close
అలాంటి అభిమానిని చూడలేదు!

అలాంటి అభిమానిని చూడలేదు!

వరసగా ఐదు విజయాలు... ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత లావణ్య త్రిపాఠి సొంతమైంది. ఆరంభంలోనే ‘అందాల రాక్షసి’గా కుర్రాళ్ల గుండెల్లో గుచ్చేసింది. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లాంటి సినిమాలతో విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అంటూ సందడి చేసిన లావణ్య, ఇక్కడి వరకూ రావడానికి వెనకున్న లెక్కలేంటో చెబుతోంది.
మిథున... ఇప్పటికీ చాలామంది నన్ను ఆ పేరుతోనే పిలుస్తారు. ఏ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికైనా వెళ్తే ‘అందాల రాక్షసి’ అంటూ అరుస్తుంటారు. నాకు తెలియని మనుషులు ఇంతలా ఆదరిస్తారనీ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తాననీ కల్లో కూడా వూహించలేదు. నేను పుట్టి పెరిగింది ఉత్తరాఖండ్‌లో. నాన్న న్యాయవాది, అమ్మ టీచర్‌. నాకు ముందు అన్నయ్యా, అక్కా ఉన్నారు. కోర్టు కేసులతో ఎన్ని తలనొప్పులున్నా ఇంటికొచ్చేసరికి నాన్న చిన్నపిల్లాడిలా మారిపోయేవారు. మాతో కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పడం, స్కూల్లో విషయాలు అడిగి తెలుసుకోవడం లాంటివి చేసేవారు. అమ్మ చాలాకాలం పాటు టీచర్‌గా పనిచేసినా మేం కాస్త పెద్దయ్యాక ఉద్యోగం వదిలిపెట్టి మమ్మల్ని చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంట్లో నైతిక విలువల విషయంలో కాస్త కఠినంగా ఉండేవారు. మిగతా అన్ని విషయాల్లో కావల్సినంత స్వేచ్ఛనిచ్చారు. పనిమనిషినైనా ప్రముఖ వ్యక్తినైనా ఒకే స్థాయిలో గౌరవించడం నేర్పించారు. మా ఇంట్లో పనమ్మాయికి నేను కాఫీ పెట్టిచ్చిన సందర్భాలకు లెక్కేలేదు.

అక్క అసిస్టెంట్‌ కమిషనర్‌
మా ఇంట్లోనే నాకిద్దరు రోల్‌మోడల్స్‌... ఒకరు అమ్మ, ఇంకొకరు అక్క. దేనికి ఎంత ప్రాధాన్యమివ్వాలో అమ్మను చూసే నేర్చుకున్నా. టీచర్‌ ఉద్యోగం కంటే మమ్మల్ని బాగా పెంచడమే ముఖ్యమనుకుని ఉద్యోగాన్ని వదులుకుంది. అమ్మకు ఒంట్లో బాగాలేని సందర్భాలు ఉన్నాయి కానీ, ఆ ప్రభావం వల్ల మాకు ఏదైనా విషయంలో లోటు జరిగిన సందర్భాలు మాత్రం లేవు. ఎంత ఇబ్బంది ఉన్నా పనులన్నీ చేసేది. తన నుంచే మేమూ సాకులు చెప్పకుండా పనులు చేయడం నేర్చుకున్నాం. అక్కకు కాస్త చిన్నవయసులోనే పెళ్లయింది. తనకిప్పుడు ఎనిమిదేళ్ల కూతురు. పెళ్లయ్యాకా చదువును కొనసాగించింది. ఐఏఎస్‌కూ, పీసీఎస్‌ పరీక్షలకూ సన్నద్ధమైంది. గతేడాది పీసీఎస్‌ ఉద్యోగాన్ని సాధించింది. ఇప్పుడు అక్క అసిస్టెంట్‌ కమిషనర్‌. కథక్‌లో డిప్లొమా కూడా ఉంది. తన ఆఫీసు పూర్తయ్యాక కథక్‌ సాధన చేస్తుంది. కూతురికి ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది. ఇంట్లో అలాంటి వ్యక్తులు ఇద్దరున్నారు కాబట్టే నేనూ చిన్నప్పట్నుంచీ ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటూనే ముందుకెళ్లా.

స్కూల్లో స్టార్‌ని!
చిన్నప్పుడు స్కూల్లో నేను ఎక్కువమందికి తెలీదు. ఓ పట్టాన ఎవరికీ అర్థమయ్యేదాన్ని కాదు. తెలిసిన వాళ్లతో గడగడా మాట్లాడేదాన్ని. తెలియని వాళ్ల దగ్గరకు కూడా వెళ్లేదాన్ని కాదు. అందరూ మా అక్క వల్లే నన్ను గుర్తుపట్టేవారు. తను నాకంటే ఆరేళ్లు పెద్ద. క్లాస్‌లో టాపర్‌. సాంస్కృతిక పోటీల్లోనూ తనే ఫస్ట్‌. చాలా ముద్దుగా ఉండటంతో టీచర్లూ తనను బాగా చూసేవారు. అక్క పదో తరగతి పూర్తయి వెళ్లిపోగానే నన్నూ వేరే స్కూల్లో చేర్చారు. కొత్త స్కూల్లోకి వచ్చాక నా పద్ధతులన్నీ మారిపోయాయి. అక్కకి పాత స్కూల్లో ఎలాంటి పేరుందో, నేనూ అలానే కావాలనుకున్నా. అక్క దగ్గరే కథక్‌ నేర్చుకుని పోటీల్లో పాల్గొనేదాన్ని. సాయంత్రం పూట అమ్మ దగ్గర బట్టలపైన డిజైన్లు కుట్టడం, బొమ్మలు వేయడం సాధన చేసేదాన్ని. అన్నింట్లో ఉత్సాహంగా పాల్గొనడంతో స్కూల్లో ఓ చిన్న స్టార్‌ లాంటి గుర్తింపు వచ్చింది. క్రమంగా చదువుకంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి పెరిగింది. సినిమాలని కాదుగానీ, ఏదో ఒక కళతో ముడిపడ్డ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని అప్పట్నుంచే అనుకునేదాన్ని.

అన్ని పనులూ నేనే...
నేను హైస్కూల్‌కి వచ్చేసరికి డెహ్రాడూన్‌ నుంచి మోడలింగ్‌, సినీ రంగాలవైపు వెళ్లేవాళ్ల సంఖ్యా పెరిగింది. టీవీల్లో, పేపర్లలో అలాంటి వార్తలొచ్చినప్పుడల్లా అమ్మా నాన్నలకు చూపించి నేను కూడా అలా వెళ్తానని చెప్పేదాన్ని. ఏదో సరదాగా అంటున్నాననుకుని సరే అనేవాళ్లు. కానీ ఇంటర్‌ అవగానే ముంబై వెళ్లి మోడలింగ్‌ నేర్చుకుంటానని చెప్పినప్పుడు మాత్రం ఇంట్లో షాకయ్యారు. నేనంత సీరియస్‌గా ఉన్నాననే విషయం వాళ్లకు అప్పుడే అర్థమైంది. మా ఇంట్లో అందరూ బాగా చదువుకున్న వాళ్లే. మోడలింగ్‌, సినిమాలతో ఎలాంటి సంబంధమూ లేదు. అందుకే ముంబైలో పోటీ ఎక్కువ, అవకాశాలు రావడం అంత సులువు కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ముంబై వెళ్లి డిగ్రీ చదువుతాననీ, అవకాశాలొస్తే వెళ్తా తప్ప చదువును పక్కన పెట్టనని ఇంట్లో ధైర్యంగా చెప్పా. కెరీర్‌కు సంబంధించిన విషయం కాబట్టి వాళ్లూ అడ్డు చెప్పలేదు. ముంబైకి వచ్చాక స్వతంత్రంగా బతకడం అలవాటైంది. వంట చేసుకోవడం, బట్టలుతుక్కోవడం లాంటి పనులన్నీ నేనే చేసుకునేదాన్ని.

కాఫీషాప్‌లో అవకాశం
ముంబైలో డిగ్రీ చదువుతూనే మోడలింగ్‌లో శిక్షణ తీసుకునేదాన్ని. క్రమంగా ప్రకటనల్లో అవకాశాలొచ్చాయి. పాండ్స్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, పోలో, అమితాబ్‌తో కలిసి బినానీ సిమెంట్‌, చిక్‌ షాంపూ లాంటి చాలా ప్రకటనల్లో నటించా. షారుక్‌ ఖాన్‌తో కలిసి ఆల్టో ప్రకటన చేయడానికి తొలిసారి రామోజీ ఫిల్మ్‌ సిటీకి వచ్చా. అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యమేసింది. స్టూడియో పెద్దదని తెలుసుకానీ, మరీ అంత భారీగా ఉంటుందని వూహించలేదు. తెలుగు సినీ పరిశ్రమ గురించీ అప్పుడే తెలిసింది. ముంబైలో ఓసారి కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు ఓ వ్యక్తి నన్ను కన్నార్పకుండా చూడటం గమనించా. కాసేపటికి దగ్గరికి వచ్చి ‘నేను సీరియల్‌ దర్శకుడిని, ఆసక్తి ఉంటే నా సీరియల్‌లో నటిస్తారా’ అని అడిగారు. ‘ష్‌... కోయీ హై’ అని హిందీలో చాలా పాపులర్‌ ధారావాహిక అది. ఎక్కువ మందికి నేను తెలిసే అవకాశం ఉంటుందనిపించి అందులో నటించా. కొన్ని రోజుల తరవాత ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి ‘ఏక్తా కపూర్‌ తీస్తున్న ప్యార్‌ కా బంధన్‌ సీరియల్‌కి ఆడిషన్‌ జరుగుతోంది, నువ్వు ప్రయత్నిస్తే బావుంటుంది’ అంది. అక్కడికెళ్తే ఓ చిన్న కవిత ఇచ్చి చదివి చెప్పమన్నారు. నేను చెప్పిన తీరు నచ్చడంతో అందులో ప్రధాన పాత్రకి ఎంపికచేశారు. అలా బుల్లితెర మీద తొలి రెండు అవకాశాలూ నన్ను వెతుక్కుంటూ వచ్చాయి.

తొలిచూపులోనే నచ్చేశా
మోడలింగ్‌ అయినా, సినిమా అయినా ప్రణాళికతో అడుగులు వేయాలని మొదట్లోనే నిర్ణయించుకున్నా. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పుకోకుండా కెరీర్‌కు మంచి చేసేవాటినే ఎంచుకున్నా. డబ్బులు పెద్దగా రాకపోయినా, పేరొస్తుంది అనిపించే వాటికి ప్రాధాన్యమిచ్చా. ఓసారి అలానే ఆడపిల్లల చదువును ప్రోత్సహించే లఘుచిత్రంలో ఉచితంగా నటించా. సినిమాలో కూడా నా తొలి అవకాశం చిత్రంగా కాఫీ షాప్‌లోనే వచ్చింది. ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగుతుంటే ‘అందాల రాక్షసి’ బృందంలోని సభ్యుడు ఒకతను వచ్చి ఆ సినిమాకు నేను సరిపోతాననీ, ఓసారి ఆడిషన్‌కు రమ్మనీ చెప్పాడు. నిజానికి నేనారోజు తెల్లటి కుర్తాలో, తలకు నూనె రాసుకొని చాలా సాదాసీదాగా ఉన్నా. ఆడిషన్‌కు మేకప్‌ లేకుండా రమ్మనడంతో అలానే వెళ్లా. నన్ను చూడగానే హీరోయిన్‌ పాత్రకు సరిగ్గా సరిపోతానని దర్శకుడు హనుకి అనిపించింది. ఎదురుగా ఓ వ్యక్తితో మాట్లాడుతుంటే వీడియోతీసి, బావున్నాననిపించి అందరూ ఓకే చేశారు. అలా తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’లో అనుకోకుండా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమాకు ముందు హైదరాబాద్‌ వచ్చి కొన్ని ప్రకటనలు చేయడంతో ఇక్కడి పరిశ్రమ స్థాయేంటో తెలిసింది. అందుకే తెలుగు సినిమా అనగానే వెంటనే చేయడానికి సిద్ధమయ్యా.

అమ్మాయిలే అభిమానులు
తొలి సినిమా చేశాక అందరూ ‘మిథున’ అనో, ‘అందాల రాక్షసి’ అనో పిలవడం మొదలుపెట్టారు. అందులో నా పాత్రకి చాలా పేరొచ్చింది. చిత్రంగా ఆ సినిమా వల్ల నాకు అమ్మాయిలు చాలామంది అభిమానులుగా మారారు. ఎక్కడైనా నా షూటింగ్‌ జరుగుతుందంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా వస్తారు. రాజమండ్రిలో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు కూడా ఇంజినీరింగ్‌ అమ్మాయిలే ఎక్కువగా వచ్చి ‘మిథున’ అని అరవడం మొదలుపెట్టారు. ఆ పాత్రకూ నాకూ ఓ సారూప్యం ఉంది. నేను కూడా ఏదైనా పని మొదలు పెట్టేప్పుడూ, కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడూ గాయత్రి మంత్రమే చదువుకుంటా. సినిమాలో మిథునలానే బయట ఎక్కువగా మేకప్‌ వేసుకోను. ఇక ఇంట్లో ఉన్నప్పుడైతే నా అవతారం పనిమనిషిలానే ఉంటుందని అమ్మ తిడుతుంటుంది. ఏ బట్టలు పడితే అవి వేసుకుని ఎలా పడితే అలా ఉంటా. హీరోయిన్‌ అయ్యాక కొంతవరకూ మారా. ‘అందాల రాక్షసి’ పాత్ర ప్రేక్షకులకు ఎంత బాగా దగ్గరయిందంటే, నేను దానికి భిన్నమైన పాత్ర చేస్తే నచ్చుతానో లేదో అన్న భయమేసింది. అందుకే కాస్త విరామం తీసుకొని రెండో సినిమా ‘దూసుకెళ్తా’ చేశా. అదీ విజయవంతమై హీరోయిన్‌గా నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
‘దూసుకెళ్తా’ తరవాత ‘మనం’లో చిన్న పాత్ర చేశా. నాగేశ్వరరావుగారి ఆఖరి సినిమాలో అవకాశం రావడమే అదృష్టం. అందుకే కళ్లుమూసుకుని ఒప్పుకున్నా. ఆ తరవాత ‘భలే భలే మగాడివోయ్‌’ కూడా సూపర్‌హిట్‌. సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ నా కెరీర్‌కు మరో సక్సెస్‌నిచ్చింది. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’లో వేటికవే భిన్నమైన మూడు పాత్రలు చేశా. నా నిర్ణయాలపైన నాకు నమ్మకం ఎక్కువ. సినిమాలైనా జీవితమైనా సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతా. ఇప్పటివరకూ నా నిర్ణయాలు ఎక్కడా తప్పు కాలేదు. ఇకపైన కూడా ఇలానే మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా.

చిరుతిళ్లు చాలా ఇష్టం
సినిమాలు ఎక్కువగా చూస్తా. డాన్స్‌ చేయడం చాలా ఇష్టం. ఓసారి అంతగా పరిచయం లేని వాళ్ల పెళ్లికి వెళ్లి విపరీతంగా డాన్స్‌ చేశా. ఇప్పటికీ నా స్నేహితులు అది గుర్తు చేసి ఆటపట్టిస్తారు.
* ఎప్పుడూ నవ్వుతూ అబ్బాయిలా అందరితో కబుర్లు చెబుతూ ఉంటా. అందుకే ‘భలే భలే మగాడివోయ్‌’ సెట్లో మారుతి నన్ను తమ్ముడూ అని పిలిచేవారు.
* రోడ్డుమీద దొరికే బుజియా, చాట్‌లాంటి చిరుతిళ్లు ఎక్కువగా తింటా. హైదరాబాద్‌లో కుబానీ కా మీఠా, ఉలవచారు బిర్యానీ అంటే చెప్పలేనంత ఇష్టం.
* ఓసారి నా అభిమానినంటూ ఓ అమ్మాయి వైజాగ్‌ నుంచి వెతుక్కుంటూ వచ్చింది. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. అలాంటి అభిమానులు కూడా ఉంటారా అని ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
* నాకు సులువుగా నవ్వొచ్చేస్తుంది. ఏదైనా జోక్‌ స్నేహితులకు చెప్పడానికి ముందు నేనే దాన్ని తలచుకొని నవ్వుతుంటా. ఆ అలవాటు మానుకోవాలి.
* నాకు ఏ విషయమైనా త్వరగా బోర్‌ కొట్టేస్తుంది. పెళ్లయ్యాక కూడా అలా నా భర్త బోర్‌ కొట్టకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇచ్చే వ్యక్తి రావాలి.
* నీళ్లు చాలా ఎక్కువగా తాగుతా. ఆహారం విషయంలో ఎలాంటి నియమాలూ పెట్టుకోను. అయినా అదృష్టం కొద్దీ లావవట్లేదు.
* ఎప్పుడూ యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్లలేదు. ఏదైనా విషయానికి బయట ఎలా స్పందిస్తానో, తెరమీద కూడా అలానే స్పందించే ప్రయత్నం చేస్తా. నిజమైన నటనంటే అదేనని నా అభిప్రాయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.