close
గుండు కింద సుబ్రహ్మణ్యుడు!

గుండు కింద సుబ్రహ్మణ్యుడు!

పార్వతీ పరమేశ్వరులు...ఇద్దరి దయా, ఇద్దరి కారుణ్యమూ ఒక చోట కుప్పగా పోస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు అవుతాడంటారు. ఆ స్వామి కుండలినీ శక్తికి ప్రతీక అని ఆదిశంకరులు ‘సుబ్రహ్మణ్య భుజంగస్తవం’లో విశదీకరించారు. అలాంటి మహిమాన్విత మూర్తి గుండు రూపంలో, ఆదిశేషుడి అవతారంగా వెలసిన క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది.

చుట్టూ ఎత్తయిన కొండలు...పచ్చని చెట్లు...ఆహ్లాదపరిచే ప్రకృతి నడుమ కొలువుదీరాడు..పరమశివుడి ప్రియపుత్రుడూ తారకాసురుణ్ని వధించినవాడూ, దేవ గణాలకు అధిపతీ అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామంలో ఉంది...గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం. సమీపంలోని పాతకోట కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. తూర్పుదిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో కనిపించే పెద్ద శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతిరూపంగా కొలుస్తారు. దీంతో, గుండు సుబ్బరాయుడు కాస్తా వాడుకలో గుంటికింద దేవుడిగా వాసికెక్కాడు. స్థల మహత్యం తెలిసిన మహర్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. అప్పట్లో సుబ్రహ్మణ్యస్వామి, మహర్షులకు ఏడు శిరసుల శేషుడి రూపంలో దర్శనమిచ్చేవాడని అంటారు. దీంతో ఆ గుండు మహిమాన్వితమైందని గ్రహించిన మహర్షులు నిత్య పూజలు ప్రారంభించారు. అదే కాలక్రమంలో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. మూలవిరాట్టు పాదాలకింద పాతాళగంగ ఉంది. ఇందులో నీరు చాలా తీయగా ఉంటుంది. ఆ తీర్థాన్ని తీసుకుంటే ఎంత మొండి వ్యాధులైనా ఇట్టే తొలగిపోతాయనీ, భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లి పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయనీ ప్రగాఢ విశ్వాసం. మండువేసవిలోనూ నీటిమట్టం అదే స్థాయిలో, చేతికందేలా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నీటితోనే స్వామిని అభిషేకిస్తారు.

పురాణగాథ...
పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు కుమారస్వామిని సర్పరూపంలో కొలవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. ఒకానొక సమయంలో, ఈశ్వరుడిని దర్శించుకోడానికి చతుర్ముఖ బ్రహ్మ కైలాసానికి వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా బ్రహ్మను అవమానించాడు కార్తికేయుడు. అది తెలిసి పరమశివుడు కొడుకును మందలించాడు. తానెంత అపరాధానికి పాల్పడ్డాడో సుబ్రహ్మణ్యుడికి అప్పుడు కానీ అర్థంకాలేదు. చాలా పశ్చాత్తాపపడ్డాడు. సృష్టికర్తను అగౌరవపరచిన దోషాన్ని తొలగించుకోడానికి తనకు తాను ఓ శిక్ష విధించుకున్నాడు. భూలోకానికొచ్చి, నాగుపాము రూపంలో రహదారికి అడ్డంగా పడుకున్నాడు. కాటేయడానికొచ్చిన విషసర్పమేమో అనుకుని జనం రాళ్లతో కొట్టసాగారు. దీంతో, నిలువెల్లా గాయాలయ్యాయి. ఆ విషయం పార్వతీదేవికి తెలిసింది. మాతృ హృదయం కదా! పరుగుపరుగున వచ్చింది. తన బిడ్డను రక్షించమని ముక్కోటి దేవతలనూ సప్తర్షులనూ ప్రార్థించింది. మహర్షుల సూచన ప్రకారం, తనయుడితో షష్ఠి వ్రతం చేయించింది. అలా పాప పరిహారం అయిపోయిందనీ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపాన్ని విడిచి పెట్టాడనీ అంటారు. ఆ కారణంగానే, స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాడని చెబుతారు.

దేవతల సమాహారం...
ఆలయానికి దక్షిణ భాగంలో...పూర్వం మునులు ప్రతిష్ఠించిన మహాలింగం కాలగమనంలో శిథిలమైపోయింది. 

దాని పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి రాజరాజేశ్వరీ సహిత మరకత లింగాన్ని ప్రతిష్ఠించారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమార్చన, ఇతర పూజలూ జరుగుతాయి. తర్వాత కాలంలో, ఆలయానికి ఎదురుగా దాదాపు యాభై అడుగుల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఉత్తర భాగాన శబరి గిరీశుడి గుడి కట్టారు. ఆ పక్కన నాగ దోషాల నివారణకు నవగ్రహాలను నెలకొల్పారు. ఈ రెండు ఆలయాల పక్కన షిర్డీ సాయినాథుడి క్షేత్రమూ ఉంది. మందిరానికి సమీపంలో 108 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఒకసారి ఈ లింగాలకు అష్టోత్తర అభిషేకాలు చేస్తే 108 సార్లు చేసినంత ఫలమని అంటారు. అలా కార్తికేయుడి సన్నిధానం కాస్తా సకల దేవతల సమాహారంగా రూపొందింది. ఇక్కడ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలూ విశేషంగా పూజలు జరుగుతాయి. మూడో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఏకాదశవార రుద్రాభిషేకాలు, రథోత్సవం, తిరునాళ్లు జరుగుతాయి. శ్రావణ మాసంలో భక్తులు ఉపవాసదీక్షతో పుట్ట వద్ద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి, రావి, వేప, కానుగ చెట్లు ఇక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదభరితం చేస్తున్నాయి. దీంతో కార్తీక వనభోజనాలకు భక్తులు తరలివస్తుంటారు. ఆదివారాలూ పర్వదినాల్లో అన్నదానం జరుగుతుంది. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి బస్సు సౌకర్యం ఉంది. అనంతపురం - బెంగుళూరు జాతీయ రహదారిలో గార్లదిన్నె మండల కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో పెనకచెర్ల జలాశయం ఉంది. మనసును ఉల్లాసపరిచే వాతావరణం ఉంటుందిక్కడ. పది కిలోమీటర్ల దూరంలో.. పెన్నానది ఒడ్డునున్న సింగరప్పకొండ మీద వందల ఏళ్లనాటి పరమేశ్వరుడు, చెన్నకేశవుడు, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ క్షేత్రాన్నీ దర్శించుకోవచ్చు.

- వునికిలి హరగోపాల రాజు, అనంతపురం డెస్క్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.