close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రెండు కోట్లమందికి మాస్టర్‌!

రెండు కోట్లమందికి మాస్టర్‌!

బిల్‌గేట్స్‌ తన పిల్లలకు అతడి పాఠాలు వినిపించాడు. ‘లింక్డిన్‌’ సీయీవో జెఫ్‌ వీనర్‌ అతడిని ఇంటర్వ్యూ చేశాడు. రతన్‌ టాటా లాంటి దిగ్గజం అతడితో పనిచేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. సల్మాన్‌ ఖాన్‌... ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ పాఠశాల ‘ఖాన్‌ అకాడమీ’ సృష్టికర్త. ఆ అంతర్జాల విశ్వవిద్యాలయంలో దాదాపు రెండు కోట్ల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారు..!

ఈ మధ్య వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘ఓ వ్యక్తి చొరవతో దాదాపు రెండు కోట్ల మంది చదువుకోవడం అంటే మాటలు కాదు. ఆ ప్రయాణంలో భాగమవ్వాలని నాకూ ఆశగా ఉంది’ అన్నారు, ఆ సంస్థలో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటిస్తూ. టాటా పెట్టుబడి పెడుతున్నారంటే అదేదో భారీ వ్యాపారం అనుకోవడం సహజం. కానీ ఖాన్‌ అకాడమీ ఉచితంగా చదువు చెప్పే ఓ వెబ్‌సైట్‌. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ విద్యార్థుల వరకూ అందరికీ అందులో పాఠాలూ, ప్రాక్టీస్‌ సెషన్లూ, క్విజ్‌ రూపంలో ప్రశ్నల లాంటి సమస్త సమాచారం ఉంటుంది. ఆరేళ్ల క్రితం మొదలైన ఆ వేదికలో దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు.
* సల్మాన్‌ ఖాన్‌ అమెరికాలో పుట్టిపెరిగిన భారత సంతతి వ్యక్తి. చిన్నప్పట్నుంచీ చదువులో మహా చురుకు. ర్యాంకుల కోసం కాకుండా విషయాన్ని నేర్చుకోవడం మీదే దృష్టిపెట్టేవాడు. స్కూల్లో మ్యాథ్స్‌, సైన్స్‌ లాంటి తెలివికి సంబంధించిన సబ్జెక్టులలో ఖాన్‌కు తిరుగుండేది కాదు. కానీ బట్టీ పట్టే సబ్జెక్టులంటే మాత్రం బోరు కొట్టేది. దానివల్ల తెలివైన విద్యార్థిగా పేరున్నా, ర్యాంకర్‌గా మాత్రం గుర్తింపు రాలేదు.
* ‘త్రీ ఇడియెట్స్‌’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌కు నిజ జీవితంలో నకలులా కనిపిస్తాడు సల్మాన్‌. లెక్కల పైన ఇష్టంతో మొదట మసాచుసెట్స్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. ఆ తరవాత కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీలతో పాటు ఆ రెండు సబ్జెక్టుల్లో పీజీ కూడా పూర్తిచేశాడు. అప్పటికే బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మరో రెండేళ్ల తరవాత ఉద్యోగం చేద్దామనిపించి, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో ఎంబీఏలో చేరి, ఆ కోర్సునూ విజయవంతంగా పూర్తిచేసి చదువుపైన తన ఇష్టాన్ని చాటుకున్నాడు ఖాన్‌.
* ఎంబీఏ పూర్తవగానే ప్రఖ్యాత ఫైనాన్స్‌ సంస్థ ‘హెడ్జ్‌ ఫండ్స్‌’లో ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌గా ఖాన్‌ ఉద్యోగంలో చేరాడు. మార్కుల పరంగా చూస్తే అతడి సహోద్యోగులు చాలామంది యూనివర్సిటీ స్థాయి టాపర్లు. కానీ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ను తయారు చేయడానికి కూడా వాళ్లు ఇబ్బంది పడటాన్ని ఖాన్‌ గమనించాడు. వాళ్లతో పాటు తరవాత చేరేవారికీ పనికొస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులో రోజూ కొంత సమయాన్ని కేటాయించి, సొంతంగా శిక్షణకు సంబంధించిన పాఠాలు చెబుతూ వాటిని రికార్డు చేసి తోటి వాళ్లకు ఇచ్చేవాడు. ఓ రోజు సంస్థ సీయీవో దృష్టిలో ఈ వీడియోలు పడ్డాయి. ఆఫీసు సమయాన్ని వృథా చేస్తూ ఇలా వీడియోలు తీస్తున్నందుకు బాసు తిడతాడేమో అని ఖాన్‌ భయపడ్డాడు. కానీ ‘హెడ్జ్‌ ఫండ్స్‌లో ఓ కొత్త సంస్కృతికి మీరు తెరతీశారు. దీన్ని ఇలానే కొనసాగించండి’ అని ప్రోత్సహించడంతో ఖాన్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపయింది.
* ఖాన్‌ మేనకోడలు నదియా అమెరికాలోనే వేరే రాష్ట్రంలో ఉండేది. ఆ అమ్మాయికి లెక్కలంటే కాస్త భయం. ఖాన్‌కు లెక్కల్లో తిరుగులేదు. అందుకే ‘యాహూ డూడుల్‌’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రోజూ ఓ గంటసేపు ఆ అమ్మాయికి పాఠాలు చెప్పేవాడు. ఆ విషయం చుట్టాలూ, స్నేహితులకూ తెలిసీ వాళ్లు కూడా ఖాన్‌ను పాఠాలు చెప్పమని అడిగేవారు. ఒకేసారి అంతమందికి చెప్పాలంటే యూట్యూబే సరైన వేదిక అనిపించింది. అందుకే రోజూ కొన్ని పాఠాలు రికార్డు చేసి యూట్యూబ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా సన్నిహితులే కాకుండా తెలీనివాళ్లు కూడా వేల సంఖ్యలో వాటిని చూడటం మొదలుపెట్టారు. ఉద్యోగం కంటే పాఠాలు చెప్పడమే బావుందనిపించి ‘హెడ్జ్‌ ఫండ్స్‌’ కొలువుకు రాజీనామా చేశాడు. ‘ఖాన్‌ అకాడమీ’ పేరుతో ఆన్‌లైన్‌లో ఎలిమెంటరీ స్కూల్‌ నుంచి ఎంబీబీఎస్‌ వరకు అన్ని రకాల పాఠాలనూ అందుబాటులోకి తేవడం మొదలుపెట్టాడు.
* ప్రస్తుతం ‘ఖాన్‌ అకాడమీ’ వెబ్‌సైట్‌లో హిందీ, ఉర్దూ, మలయాళం, బెంగాలీ, చైనీస్‌ లాంటి అరవై ఐదు భాషల్లో ఐదు వేల కోర్సులకు సంబంధించిన వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకూ ప్రాక్టీస్‌ సెషన్లతో పాటు క్విజ్‌ పోటీలు లభ్యమవుతున్నాయి.
* అకాడమీని డబ్బుల కోసం నడిపిస్తే ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా సల్మాన్‌ ఖాన్‌ నిలుస్తాడని ఫోర్బ్స్‌ పత్రిక అంచనా. కానీ ఖాన్‌ లక్ష్యం నాణ్యమైన విద్యను మారుమూల ప్రాంతంలోని విద్యార్థులకు కూడా అందించడమే. అందుకే ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని అనేక పేద దేశాల్లో ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రాంతాలకు టీవీలను సరఫరా చేసి వెబ్‌సైట్‌లోని వీడియోలను సీడీల రూపంలో ఎప్పటికప్పుడు పంపిస్తున్నాడు.
* ఖాన్‌ ప్రయత్నం ఎంతలా విస్తరించిందంటే... ప్రపంచ సంపన్నుడు బిల్‌గేట్స్‌ తన పిల్లలకూ ఖాన్‌ అకాడమీలో పాఠాలను వినిపించినట్లు ఓ సందర్భంలో చెప్పాడు. బిల్‌గేట్స్‌, కార్లస్‌ స్లిమ్‌, రతన్‌ టాటాల సంస్థలతో పాటు గూగుల్‌ కూడా ఖాన్‌ అకాడమీ ద్వారా ఉచిత విద్యను అందించేందుకు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. వ్యక్తిగతంగా ఖాన్‌ సాధించిన పురస్కారాలూ గౌరవాలకు లెక్కేలేదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్న సంస్థ ఖాన్‌ అకాడమీనే. మరి వాళ్ల నుంచి ఫీజు తీసుకునే ఆలోచన లేదా అంటే ‘మా విద్యార్థుల విజయమే మాకు గురుదక్షిణ లాంటిది’ అంటాడు ఖాన్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.