close
భయపడొద్దు.. మీరూ సాధించగలరు!

భయపడొద్దు.. మీరూ సాధించగలరు!

కడుపునిండా భోజనం, అతుకుల్లేని బట్టలూ, కాళ్లకు చెప్పులూ... మన్నెం మధుసూదనరావు చిన్నప్పుడు వీటికోసం కలలు కంటూనే పెరిగాడు. ఓ ముప్ఫయ్యేళ్లు ఫాస్ట్‌ఫార్వర్డ్‌ చేస్తే... ఇప్పుడాయన పదకొండు సంస్థలున్న ఎంఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌. వందల కోట్ల వ్యాపారాలకూ, వందల మంది ఉద్యోగులకూ అధినేత. విదేశీ డాక్యుమెంటరీలూ, స్వదేశీ పుస్తకాల్లో చోటు దక్కించుకున్న వ్యక్తి. పాటలో హీరోలా ఎంఎంఆర్‌ ఒక్క రోజులో కోటీశ్వరుడు కాలేదు. ఎన్నో ఏళ్ల పేదరికం, ఏదో ఒకటి సాధించాలన్న కసి... సినిమా కథకు తీసిపోని ఆ విజయగాథ ఆయన మాటల్లోనే.
తాతల నుంచి తండ్రులకూ, అక్కణ్నుంచి పిల్లలకూ ఆస్తులూ అంతస్తులూ వారసత్వంగా వస్తుంటాయి. మాకు మాత్రం పొలాల్లో వెట్టిచాకిరీ, ఆకలి మంటలూ, పేదరికం తరతరాలుగా ఒకర్నుంచి మరొకరికి వచ్చాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర్లో పలుకూరు అనే చిన్న పల్లెటూరు మాది. సామాజికంగా, ఆర్థికంగా బాగా వెనకబడ్డ కుటుంబం. నాన్న పేరయ్య ఓ భూస్వామి దగ్గర వెట్టికూలీగా పనిచేసేవారు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. నేను ఐదో పిల్లాణ్ని. నాన్న పొలంలో పనిచేసేప్పుడు డబ్బులకు బదులు వడ్లు ఇచ్చేవాళ్లు. ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బులు కరవవడంతో పెద్దక్కకు పదిహేనేళ్లు ఉన్నప్పుడు అమ్మా, అక్కా కలిసి ఒంగోలులోని పొగాకు ఫ్యాక్టరీలో పనికి వెళ్లేవారు. ఇద్దరికీ కలిపి రోజుకు వంద రూపాయలు వచ్చేవి. రిక్షాలకు డబ్బులు ఖర్చుపెట్టడం ఇష్టంలేక, రోజూ పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు. వాళ్లిద్దరూ పనిచేయడం మొదలుపెట్టాకే ఇంట్లో కాస్త డబ్బులు కనిపించేవి. దాంతో నన్నూ, రెండో అన్నయ్యనూ చదివించడం మొదలుపెట్టారు.

మొదటిసారి కొత్తబట్టలు...
అన్నయ్యా నేనూ ఐదో తరగతి వరకు వూళ్లొనే చదువుకున్నాం. ఆ తరవాత సింగరాయకొండలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేరాం. నా జీవనశైలి అక్కడే చాలా మారింది. ఉతికిన బట్టలు వేసుకోవడం, చెప్పులు తొడుక్కోవడం, తల దువ్వుకోవడం లాంటివన్నీ హాస్టల్లోనే అలవాటయ్యాయి. అక్కడ ఉన్నప్పుడే మా పెద్దన్న పెళ్లి కుదిరితే ఇంటికెళ్లాం. జీవితంలో నేను మొదటిసారి కొత్త బట్టలు వేసుకుంది ఆ పెళ్లిలోనే. పెళ్లయిన మరుసటి రాత్రి మా ఇంటి ముందు ఎరువుల సంచులను కుట్టి వాటితో చిన్న గుడారంలా వేశారు. మా ఇంటిని కొత్త జంటకు ఇచ్చి అందరూ ఆ గుడారంలో పడుకున్నాక కానీ మా కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో నాకర్థం కాలేదు. పెళ్లి హడావుడి పూర్తయ్యాక అన్నయ్యా నేనూ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్‌కు నడిచి వెళ్లడం మొదలుపెట్టాం. దారి పొడవునా మా మాటలన్నీ డబ్బుల గురించే. పెద్దయ్యాక ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలనీ, కుటుంబాన్ని పేదరికం నుంచి బయట పడేయాలనీ గట్టిగా నిర్ణయించుకున్నాం. ఓ రకంగా ఆ పది కిలోమీటర్ల నడకేమా గమ్యాన్ని నిర్దేశించింది.

అందరి కళ్లూ మామీదే!
ఇంటర్‌ అయిపోయాక అన్నయ్య బీటెక్‌లో చేరాడు. నేను పాలిటెక్నిక్‌లో చేరా. ఇద్దరం చదువు పూర్తిచేసుకొని ఇంటికెళ్లాక వూళ్లొ అందరూ మాకు పెద్ద ఉద్యోగాలొచ్చాయనీ, సెలవు పెట్టి ఇంటికొచ్చామనీ అనుకున్నారు. మా వూరికి పేపర్‌ వచ్చేది కాదు. రోజూ పొద్దున్నే పక్కవూరికి వెళ్లి పత్రికలో ఉద్యోగ ప్రకటనలు ఏవైనా పడ్డాయేమోనని చూసొచ్చేవాళ్లం. రోజులు గడిచేకొద్దీ ఇంట్లో వాళ్ల ఆందోళన పెరుగుతూ వచ్చింది. వూళ్లొ వాళ్ల కళ్లూ అనుమానంగా చూసేవి. అక్కడుంటే లాభం లేదనుకొని హైదరాబాద్‌లో మా అక్క దగ్గరికి వెళ్లి ఉద్యోగం వెతుక్కుందామని అన్నయ్యా నేనూ అనుకున్నాం. వాళ్లింట్లో మా ఇద్దరికోసం ఒక గదైనా ప్రత్యేకంగా ఉంటుందనుకున్నా. హైదరాబాద్‌ వెళ్లాక కానీ వాళ్ల పరిస్థితేంటో అర్థం కాలేదు. కూకట్‌పల్లిలో ఓ భవన నిర్మాణంలో వాళ్లు కూలీలుగా పనిచేస్తూ కనిపించార్లు. కూలీల కోసం కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన గుడారాల్లోనే ఉంటున్నారు. వాళ్ల పరిస్థితి చూసి ఏడుపాగలేదు. అక్కడే ఉండి వాళ్లను ఇబ్బంది పెట్టలేం. అలాగని బయటికొచ్చి బతికే పరిస్థితీ లేదు. ఎలాగూ అంత దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒక దారి దొరికే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం.

జీతం రోజుకు రూ.10...
ఆ రోజు రాత్రి గుడారం బయటే ఇసకపైన గోతాలు పరచుకొని పడుకున్నాం. అప్పుడూ నాకు భవిష్యత్తు గురించిన ఆలోచనలే. ఎలాగైనా పేదరికం నుంచి బయటపడాలని అనుకుంటూ నిద్రపోయా. నాకు అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి రోజూ ఓ గంటపాటు నీళ్లు కొట్టే పని దొరికింది. రోజుకు పది రూపాయలు ఇచ్చేవారు. కొన్ని రోజులకు ఓ భవనంలో నైట్‌ వాచ్‌మన్‌గా పని దొరికింది. నెలకు మూడు వందలు ఇచ్చేవారు. తెలిసిన వాళ్ల ద్వారా పొద్దునపూట దగ్గర్లో ఏడో తరగతి పిల్లలకు ట్యూషన్లు చెప్పే అవకాశం దొరికింది. దానిద్వారా నెలకు తొమ్మిదొందల వరకు వచ్చేవి. కొన్నాళ్లకు రాత్రి పూట భూమిలో గుంతలు తవ్వి టెలిఫోన్‌ కేబుళ్లు వేసే సైట్‌ దగ్గర పనిదొరికింది. రోజుకు నాలుగొందలు ఇచ్చేవారు. మరో పక్క అన్నయ్యకు బీటెక్‌ క్వాలిఫికేషన్‌మీద ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. అలా మా ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడటం మొదలైంది.

కూలీ కాంట్రాక్టర్‌గా మొదలు...
నేను చదివింది సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కాబట్టి కేబుల్‌ వైరింగ్‌ వ్యవస్థకు సంబంధించిన మెలకువలు త్వరగానే అర్థమయ్యాయి. కొన్ని రోజుల తరవాత ఓ కేబుల్‌ కాంట్రాక్టులు చేసే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లా. అక్కడ ముందు రోజు రాత్రి కేబిలింగ్‌కు గుంతలు తవ్వడానికి సరిపడా కూలీలను తీసుకురాలేదని ఓ కాంట్రాక్టర్‌ మధ్యవర్తిపైన అరవడం చూశా. వాళ్ల దగ్గరకి వెళ్లి ఆ రోజు రాత్రికి కనీసం పాతిక మంది కూలీలను నేను తీసుకొస్తానని చెప్పా. గతంలో కేబుళ్ల దగ్గర నేను పనిచేసినప్పుడు ఓ కూలీకి ప్రమాదం జరిగితే ఆ కాంట్రాక్టర్‌తో మాట్లాడి అతడికి వైద్య ఖర్చులతో పాటు, కోలుకునేవరకు కొంత జీతం ఇవ్వడానికి ఒప్పించా. ఆ గౌరవంతో నేను పిలవగానే కూలీలు వస్తారన్న నమ్మకం నాది. ఇంటికెళ్లి మా అక్కను బతిమాలి మూడు వేలు అప్పు ఇప్పించమని అడిగా. ఆ డబ్బులు తీసుకొని కూలీలుండే బస్తీకి వెళ్లి, ఎలాగోలా ఒప్పించి 45మందిని నాతో పాటు పనిజరిగే చోటుకి తీసుకెళ్లా. మమ్మల్ని చూసి ఆ కాంట్రాక్టార్‌ చాలా సంతోషించాడు. ఇరవై వేల రూపాయలు నా చేతిలో పెట్టాడు. నా జీవితంలో అంత డబ్బును తాకడం మొదటిసారి. కూలీల ఖర్చులు పోనూ పదమూడు వేలు మిగిలాయి. మరుసటి రోజు కనీసం వంద మందిని తీసుకొస్తానని కాంట్రాక్టర్‌కు మాటిచ్చా. నేను తీసుకెళ్లిన డబ్బులని చూసి ఇంట్లో చాలా కంగారు పడ్డారు. ‘హైదరాబాద్‌ వచ్చి ఇన్నేళ్లయినా నేనిప్పటివరకు అంత డబ్బు చూడలేదు, మీ తమ్ముడిపైన ఓ కన్నేసి ఉంచు’ అని బావ అక్కతో అన్నాడు.

మళ్లీ రోడ్డు మీదకు...
మరుసటి రాత్రి చెప్పినట్లే వంద మంది కూలీలను తీసుకెళ్లి పనిచేయించా. నాపైన నమ్మకం కుదరడంతో పొద్దున్నే అడ్వాన్స్‌ తీసుకోవడానికి ఇంటికి రమ్మని ఆ కాంట్రాక్టర్‌ చెప్పాడు. మా బావనీ, అన్నయ్యనీ కూడా తీసుకెళ్తే నాపైన ఉన్న అనుమానాలు తొలగిపోతాయనిపించి వాళ్లనూ తీసుకెళ్లా. కాంట్రాక్టర్‌ వాళ్లకు విషయం చెప్పి లక్ష రూపాయలు మా చేతిలో పెట్టాడు. బస్సులూ, ఆటోలను నమ్మలేక 17కి.మీ నడుచుకుంటూనే ఇంటికి వెళ్లాం. అలా కూలీ కాంట్రాక్టర్‌గా కొనసాగుతూనే కేబిలింగ్‌ రంగానికి సంబంధించిన మెలకువలు నేర్చుకున్నా. కొన్నాళ్లకు చిన్న కేబిలింగ్‌ పనులు సొంతంగా చేయించడం మొదలుపెట్టా. తరవాత ఓ పరిచయస్థుడితో కలిసి సొంతంగా కేబిలింగ్‌ పనులు చేయడానికి సంస్థను ఏర్పాటు చేశా. నాకున్న పరిచయాల సాయంతో చిన్న చిన్న కాంట్రాక్టులు పూర్తిచేస్తూ ముందుకెళ్లా. ఆ ప్రయాణంలోనే ‘గ్లోబల్‌ టెలీ సిస్టమ్స్‌’ వాళ్లది కోదాడ నుంచి విజయవాడ వరకూ కేబుళ్లు వేసే కాంట్రాక్ట్‌ దొరికింది. కోటి రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టు. ఫీల్డ్‌మీద నేనుంటే పని బాగా జరుగుతుందని, హైదరాబాద్‌లో ఆఫీసు ఖర్చుల కోసం కొన్ని చెక్కుల మీద సంతకాలు పెట్టి నేను బయటకు వచ్చా. నేను ఫీల్డ్‌ పనుల మీద ఉన్నప్పుడు నమ్మకస్తులే నాకు తప్పుగా లెక్కలు చూపించి చెక్కులన్నీ మార్చుకున్నారు. నేను అప్పటివరకూ సంపాదించిన ప్రతి రూపాయి ఆ ప్రాజెక్టుపైనే పెట్టా. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. కానీ చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రోడ్డుమీదకొచ్చా.

పెళ్లికి షరతు...
నాకు తగిలిన ఎదురుదెబ్బతో ఎవరిని నమ్మాలన్నా భయమేసింది. ఏడాది పాటు ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరిగా. కాస్త మనసు కుదుట పడ్డాక ఓ ఇంజినీరింగ్‌ సంస్థలో ఉద్యోగంలో చేరా. నాకున్న పరిచయాలతో ఆ సంస్థకు ప్రాజెక్టులు తీసుకొచ్చేవాడిని. వాళ్లకు నా పనితీరు నచ్చి కొన్ని నెలల్లోనే జీతంతో పాటు హోదానీ పెంచుతూ వెళ్లారు. ఎంత పనిచేస్తున్నా, మళ్లీ వ్యాపారం మొదలుపెట్టాలన్న కసి మాత్రం తగ్గట్లేదు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నాకు పెళ్లి కుదిరింది. నేను గతంలో వ్యాపారంలో నష్టపోయిన సంగతి అమ్మాయి వాళ్లకు తెలిసింది. అందుకే నేను మళ్లీ వ్యాపారం జోలికి వెళ్లకూడదని వాళ్లు షరతు పెట్టారు. అలాగేనని చెప్పి పెళ్లిచేసుకున్నా. నా భార్య పద్మలత అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. నాకప్పుడు పదహారు వేలు జీతం వచ్చేది. కానీ నేను పదివేలేనని అబద్ధం చెప్పి మిగతావి వ్యాపార పెట్టుబడి కోసం దాచడం మొదలుపెట్టా. వ్యాపారంలో మళ్లీ రాణించగలనన్న ఆత్మవిశ్వాసం పెరిగాక నా జీతం, ఆలోచనల గురించి నా భార్యకు చెప్పా. తనకు భయమేసినా నా కోరికను కాదనలేకపోయింది. అది నాకు రెండో జీవితం. కొత్త ఉత్సాహంతో ‘ఎంఎంఆర్‌ గ్రూప్‌’ను మొదలుపెట్టా. నాకు గతంలో ప్రాజెక్టు అప్పజెప్పిన ‘జీటీఎస్‌’ సంస్థనే మళ్లీ కలిశా. నాపైన నమ్మకంతో వాళ్లొ చిన్న ప్రాజెక్టు అప్పజెప్పారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేయడంతో మరికొన్ని ప్రాజెక్టులు రావడం మొదలయ్యాయి. డొకోమో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, టాటా లాంటి అన్ని పెద్ద కంపెనీలకు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన కేబిలింగ్‌ పనులన్నీ మేమే చేస్తూ వచ్చాం.

ఐదారేళ్లలో రిటైర్‌మెంట్‌!
టెలికాం రంగంలో చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అందుకే ఒకే రంగానికి పరిమితమవడం సరికాదనిపించి, వేర్వేరు రంగాలకు వ్యాపారాన్ని విస్తరించా. ఎంఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో వైజాగ్‌, రాజమండ్రిలో భారీ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేశాం. ఎంఎంఆర్‌ పీఈబీ సిస్టమ్స్‌, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌, పవర్‌ ప్రాజెక్ట్స్‌, ఐటీ స్టాఫింగ్‌, మైనింగ్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఆగ్రో లాంటి సంస్థలతో వివిధ రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించా. వీటన్నింటి ద్వారా వీలైనంత మందికి ఉపాధి కల్పించాలన్నదే నా కోరిక. యువతలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ పైన ఆసక్తి పెంచేందుకు డిక్కీ (దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నాకిప్పుడు నలభై ఏళ్లు. ఇప్పటికే పనిలో పడి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఎంఎంఆర్‌ ట్రస్ట్‌ ద్వారా భవిష్యత్తులో చాలా పనులు చేయడానికి ప్రణాళిక వేసుకున్నా. అందుకే మరో ఐదారేళ్ల తరవాత పని నుంచి రిటైరయ్యి ట్రస్ట్‌ మీద దృష్టి పెట్టాలన్నది నా ఆలోచన. కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన నేను ఇప్పుడు వందల కోట్ల లావాదేవీలు సాగిస్తోన్న సంస్థలకు అధినేతను కావడం వెనకున్న ఒకే ఒక్క కారణం కష్టమే. మన వూరు కానప్పుడు ఏ వూరైనా ఒకటేనని నమ్ముతా. నేను చేశాను కాబట్టి ఎవరైనా ఏదైనా సాధించగలరు. కావాలంటే ప్రయత్నించి చూడండి..!

ఇంకొంత
సరైన మెంటార్‌షిప్‌లేక చాలా మంది విద్యార్థులు ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలని సరిపెట్టుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు హాస్టళ్లూ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి ఎంట్రప్రెన్యూర్‌షిప్‌మీద మెంటారింగ్‌ తరగతులు నిర్వహిస్తున్నా. అలా ఇప్పటివరకూ సుమారు 300 తరగతులు నిర్వహించా.

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికరంగ ప్రాధాన్యాల్లో కొన్ని మార్పులు కోరుతూ ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశాం. పదినిమిషాలే అపాయింట్‌మెంట్‌ ఇచ్చినా, తరవాత అరగంట పాటు ఆయన మాతో చర్చించారు.

నేను ఎంత డబ్బు సంపాదించినా నా భార్య పద్మలత బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం వదల్లేదు. ఓ ప్రభుత్వ సంస్థలో పెద్దఅధికారిగా తనని చూడాలన్నది ఆమె తండ్రి కల. అందుకే ఉద్యోగం మానేయడానికి ఆమె ఇష్టపడలేదు.

ఇప్పటివరకు సుమారు ఏడువేల మంది నా ద్వారా ఉపాధి పొందారు. ఉద్యోగం లేకపోతే కలిగే బాధేంటో నాకు తెలుసు. అందుకే భవిష్యత్తులోనూ ఉపాధి కల్పనే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.