close
రెండు పెళ్లిళ్ల రాముడు!

రెండు పెళ్లిళ్ల రాముడు!

భద్రాద్రి సహా ఏ క్షేత్రంలో అయినా శ్రీరాముడు రామనవమికి మాత్రమే కల్యాణం చేసుకుంటాడు. కానీ, వరంగల్‌ జిల్లాలోని వీరాచలంలో మాత్రం రాములవారు ఏడాదికి రెండుసార్లు పెళ్లి చేసుకుంటారు. చైత్రంలోనే కాదు, కార్తీక మాసంలోనూ బాసికం కట్టుకుంటారు.

బండ మీద స్వయంభూమూర్తిగా శ్రీరామచంద్రమూర్తి కొలువైన క్షేత్రం వీరాచలం. వరంగల్‌ జిల్లా, లింగాలఘనపురం మండలంలోని వీరాచలం (జీడికల్‌) ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తిని కలిగిన ఆలయం. ఏటా కార్తీక శుద్ధ చతుర్దశి మొదలు కార్తీక బహుళ ఏకాదశి వరకూ బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. పంచమినాడు కనులపండువగా కల్యాణం జరుగుతుంది. చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో సీతారాముల పెళ్లి నిర్వహించటం ఆనవాయితీ. కానీ వీరాచలంలో మాత్రం, శ్రీరామనవమితో పాటుగా కార్తీక పంచమినాడూ కల్యాణం జరుగుతుంది. ఆ సంప్రదాయం వెనుకా, ఈ క్షేత్ర మహత్యం వెనుకా అనేక ఐతిహ్యాలున్నాయి.

  రామాయణ ఘట్టం.. పురాణ కథ ప్రకారం, సీత బంగరు లేడిని చూసి మనసు పడటంతో... రాముడు ఆ మాయామృగం వెంట విల్లంబులతో పరుగులు తీస్తాడు. రామ బాణానికి తిరుగేముంది? ఆ శరాఘాతానికి గిలగిలా తన్నుకుంటూ ‘శ్రీరామా’ అంటూ గంధర్వుడి రూపంలో నేలవాలిపోతుంది జింక. ‘నాపేరు చిత్రరథుడు. కౌశిక మహర్షి శాపం వల్ల ఈ రూపం ధరించాను. నువ్వు సంధించిన బాణంతో శాపవిముక్తి లభించింది. ధన్యోస్మి రామా!’ అంటూ రక్తపుమడుగులోనే తన కథంతా వివరించాడు గంధర్వుడు. ఆ భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు రామచంద్రుడు. ‘శ్రీరాముని పాదజలం కంటే, పవిత్రమైంది ఏం ఉంటుంది? ఆ ఒక్క కోరికా తీర్చు తండ్రీ!’ అని విన్నవించాడు గంధర్వుడు. శ్రీరాముడు తన బొటనవేలితో బండపై నొక్కిపట్టి గంగను ప్రార్థించడంతో... జలం ఉబికి వచ్చింది. ఆ గుంత లోంచి ఇప్పటికీ నీళ్లు వస్తూనే ఉన్నాయి. అదే, ‘లేడి బండ’గా ప్రశస్తి పొందింది. ఇది వీరాచల దేవాలయానికి తూర్పున రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరో గాథ ప్రకారం...మాయలేడి సంహారం తర్వాత, సంధ్యాసమయం సమీపించడంతో అక్కడున్న బండ మీద కూర్చునే సంధ్యవార్చుకున్నాడు రాముడు. పశ్చిమదిశగా బదరీ వృక్షం కింద, తలనిండా జడలతో ఓ సాధకుడు కనిపించాడు. అతని పేరు వీరముని. రామభక్తుడు. ఇష్టదైవం కట్టెదుట నిలవటంతో ఆ భక్తుని ఆనందానికి అవధుల్లేవు. ‘నిత్యం నీ పాద సేవ చేసే భాగ్యం కల్పించు స్వామీ’ అని వేడుకున్నాడు. వీరమునికి తన రెండు పాదుకల్నీ ఇచ్చి, ఆయన పూజించిన విగ్రహానికి దివ్యత్వాన్ని ప్రసాదించాడు రాముడు. జీడంత చిన్న తప్పు చేసినా, ఈ గుండంలో స్నానం చేయగానే పూర్తి పాపవిమోచన కలుగుతుందని వరమిచ్చాడు కూడా. ఆ ప్రదేశమే నేటి జీడికల్‌! వీరముని వరం కారణంగా శ్రీరాముడు వెలసిన క్షేత్రం కావడంతో ‘వీరాచలం’గా సుప్రసిద్ధమైంది.

 కార్తీక కల్యాణం.. కార్తీక మాసంలో రాములవారి కల్యాణానికి సంబంధించి కూడా ఓ ఐతిహ్యం ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన చంద్రగుప్తుడికి చాలాకాలం దాకా సంతానం కలగలేదు. భృగుమహర్షి ఇచ్చిన ఫలాలతో పట్టపురాణి సుమతి ఒక పాపకూ బాబుకూ జన్మనిస్తుంది. బాలచంద్రిక, బాలచంద్రుడని పేరుపెట్టుకుంటారు. ఆ ఆనందంలో, బారసాలకు వచ్చిన భృగుమహర్షికి సపర్యలు చేయడం మరచిపోతారు. దీంతో మహర్షి ఆగ్రహిస్తాడు. ‘కార్తీక పౌర్ణమి నాటికంతా అపమృత్యువు నిన్ను వరిస్తుంది’ అని రాజును శపిస్తాడు. సరిగ్గా కార్తీక పౌర్ణమి రాత్రి పొరుగురాజైన భీమసేనుడు దండెత్తుతాడు. ఓటమిని భరించలేక రాజూ రాణీ ఆత్మహత్య చేసుకుంటారు. యువరాజును రక్షించే ప్రయత్నంలో మంత్రి దోపిడీ దొంగల చేతికి చిక్కుతాడు. వారు మంత్రిని చంపి పసివాడిని తీసుకెళ్తారు. యువరాణిని మాత్రం భీమసేనుడే పెంచుకుంటాడు. బాలికకు యుక్తవయసు వచ్చాక ఘనంగా స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవర సభలో తన శౌర్యపరాక్రమాలతో బాలచంద్రిక మనసును దోచుకుంటాడు బాలచంద్రుడు. ఆ అనైతిక వివాహంతో...ఇద్దరి రంగూ, దండలూ, ఆభరణాలూ నల్లగా జీడి రంగులోకి మారిపోతాయి. ఆకాశవాణి ప్రత్యక్షమై అసలు విషయం చెబుతుంది. ఆ పాపాన్ని పరిహరించుకోడానికి పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తారు. అయినా...పాపవిమోచనం కాకపోవటంతో జీడికల్‌ దగ్గరున్న బండ మీద కూర్చుని కన్నీరుమున్నీరుగా విలపిస్తారు. ఆ కన్నీటిలో ఒంటిమీదున్న జీడి రంగంతా కరిగిపోతుంది. మునుపటి బంగారు ఛాయ వచ్చేస్తుంది. ఆ ఇద్దరి కన్నీటితో ఏర్పడినవే జీడిగుండాలని నానుడి. ఈ రెండు జీడి గుండాలతో పాటూ ప్రస్తుత గర్భగుడిలో ఉన్న పాలగుండంలోనూ స్నానం చేశాక పరిపూర్ణ శాపవిముక్తి కలిగింది వాళ్లకు. తమ జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సేవకే అంకితం చేసి అక్కడో రామాలయాన్ని నిర్మించారు. కార్తీక మాసంలో శాపవిముక్తి కలిగింది కాబట్టి, ఆ నెలలోనే స్వామివారికి కల్యాణం జరిపించే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. వరంగల్‌కు 69 కిలోమీటర్ల దూరంలో ఉందీ దేవాలయం.

- కర్రె వీరయ్య, న్యూస్‌టుడే, లింగాలఘనపురం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.