిపెట్టాయి. దాంతో కాలేజీలో తన జూనియర్లనూ, ఇంకొందరు స్నేహితులనూ కలిపి ‘రాయ్‌వెంట్‌’ అనే చిన్న పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశాడు. ‘రాయ్‌వెంట్‌’లో భాగస్వాములు ఎక్కువగా ఉండటంతో సొంతంగా మరో సంస్థను మొదలుపెట్టాలనుకున్నాడు. అదే ‘యాక్సోవెంట్‌’.
* ‘యాక్సోవెంట్‌’లో వివేక్‌, అతడి తల్లీ, తమ్ముడితో పాటు మరో ఏడుగురే ఉద్యోగులు. ఆ బృందమే వాళ్లు కొనుగోలు చేసిన ఫార్ములాను అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. ఆ పరిశోధనలు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లాయి. ఆ సమయంలోనే వివేక్‌కు పెళ్లయింది. ఫ్రాన్స్‌లో హనీమూన్‌కు ఏర్పాట్లూ చేసుకున్నాడు. కానీ అదే సమయంలో తన సంస్థ ఐపీవోకు వెళ్లాల్సి రావడంతో హనీమూన్‌ ప్రణాళికను రద్దు చేసుకుని భార్యతో కలిసి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో వాలిపోయాడు. ఆరోజు ‘యాక్సోవెంట్‌’ షేర్లన్నీ సుమారు 20వేల కోట్లకు అమ్ముడై, ఎన్‌వైఎస్‌ఈ చరిత్రలో అతిపెద్ద బయోటెక్‌ షేర్ల లావాదేవీకి తెరతీశాయి. ఆ దెబ్బతో ఈ కొత్త జంట బిలియనీర్ల జాబితాలో చేరిపోయింది. వివేక్‌కు ఈ ఏడాది ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కింది. రానున్న రోజుల్లో ఫార్మా రంగంలో సంపదలోనూ, ఆవిష్కరణల్లోనూ వివేక్‌ సంచలనాలు సృష్టిస్తాడని ఆ రంగ నిపుణుల అంచనా. ఈ దూకుడు చూస్తోంటే ఆ రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది కదూ..!


గూగుల్‌కు పోటీ అతనొక్కడే!

ఇంటర్నెట్‌ ప్రపంచానికి పెద్దన్న గూగుల్‌. అలాంటి గూగుల్‌నే వణికిస్తోన్న వెబ్‌సైట్‌ బైదు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తరవాత ఇంటర్నెట్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న వెబ్‌సైట్‌ అది. చైనాలోంచి గూగుల్‌ని దాదాపు బయటకు పంపి 90శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకున్న బైదు, అంతర్జాతీయ సెర్చ్‌ ఇంజిన్లలో గూగుల్‌ తరవాతి స్థానంలో కొనసాగుతోంది. దాని వ్యవస్థాపకుడు రాబిన్‌ లీ టెక్‌ప్రపంచంలో ఓ సంచలనం.ప్రపంచంలో ఎక్కడైనా సినీతారలకు అభిమాన సంఘాలుంటాయి. కానీ చైనాలో సినిమా వాళ్లతో పాటు రాబిన్‌ లీకి కూడా బోలెడన్ని అభిమాన సంఘాలున్నాయి. గూగుల్‌ ధాటికి ప్రపంచంలో ఎన్నో సెర్చ్‌ ఇంజిన్లు ఉనికిని కోల్పోయాయి. కానీ చైనాలో మాత్రం బైదు దాటికి గూగుల్‌కే ఆ దేశంలో నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. పదిహేనేళ్ల క్రితం గూగుల్‌ ఏర్పడుతోన్న సమయంలోనే చైనాలో ‘బైదు’ సంస్థను మొదలుపెట్టాడు రాబిన్‌. మొదట్లో గూగుల్‌కీ, బైదూకీ మధ్య గట్టి పోటీ నడిచేది. కానీ తనదైన శైలిలో సంస్థను ముందుకు నడిపి అతి తక్కువ కాలంలోనే దేశంలో బైదుని నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకొచ్చాడు రాబిన్‌. ఇంటర్నెట్‌ సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్‌ నుంచి చైనాను బయటకు తీసుకొచ్చి తమదైన ముద్ర వేసినందుకే రాబిన్‌కు అక్కడ అంతమంది అభిమానులు.

* చాలా దేశాల్లో గూగుల్‌కు పోటీగా ఎన్నో సెర్చ్‌ ఇంజిన్లు వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ యాహూ, బింగ్‌ లాంటి సంస్థలు వెలిశాయి. కానీ బైదు తప్ప మరేదీ గూగుల్‌కు ఎదురు నిలవలేకపోయింది. ఆ విజయానికి బోలెడన్ని కారణాలున్నాయి. బైదు స్థానికతకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఉదాహరణకు బైదులోకి వెళ్లి ‘టాటూ’ అని కొడితే స్థానికంగా టాటూలు వేసే కళాకారులు ఎక్కడున్నారూ, దేశంలో ఎలాంటి టాటూల ట్రెండ్‌ నడుస్తోంది లాంటి సమాచారం వస్తుంది. అదే ‘రైస్‌’ అని కొడితే నాణ్యమైన బియ్యం ఎక్కడ దొరకుతుంది, మార్కెట్లో ధరల వ్యత్యాసం ఎలా ఉంది లాంటి సమాచారమంతా వస్తుంది. గూగుల్‌ అంతర్జాతీయ వినియోగదార్లను దృష్టిలో పెట్టుకొని పేజీల కొద్దీ సమాచారం అందిస్తుంది. దానికి భిన్నంగా బైదు స్థానిక సంస్థలనూ, అక్కడివాళ్ల అవసరాలనూ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ ఫలితాలను మాత్రమే ముందుకు తీసుకొస్తుంది. బైదు విజయానికి అదే ప్రధాన కారణం.

* పదహారేళ్ల క్రితం సెర్చ్‌ ఇంజిన్‌కు సంబంధించిన కొన్ని పేటెంట్ల కోసం గూగుల్‌ వ్యవస్థాపకుడు లారీపేజ్‌ కంటే ముందే రాబిన్‌ లీ దరఖాస్తు చేశాడు. తాను కనిపెట్టిన టెక్నాలజీ ఆధారంగానే లారీపేజ్‌ గూగుల్‌ను అభివృద్ధి చేశాడంటూ అప్పట్లో రాబిన్‌ కొన్ని ఇంటర్వ్యూల్లో పేర్కొన్నాడు. కానీ బైదు మొదట్లో చైనాను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఏర్పడటం, గూగుల్‌ అంతర్జాతీయంగా విస్తరించే ప్రయత్నాల్లో పడటంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది.

* బైదు విజయంతో ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న రాబిన్‌ పుట్టి పెరిగింది మాత్రం ఓ పేద కుటుంబంలో. అతడి తల్లిదండ్రులు చైనాలో ఓ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేసేవారు. తాను బాగా చదువుకోవడానికి స్ఫూర్తి తన తల్లేనంటాడు రాబిన్‌. చిన్నప్పట్నుంచీ తమ పేదరికం గురించీ, బాగా చదువుకుంటే కలిగే ప్రయోజనాల గురించీ రాబిన్‌ తల్లి అనుక్షణం గుర్తు చేస్తుండేదట. ఆ ప్రోత్సాహంతోనే చైనాలో ఇంటర్‌ పూర్తి చేయగానే అమెరికాలో బ్యాచిలర్‌ డిగ్రీ సీటుకు దరఖాస్తు చేశాడు. ప్రవేశ పరీక్షలో టాపర్‌గా నిలవడంతో అక్కడి పెకింగ్‌ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌తో పాటు కంప్యూటర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో సీటు కూడా వచ్చింది. ఆ తరవాత బఫెలో యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో పీజీ చేసిన రాబిన్‌, రెండేళ్ల పాటు పీహెచ్‌డీ కూడా చేశాడు. కానీ దాన్ని కొనసాగించడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించక మధ్యలోనే ఆపేసి అక్కడే ‘డో జోన్స్‌’ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు.

* ‘డో జోన్స్‌’లో పనిచేస్తున్నప్పుడే ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక ఆన్‌లైన్‌ ఎడిషన్‌కు సాఫ్ట్‌వేర్‌ తయారు చేసిచ్చాడు రాబిన్‌. ఆ ప్రాజెక్టు అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. తరవాత ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్లకు ర్యాంకింగ్‌లు ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. తాను తయారుచేస్తోన్న సాఫ్ట్‌వేర్‌ భవిష్యత్తులో సంచలనాలు సృష్టించనుందని అప్పుడే వూహించాడు. అందుకే ఉద్యోగం వదిలేసి చైనాకు తిరిగొచ్చి అక్కడే తన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. సెర్చ్‌ ఇంజిన్‌ తయారీ పూర్తయ్యాక దానికి ‘బైదు’ అని పేరు పెట్టి ఓ హోటల్‌ గదిని లీజుకి తీసుకొని కార్యకలాపాలు మొదలుపెట్టాడు. వందల సార్లు వెతికినా దొరకని వస్తువు అనుకోకుండా కంట పడిందన్న అర్థంలో ‘బైదు’ అన్న పదాన్ని చైనాలో వాడతారు.

* గూగుల్‌ తరహాలోనే మ్యాప్స్‌, న్యూస్‌, ఎన్‌సైక్లోపీడియా, గేమ్స్‌, ఎంపీ3, ఫుడ్‌ డెలివరీ లాంటి 60 విభాగాల్లో బైదు సేవలందిస్తోంది. క్రమంగా అది దేశంలో నంబర్‌ వన్‌ వెబ్‌సైట్‌గా ఎదగడంతో పాటు రాబిన్‌ చైనాలో అత్యంత సంపన్నుడిగానూ అవతరించాడు. జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా లాంటి అనేక ఆసియా దేశాల్లో బైదు వేగంగా విస్తరిస్తోంది. ‘చైనా మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకున్నాం. ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాం. మరో పదిహేనేళ్లలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా నిలవాలన్నది మా లక్ష్యం. మా తరవాత ఎక్కువ ఇంటర్నెట్‌ వినియోగదారులున్న భారత్‌ మార్కెట్‌ను కైవసం చేసుకోగలిగితే అదేమంత కష్టం కాదు’ అంటాడు రాబిన్‌.

అత్యుత్తమ టెక్‌ శాస్త్రవేత్తల్లో ఒకడిగా రాబిన్‌కు పేరుంది. ప్రస్తుతం అతడి సంపద విలువ రూ.95వేల కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశిస్తే గూగుల్‌కు పోటీగా నిలిచే సత్తా బైదుకి మాత్రమే ఉందన్నది టెక్‌ నిపుణుల అంచనా. ప్రస్తుతం రాబిన్‌ ప్రయత్నం కూడా అదే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.