close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫుల్‌ మీల్స్‌... రూ.5 మాత్రమే!

ఫుల్‌ మీల్స్‌... రూ.5 మాత్రమే!

ఒక్క రూపాయిస్తే ఇడ్లీ సాంబార్‌. ఐదు రూపాయలకే కమ్మని భోజనం. పది రూపాయలకు కడుపు నిండా దాల్‌ పరోటా... పేదల ఆకలి తీర్చేందుకు కొన్ని రాష్ట్రాలు నిర్వహిస్తోన్న భోజన కేంద్రాల్లో ధరలివి. ఈమధ్యే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నామమాత్రపు ధరకే కష్టజీవుల కడుపు నింపనున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ రూ.5మీల్స్‌, తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌, ఒడిశాలో ఆహార్‌... నిరుపేదల పాలిట అక్షయ పాత్రలా మారిన ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి.

ద్యోగవేటలో కాళ్లరిగేలా తిరిగే నిరుద్యోగులూ, ఉపాధి బాటలో వీధుల్లో చక్కర్లు కొట్టే చిరు వ్యాపారులూ, వైద్యం కోసం వచ్చిన రోగుల బంధువులూ, ఏ దిక్కూ లేకుండా రోడ్డున పడ్డ అభాగ్యులూ... మహానగరంలో ఆర్థిక సమస్యలతో పాటు ఆకలి బాధలతోనూ సతమతమయ్యేవాళ్లు వేలలో కనిపిస్తారు. అలాంటి వాళ్లందరి ఆకలి తీర్చేందుకు హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ, హరేకృష్ణ ఫౌండేషన్‌తో కలిసి రెండేళ్ల క్రితం ఓ కొత్త విధానంతో ముందుకొచ్చింది. కేవలం ఐదు రూపాయలకు కడుపు నిండా కమ్మని భోజనం పెట్టే ప్రాజెక్టును రూపొందించింది. ఆస్పత్రులూ, బస్టాండ్లూ, రైల్వే స్టేషన్లలాంటి వివిధ ప్రాంతాల్లో ఆహార కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నార్తులకు భోజనం పెట్టడం మొదలుపెట్టింది. తొలి రోజు నుంచే వేల సంఖ్యలో ప్రజల ఆదరణ దక్కించుకున్న ఈ క్యాంటీన్లు ఏడాదిలోనే దాదాపు పదమూడు లక్షల మంది ఆకలిని తీర్చాయి. ప్రస్తుతం నగరవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఐదు రూపాయలకు సింగిల్‌ టీ కూడా దొరకని సైబర్‌సిటీలో వేడివేడి అన్నం, పప్పూ, సాంబార్‌, పచ్చడీ... పేదవాడికి అంతకంటే ఏం కావాలి..!

తమిళనాట అమ్మ బాట
అమ్మ క్యాంటీన్‌... రోజూ లక్షల మంది ఆకలి తీర్చే అక్షయపాత్ర. అన్నం తినడానికి పేదలూ, అధ్యయనం చేయడానికి విదేశీయులూ, అభినందించడానికి ప్రముఖులూ రోజూ అమ్మ క్యాంటీన్‌ల తలుపు తడుతూనే ఉంటారు. తమిళనాట నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ భోజన కేంద్రాలే దాదాపు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్వహిస్తోన్న రకరకాల పథకాలకు మూలం. మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చెన్నైలోనే రెండొందల కేంద్రాల్లో, ఇతర ప్రాంతాల్లో వందకు పైగా కేంద్రాల్లో మూడుపూట్లా అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఉదయం ఏడు నుంచి పది వరకూ రూపాయికి ఇడ్లీ సాంబార్‌, ఐదు రూపాయలకు పొంగల్‌ పెడుతున్నారు. మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకూ ఐదు రూపాయలకు సాంబారన్నం, కూరన్నం, తాళింపన్నం, మూడు రూపాయలకు పెరుగన్నం అందుతాయి. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకూ మూడు రూపాయలకే చపాతీ, కూరా, పప్పూ తినొచ్చు. క్యాంటీన్లను సౌర విద్యుత్తుతో నడపడం, అక్కడి చెత్త నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయడం లాంటి విషయాల్లోనూ అమ్మ క్యాంటీన్లు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఒడిశాలో ఆహార్‌
రకరకాల పనుల మీద నగరాలకు వచ్చివెళ్లే వాళ్లూ, చిన్నాచితకా పనులు చేసుకుని బతికేవాళ్ల కోసం ఒడిశా ప్రభుత్వం ‘ఆహార్‌’ పేరుతో తక్కువ ధరకు నాణ్యమైన భోజనం పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఐదు రూపాయలు చెల్లించి అన్నం, దాల్మా, పాయాతో పాటు ఒడిశా సంప్రదాయ వంటకాల్లో ఏదో ఒకదాన్ని ఆరగించొచ్చు. భువనేశ్వర్‌, కటక్‌, బ్రహ్మపుర, సంబల్‌పూర్‌, రవుర్కెలా లాంటి అనేక నగరాల్లో రైల్వేస్టేషన్లూ, బస్టాండ్లూ, ఆస్పత్రుల లాంటి రద్దీ ప్రాంతాల్లో రోజూ కనీసం పాతికవేల మంది కడుపు నింపేలా ఈ భోజన కేంద్రాల్ని ఏర్పాట్లు చేశారు.

త్వరలో ఆమ్‌ఆద్మీ మీల్స్‌
అమ్మ క్యాంటీన్లలానే త్వరలో ఆమ్‌ ఆద్మీ క్యాంటీన్లనూ ఏర్పాటు చేసి తక్కువ ధరకు దిల్లీవాసులకు భోజనాన్ని అందించనున్నట్లు ఈమధ్యే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. కానీ ఇంతకు ముందు నుంచే ‘జనాహార్‌ క్యాంటీన్లు’ పేరుతో అక్కడ భోజన కేంద్రాలు నడుస్తున్నాయి. పద్దెనిమిది రూపాయలకు ప్లేట్‌ మీల్స్‌, పూరీ, చపాతీ కూరలలో ఏదో ఒకదాన్ని అక్కడ తినొచ్చు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే రూ.18 ఎక్కువే అయినా, రాజధాని జీవన ప్రమాణాలను బట్టి చూస్తే తక్కువే. ఇప్పుడు కేజ్రీవాల్‌ ఐదు నుంచి పది రూపాయల్లోపే ‘ఆమ్‌ ఆద్మీ మీల్స్‌’ పెట్టే క్యాంటీన్లను తెరుస్తూ దిల్లీలోని పేదల ఆహార భద్రత మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోనూ...
తెలంగాణలోలానే ఉత్తరాఖండ్‌లో కూడా మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆధ్వర్యంలోనే ప్రభుత్వం తక్కువ ధరకు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తోంది. ‘అన్న యోజన’ పేరుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఫ్యాక్టరీలూ, భవన నిర్మాణం లాంటి రంగాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే కూలీల కడుపు నింపడమే. రోజంతా కష్టపడేవాళ్లకు కొద్దిగా పెడితే ఆకలి తీరదు. అలాగని మరీ తక్కువ ధరకు అన్నం పెడితే ప్రభుత్వ భారమూ పెరిగిపోతుంది. అందుకే 20 రూపాయలకు నాలుగు చపాతీలతో పాటు అన్నం, ఆకు కూరలూ, కూర, పచ్చడితో కూలీలకు ఈ క్యాంటీన్లు భోజనం పెడుతున్నాయి.

కర్ణాటకలో కూడా ఈ మధ్యే ఐదు రూపాయలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు వెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘అన్న క్యాంటీన్ల’ పేరుతోనే భోజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రాంతమేదైనా, పేరేది పెట్టినా నిరుపేదల పాలిట ఈ అన్న కేంద్రాలు ఆకలి తీర్చే అమృత భాండాగారాలే.


 

భూమ్మీద ఆరోగ్యవంతమైన చోటు ఇదే!

శతాయుష్మాన్‌భవ... అంటూ నిండు నూరేళ్లూ జీవించమని పెద్దలు ఆశీర్వదించడం మనకు తెలిసిందే. కానీ అక్కడ మాత్రం కనీసం ఓ నూటయాభై ఏళ్లైనా హాయిగా ఉండాలి అని దీవిస్తారు. ఎందుకంటే... వందేళ్లు దాటి బతకడం అక్కడ సామాన్యమైన విషయం మరి. ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆ చోటుని మనమూ చూద్దాం రండి.

సెయికిచి ఉహరా... మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎంత ప్రావీణ్యుడంటే అతడి మీదకు పోటీకి దిగాలంటే ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పుడతనికి 99ఏళ్లు. ‘అయితే గత స్మృతులను తలచుకుంటూ ఏ మంచంలో ఉన్నాడో...’ అని మనం పొరపాటున కూడా అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ వయసులోనూ సెయికిచి యువ బాక్సింగ్‌ ఛాంపియన్లను సైతం ఓడించేస్తాడు.105ఏళ్ల నబి కింజో కూడా ఏం తక్కువ కాదు. విషపూరితమైన పాముల్ని ఎంతో చాకచక్యంగా పట్టుకుని చంపేయగలదు. అదే ఆమె వృత్తి. జపాన్‌లోని ఒకినవా దీవికెళ్తే ఇలాంటి వాళ్లను వీధివీధిలోనూ చూడొచ్చు. వందేళ్లు దాటినా ఎలాంటి అనారోగ్యమూ లేకుండా హాయిగా బతుకుతున్న వృద్ధులు అక్కడ 450కి పైగానే ఉన్నారు. ఎనభై తొంభై ఏళ్లు దాటినవారూ ఎంతోమంది ఉన్నారు. అందుకే, ఈ దీవి భూమ్మీదే ఆరోగ్యవంతమైన ప్రదేశంగా పేరుతెచ్చుకుంది. అవునుమరి, మనదగ్గర సగటు ఆయుఃప్రమాణం మహిళలకు 69, మగవారికి 67 ఏళ్లైతే ఒకినవాలో ఆ సగటు మహిళలకు 86, మగవారికి 78 ఏళ్లు.

ఆరోగ్యంగానూ...
ఎక్కువ కాలం బతకడమే కాదు, చాలావరకూ పూర్తి ఆరోగ్యంగా ఉండడం కూడా ఇక్కడున్న మరో విశేషం. నలభై ఏళ్లు దాటితేనే మధుమేహం, రక్తపోటు కీళ్ల నొప్పులతో పాటు, క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఎక్కువవుతున్న ఈ రోజుల్లో వందేళ్లకు అటూ ఇటూగా ఉన్నవారు కూడా అక్కడ చాలా ఆరోగ్యంగా ఉండడం ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేయడంలో వింతేముందీ... అందుకే, అక్కడి ప్రజల ఆరోగ్యం వెనకున్న రహస్యాన్ని శోధించడానికి కొన్నేళ్లుగా ఎందరో మేధావులైన వైద్య నిపుణులు ఒకినవాను సందర్శించారు. మామూలుగా డెబ్భై ఏళ్లకు దగ్గరపడితే చాలు ‘వూరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది’ అంటూ చాలామంది వృద్ధులు నిరుత్సాహంతో కాలం గడుపుతారు. కానీ ఒకినవా వాసులు ఇందుకు పూర్తి భిన్నం. ‘డెబ్భై ఏళ్ల వయసులో చిన్న పిల్లల్లానూ 80ఏళ్ల వయసులో యువకుల్లానూ తొంభైల్లో ఒకవేళ స్వర్గం నుంచి పిలుపొచ్చినా ఇప్పుడు కాదు నాకు వందేళ్లు నిండాక వస్తా అని చెప్పేలానూ’ ఉండాలంటారు వీళ్లు. ఆ సానుకూల దృక్పథమే వారికి మరింత ఆయుష్షును పోస్తోందంటారు వైద్యులు. 90ఏళ్లు దగ్గరికొచ్చినా ఇక్కడి రైతులు చాలామంది రోజుకు 11 గంటలపాటు పొలంలో పని చేస్తారు. ‘మమ్మల్ని ఎక్కువకాలం బతికించే మందు ఆ శారీరక శ్రమే’ అంటాడు ఓ పెద్దాయన. తినే ఆహారం కూడా వారిని వయసులో సెంచరీ బోర్డరు దాటేలా చేస్తోందట. ఒకినవన్లు తినే ఆహారంలో అన్నం, చేపలు, కూరగాయలు ఆకుకూరలే ఎక్కువ ఉంటాయి. కాకరకాయ అయితే ప్రతిరోజూ తప్పనిసరే. మధుమేహంతో పాటు చాలా వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. పంది చెవి మాంసంతో చేసే ‘మిమిగా’ వంటకం కూడా స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. దీన్లో కొవ్వు స్థాయులు తక్కువా కాల్షియం స్థాయులు ఎక్కువా ఉంటాయి. స్థానికంగా ఎక్కువగా తినే చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్లూ విటమిన్‌ ఏ స్థాయులూ బాగా ఎక్కువ. ఇక ఒకినవన్లు ప్రతి సాయంత్రమూ తాగే ‘అవామొరి’ రైస్‌ వైన్‌లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. మొత్తంగా చెప్పాలంటే ఫ్లేవనాయిడ్లూ కెరోటినాయిడ్లూ విటమిన్‌ ఇ, లైకోపీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఒకినవన్ల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతోంది. వీటికి తోడు వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు కూడా వీరి ఆయుష్షును పెంచే ప్రధానమైన కారణమట.

మరో గ్రామం...

చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌లో ఉన్న బమా గ్రామంలో కూడా నూరేళ్లు నిండిన వాళ్లు 80మందికి 

పైగా ఉన్నారు. అందుకే, అత్యధిక ఆయుఃప్రమాణంగల ప్రదేశాల్లో ఇదీ ఒకటిగా ప్రాచుర్యం పొందింది. చుట్టూ ఎతై్తన కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కాలుష్యపూరితమైన పట్టణాలకు చాలా దూరంగా ఉండే ఈ గ్రామంలో గాలీ నీరూ అన్నీ స్వచ్ఛమైనవే. ఇక్కడి నీటిలోని ఖనిజలవణాలు రోగాలను దరిచేరనివ్వవనేది స్థానికుల నమ్మకం. అందుకే, అనారోగ్యంతో ఉన్నవాళ్లూ ఆసక్తికొద్దీ వచ్చే పర్యటకులతో నిత్యం ఈ గ్రామం కిటకిటలాడుతూ ఉంటుంది. ఏడాదికి ఆరున్నర లక్షలకు పైగా జనం ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. వీరి జన్యువులు ఉత్పత్తి చేసే ఎపోలిపొ ప్రొటీన్‌-ఇ కొవ్వుతో కలిసినపుడు లిపోప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుందనీ అది వ్యర్థంగా ఉండే కొవ్వును కరిగిస్తుందనీ చెబుతారు అధ్యయనకర్తలు. బమా ప్రజలు తినే ఆహారం కూడా చాలా వరకూ ఆవిరిమీద ఉడకబెట్టిందే. ఇక, 114ఏళ్ల హువాంగ్‌ పుక్సిన్‌, 108ఏళ్ల వయసున్న మకాన్‌లాంటి వాళ్లందరూ ఇప్పటికీ తమ పని తాము చేసుకుంటారు. ఆ శారీరక శ్రమ కూడా వారి ఆరోగ్యం వెనకున్న మరో రహస్యం అని ప్రత్యేకంగా చెప్పేదేముందీ...


 

భారతదేశపు బలమైన పల్లె!

పల్లెలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందంటారు. అయితే ఈ పల్లె నిజంగా బలమైనదే. ఎందుకంటే ఆ వూరినిండా కండలవీరులే ఉంటారు.

సాధారణంగా పల్లెలోకి అడుగు పెట్టగానే పచ్చటి పొలాలూ, ముగ్గేసిన వాకిళ్లూ, పొలాలకెళ్లే రైతులూ కనిపించినట్టే... సిక్స్‌ప్యాక్‌ బాడీలూ 19 అంగుళాల కొలతలుండే కండలూ దృఢమైన శరీరాలున్న యువకులు ఈ వూళ్లలోకెళ్లగానే కనిపిస్తారు. ఈ ప్రాంతమే ఓ బౌన్సర్ల (పహిల్వాన్‌) ఫ్యాక్టరీ. ఢిల్లీ శివార్లలోని అసోలా-ఫతేపూర్‌ బేరీ జంటపల్లెల్లోని దాదాపు 90 శాతం మంది యువకులు ఇదే వృత్తిగా ఎంచుకుంటున్నారు. దేశంలోనే ఎక్కువగా ఈ పల్లెలనుంచే బాడీగార్డులూ, బౌన్సర్లూ తయారవుతున్నారంటే ఆశ్చర్యమే కదూ!

అంతా రక్షకులే...
నైట్‌క్లబ్బులూ, షాపింగ్‌ మాళ్లూ, కాలేజీలూ ఒకటేమిటి దేనికైనా భద్రత అవసరమే. దిల్లీలాంటి చోట్ల నామ్‌కేవాస్‌తే సెక్యూరిటీని పెట్టుకుంటే చాలా ఇబ్బందులొస్తాయి. ఇక సినిమా యాక్టర్లూ, బడా వ్యాపార వేత్తలూ, సెలబ్రిటీలైతే బౌన్సర్ల వలయం చుట్టూ లేనిదే పబ్లిక్‌ మీటింగుల నుంచి బయటపడలేరు. అలా రకరకాల సందర్భాల కోసం ఏర్పడ్డ అవసరాన్ని ఈ పల్లెలు తమ ఆదాయవనరుగా మార్చుకున్నాయి. ఇప్పుడు దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలవాళ్లూ, చాలా మంది సెలబ్రిటీలూ తమకీరకమైన అవసరం ఏర్పడగానే ముందుగా ఇక్కడికే వస్తున్నారు. ప్రస్తుతం ఈ పల్లెల నుంచే 200 మందికిపైగా యువకులు బాడీగార్డులూ, బౌన్సర్లుగా ఉన్నారు. వీళ్లకు నెలకు రూ. 30,000 నుంచి 50,000 వరకూ ఆదాయం ఉంటోంది.

ఎప్పటి నుంచి...
పల్లె యువత బౌన్సర్లుగా మారడం ఎప్పటి నుంచీ మొదలైందంటే కచ్చితంగా చెప్పలేం కానీ... 1998 సమయానికి పాల వ్యాపారి అయిన సుందర్‌చౌదరీకి ఈ రకమైన వృత్తి ఆకర్షణీయంగా కనిపించింది. చక్కటి శరీరాకృతితో ఉండే తమ వూరి యువకులకూ ఇది బాగుంటుందని భావించాడు. అందుకే తనే ముందు బౌన్సర్‌గా మారి ట్రెండ్‌ సృష్టించాడు. అప్పుడప్పుడే దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పబ్‌లు వెలవడం మొదలైంది. సుందర్‌ తండ్రి మల్లయోధుడు. వూళ్లొ పోటీల కోసం కొందరూ, సరదా కోసం కొందరూ దీన్ని సాధన చేస్తుంటారు. తండ్రి నుంచి బాడీబిల్డింగ్‌లో చిట్కాలు నేర్చుకున్న ఆయన ఓ పరిశ్రమకు సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. రాత్రిపూట నైట్‌క్లబ్బుల్లో పనిచేసి మరిన్ని డబ్బులు సంపాదించేవాడు. దాదాపు అదే కాలంలో... ఓ పబ్‌ యజమాని దిల్లీలోని ఒక పెళ్లికార్యక్రమం కోసం ఈ వూరిలోని విజయ్‌ పహిల్వాన్‌ అనే యువకుడికి పదివేల రూపాయలిచ్చి ఐదుగురు పహిల్వాన్‌లను ఒక్కరోజు కోసం తీసుకురమ్మని చెప్పడం ఆ పల్లెల్లో పెద్ద వార్తగా మారిపోయింది.

ఏం తింటారంటే...
ఆకర్షణీయమైన ఆదాయం వీరికి దృఢమైన శరీరాకృతి వల్లనే వస్తోంది. కనుక వీళ్లు ఆహారం, వ్యాయామాలపైన చాలా శ్రద్ధ పెడతారు. బౌన్సర్లుగా పనిచేసే వ్యక్తులు రోజుకు డజను అరటి పండ్లూ, మరో అరకిలో ఇతర పండ్లూ, రెండుకిలోల యోగర్ట్‌, మూడులీటర్ల పాలూ లేదా లీటరున్నర బాదంపాలు తీసుకుంటారు. అదే మాంసాహారులైతే వీటికి అదనంగా పది గుడ్లూ, రెండు కోళ్లూ తింటారు. ఇవి కాక నెయ్యీ, పెరుగూ, సోయా, బాదాం వీళ్ల ఆహారంలో భాగంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ప్రత్యేకాహారం కోసం నెలకు 10,000 రూపాయలకు పైగా ఖర్చుచేస్తారు. ఆహారమే కాదు వ్యాయామమూ దీనికి తగ్గ మోతాదులోనే ఉంటుంది. వెయిట్‌ లిఫ్టింగుల కోసం ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బళ్లను బుక్‌ చేసుకుంటారు. కేవలం పాదాల మీద ఓ ట్రాక్టర్‌నే ఎత్తగలరంటే నమ్మశక్యం కాదు. ధూమపానం, మద్యపానంలాంటి చెడు అలవాట్లకూ దూరంగా ఉండటం ఈ వూరి కండల వీరుల ప్రత్యేకత. బౌన్సర్ల కోడ్‌ను ఉల్లంఘించని క్రమశిక్షణగల వ్యక్తులుగా కొట్లాటకు కాలు దువ్వని వ్యక్తులుగా వీళ్లు పేరు సంపాదించారు. అయితే గొడవ జరిగి తమకు జీతమిస్తున్న వ్యక్తినో, సంస్థనో కాపాడాల్సి వస్తే మాత్రం తమ శక్తిని చూపించడంలో ఏమాత్రం వెనుకంజ వేయరు. ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఎదుటివాళ్ల ప్రవర్తన వల్ల వీళ్లు ఇబ్బందుల పాలవుతున్న సంఘటనలు చెదురుమదురుగా జరుగుతుండటంతో ఈ ఉద్యోగులంతా కలిసి తమ సమస్యల కోసం ‘బౌన్సర్‌ సమాజ్‌’ను స్థాపించుకున్నారు.

వీళ్లు ప్రత్యేకం...
ఎంతమంది బౌన్సర్లలో ఉన్నా వీళ్లు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఓ బౌన్సరు నటుడు గోవిందాకు సెక్యూరిటీగా పనిచేస్తున్న సమయంలో అతడి ఒంటి కొలతలు చూసి గోవిందా చాలా ముచ్చటపడిపోయాడట. ‘తొడలు తగ్గాలంటే ఏం చేయాలి?’ అంటూ చిట్కాలు అడిగి తెలుసుకున్నాడట. అయితే నలభైదాటితే ఈ వృత్తిలో ఉండటం కష్టం. అందుకే ముందు తరం బౌన్సర్లు బౌన్సర్‌ ఏజెన్సీలను నడుపుతున్నారు. కొంతమంది నైట్‌క్లబ్బులూ పబ్బులకు యజమానులవుతున్నారు. మరికొంత మంది రియల్‌ఎస్టేట్‌లాంటి వ్యాపారాలూ చేసుకుంటున్నారు. మరోపక్క పదిపదిహేనేళ్ల వయసునుంచే ఇక్కడ మరో తరం పిల్లలు కండల వీరులుగా మారేందుకు సిద్ధమవుతున్నారు.


 

ఇది రైతుల ఫేస్‌బుక్‌

  మన దేశంలో రైతుల పరిస్థితి చాలా విచిత్రం. పంట చేతిలో ఉన్నప్పుడు ధర పలకదు. బాగా గిరాకీ ఉన్నప్పుడు పంట చేతికందదు. ఏడాది తిరిగేసరికి వేల ఎకరాల పంట నష్టం. ఆ సమస్యకు ఆన్‌లైన్‌ వేదికగా పరిష్కారాన్ని చూపిస్తోంది ‘ఫార్మిలీ’. ఇక్కడ కొనుగోలుదారులకు కావాల్సినంతే రైతులు పండిస్తారు. రైతులు ముందే నిర్ణయించిన ధరను వినియోగదారులు చెల్లిస్తారు.

ఫ్యామిలీ... అంటే కుటుంబం. ఫార్మిలీ... అంటే రైతుల కుటుంబం. భారత దేశంలోని రైతులందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు మొదలైందే ఫార్మిలీ. కేజీ వంకాయలను పండించడానికి ఐదు రూపాయలు ఖర్చయితే దళారులను దాటుకొని అది వినియోగదారుడికి అందేసరికి పదో, పదిహేనో అవుతుంది. లేకపోతే ఐదు రూపాయలకంటే తక్కువకే అమ్మాల్సి వస్తోంది. నష్టపోతూనే పంటను అమ్మేవాళ్లనూ, నష్టాలను తట్టుకోలేక చేతులారా పంటను నాశనం చేసే రైతులనూ చూస్తూనే ఉంటాం. ఇక ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినే పొలాల సంగతి సరేసరి. ఇలా దేశంలో పండిన పంటలో ఏటా సుమారు 30శాతం వృథా అవుతోందని అంచనా. కారణాలేవైనా చిట్టచివరికి నష్టాలను మూటగట్టుకునేది రైతే. ‘‘రైతులను కూడా ప్రిపెయిడ్‌ పద్ధతిలోకి మార్చేస్తే కావల్సినంతే పండిస్తారు. ధర ముందే నిర్ణయించబడుతుంది కాబట్టి అప్పు చేసే విషయంలోనూ ఆచితూచి అడుగేస్తారు’’ అని కార్తీక్‌కు ఆలోచన వచ్చింది. అది ‘ఫార్మిలీ’ రూపంలో ఆచరణలోకి వచ్చింది.

అది రైతుల కోరిక!
కర్ణాటకలో ఓ పల్లెటూళ్లొ పుట్టిపెరిగిన కార్తీక్‌ బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. వాళ్ల తాతయ్యకు తేయాకు తోటలు, నాన్నకు కాఫీ తోటలు ఉండేవి. చిన్నప్పుడు ఆ తోటల్లో ఆడుకుంటూ కార్తీక్‌ పెరిగాడు. వాటిపైన ఉన్న ఇష్టంతో కర్ణాటకలోనే కొన్ని కాఫీతోటలపైన పెట్టుబడి పెట్టాడు. వాటిపైన వచ్చే ఆదాయాన్ని వాళ్ల గ్రామంలోనే స్కూలూ, గుడి అభివృద్ధి కోసం ఖర్చు చేసేవాడు. ఓసారి ఆ స్కూలు అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్లినప్పుడు కార్తీక్‌కు కొందరు రైతులు ఎదురుపడ్డారు. ‘మీరు ఎక్కణ్నుంచో వచ్చి ఇక్కడ మా కోసం ఖర్చు చేయడం బావుంది. కానీ ఒక్కసారి భవనాల్ని నిర్మించి వెళ్లిపోతే మీ పని అయిపోతుంది. అదే మీ కంప్యూటర్ల సాయంతో మా రైతులకు పనికొచ్చేదేమైనా చేస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం’ అన్నారు. ఆ ఏడాది అక్కడున్న రైతులందరూ అల్లం సాగు చేశారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో ధరలేక పంటనే కోయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ పరిస్థితి కార్తీక్‌ను చాలా బాధపెట్టింది. కొంతకాలం అధ్యయనం చేశాక దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని అర్థమైంది. ఆ రైతుల కోరిక ప్రకారం టెక్నాలజీ సాయంతోనే సమస్యకు సమాధానం చెప్పాలనుకున్నాడు. అప్పట్నుంచీ ఫార్మిలీపైన పనిచేయడం మొదలుపెట్టాడు.

డిమాండ్‌కు తగ్గట్టే...
అవసరాన్ని తెలుసుకోకుండా పంటను పండించి, తీరా అమ్మాల్సివచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడుతుంటారు. అసలు బయట వినియోగదారులకు ఎంత అవసరం అవుతుందో తెలిస్తే అంతే పండించొచ్చు. మిగతా పొలాన్ని మరో పంట కోసం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల వనరులూ ఆదా అవుతాయి అని కార్తీక్‌కు అనిపించింది. ఇదే ఫార్మిలీ మూల సూత్రం. బయట సూపర్‌ మార్కెట్లూ, రెస్టరెంట్లూ, కిరాణా షాపుల లాంటి పెద్ద స్థాయి వినియోగదారులకు ఏటా ఎంత సరకు అవసరమవుతుందో తెలుసుకుంటారు. రైతులకు ఆ సమాచారాన్ని ఇచ్చి దానికి తగ్గట్లుగానే పండించే అవకాశం కల్పిస్తారు. మిగతా పొలాన్ని మరో పంటకోసం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మధ్యవర్తికి అడ్డగోలుగా పంటను అమ్మే పరిస్థితీ ఉండదు. అవసరానికి మించి పండించి అది అమ్ముడవట్లేదని బాధపడాల్సిన సమస్యా తలెత్తదు.

ఆప్‌తో అమ్మకాలు
పెద్దస్థాయి వినియోగదారులను రైతులకు పరిచయం చేయడంతో పాటూ, ఒక రైతు పంట సాగు గురించి మరో రైతుకు తెలిపే ఉద్దేశంతో ఫార్మిలీ.కామ్‌, ఫార్మిలీ మొబైల్‌ అప్లికేషన్‌నూ కార్తీక్‌ రూపొందించాడు. ఆప్‌ను వినియోగించే తీరుపైన గ్రామాల్లో అవగాహన కల్పించడంతో పాటూ అక్కడి విద్యార్థుల సాయంతో అప్లికేషన్‌ను వాడే పద్ధతిపైన శిక్షణ ఇప్పించాడు. ఆ ఆప్‌, వెబ్‌సైట్లలో రైతులు తాము పండించే పంటల వివరాలూ, ఎంత మొత్తంలో పండిస్తారూ లాంటి సమాచారాన్ని పెట్టొచ్చు. తమకు ఎంత పంట అవసరమవుతుంది, ఎంత నాణ్యత కావాలన్న సమాచారాన్ని కొనుగోలుదారులూ వెబ్‌సైట్‌లో ఉంచొచ్చు. డిమాండ్‌కు తగ్గట్టు పంటను అందించగలిగే రైతులను ఫార్మిలీ ఒక్కటి చేస్తుంది. అక్కణ్నుంచి వ్యాపారి-రైతుల లావాదేవీ మొదలవుతుంది. ఎక్కడెక్కడి వ్యక్తుల్నో దగ్గర చేస్తుంది కాబట్టి కార్తీక్‌ దీన్ని ‘రైతుల ఫేస్‌బుక్‌’ అని పిలుస్తాడు.

అందరికీ రేటింగ్‌
రైతులు ఆన్‌లైన్‌ బాట పట్టినప్పుడే వ్యవసాయం లాభసాటి వ్యాపారం అవుతుందని కార్తీక్‌ నమ్మాడు. కానీ వాళ్లకు టెక్నాలజీని పరిచయం చేయడం అంత సులభమైన పనికాదు. అందుకే స్థానిక భాషల్లోనే వీలైనంత సౌకర్యంగా ఉండేందుకు వెబ్‌సైట్‌, ఆప్‌లను రూపొందించాడు. వాటి వినియోగంపైన శిక్షణ ఇస్తున్నాడు. పంట నాణ్యతపైన కొనుగోలుదారులతో పాటూ, వ్యాపార నిర్వహణపైన రైతులతో రేటింగ్‌ ఇప్పిస్తున్నాడు. చాలా మంది రైతుల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తోన్న రోజుల్లో తమ ఆప్‌ను వాళ్లకు చేరువచేయడం పెద్ద కష్టమైన పనేం కాదు అన్నది కార్తీక్‌ నమ్మకం. దేశవ్యాప్తంగా రైతులు పూర్తిస్థాయిలో ఈ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే వ్యవసాయం నూరుశాతం కచ్చితమైన లాభసాటి వ్యాపారం అవుతుందన్నది అతడి మాట. అందరి కోరికా అదే కదా. 1800 1214142... ఫార్మిలీ టోల్‌ఫ్రీ నంబరు.


 

ఆ వూళ్లొ అందరూ ఆనంద్‌లే!

  ఆ వూళ్లొ ప్రతి రోజూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వందల ఏనుగులు నేలకూలతాయి. సేనాపతులూ, మంత్రులూ, సైనికులూ చెల్లాచెదురుగా పడిపోయి కనిపిస్తారు. గ్రామస్థులంతా కనురెప్ప కదపకుండా ఆ సంగ్రామంలో లీనమైపోతారు. 64 గళ్ల చదరంగం బోర్డే ఆ యుద్ధభూమి. కేరళలోని మరోట్టిచల్‌... దేశంలో వందశాతం చెస్‌ ఆడే వ్యక్తులున్న ఒకే ఒక్క గ్రామం.

 

చదరంగం... చదువుకునే వాళ్లు ఆడే ఆటల వరసలో మొదటి స్థానంలో ఉంటుంది. ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తుంది. అలాంటిది కేరళలోని ఓ మారుమూల చిన్న పల్లెటూళ్లొ ఉన్న ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన దగ్గర్నుంచీ పడుకునేవరకూ చెస్‌లోనే మునిగిపోవడమంటే మామూలు విషయమా! ఉద్యమాలు చేశో, త్యాగాలు చేశో ఓ వ్యక్తినో, గ్రామాన్నో మద్యం బారినుంచి బయట పడేసిన సంఘటనలకు లెక్కేలేదు. కానీ చదరంగమే ఆయుధంగా గ్రామాన్ని మద్యం రక్కసి నుంచి బయటపడేసిన ఘనత బహుశా ఒక్క మరోట్టిచల్‌ ప్రజలకే దక్కుతుందేమో. ఒకప్పుడు ఆ గ్రామంలోకి అడుగుపెట్టగానే గుప్పుమంటూ నాటు సారా వాసనే బయటికొచ్చేది. కానీ ఇప్పుడు వాసన కాదు కదా, కనీసం చిన్న అలికిడి కూడా వినిపించదు. అయితే ఎవరి రోజువారీ పనులు వాళ్లు చేసుకుంటుంటారు. లేకపోతే చెస్‌ ఆడుతూ కనిపిస్తారు. చెడుదారిలో వెళ్తొన్న వాళ్ల జీవితాలను చదరంగమే సరిజేసింది.

మద్యాన్ని వదిలేస్తూ...
సుమారు ముప్ఫయి ఏళ్ల క్రితం ఈ గ్రామంలో తొంభై శాతం మందికి నాటుసారా కాయడమే జీవనోపాధి. దాని వల్ల వూళ్లొ ఎప్పుడూ ఏవో గొడవలు. అలాంటి చిన్నచిన్న తగాదాలే చిలికి చిలికి పెద్దవై ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. మద్యం వల్ల తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన కొంతమంది చదువుకున్న కుర్రాళ్లు ఆ వూరిని ఎలాగైనా దాని బారినుంచి బయటపడేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్సైజ్‌ అధికారులను కలిసి వూళ్లొ జరిగే అక్రమ మద్యం వ్యాపారం గురించి సమాచారం ఇచ్చేవాళ్లు. తనిఖీలు నిర్వహించి ఆ వ్యాపారాల్ని మూయించమని అడిగేవాళ్లు. అధికారులు సాధారణంగా అర్థరాత్రుళ్లే తనిఖీలు నిర్వహించేవాళ్లు. ఏ ఇంట్లో నాటుసారా కాస్తున్నారో చెప్పాలంటే ఈ కుర్రాళ్లు పోలీసులు వచ్చేవరకూ మేల్కొని ఉండాలి. వూళ్లొ వినోదానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో వీళ్లు రాత్రుళ్లు చెస్‌ ఆడుతూనే కాలక్షేపం చేసేవారు. వాళ్లను చూస్తూ పక్కనుండే కొందరు పెద్దలకూ ఆటపైన ఆసక్తి పెరిగింది. రెండు నెలలపాటు అధికారులు రోజూ దాడులు నిర్వహించడంతో దాదాపు గ్రామస్తులంతా మద్యం తయారీకీ, తాగుడుకీ దూరమయ్యారు. మరోవైపు కుర్రాళ్లు ఆడే ఆట ఆసక్తిగా అనిపించడంతో రోజూ గ్రామస్థులూ వాళ్ల పక్కన చేరడం మొదలుపెట్టారు. అలా క్రమంగా వాళ్ల వ్యసనం మద్యం నుంచి చదరంగం వైపు మళ్లింది.

అందరి కోచ్‌ అతడే!
అదే గ్రామంలో అప్పుడు పదో తరగతి చదువుతున్న ఉన్నికృష్ణన్‌ అనే కుర్రాడికి చదరంగం అంటే చాలా ఇష్టముండేది. అప్పట్లో పత్రికలో అమెరికా చెస్‌ దిగ్గజం బాబీ ఫిషర్‌ పదహారేళ్లకే గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడన్న వార్త చదివి, ఉన్నికృష్ణన్‌ కూడా అతడిలా పేరు తెచ్చుకోవాలని చెస్‌ నేర్చుకున్నాడు. కానీ తనలానే వూళ్లొ చాలామందికి చెస్‌పైన ఆసక్తి ఉన్నట్లు గమనించాడు. వాళ్లకు అక్కడ ఆ ఆట నేర్పించడానికి ఎవరూ లేరు. అందుకే తన వ్యక్తిగత లక్ష్యాన్ని పక్కనబెట్టి గ్రామస్థులకు చదరంగం నేర్పించడం మొదలుపెట్టాడు. రోజూ కృష్ణన్‌ స్కూల్‌ నుంచి రాగానే చెస్‌ పాఠాలు చెప్పించుకోవడానికి పిల్లలూ, పెద్దలూ అతడి ఇంటి ముందు వాలిపోయేవారు. రానురానూ తల్లిదండ్రులూ తమ పిల్లలకు అక్షరాభ్యాసానికి ముందే పావులు కదపడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. సరదా వ్యాపకంలా మొదలైన ఆట క్రమంగా వాళ్ల జీవనశైలిలో భాగమైపోయింది. జిల్లాలో జరిగే ఏ చదరంగం పోటీలోనైనా విజేతల నుంచి పరాజితుల వరకూ జాబితా అంతా మరోట్టిచల్‌ గ్రామస్థుల పేర్లతోనే నిండిపోయేది.

టీ బిస్కెట్లు ఉచితం
పదో తరగతిలో వూళ్లొవాళ్లకు చెస్‌ నేర్పించడం మొదలుపెట్టిన ఉన్నికృష్ణన్‌ శిష్యుల సంఖ్య ఇప్పుడు ఆరు వందలకు పైనే. ప్రస్తుతం అతడు అదే వూళ్లొ ఓ చిన్న హోటల్‌ నడిపిస్తున్నాడు. చెస్‌ ఆడేవాళ్లు ఎవరైనా అక్కడ ఎంత సేపైనా కూర్చొని ఎలాంటి ఆటంకం లేకుండా ఆడుకోవచ్చు. పైగా ఆటగాళ్లకు టీ బిస్కెట్లూ ఉచితమే. చదరంగం ప్రేమికుల కోసం ఉన్నికృష్ణన్‌ తన ఇంటిబయట ఓ పెద్ద షెడ్డునూ వేయించాడు. తాను ఇంటికెళ్లే సరికి ఏడేళ్ల పిల్లాడి నుంచీ డెబ్భై ఏళ్ల ముసలాయన వరకూ అందరూ ఆటలో లీనమై కనిపించే దృశ్యం తనకెంతో సంతోషాన్నిస్తుందంటాడు ఉన్నికృష్ణన్‌. తమ వూరి వాళ్ల ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయాలని గ్రామపెద్దలూ అనుకున్నారు. అందుకే డెబ్భై, ఎనభై శాతం కాకుండా వూళ్లొ వంద శాతం మందితో చదరంగం ఆడించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం కొన్ని స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకొని రానివాళ్లందరికీ ఆటను నేర్పించే ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద ఇప్పుడది వందశాతం చెస్‌ ఆటగాళ్లున్న ఏకైక గ్రామంగా చరిత్రకెక్కింది. ఆ వూరి కథకు వెండితెరమీదా చోటు దక్కింది. ‘ఆగస్ట్‌ క్లబ్‌’ పేరుతో చదరంగం గ్రామంగా మరోట్టిచల్‌ ఎదిగిన క్రమాన్ని ఆ సినిమాలో ఆవిష్కరించారు.

ఆ వూళ్లొ గుడీ, బడీ, పగలూ, రాత్రీ అన్న తేడా లేకుండా ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా బృందాలుగా గ్రామస్థులు చెస్‌ ఆడే దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఓ వ్యసనాన్ని వదిలించుకోవాలంటే, అంతకంటే మంచి వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలంటారు. ఎప్పుడో మరోట్టిచల్‌ వాసులు మొదలుపెట్టిన ఆ ప్రయత్నం, ప్రపంచంలో మరెవరికీ లేని ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఏదేమైనా మంచి వ్యసనాలను ఎంత పెంచుకుంటే అంత మంచిదే కదా..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.