close
యాభై సినిమాలూ...ఎన్నో అనుభవాలూ!

యాభై సినిమాలూ...ఎన్నో అనుభవాలూ!

అర్ధ శతకాన్ని క్రికెట్‌ మైదానంలో బ్యాట్స్‌మనే కాదు, సినీ పరిశ్రమలో హీరో పూర్తిచేయడం కూడా కాస్త కష్టమైన పనే. కేవలం పదమూడేేళ్ల వ్యవధిలో ఆడుతూ పాడుతూ యాభై సినిమాల్లో నటించాడు అల్లరి నరేష్‌. ఆ ప్రయాణంలో రవిలా మారి ‘అల్లరి’ చేశాడు. రేలంగి రాజబాబులా ‘కితకితలు’ పెట్టాడు. గాలి శీను అవతారమెత్తి తన ‘గమ్యం’ మార్చుకున్నాడు. ‘కంచు’లా మారి ‘మంచు’నే ముప్పతిప్పలు పెట్టాడు. ‘ఎన్ని సినిమాలు చేసినా, కొన్ని మాత్రం మనసుకు చాలా దగ్గరవుతాయి’ అంటోన్న నరేష్‌, తాను చేసిన వాటిలో అలా దగ్గరైన పది సినిమాల గురించి ఇలా చెబుతున్నాడు....
ఒక్కోసారి ప్రమాదాలు కూడా మంచే చేస్తాయి. గతంలో నాకు జరిగిన ఓ ప్రమాదమే నా తొలిసినిమా ‘అల్లరి’ని తీసుకొచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ ప్రమాదంలో కాలికి దెబ్బ తగిలితే చికిత్స కోసం అమెరికా వెళ్లా. అక్కడే చలపతిరావుగారి అబ్బాయి రవి పరిచయమయ్యాడు. రవిని చూసి మా నాన్న ‘మంచి హైటూ, పర్సనాలిటీ ఉంది. సినిమాల్లో చేద్దువుగానీ హైదరాబాద్‌ వచ్చేయి’ అన్నారు. రవికి కూడా ఆసక్తి ఉండటంతో హైదరాబాద్‌ వచ్చేశాడు. కొన్ని రోజుల తరవాత రవి చెన్నైలో ఓ యాడ్‌ ఏజెన్సీ పెట్టాడు. నేనోసారి ఏదో పనిమీద చెన్నై వెళ్లి రవిని కలిస్తే, ‘మీ అన్నయ్య హీరో అవుతున్నాడంట. నువ్వు కూడా మంచి ఆర్టిస్ట్‌వి అవుతావు, నీకెందుకు అవకాశం రాలేదు’ అన్నాడు. అప్పటివరకూ అందరూ నన్ను ‘అద్దంలో మొహం చూసుకున్నావా’ అన్నవాళ్లే. అందుకే రవి మాటలు సంతోషంగా అనిపించినా, ఫ్రెండ్‌ కాబట్టి నన్ను ప్రోత్సహించడానికి అలా అంటున్నాడనుకున్నా. ఓ రోజు తెల్లవారు జామున ఫోన్‌ చేసి ‘నీ దగ్గరున్న మంచి బట్టలు సర్దుకుని రామానాయుడు స్టూడియోస్‌కు వచ్చేయి’ అన్నాడు. కట్‌ చేస్తే... జనవరి 24న రవి పుట్టినరోజు నాడు ‘అల్లరి’ షూటింగ్‌ మొదలైంది. ఆ సినిమా రవికీ, నాకే కాదు మరో ఐదుగురు కొత్త వాళ్లకూ ఇంటి పేరులా మారింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని కసితో చేశా. ఆ సినిమా యాభై రోజులు పూర్తయ్యాకే నేను ఇ.వి.వి.సత్యనారాయణగారి అబ్బాయినని చాలామందికి తెలిసింది. సొంతంగా నిరూపించుకోవాలన్న నా కోరికను ‘అల్లరి’ తీర్చింది.

నాన్నతో ‘తొట్టిగ్యాంగ్‌’
తొట్టిగ్యాంగ్‌ నా మూడో సినిమా. నాన్నగారితో చేసిన మొదటిసినిమా. మొదట్లో నాన్న నన్ను పరిచయం చేస్తానన్నా, సొంతంగా ఒకట్రెండు సినిమాలు చేశాకే ఆయన దర్శకత్వంలో నటిస్తానన్నా. ఎంత కొడుకునైనా, పెద్ద హీరోలతో సినిమాలు చేశాక నాలాంటి వాళ్లతో చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ‘మీ అబ్బాయి చాలా సీన్లు సింగిల్‌ టేక్‌లో చేశాడు’ అని రవిబాబు నాన్నకు భరోసానిచ్చాడు. దాంతో నాతో పాటు ప్రభుదేవా, సునీల్‌ని కలిపి ‘తొట్టిగ్యాంగ్‌’ సినిమా తీశారు. ఓ కామెడీ హీరోగా నన్ను పూర్తిస్థాయిలో తెరమీద చూపించిన సినిమా అది. సినిమా హిట్టవడంతో పెద్ద బడ్జెట్‌ కామెడీ హీరోగా అవకాశాలు మొదలయ్యాయి.

కొత్తదారిలో ‘నేను’
ఒక్కోసారి ఒక సినిమా వల్ల ఎన్ని మంచి అవకాశాలొస్తాయో చెప్పడానికి ‘నేను’ ఉదాహరణ. తమిళంలో విజయవంతమైన ‘కాదల్‌ కొండేన్‌’ సినిమాలో ధనుష్‌ పాత్ర నాకు బాగా నచ్చింది. అలాంటి పాత్ర నటుడిగా నన్నో మెట్టు పైకి ఎక్కిస్తుందని అనిపించింది. ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్‌ హైదరాబాద్‌లో ‘7జి బృందావన్‌ కాలనీ’ షూటింగ్‌లో ఉన్నప్పుడు వెళ్లి కలిశా. నాలుగైదు రోజులపాటు ‘నేను’ సినిమాలో హీరో పాత్ర ఎలా ప్రవర్తించాలీ, హావభావాలు ఎలా ఉండాలీ లాంటి రకరకాల అంశాల గురించి వివరించారు. ఆ పాత్రను చూస్తుంటే జుగుప్స కలుగుతూనే ఇంకోపక్క పాపం అనిపించాలి. అలా సహజంగా కనిపించడానికి నలుగురితో కలిసి తినేప్పుడు కూడా అందులో పాత్రలానే కాస్త అసహ్యంగా తినేవాణ్ని. అనుకున్నట్టుగానే నా నటనకు మంచి పేరొచ్చింది. కెరీర్లో చాలా తొందరగా ఆ సినిమా చేశాననిపిస్తుంది. కానీ దానివల్లే నాకు గమ్యం, అక్కణ్నుంచి శంభోశివశంభో సినిమాలొచ్చాయి. అందుకే నా కెరీర్‌లో ‘నేను’ది ప్రత్యేక స్థానం.

‘కితకితలు’ పెట్టించా
‘నేను’ తరవాత దాదాపు పదమూడు నెలలు ఖాళీ వచ్చింది. ఏ సినిమా సరిగా వర్కవుట్‌ కావట్లే. తొమ్మిది సినిమాలు చేశాను చాలు, ఇంక రిటైర్‌ అవ్వాల్సిందే అనుకున్నా. చాలారోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆ సమయంలో నా కెరీర్‌కు కొత్త వూపిరినిచ్చిన సినిమా కితకితలు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో చాలామంది ప్రతికూలంగానే మాట్లాడారు. హీరోయిన్‌ ఎంపిక దగ్గరే తప్పు చేశామని విమర్శించారు. ఓ రకంగా అది ప్రయోగాత్మకమైన సినిమా. అయితే మంచి విజయం సాధిస్తుందీ, లేకపోతే అడ్రస్‌ లేకుండా పోతుంది అనుకున్నాం. సినిమా మొదట్లో ప్రేక్షకులకు నాపైన జాలి ఉంటుంది. కథ ముందుకెళ్లే కొద్దీ నాపైన అసహ్యం మొదలవుతుంది. ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా డిజాస్టర్‌గా మిగిలేది. కానీ ఓ వైపు ‘పోకిరి’ సంచలనం సృష్టిస్తోన్న సమయంలో ‘కితకితలు’ విజయవంతమై నా కెరీర్‌ను నిలబెట్టి రెండో జీవితాన్నిచ్చింది.

నవ్వుల శాస్త్రి
ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన మొదటి కామెడీ సినిమా సీమశాస్త్రి. నరేష్‌ ఫ్యాక్షనిస్టు అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి గారికి వచ్చింది. అలాగని నేను సీరియస్‌గా కత్తిపడితే జనాలు చూడరు. అందుకే పౌరోహిత్యం చేసుకునే కుర్రాడికీ, ఫ్యాక్షన్‌ సీమలో పెరిగిన అమ్మాయికీ మధ్య జరిగే ప్రేమకథ నుంచి హాస్యం పుట్టించొచ్చని ఆయనో లైన్‌ చెప్పారు. తరవాత దాని చుట్టూ కథ అల్లారు. మేము ఎంచుకున్న కథలోనే హాస్యానికి బోలెడంత అవకాశం ఉంది. కాబట్టి జోకులు వెతుక్కుని పెట్టాల్సిన అవసరం రాలేదు. ప్రేక్షకులకూ అది బాగా నచ్చింది. నా ఖాతాలో మరో విజయం చేరింది. బహుశా అలాంటి పాత్ర ఇంకెప్పటికీ చేయకపోవచ్చు.

‘గమ్యం’ మారింది
నా కెరీర్‌ గమనాన్ని మార్చేసిన సినిమా గమ్యం. 2003లో క్రిష్‌ నన్ను కలిశాడు. ‘నేను’ సినిమాలో నా పాత్ర నచ్చి ‘గమ్యం’లో గాలిశీను పాత్ర గురించి నాకు చెప్పాడు. క్రిష్‌కు అనుభవం లేకపోయినా అతడి ఆత్మవిశ్వాసం నచ్చి సినిమాను ఒప్పుకున్నా. మొదట్నుంచీ నా పాత్ర స్థిరంగా ఉంది కానీ శర్వానంద్‌ పాత్రకు ముందు ఏడుగురు హీరోలు మారారు. ఏడుగురు నిర్మాతలు మారారు. చివరికి నాలుగేళ్ల తరవాత 2007లో సినిమా మొదలైంది. రేపో ఎల్లుండో షూటింగ్‌ మొదలవుతుంది అన్నప్పుడూ మరో నిర్మాత వెనకడుగు వేయడంతో క్రిష్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. కొన్ని రోజులు షూటింగ్‌ జరిగి, డబ్బుల్లేక మళ్లీ బ్రేక్‌ పడేది. ఓ పదిలక్షలు దొరికితే ఇంకో రెండ్రోజులు షూటింగ్‌ జరిగేది. కథ బాగా నచ్చడంతో కొందరు పారితోషికం విషయంలోనూ రాజీ పడ్డారు. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని 2008 ఫిబ్రవరి 29న సినిమా విడుదలైంది. నరేష్‌ కామెడీకి మాత్రమే పరిమితమన్న ముద్ర ఆ సినిమాతో పోయింది. సినిమాలో నా పాత్ర చనిపోయే సన్నివేశాన్ని నా పుట్టినరోజు నాడే చేయాల్సి వచ్చింది. మా అమ్మకి ఫోన్‌ చేస్తే వద్దని చెప్పింది. కానీ నాన్న మాత్రం మరేం ఫర్వాలేదు, చేసి రా అన్నారు. చివరికి ‘గమ్యం’ చాలామంది జాతకాలను మార్చేసింది.

శంభో శివ శంభో
నేను డీగ్లామరస్‌ పాత్రలనే ఎక్కువగా ఇష్టపడతా. ‘శంభోశివశంభో’లో వినికిడి లోపంతో ఉండే పాత్ర నాది. చూసేవాళ్లకు పాపం అనిపిస్తూనే హాస్యాన్నీ పుట్టించాలి. అది దర్శకుడు సముద్రఖని నిజజీవితంలో జరిగిన సంఘటన ఆదారంగా తీసిన సినిమా. సినిమాలో నేను చేసిన పాత్ర, నిజ జీవితంలో సముద్రఖనిదే. సినిమాలో నన్ను కొట్టినట్టే బయట అతడినీ కొట్టారు. ఇప్పటికీ దాని తాలూకు దెబ్బ ఆయనకు ఉంటుంది. ఆయన నడక, మాటతీరూ, హావభావాలన్నీ అనుకరించేవాణ్ని. రవితేజతో కలిసి పనిచేయడం ఆ సినిమాలో మరో మంచి అనుభవం.

‘సుడిగాడు’ మెప్పించాడు
నేను నటించిన వాటిలో కత్తిమీద సాములా చేసిన సినిమా ‘సుడిగాడు’. 108 సినిమాల కలయిక అది. బాగా హిట్టయిన వందకు పైగా సినిమాల్లోంచి ఒక్కో సన్నివేశాన్ని తీసుకున్నాం. టీవీలో పేరొచ్చిన కార్యక్రమాల నుంచి కొన్ని అంశాలను తీసుకున్నాం. వాటన్నింటినీ కలిపి, ఒక అర్థవంతమైన కథలా తయారుచేశాం. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు లాంటి చాలామంది హీరోలను నేను అనుకరించాలి. కాస్త శ్రుతి మించినా అపహాస్యం అవుతుంది. అలాగని సరిగా ఇమిటేట్‌ చేయకపోతే సన్నివేశం తేలిపోతుంది. అందుకే ప్రతి సన్నివేశాన్నీ ఎంతవరకూ చేయాలీ, ఎక్కడ ఆపాలీ అని జాగ్రత్తగా నిర్ణయించుకుని చేసిన సినిమా అది. ఆ సినిమా నా నటనలో అనేక కోణాలని ఆవిష్కరించింది. అన్నీ కుదిరుంటే దాని కొనసాగింపే నా యాభయ్యో సినిమా కూడా అయ్యుండేది.

అవాక్కనిపించిన ‘లడ్డుబాబు’
శారీరకంగా చాలా కష్టపడి చేసిన సినిమా ‘లడ్డుబాబు’. సన్నగా ఉండే నరేష్‌ లావుగా అయితే చూడాలని అందరికీ ఉంటుందన్నాడు దర్శకుడు రవి. తెలుగులో పూర్తిస్థాయి ప్రోస్థెటిక్‌ మేకప్‌తో వచ్చిన మొదటిసినిమా అదే. ఆ మేకప్‌ ఉన్నప్పుడు ఉష్ణోగ్రత పదహారు డిగ్రీలకు మించకూడదు. అందుకే వూటీలో తీయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌లోనే తీయాల్సొచ్చింది. దానివల్ల చర్మానికి చిన్నచిన్న సమస్యలొచ్చాయి. ఉదయం ఐదింటికి మేకప్‌ వేసుకుంటే అది తీసేవరకూ ఏదీ తినడానికి వీల్లేదు. దాని వల్ల బరువూ తగ్గిపోయా. షూటింగ్‌లో భాగంగా కింద పడ్డప్పుడు రెండుసార్లు చేతుల జాయింట్లు డిస్‌లొకేట్‌ అయ్యాయి. లావుగా ఉండేవాళ్లను కొంత కాలం అబ్జర్వ్‌చేసి వాళ్ల హావభావాలను ఒంటబట్టించుకొని చేసిన సినిమా అది. విజయం సాధించి ఉంటే ఆ కష్టం ఇంకాస్త కిక్కిచ్చి ఉండేది. కానీ నా కెరీర్‌లో అదో మంచి జ్ఞాపకంలా మిగిలిపోతుంది.

కంచు మోగింది
ఓ హీరోకి యాభయ్యో సినిమా అంటే కచ్చితంగా మంచి మైలురాయే. దానికోసం నేను కూడా చాలా కథలు విన్నాను. మోహన్‌బాబుగారు ఒకప్పుడు మామల్ని తిప్పలు పెట్టే పాత్రలు చేశారు కానీ ఆయనే మామలా ఎప్పుడూ చేయలేదు. కథ బావుంటుందనీ, ఆ పాత్రకు నేనైతేనే సరిపోతాననీ మోహన్‌బాబుగారు చెప్పారు. గతంలో సీనియర్‌ నటులు చాలామందితో నటించాగానీ మోహన్‌బాబు వేరు. ఎక్కువ టేకులు తిని ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆయన్ని డామినేట్‌ చేయాలని నేనూ, నన్ను దెబ్బ కొట్టాలని ఆయనా బాగా పోటీపడ్డాం. మొత్తానికి మంచు, కంచుల కలయిక నా కెరీర్‌కి మంచి మైలురాయిలా నిలిచిపోయింది. ఓ దశలో ఏడాదికి ఎనిమిది సినిమాలు చేశా. ఇప్పుడు చాలామంది కామెడీ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు భిన్నంగా ఉండాలంటే ఏదో ఒక ప్రత్యేకత చూపించాలి. మరో యాభై సినిమాలు చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను కానీ, ఇప్పట్నుంచీ చేసే ప్రతి సినిమా నాతోపాటు ప్రేక్షకులకీ మంచి జ్ఞాపకంగా మిగిలేలా చూసే ప్రయత్నమైతే చేస్తూనే ఉంటా.

భర్తగా కొత్త పాత్ర
సినిమాలను పక్కనపెడితే నిజజీవితంలో భర్త అనే బాధ్యత కలిగిన పాత్రలోకి కొత్తగా అడుగుపెట్టా. నా భార్య విరూప ఆర్కిటెక్ట్‌. తను సినిమాలు పెద్దగా చూడదు. నాకు ఆర్కిటెక్చర్‌ గురించి అంతగా తెలీదు. ఇప్పుడిప్పుడే ఇద్దరం మా రెండు రంగాల గురించీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పెళ్లయ్యాక నా జీవనశైలి కొద్దిగా మారింది. బాధ్యత మరింత పెరిగింది. ఇంతకుముందు ఏ విషయమైనా మా అమ్మను దృష్టిలో పెట్టుకుని ఆలోచించేవాణ్ని. ఇప్పుడు మరో కొత్త వ్యక్తి తోడైంది. భవిష్యత్తులో పిల్లలు పుట్టాక ఇంకెంతలా మారతానో చూడాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.