close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ విషాదం నన్నెప్పటికీ వీడదు!

ఆ విషాదం నన్నెప్పటికీ వీడదు!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రుల పనితీరుపైన సర్వే నిర్వహిస్తే, తొలి స్థానం కింజారపు అచ్చెన్నాయుడుకే దక్కింది. పాతికేళ్ల లేత వయసులో ఎమ్మెల్యేగా, ఎర్రన్నాయుడి తమ్ముడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఇరవయ్యేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ‘అచ్చెన్న’గా ప్రజలకు దగ్గరయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా మారడానికి ముందు ప్రజా జీవితంలో కార్మికుడిలా ఆయన పడ్డ శ్రమ గురించి ఇలా చెబుతున్నారు.

ఇంత దూకుడుగా ఉండే వ్యక్తిని ఎమ్మెల్యేని చేసి తొందరపడ్డామేమో’... మొదట్లో చాలా కాలంపాటు అన్నయ్య ఎర్రన్నాయుడు నా గురించి ఇలానే ఆలోచించేవారు. ఆ దుందుడుకు స్వభావం రాజకీయాల్లోకి అడుగుపెట్టాక కొత్తగా వచ్చిందేం కాదు, చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం, చూసిన పరిస్థితులూ నన్నలా తయారు చేశాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ గ్రామం మా సొంతూరు. అమ్మా నాన్నకు మేం ఏడుగురు సంతానం. అందులో ఎర్రన్న అందరికంటే పెద్దయితే, నేను ఆఖరి వాణ్ని. దాంతో సహజంగానే నన్ను కాస్త గారాబంగా చూసేవారు. నాన్న దాలినాయుడు, అమ్మ కళావతమ్మలకు వ్యయసాయమే వృత్తి. మొదట్నుంచీ ఉమ్మడి కుటుంబం, దానికి తోడు వూరంతా స్నేహితులూ, పల్లెటూరి సరదాలూ, వీధుల్లో ఆటలూ, అప్పుడప్పుడూ పొలంలో పనులూ... ఇలా చిన్నతనంలో పచ్చటి వాతావరణంలో రోజులు చక్కగా గడిచిపోయేవి. ఇప్పుడు ‘అచ్చెన్న నోరు విప్పితే ఎదుటివాళ్లు మాటలకు తడుముకోవాల్సిందే’ అంటుంటారు కానీ, చిన్నప్పుడు మాత్రం నేను చాలా అమాయకంగా ఉండేవాడిని. ఎప్పుడోసారి ఏదో ఒక కొంటె పని చేసేవాణ్ని. ఓరోజు అలానే ఒకతను గెడ్డం చేసుకుంటుంటే వెళ్లి సాయం చేస్తానని చెప్పి, రెండు వైపులా మీసం తీసేశా. విషయం మా నాన్నకి తెలిసి చెడామడా తిట్టేశారు.

రెండేళ్లు ఖాళీగా...
ఏడో తరగతి వరకూ నిమ్మాడలో గుడిసెలాంటి స్కూల్లో మట్టి నేలమీదే చదివా. 8, 9 తరగతుల కోసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియ అగ్రహారం స్కూలుకి నడుచుకుంటూ వెళ్లొచ్చేవాణ్ని. ఆ తరవాత చదువంతా నగరాల్లోనే సాగింది. పదో తరగతి నర్సన్నపేటలో, ఇంటర్‌ విజయవాడలో, బీఎస్సీ విశాఖపట్నంలో పూర్తిచేశా. డిగ్రీ తరవాత నిమ్మాడ వచ్చి రెండేళ్లపాటు అక్కడే ఖాళీగా ఉన్నా. వూళ్లొ ఇంటిపక్కనే మా పెదనాన్న వాళ్ల ఇల్లుండేది. ఆయన మనవరాలు మాధవితో మాటలు కలిసి క్రమంగా తనపైన ఇష్టం పెరిగింది. అదే ప్రేమగా మారింది. ఆ విషయం ఇంట్లో చెబితే ఎవరూ ఒప్పుకోలేదు. మా అక్క కూతురినే నాకిచ్చి పెళ్లిచేయాలని నాన్నతో సహా అందరూ అనుకున్నారు. అదే సమయంలో ఎన్నికల హడావుడి కూడా మొదలైంది. ఇంట్లో నా పెళ్లి వ్యవహారం కూడా పతాక స్థాయికి చేరింది. ఎన్నికలయ్యాక దాని గురించి మాట్లాడదామని తాత్కాలికంగా ఆ వ్యవహారం వాయిదా వేశారు.

తొలి నామినేషన్‌ వెనక్కి...
నాకూ ఎర్రన్నకూ వయసులో చాలా తేడా ఉంది. నాకు వూహ తెలిసే నాటికే ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. రోజూ అన్నయ్య కోసం ఇంటికి జనాలు రావడం, వాడీవేడీ చర్చలు జరగడం అన్నీ చూస్తూ పెరిగా. అన్నయ్య మోటార్‌ సైకిల్‌మీదే సభలూ, పర్యటనలకు వెళ్లేవారు. నేనూ సరదాగా వస్తానని ఎన్నిసార్లు అడిగినా వద్దనేవారు. పెద్దయ్యాక కూడా మా దగ్గర రాజకీయాల ప్రస్తావన తెచ్చేవారు కాదు. ‘నేనున్నా కదా, మీకెందుకు అవన్నీ’ అనేవారు. అయినా ఆయనకు తెలీకుండా దొంగచాటుగా సభలకు వెళ్లి ప్రసంగాలు వినేవాడిని. 1994 శాసనసభ ఎన్నికలకు అన్నయ్య హరిశ్చంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసి నేను ఖాళీగానే ఉండటంతో ఓ ప్రాంతానికి ఎన్నికల ఏజెంట్‌గా నాకు బాధ్యతలు అప్పగించారు. నేను ఎర్రన్న తమ్ముడినని చాలా మందికి అప్పుడే తెలిసింది. ఆ తరవాతి ఏడాదిలో మా మండలంలోని ఎంపీపీ పదవి మహిళలకు రిజర్వయింది. ఆ సమయంలో చదువుకున్నవాణ్ని కాబట్టి నేను ఎంపీటీసీగా పోటీచేస్తే, ఎంపీపీకి మార్గనిర్దేశం చేయొచ్చని అన్నయ్య అన్నారు. అన్న మాట కాదనలేక నామినేషన్‌ వేశా. అదే సమయంలో మా కజిన్‌ మరొకరు వచ్చి ఎంపీటీసీగా పోటీ చేస్తానన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బరిలోకి దిగడం మంచిది కాదని ఎర్రన్న నన్ను నామినేషన్‌ ఉపసంహరించుకోమన్నారు. మళ్లీ ఆయన మాట కాదనలేదు. అలా రాజకీయాల్లో నా తొలి అడుగు నామినేషన్‌ ఉపసంహరణతోనే మొదలైంది.

అలిగి హైదరాబాద్‌ వెళ్లా...
మొదట్లో అసలు రాజకీయాలంటేనే పెద్దగా ఆసక్తిలేదు. అలాంటిది అన్నయ్య ప్రోత్సాహంతో వచ్చాక, తొలి నామినేషన్‌నే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో కోపమొచ్చి హైదరాబాద్‌ వెళ్లిపోయా. రెండు నెలలపాటు ఇంటి మొహం చూడలేదు. హైదరాబాద్‌లో అన్నయ్యకిచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఉండేవాణ్ని. ఆ సమయంలో ఎర్రన్న చేసిన మార్గనిర్దేశం నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. రాజకీయాల్లో నిరాశ ఎదురైనప్పుడల్లా అలుగుతూ పోతే జీవితాంతం అలకతోనే ఉండాల్సొస్తుందన్నారు. ఆయన అప్పుడు శాసనసభలో చీఫ్‌ విప్‌గా చాలా బిజీగా ఉండేవారు. దాంతో నాకొక జీప్‌ కొనిచ్చి ఆయన నియోజకవర్గంలోని అన్ని పనులూ అప్పజెప్పేవారు. రోజూ ఏదో ఒక వీధిలో తిరుగుతూ, ప్రజల సమస్యలు తెలుసుకొని అన్నయ్య దృష్టికి తీసుకెళ్లేవాణ్ణి. అలా క్రమంగా ప్రజలతో పరిచయాలు పెరిగాయి. 1996లో లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎర్రన్నే ఆ బాధ్యత తీసుకున్నారు. అన్నయ్యకు ప్రత్యర్థి ఎన్టీఆర్‌ కొడుకు జయకృష్ణ. పోటీ చాలా తీవ్రంగా ఉంది. కానీ విజయం అన్నయ్యకే దక్కింది. దాంతో ఆప్పటివరకు అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న హరిశ్చంద్రాపురం స్థానానికి ఉప ఎన్నికలొచ్చాయి.

పెళ్లి చేసుకుంటేనే టికెట్‌!
హరిశ్చంద్రాపురంలో అన్నయ్యకు తిరుగులేదు. అన్నయ్య వారసుడిగా టికెట్‌ నాకే వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అదే సమయంలో మా వదినకి(ఎర్రన్న భార్య) లేదా మరో సోదరుడికి టికెట్‌ ఇవ్వొచ్చంటూ పత్రికల్లో కథనాలొచ్చాయి. మరోపక్క ఇంట్లో నా పెళ్లి విషయం కూడా మళ్లీ చర్చకు వచ్చింది. అక్క కూతురిని పెళ్లి చేసుకుంటేనే అన్నయ్యతో ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించడానికి సిఫార్సు చేయిస్తామని నాన్న అన్నారు. నేను మాత్రం కుదరదని చెప్పా. పెదనాన్న మనవరాలు మాధవికి మాటిచ్చాననీ, టికెట్‌ రాకపోయినా ఫర్వాలేదు కానీ తననే పెళ్లి చేసుకుంటాననీ చెప్పా. కొన్ని రోజులు గొడవ జరిగాక, ఎన్నికల తరవాత ఆ విషయం మాట్లాడదామని అక్కడితో ఆపేశారు. టికెట్‌ విషయం ఎర్రన్న పార్టీకే వదిలేశారు. దాంతో పార్టీ ఓ వ్యక్తిని నియోజకవర్గంలో పరిస్థితిని తెలుసుకొని రమ్మని పంపించింది. అప్పటికే జనాలతో సత్సంబంధాలు ఉండటం నాకు కలిసొచ్చింది. కార్యకర్తలు టికెట్‌ నాకే ఇవ్వాలని కోరారు. అలా హఠాత్తుగా అన్నయ్య పార్లమెంటుకు వెళ్లడం, నేను రాజకీయాల్లోకి వచ్చి శాసనసభకు పోటీ చేయడం, మంచి మెజార్టీతో విజయం సాధించడం రోజుల వ్యవధిలో జరిగిపోయాయి.

ఏడేళ్లకు వివాహం!
ఎమ్మెల్యే అయ్యేనాటికి నా వయసు పాతికేళ్లు. కాస్త దూకుడుగా ఉండేవాణ్ని. నా గురించి తెలుసు కాబట్టి అన్నయ్య ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి సలహాలిస్తుండేవాడు. నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో అన్నయ్య ఫోన్‌ బిల్లంతా నాకు చేసిన కాల్స్‌తోనే నిండిపోయేది. ఎవరితో ఎలా ఉండాలీ, పనులెలా చేయాలీ లాంటి విషయాలన్నీ వివరంగా చెప్పేవాడు. క్రమంగా నా స్వభావమూ చాలా మారింది. కోపం బాగా తగ్గింది. ప్రజలతో కలిసి పనిచేస్తూ ముందుకెళ్లా. దాంతో 1999ఎన్నికల్లోనూ గెలిచా. రెండు దఫాలు శాసనసభలో అడుగుపెట్టినా, ఇంట్లో నా పెళ్లి విషయం మాత్రం కొలిక్కి రాలేదు. దాదాపు ఏడేళ్లు ఆ విషయంపైన పోరాడుతూనే ఉన్నా. నాన్న మాత్రం పట్టు వదల్లేదు. ఆయనకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటే వూరికి రావొద్దన్న స్థాయికి వచ్చారు. కానీ ఇంట్లో వాళ్ల చొరవతో చివరికి ఎలాగోలా ఆయన్ని ఒప్పించి 2001లో మాధవిని పెళ్లిచేసుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి కృష్ణమోహన్‌ తొమ్మిదో తరగతి, చిన్నోడు తనూజ్‌ ఐదో తరగతి చదువుతున్నారు.

పార్టీ, ప్రజలే ప్రపంచం
ఎమ్మెల్యేగా బిజీ అయ్యాక కుటుంబ జీవితానికి చాలా దూరమయ్యా. పిల్లలు నిద్రలేవకముందే బయటకి వెళ్లిపోయేవాణ్ని. తిరిగి నేనొచ్చేసరికి వాళ్లు పడుకునేవారు. కానీ ఆ క్రమంలో ప్రజలకు బాగా దగ్గరయ్యా. ఆ సామీప్యమే 2004 ఎన్నికల్లోనూ వరసగా మూడోసారి విజయాన్ని అందించింది. తరవాత పునర్విభజనలో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దయింది. మా సొంత మండలం టెక్కలి నియోజకవర్గంలో కలిసిపోయింది. 2009లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయాను. నాకు రాజకీయాలంటే పూర్తిగా తెలీని రోజుల్నుంచీ ప్రజల మధ్యలోనే ఉన్నా. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసి, ఓటమి పాలయ్యాక కూడా ప్రజలతోనే ఉన్నా. అదే 2014లో జరిగిన ఎన్నికల్లో విజయాన్ని తీసుకొచ్చింది. నా సామర్థ్యాన్ని గుర్తించిన పార్టీ మంత్రి పదవిని అందించింది.

నాకు తెలిసిన ప్రపంచం పార్టీ, ప్రజలే. తమ పార్టీలో చేరితే మంచి పదవులు కట్టబెడతామని ఇతర పార్టీల నుంచి పిలుపులొచ్చాయి. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటా కానీ ఆ పని మాత్రం చేయనన్నా. నన్ను నమ్మి ప్రజలు గెలిపించారు. పార్టీ పదవులిచ్చింది. వాళ్ల నమ్మకాన్ని నిజం చేసినప్పుడే ఆ విజయాలకు సార్థకత. దాని కోసం ప్రతి క్షణం శ్రమించడం నా బాధ్యత

- ఉప్పులూరి మురళీకృష్ణ
ఈనాడు, హైదరాబాద్‌
ఇంకొంత
నేను జీవితంలో బాగా సంతోషించింది తొలిసారి అన్నయ్యకు కేంద్ర మంత్రి పదవి దక్కినప్పుడే. అప్పటికి నేను ఎమ్మెల్యేని కూడా కాను. అలాంటిది మా ఇంట్లో, మా గ్రామంలో అంత పెద్ద నాయకుడు ఉన్నాడన్న భావనే చాలా ఆనందాన్నిచ్చింది.

* నాకు బాధను మిగిల్చిన ఘటనలు కూడా అన్నయ్యతో ముడిపడ్డవే. పార్టీకోసం సైనికుడిలా పనిచేసే అన్నయ్యకు 1989 ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వనప్పుడు చాలా బాధపడ్డా. మరోసారి 2009లో అప్పటివరకు ఓటమే తెలియని నేనూ, ఎర్రన్న ఒకేసారి శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయాం. ఈ రెంటికీ మించిన బాధ అన్నయ్య మరణం. విశాఖలో జరిగిన ఓ పెళ్లికి హాజరై తిరిగొస్తున్న అన్నయ్య కారును ట్యాంకర్‌ ఢీకొట్టింది. అక్కడికక్కడే గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం నన్నెప్పటికీ విడిచిపోదు.

* మాకెంత ఆస్తి ఉందో కూడా నాకు సరిగ్గా తెలీదు. నా జీతం డబ్బులే నేను ఖర్చు చేస్తాను. ఇతర అవసరాలేమైనా ఉంటే మా రెండో అన్నయ్యే ఇప్పటికీ డబ్బులిస్తాడు. విశాఖపట్నంలో ఏసీపీగా పనిచేస్తున్నా ఇంటి ఆర్థిక వ్యవహారాలు ఆయనే చూసుకుంటారు.

* మొదట్నుంచీ ఇప్పటివరకూ మాది ఉమ్మడి కుటుంబమే. వాటాలు వేరైనా, ఒకే ఇంట్లో, ఒకే మాట మీదే అందరం ఉంటాం.

* సినిమాలు తక్కువగానే చూస్తాను. నేను చూసిన ఆఖరి సినిమా శ్రీరామరాజ్యం. ఎన్టీఆర్‌కు అభిమానిని. ఓసారి అన్నయ్య తీసుకెళ్లి ఎన్టీఆర్‌కు నన్ను పరిచయం చేసినప్పుడు కలిగిన ఆనందం ఎప్పటికీ మరచిపోలేను.

* గౌతు లచ్చన్న జీవిత చరిత్ర నాకిష్టమైన పుస్తకం. ప్రతి పేజీ మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది.

* మాంసాహారం బాగా తింటాను. అందులోనూ చేపల పులుసంటే మరీ ఇష్టం. ఎత్తూ, దేహదారుఢ్యం వంశ పారంపర్యంగా వచ్చినవే. మా అమ్మ కూడా సుమారు ఆరడుగుల ఎత్తు ఉంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.