close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ నాన్న మనసు వెన్న!

ఈ నాన్న మనసు వెన్న!

వజ్రాల వ్యాపారం. వందల కోట్ల ఆస్తి. ఆ డబ్బుతో ఎంతో విలాసంగా ఉండొచ్చు. కానీ, ఆయన ఓ కూతురికి తండ్రిగా పొందే ఆనందానికే ఎక్కువ విలువ ఇచ్చాడు. అందుకే, తండ్రి మరణించిన వందలమంది ఆడపిల్లలకు నాన్నవుతున్నాడు. వైభవంగా పెళ్లి చేసి, లక్షల విలువచేసే కానుకలతో అత్తవారింటికి సాగనంపుతున్నాడు. ఆయనే మహేష్‌ సవాని.

పెళ్లంటే మూడుముళ్ల పండుగ. ఏడడుగుల సంప్రదాయం. నూరేళ్లకు సరిపడా సంతోషం. అందుకే, ఆర్థికంగా ఇబ్బందులున్నా ఉన్నంతలో పిల్లల పెళ్లిని ఘనంగా జరిపించాలనుకుంటాడు ప్రతి తండ్రీ. దానికోసం ముందునుంచే ప్రణాళికలు వేసుకుంటాడు. ఆడపిల్లల విషయంలో ఆ జాగ్రత్త మరీ పెరుగుతుంది. మెట్టినింట్లో కూతురు సంతోషంగా ఉండాలని కొత్త కాపురానికి అవసరమైన సామగ్రినీ కానుకలనూ ఇచ్చి సాగనంపుతాడు. కానీ అంతలా ఆలోచించే ఆ నాన్నే లేకపోతే... ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు... ముఖ్యంగా మధ్యతరగతి ఆడపిల్లలకు పెళ్లి సమయంలో ఆ లోటు మరింత బాగా తెలుస్తుంది. డబ్బులో పుట్టి పెరిగిన మహేష్‌ సవానీకి పేదలు పడే ఆ కష్టాల గురించి ఎలాంటి అనుభవమూ లేదు. కానీ వారి ఇబ్బందుల్ని అర్థం చేసుకోగల మంచి మనసుంది. వారికి సహాయం చెయ్యాలన్న తపనా ఉంది. ఆ పెద్ద మనసుతోనే ఎంతోమంది ఆడపిల్లలకు తండ్రి స్థానంలో నిలబడుతున్నారు. అలా ఇప్పటివరకూ ఏడువందల మందికి పైగా అమ్మాయిలకు కన్యాదానం చేశారు ఈ మనసున్న నాన్న. 

ఖరీదైన కానుకలూ...
‘తన ఇద్దరు కూతుళ్ల పెళ్లి మరో పన్నెండు రోజుల్లో ఉందనగా మా కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి అకస్మాత్తుగా మరణించాడు. ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దాంతో వారికి అన్నీ నేనై పెళ్లి జరిపించాను. ఆ తృప్తితోనే తండ్రి మరణించిన పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు నా చేతుల మీదుగా ఘనంగా పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నా’ అంటారు మహేష్‌ సవాని. పీపీ సవాని గ్రూప్స్‌ అంటే... వజ్రాల వ్యాపారంతో పాటు రియల్‌ ఎస్టేట్‌, వైద్య విద్యారంగాల్లో గుజరాత్‌లో పేరున్న సంస్థ. దాని అధినేత వల్లభ్‌భాయ్‌ ప్రేమ్‌జీ కొడుకే మహేష్‌. వ్యాపారంలోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ తండ్రిని మించిన తనయుడు. ఆ మంచితనంతోనే 2008 సంవత్సరం నుంచి ఏటా కొంతమంది అమ్మాయిలను ఎంపిక చేసి, అయిదుకోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవునుమరి, ఏదో తాళిబొట్టు ఇచ్చి, దండలు మార్పించి తూతూమంత్రంగా జరిపించే పెళ్లి కాదిది. మెహందీ వేడుక మొదలుకొని అప్పగింతల వరకూ మూడు రోజులు వేడుకగా జరుగుతుంది. 1,50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రతి జంటకూ విడిగా నిర్మించిన చూడచక్కని మండపంలో వధూవరులు ఒక్కటవుతారు. బంధుమిత్రుల కోసం విందు వినోద కార్యక్రమాలూ ఉంటాయి. 2014లో 111మంది యువతులను ఎంపిక చెయ్యగా పెళ్లికి వారి బంధువులూ ఇతర ప్రముఖులతో కలిపి 70వేల మంది అతిథులు హాజరయ్యారు. 2015లో 151మంది వధువులకు గానూ లక్షమంది అతిథులు పాల్గొన్నారు. అంతేనా... బంగారు నెక్లెసూ, పోగుల సెట్‌, ఉంగరంతో పాటు, వెండి వస్తువులూ పదకొండు జతల బట్టలూ, మంచం, కుర్చీల్లాంటి ఫర్నిచరూ ఇంట్లోకి అవసరమైన గిన్నెలూ ఇతర ఎలక్ట్రిక్‌ ఉపకరణాలతో మొత్తం రూ.నాలుగున్నర లక్షల విలువైన బహుమతుల్ని ఒక్కో వధువుకీ కానుకగా ఇచ్చి సాగనంపుతున్నారు. దీనికి అదనంగా గతేడాది నుంచి లక్కీ డ్రా ద్వారా ఏడు జంటలను ఎంపిక చేసి హనీమూన్‌కోసం కులూమనాలికి పంపిస్తున్నారు సవాని. అంతేకాదు, పెళ్లయ్యాకా అమ్మాయి తొలి కాన్పుకి అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తారు. ‘పెళ్లి రోజు తండ్రి లేని లోటూ ఆ బాధా ఎలా ఉంటుందో తండ్రి దూరమైన ఆడపిల్లకు మాత్రమే తెలుస్తుంది. మా నాన్న చనిపోయాక నా పెళ్లి ఎలా చెయ్యాలా అని అమ్మ ఎంతగానో మధనపడింది. ఆ సమయంలో దేవుడు పంపించినట్లు వచ్చి ఈ నాన్న నా జీవితంలో ఆనందాన్ని నింపారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ‘విమలా కోరింగ’ అనే ఓ కొత్త పెళ్లికూతురు. అలా ఒక్కో వధువూ కన్యాదానం చేసిన ఆ తండ్రి చేతుల్లో వాలి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతుంటే చెమ్మగిలిన కళ్లతో ‘నా దృష్టిలో ఇదో పవిత్ర కార్యం... దీనికైన ఖర్చును లెక్కపెట్టలేను. తండ్రిగా ఓ కూతురికి పెళ్లి చెయ్యడమే వెలకట్టలేని అనుభూతి’ అంటారు మహేష్‌.

మరెన్నో సేవలు...

తండ్రిలేని 3200మంది పిల్లలకు పదో తరగతి వరకూ ఉచిత విద్యను అందిస్తున్నారు.

* సూరత్‌లోని పీపీ సవాని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా స్థానికంగా ఉండే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్‌ చేయిస్తున్నారు.

* సవాని ఫామ్‌హౌస్‌లో హెచ్‌ఐవీ సోకిన అనాథ బాలలూ భర్త చనిపోయిన మహిళలూ ఆశ్రయం పొందుతున్నారు. బీ చదువుకోవాలనే ఆశ ఉన్న వృద్ధులకు మహేష్‌ ఆధ్వర్యంలో ‘ప్రేమ్‌జీ లక్ష్మీ మందిర్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ పాఠశాల నడుస్తోంది. ఇలా... చెప్పాలే కానీ ఆ సంస్థ తరఫున చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.