close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అలస్కా ఓ అద్భుత ప్రపంచం..!

అలస్కా ఓ అద్భుత ప్రపంచం..!

‘చుట్టూ నీలిజలాలూ వాటిమీద తేలే మంచుముద్దలూ; తీరంలోని మంచుకొండల మధ్యలోంచి జాలువారే జలపాతాలూ హిమనీనదాలూ; కొండపాదాల్లో పెరిగే వర్షారణ్యాలూ పచ్చని ఉద్యానవనాలూ; సాగరంలో మునకలు వేసే సముద్ర జంతువులూ వాటిమీదుగా ఎగిరే సాగర పక్షులూ... ఇలా ఎన్నోప్రకృతి అందాలకూ వింతలకూ నిలయమే మా అలాస్కా ఓడ ప్రయాణం’ అంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.సీత.

సియాటల్‌లోని మా అబ్బాయి దగ్గరకు వెళ్లిన మేము, హాలెండ్‌- అమెరికన్‌ లైనర్‌ అనే ఎనిమిది అంతస్తుల ఓడలో అలాస్కాకు బయలుదేరాం. మూడో అంతస్తు గదిలోని గాజు కిటికీల్లోంచి సముద్రం చక్కగా కనిపిస్తుంది. డిన్నర్‌ అయ్యాక ఓడ అంతస్తులన్నీ కలియతిరిగాం. లిఫ్ట్‌లో తిరిగినా మూడు గంటలు పట్టింది. కాలక్షేపంకోసం జరిగే కార్యక్రమాల వివరాలతో కూడిన కాగితాలను రోజూ సాయంత్రానికల్లా ఇచ్చేవారు. ఉదయం అల్పాహారానికి వెళ్లి వచ్చేలోగా సిబ్బంది రూమ్‌ను అలంకరించి టవల్స్‌తో రకరకాల బొమ్మలను చేసి చాక్లెట్లు పెట్టి వెళ్లిపోయేవారు. మా రూమ్‌ కీ కార్డును బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానించడం వల్ల ప్రతి కొనుగోలుకూ కరెన్సీ అవసరం లేకపోయేది. ఓడలో సంగీతం, నృత్యం, క్రీడలు, కాసినోలు, ఫొటోస్టూడియో, కళాఖండాల ప్రదర్శనశాలలూ రెస్టారెంట్లూ, ఈతకొలనులూ... ఇలా రకరకాల విభాగాలు ఉన్నాయి.

రోజూ ఓ గంటపాటు రాబోయే నాలుగు రోజుల్లో ఉండబోయే ఎక్స్‌కర్షన్ల వివరాలూ వాటిలో చూడబోయే జంతువులూ పక్షుల వివరాలను వీడియోల సాయంతో సిబ్బంది వివరించేవారు. దాంతో మన బడ్జెట్‌కూ అభిరుచికీ అనువుగా ఉండేవాటిని ఎంచుకునే సౌలభ్యం ఉంది. మొదటి మూడు రోజులూ అనంతమైన సముద్రంలో ప్రయాణిస్తూ ఓడలోని బాల్కనీలోంచే కొండల్నీ వాటిమీద నుంచి దూకే జలపాతాల్నీ తీరంలో కదిలిపోయే పచ్చని చెట్లనీ చూస్తూ ‘అలాస్కా ప్రయాణం ఎంత అద్భుతం’ అనుకోని క్షణం లేదు.

పాలకడలిలో వెన్నముద్దలు!
ఓడ సిబ్బంది మైక్‌లో ప్రకటించిన ట్రేసీ ఆర్మ్‌ గ్లేషియర్‌ చూడ్డానికి చలికోట్లూ టోపీలూ ధరించి బాల్కనీలోకి చేరుకున్నాం. ఆ దృశ్యం దగ్గరయ్యే కొద్దీ లేత నీలం, లేతాకుపచ్చ రంగుల్లోని మంచుగడ్డలు సముద్రంలోకి కొట్టుకువచ్చాయి. మంచుశిఖరాల నుంచి కిందకు దూకే జలపాతాలు భారీ శబ్దాలతో సముద్రంలో కలుస్తూ కనువిందుచేశాయి. క్రమంగా సముద్రపు నీరు పాలవర్ణంలోకి మారి వాటిమీద మంచు శకలాలు వెన్నముద్దల్లా తేలుతూ కనిపించాయి. మేం ప్రయాణించే ఓడ భారీ పర్వతాల మధ్యలోని ఇరుకుదారుల్లో ప్రయాణించసాగింది. అప్పుడే సూర్యకాంతిలో మెరుస్తూ పర్వతశిఖరాల్లోని అతిపెద్ద ట్రేసీ ఆర్మ్‌ గ్లేషియర్‌ పైభాగం కనువిందు చేసింది. మా ఓడ మరో ఇరుకు మలుపులోకి ప్రవేశించగానే గ్లేషియర్‌ భుజభాగం నీలిపచ్చ వర్ణంలో మెరుస్తూ కనిపించింది. ఆ అద్భుత దృశ్యం ఓడలోని వాళ్లందరికీ కనిపించేలా కెప్టెన్‌ ఓడను అతి నెమ్మదిగా 180 డిగ్రీల కోణంలో తిప్పసాగాడు. ఆ అతిపెద్ద గ్లేషియర్‌, దాని నుంచి విరిగిపడే మంచు శకలాలు సముద్రాన్ని తెలుపురంగులోకి మారుస్తోన్న దృశ్యాన్నీ చూడగానే మన పురాణాల్లోని పాలకడలి ఇదేనా అనిపించింది. ఈ ట్రేసీ ఆర్మ్‌ అలాస్కా రాజధాని జూనౌకి దక్షిణంగా 45 మైళ్ల దూరంలో ఉంది. మైక్‌లోంచి వినిపించే దాని వివరాలను వింటూ ఆ సుందర దృశ్యాన్ని ఫొటోలూ వీడియోలూ తీసుకుంటూ సుమారు రెండు గంటలపాటు గడిపాం. కానీ మా ముఖాలు చలిగాలుల తీవ్రతకి ఉబ్బి, ఎర్రబారి కళ్లూ ముక్కూ జలపాతాలతో పోటీపడ్డాయి. ఓడలోని ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో ప్రతి ఒక్కరినీ అడిగి మరీ ఫొటోలు తీశారు.

రాత్రి పదికి సూర్యాస్తమయం!
సియాటల్‌లో రాత్రి 8 గం.లకు చీకటిపడితే అలాస్కాలో మాత్రం రాత్రి 10 గంటలకు సూర్యాస్తమయం అయ్యేది. పొద్దున్న 4 గంటలకే సూర్యోదయం అయ్యేది. ఆ మర్నాడు ఉదయం ఏడు గంటలకే జూనౌకి చేరుకున్నాం. ప్రతి ట్రిప్‌లోనూ (4వరోజు నుంచి 7వరోజు వరకూ)ఓడ ఆగాక 5 నుంచి 10 రకాల ఎక్స్‌కర్షన్లు ఉంటాయి. అల్పాహారం ముగించి త్వరగా తయారై 8 గంటలకే బసచేసిన రూమ్‌కీ కమ్‌ గుర్తింపు కార్డులను తీసుకుని ఓడ దిగాం. ఎక్స్‌కర్షన్స్‌ సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని ఆహ్వానించడానికి. ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉండటంతో వేల్‌ వాచింగ్‌, మెండెన్‌హాల్‌ గ్లేషియర్‌ ఫొటో సఫారీని ఎంచుకున్నాం. ఐదుగురిని కలిపి ఓ మినీ బస్సులో ఎక్కించి జూనౌ పోర్టుకి తీసుకెళ్లి, సఫారీ బోటు ఎక్కించారు. జూనౌ స్టీఫెన్స్‌ పాసేజ్‌ అనే ప్రాంతానికి ప్రయాణించాం. నావికుల గుర్తుకోసం పెట్టిన ఫ్లోట్‌ పైకి ఎక్కి దూకుతోన్న సీల్స్‌ను గుర్తుపట్టి బోట్‌ అద్దాలు పైకి లేపారు. మేం వాటిని ఫొటోలు తీయడానికి పోటీ పడ్డాం. మరింత వేగంగా పడవని లోపలికి తీసుకెళ్తుంటే సముద్రంమీద ఫౌంటెయిన్‌ మాదిరిగా నీళ్లు ఎగసిపడటం కనిపించింది. అందుకు కారణం హంప్‌ బ్యాక్‌ వేల్స్‌ అని చెప్పారు. అవి 4-5 కలిసి రెప్పపాటులో నీటిలోకి ఎగిరిపడేవి. సముద్రంలో అక్కడక్కడా ఉన్న చెట్లపై బాల్డ్‌ ఈగిల్స్‌ నెస్ట్‌లూ గద్దల గుంపులూ సాల్మన్‌ చేపలూ కనిపించాయి. అలాస్కాను సాల్మన్‌ చేపల రాజధానిగా చెబుతారు. పడవ ముందుభాగం తలుపు తెరిచి, నీళ్లల్లో తడుస్తూ ఫొటోలు తీసుకున్నాం.

హిమానీ నదంమీద...
అక్కడ నుంచి మరో మినీ బస్‌లో టోంగాస్‌ రెయిన్‌ ఫారెస్ట్‌కు చేరుకుని, నడకదారిలోనే మెండెన్‌హాల్‌ గ్లేషియర్‌కు బయలుదేరాం. అలాస్కన్‌ గోధుమ, నలుపురంగు ఎలుగుబంట్లు, ముళ్లపందులు, ఆర్కిటిక్‌ టర్న్స్‌ వంటి జంతువులూ పక్షులూ ఎదురుపడతాయని గైడ్‌ చెప్పాడు. అడవిలో సూర్యకాంతి సోకనంతగా చెట్లూ ఫెర్న్‌ మొక్కలూ సెడార్‌ వృక్షాలూ అరుదైన పుష్పజాతులూ కనిపించాయి. ఉన్నట్లుండి మా గైడ్‌ మీరు ఇప్పుడు గ్లేషియర్‌మీద నిలబడ్డారని అన్నాడు. వందేళ్ల కిందట మెండెన్‌ హాల్‌ గ్లేషియర్‌ మేం నిలబడిన ప్రదేశం వరకూ ఉండేదట. గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యటకులు ఎక్కువగా రావడం... వంటి కారణాలవల్ల విరిగిన గ్లేషియర్‌ శకలాలు కరిగిపోయాయి. ఫలితంగానే సముద్ర మట్టాలు పెరిగి ఉప్పెనలు సంభవిస్తున్నాయనేది ప్రత్యక్షంగా అర్థమైంది. అలా నడుస్తూ మేం బీవర్‌ డ్యాం, సాల్మన్‌ చేపలు ఉండే ప్రాంతానికి దగ్గరయ్యాం. అలాస్కాలో నడిచి వెళ్లే హిమనీనదం ఇదొక్కటే. అలా నడుస్తూంటే నీలాకుపచ్చ వర్ణంలో మెరిసే గ్లేషియర్‌ కనువిందు చేసింది. ఇక్కడ ఉండే స్థానిక ట్లింగిట్‌ ఇండియన్స్‌ తెగ దాన్ని సీటాంటాగు అని పిలుచుకుంటారట. ఈ గ్లేషియర్‌ కరిగి ఏర్పడిన సరస్సు నుంచే జూనౌ నగరానికి మంచినీళ్లు సరఫరా అవుతుంటాయి. ఇది 3,500 సంవత్సరాల కిందట ఏర్పడిందనీ, మంచు ఖండాలు విరిగిపడిపోవడంతో ఏటా సుమారు 40 మీటర్ల మేర కుంచించుకుపోతోందనీ గైడ్‌ వివరించారు. అన్నింటినీ మించి ఈ గ్లేషియర్‌ కరిగి అతిపెద్ద జలపాతాలు ఏర్పడ్డాయట. అది విని త్వరగా నడిచి అక్కడకు చేరుకున్నాం. జలపాతాల నుంచి వచ్చే పీడనం వల్ల గ్లేషియర్‌లో గుహలు ఏర్పడ్డాయి. అయితే ఆ గుహల్లోకి వెళ్లొద్దని బోర్డులు ఉన్నాయి. మంచు కరిగి అవి మూసుకుపోతే ప్రాణాపాయం. అక్కడ నుంచి వెనుతిరిగి మళ్లీ ఓడలోకి వచ్చాం.

సిట్కాలో...
ఐదోరోజున ఒకప్పటి అలాస్కా రాజధాని సిట్కా నగరాన్ని చేరుకున్నాం. ఆ రోజు ఎక్స్‌కర్షన్‌... వూటర్స్‌(సీ లయన్స్‌), రాప్టర్స్‌ అండ్‌ ఓహ్‌ యై. ఈసారి డీలక్స్‌ పవర్‌ బోటులో బయలుదేరాం. పైభాగం కొంత ఓపెన్‌ డెక్‌తోనూ గ్లాస్‌ క్యాబిన్‌తోనూ ఉంది. కెప్టెన్‌ అతి లాఘవంగా నీటిపక్షులూ చెట్లూ ఉన్న చిన్నా పెద్దా ద్వీపాలు కనిపించేలా తీసుకెళ్లాడు. ముందుకాళ్లతో చప్పట్లుకొడుతూ తలపైకి పెట్టి రకరకాల విన్యాసాలు చేసే వూటర్స్‌ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. పార్‌పోయిస్‌లు కెమెరాకి చిక్కకుండా ఈదేవి. మూడు గంటలు మూడు క్షణాల్లా గడిచాయి. తరవాత బాల్డ్‌ ఈగిల్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కి వెళ్లాం. గాయపడ్డ డేగ, గద్ద, గుడ్లగూబ... వంటి వాటిని దత్తత తీసుకుని వాటికి తిరిగి ఎగిరేవరకూ సంరక్షించే సంస్థ ఇది.

కెచికన్‌లో...
ఆరో రోజు ఉదయం ఏడు గంటలకే మా ఓడ అలాస్కాలోని మరో నగరం కెచికన్‌కు చేరుకుంది. దీన్ని ప్రపంచ సాల్మన్‌ రాజధానిగా పిలుస్తారు. ఓడ దిగి మేం ఎంచుకున్న లంబర్‌ జాక్‌ షో, సాక్స్‌మన్‌ నేటివ్‌ విలేజ్‌, టోటెంపోల్‌ పార్కులకు బయలుదేరాం. హైదా, ట్లింగిట్‌, షింషియన్‌ గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తారు. జనాభా 8050 మాత్రమే. ఈ షోలో స్థానిక వడ్రంగులు పన్నెండు రకాల రోమాంఛిత ప్రదర్శనలు చేశారు. వేగంగా 70 అడుగుల చెట్లమీదకి ఎక్కడం, కిందికి దూకడం, ఎక్కిన చెట్లను గొడ్డలితో నరికివేసి అది కూలిపోయేలోగానే అతి లాఘవంగా దూకడం, గొడ్డలిని కొయ్యదుంగ పైకి విసిరి, రెండు ముక్కలుగా చేయడం, రెప్పపాటులో కొయ్యను కుర్చీగా మలచడం, చెట్ల మొద్దులను నీళ్ల కొలనులో పడేసి వాటిని కాళ్లతో రోల్‌ చేస్తూ నీటిలో పడకుండా ఫీట్లు చేయడం వంటివి ప్రదర్శించారు.

ఓ బస్‌లో ఎక్కించుకుని సాక్స్‌మన్‌ నేటివ్‌ విలేజ్‌, టోటెంపోల్‌ పార్కుకు తీసుకెళ్లారు. స్థానిక తెగలవాళ్లు మమ్మల్ని వాళ్ల ఇంట్లోకి తీసుకెళ్లారు. రకరకాల వాద్యాలతో నృత్యాలు చేశారు. తరవాత టోటెంపోల్‌ పార్కుకి వెళ్లాం. అక్కడ అతిపెద్ద చెట్ల దుంగలు నిలబెట్టారు. వాటిమీద ఎలుగుబంట్లు, మనుషులు, గెద్దలు, సాల్మన్‌ చేపలు, తిమింగలాలు, రెయిన్‌డీర్‌ బొమ్మలు చెక్కి రంగులద్దారు. ఈ పోల్స్‌ 60 -80 అడుగుల పొడవున్నాయి. ఏ ఒక్క పోల్‌ మరో పోల్‌లా లేదు. మా డ్రైవర్‌ ఓ టోటెంపోల్‌పై చెక్కిన కథనాన్ని వినిపించాడు. ఓ ఆడ ఎలుగుబంటిని స్థానిక గిరిజనుడు పెళ్లి చేసుకుని మూడు పిల్ల ఎలుగుబంట్లకు జన్మనిచ్చాడన్నది ఆ కథన సారాంశం. మరో టోటెంపోల్‌మీద అబ్రహాంలింకన్‌ బొమ్మ చెక్కి ఉంది. ఇలాంటి అద్భుతమైన శిల్పకళ అలాస్కాలోని కెచికన్‌లో తప్ప ఎక్కడా కనిపించదట. తరవాతిరోజు ఉదయం ఎనిమిది గంటలకే మా ఓడ విక్టోరియా తీరాన్ని చేరింది. అక్కడ మేం సుప్రసిద్ధ స్థలాలన్నీ చూశాక బుచర్ట్‌ గార్డెన్‌కు వెళ్లాం. ఇందులో 700 రకాల పూలమొక్కలు కనువిందు చేశాయి. ఆ పూల సౌరభాలతో మా ముక్కుపుటాలు ఉబ్బిపోయాయి. జులైలో రాత్రివేళల్లో ప్రతి శనివారం ఇక్కడ జరిగే బాణసంచా ప్రదర్శన, వాద్య సంగీతం అద్భుతాలనే చెప్పాలి. తిరిగి రాత్రి 11 గంటలకు ఓడలోకి చేరుకుని ఉదయానికి సియాటల్‌ నగరానికి వచ్చేశాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.