close
అచ్చంగా తిరుమల దేవుడే!

అచ్చంగా తిరుమల దేవుడే!

వరదహస్తం, కటిహస్తం, వక్షస్థలం మీద హృదయలక్ష్మి, చిరుమందహాసం, చుబుకంపై తెల్లని కప్పురపు చుక్క, సొగసైన నాసిక...అచ్చంగా తిరుమలేశుడే అన్నట్టుగా ఉంటాడు చిత్తూరు జిల్లాలోని కీలపట్లలో కొలువైన కోనేటిరాయుడు. ఇద్దరు శ్రీనివాసులకూ ఎన్నో పోలికలు, ఇద్దర్నీ ముడిపెడుతూ ఎన్నో ఐతిహ్యాలు.

పెద్ద కిరీటము వాడు, పీతాంబరములవాడు.. నొద్దిక గౌస్తుభమణి వురమువాడు.. ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు.. అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు...అన్న వర్ణన తిరుమల శ్రీవేంకటేశ్వరుడికే కాదు, కీలపట్ల కోనేటిరాయుడికి కూడా సరిపోలుతుంది. ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడువాడు...’ అంటూ తాళ్లపాకవారు కీర్తించింది కూడా కీలపట్ల కోనేటిరాయుడినే అన్న అభిప్రాయమూ ఉంది. అయినా, ఆయన శ్రీవేంకటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు, ఈయన కోనేటిరాయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనుండేది తిరుమలలో, ఈయనుండేది కీలపట్లలో. మహా అయితే, పేరూ వూరూ మారవచ్చు కానీ ... ఇద్దరి మధ్యా ఎన్నో పోలికలు. ఇద్దరూ పుష్కరిణి తీరంలో వెలసిన కోనేటిరాయుళ్లే! ఇద్దరూ కొండలంత వరములు గుప్పెడువాళ్లే! కాబట్టే, చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఉన్న కీలపట్ల గ్రామం చిన్న తిరుపతిగా పేరు తెచ్చుకుంది. కీలపట్ల అసలు పేరు కోటిపల్లి. చోళరాజుల కాలంలో కోటిపల్లి సమీపాన ఓ చిన్న సైనిక పటాలాన్ని ఏర్పాటు చేశారు. చిన్నదండు ఉండే ప్రాంతం కాబట్టి ‘కీల్‌ పటాలం’ అని పిలిచేవారు. వాడుకలో కీల్‌ పటాలం, కీల్‌పట్టు, కీల్‌పట్టణం.. కీలపట్లగా స్థిరపడింది.

ప్రాచీనుడు.. ఇక్కడ నెలకొన్న శ్రీవేంకటేశ్వరుడిని బ్రహ్మమానస పుత్రుడైన భృగుమహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి. పాండవ మధ్యముడు అర్జునుని మునిమనవడైన జనమేజయుడు స్వామివారికి చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాడని అంటారు. ఆతర్వాత పల్లవులూ, చోళరాజుల కాలంలో దాన్ని పునర్నిర్మించినట్టు ఆధారాలున్నాయి. కీలపట్ల వేంకటేశ్వరుడి ఆలయం కాలప్రవాహంలో ఎన్నో అవరోధాల్ని తట్టుకుని నిలిచింది. తురుష్క సైనికులు హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, అపార సంపదల్ని కొల్లగొట్టారు. ఆ విధ్వంస యాత్ర ఓసారి కీలపట్ల దాకా వెళ్లింది. స్వామి మీద భక్తితో గ్రామ ప్రజలు ఎదురొడ్డి పోరాటం సాగించారు. ఆ రాకాసి బలం ముందు సామాన్యుల శక్తి సరిపోలేదు. దీంతో అర్చకులు వేంకటేశ్వరస్వామి దివ్య విగ్రహాన్నీ, అమ్మవారి మూర్తులనూ జాగ్రత్తగా పెకిలించి, పట్టు బట్టలలో చుటి,్ట గుడికి ఈశాన్యంగా ఉన్న శ్రీవారి కోనేటిలో ముంచేశారు. పంచలోహ విగ్రహాలనూ, హుండీ సొమ్మునూ, ఆభరణాలనూ కూడా కోనేటిపాలు చేశారు. అప్పటికే ఎవరో విగ్రహాల్ని ధ్వంసం చేసుంటారన్న భ్రమతో తురుష్క సైన్యం వెనుదిరిగిపోయింది. అలా ఎంతోకాలం, పాలకడలిలో పవళించే స్వామి కాస్తా నీటిపాలు అయ్యాడు. విజయనగరాధీశుల హయాంలో ఆలయానికి పునర్వైభవం వచ్చింది. ఆ సమయానికి కీలపట్ల గ్రామం పుంగనూరు జమీందారుల అధీనంలో ఉంది. జమీందారు బోడికొండమనాయుడు మహా ఆస్తికుడు. ఆయనకు శ్రీమన్నారాయణుడు కలలో కనిపించి ‘నేను కీలపట్ల దేవాలయంలోని కోనేటిలోనే ఉన్నాను. పునఃప్రతిష్ఠించు’ అని ఆదేశించాడు. స్వామివారి ఆదేశాన్ని శిరసావహించాడు కొండమనాయుడు. ఎంతోకాలం కోనేటిలో యోగనిద్రా స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వామి ‘కోనేటిరాయుడని’ పేరు తెచ్చుకున్నాడు.

ఎన్నో పోలికలు...
తిరుమల ఆలయాన్నీ కీలపట్ల ఆలయాన్నీ ఒకే శిల్పి తీర్చిదిద్దాడని అంటారు. దీనికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. నిర్మాణ కార్యక్రమాలు కీలపట్లలోనే ముందుగా ప్రారంభం అయ్యాయి. ఆ నిర్మాణ ప్రతిభను గమనించిన తిరుమల ఆలయ నిర్మాతలు ప్రధాన శిల్పాచార్యుడిని కొండమీదికి పిలిపించి, మూలవిరాట్టు రూపకల్పన బాధ్యత అప్పగించారు. చతుర్భుజాలతో, ఎడమవైపు వయ్యారంగా కొద్దిగా వంగినట్టుగా కనిపిస్తూ, అరగన్ను చూపులతో, చెరగని చిరునవ్వుతో - ఓరకమైన తపోస్థితిలో శ్రీవేంకటేశ్వరుడి మూలవిరాట్టుకు ప్రాణంపోశాడా శిల్పి. విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రెండు ఆలయాలూ ఒకే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాయి. ఆ దివ్య ఘడియల్లో ప్రతిష్ఠాపన జరిగితే.. ఆ క్షేత్రం కలియుగాంతం వరకూ వైకుంఠంలా వెలిగిపోతుందని రుత్వికులు తేల్చి చెప్పారు. కీలపట్లలో కొన్ని పనులు మిగిలి ఉండటంతో... ఆనతి ఇస్తే వెళ్లొస్తానని శిల్పాచార్యుడు నిర్వాహకుల అనుమతి కోరాడు. కీలపట్లలో తిరుమల కంటే సుందరంగా విగ్రహాన్ని ఎక్కడ తీర్చిదిద్దుతాడోనన్న అనుమానంతో ఆలయ నిర్వాహకులు ఆ మహాశిల్పిని మాయం చేశారని జానపదుల కథనం. ఫలితంగా, కీలపట్ల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఒక సంవత్సరం వాయిదాపడింది. కీలపట్ల స్వామి మహిమల్ని విన్న అన్నమాచార్యుడు ఎన్నోసార్లు ఈ క్షేత్రాన్ని సందర్శించాడు. కోనేటి ఒడ్డున అనేక కీర్తనలకు ప్రాణంపోశాడు. స్వామివారి ఆలయ నిర్మాణం జరిగిన వందేళ్ల తర్వాత, ఆవరణలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అమ్మవారు ఐశ్వర్య పీఠంపై కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. దీన్ని చోళరాజులు నిర్మించడంతో చోళ మండపం అన్న పేరొచ్చింది.

- ఈరళ్ల శివరామ ప్రసాదు, ఈనాడు, చిత్తూరు డెస్క్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.