close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
75 ఇళ్లు... 47 మంది ఐఏఎస్‌లు!

75 ఇళ్లు... 47 మంది ఐఏఎస్‌లు!

  ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్‌లు... ఒకే వూళ్లొ నలభై ఏడు మంది సివిల్‌ సర్వెంట్లు... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ అద్భుతాన్ని నిజం చేసిన గ్రామం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మదోపట్టి. దాదాపు వందేళ్ల క్రితం అక్కడ మొదలైన బ్యూరోక్రాట్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. కేవలం డెబ్భై ఐదు ఇళ్లున్న ఆ కుగ్రామం నుంచి ఇప్పటి వరకూ 47 మంది సివిల్‌ సర్వెంట్లు దేశంలో ఉన్నత బాధ్యతలు చేపట్టారు.

పోచంపల్లి చేనేతలా, ఆత్రేయపురం పూతరేకుల్లా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లాలోని మదోపట్టి గ్రామం ఐఏఎస్‌లకు పెట్టింది పేరు. ఒకరో ఇద్దరో కాదు ఏకంగా నలభై ఏడు మంది ఐఏఎస్‌ ఆఫీసర్లూ, డజన్లకొద్దీ యూపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులూ, బార్క్‌, ఇస్రో, ప్రపంచ బ్యాంక్‌లాంటి ప్రఖ్యాత సంస్థల ఉన్నతాధికార్లూ ఆ వూరి నుంచి చాలామంది ఉన్నారు. దాదాపు వందేళ్ల క్రితం ఒక వ్యక్తితో మొదలైన ఈ ప్రయాణం తరవాతి రోజుల్లో భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూ వస్తోంది. 1914లో ముస్తఫా హుసేన్‌ వూరి నుంచి మొదటిసారి ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసుల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తరవాత దాదాపు నలభై ఏళ్ల పాటు ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకోలేదు. 1952లో జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఆ గ్రామ వాసి ఇందు ప్రకాష్‌ సింగ్‌ దేశంలోనే రెండో ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. ఆయన స్ఫూర్తితోనే మదోపట్టిలో ఐఏఎస్‌ల పర్వం మొదలైంది.

ఒక్క వ్యక్తి స్ఫూర్తితో
సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యాక కూడా ఇందు ప్రకాష్‌ చదువు కొనసాగించారు. ఎంఏ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. లండన్‌లో భారత హైకమిషనర్‌గా, నేపాల్‌, సూడాన్‌ లాంటి దేశాల్లో భారత రాయబారిగా అనేక హోదాల్లో పనిచేశారు. తమ కళ్ల ముందే పెరిగిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదగడం మదోపట్టి గ్రామస్థుల్లో ఆలోచన రేకెత్తించింది. తమ పిల్లల్ని కూడా బాగా చదివించి అలా ఉన్నత స్థానాల్లో చూడాలన్న కోరిక వాళ్లలో పెరిగింది. అప్పట్నుంచీ పిల్లలను సివిల్‌ సర్వీసులే లక్ష్యంగా పెంచడం మొదలుపెట్టారు. అలా క్రమంగా సివిల్స్‌తో పాటు ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు ఒక్కొక్కరూ ఎంపికవుతూ వచ్చారు. ఆ వూరి విద్యార్థుల ప్రతిభ చూసి ప్రభుత్వమూ సాయం చేయడానికి ముందుకొచ్చింది. గ్రామస్థులు సేకరించిన నిధులకు కొంత కలిపి ఇంటర్‌, డిగ్రీ కళాశాలలను అక్కడే నిర్మించింది. అలా ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకూ అదే గ్రామంలో చాలామంది ప్రస్తుతం ఐఏఎస్‌ లక్ష్యంగా చదువు కొనసాగిస్తున్నారు.

ఒకే ఇంట్లో నలుగురు
ప్రభుత్వ స్కూలూ, కాలేజీలో బోధనంతా హిందీ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కలిసి ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ టీచర్‌ను నియమించి చిన్నప్పట్నుంచే పిల్లలకు ఆ భాషలో శిక్షణ ఇప్పిస్తున్నారు. గ్రామం చుట్టుపక్కల సివిల్‌ సర్వీసు పరీక్షలకు సంబంధించిన శిక్షణా కేంద్రం కూడా లేదు. ఇంటర్‌కి వచ్చేనాటికి విద్యార్థులే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని సన్నద్ధం అవడం మొదలుపెడతారు. గ్రామం నుంచి సివిల్‌ సర్వీసులకు ఎంపికైనవాళ్లు అక్కడికి వచ్చినప్పుడల్లా విద్యార్థులకు మార్గ నిర్దేశం చేస్తుంటారు. ఇంటికి ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్‌లైన అరుదైన రికార్డూ ఆ గ్రామానికి దక్కింది. నలుగురు సోదరుల్లో వినయ్‌ సింగ్‌, ఛత్రపాల్‌ సింగ్‌లు బిహార్‌, తమిళనాడు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలుగా, మరో ఇద్దరు అజయ్‌ సింగ్‌, శశికాంత్‌ సింగ్‌లు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఐఏఎస్‌ అధికార్లుగా పనిచేశారు. అలా ఇన్నేళ్లలో సివిల్స్‌కు ఎంపికైన 47మందితో పాటు యూపీపీఎస్సీకి డజన్లకొద్దీ గ్రామ యువకులు ఎంపికయ్యారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఇస్రో, ప్రపంచ బ్యాంక్‌ లాంటి ఉన్నత సంస్థల్లోనూ ఇక్కడివాళ్లు పనిచేస్తున్నారు.

ప్రతి ఒక్కరితో పోటీ
ఈ గ్రామ యువకుల ప్రతిభ వెనక స్థానికులు మరో ఆసక్తికర విషయాన్నీ చెప్పుకుంటారు. పురాణాల ప్రకారం జాన్‌పూర్‌ జమదగ్ని మహాముని కర్మభూమిగా ఉండేది. అక్కడే ఆయన యజ్ఞయాగాదులు నిర్వహించారు. ఆ మహిమ వల్లే అందరూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారన్నది కొందరి నమ్మకం. అవన్నీ కల్పనలే, కష్టపడి చదవడం వల్లే దూసుకెళ్తున్నారన్నది ఎక్కువమంది మాట. కానీ అంతమంది అధికారులున్నా ఆ గ్రామం అభివృద్ధికి మాత్రం దూరంగానే ఉంది. సర్వీసులకు ఎంపికైన చాలామందికి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం వస్తోంది. కెరీర్‌ మొదలుపెట్టిన తొలిరోజుల్లోనే కుటుంబంతో సహా వలస వెళ్లిపోతున్నారు. దాంతో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. ఇన్నేళ్లలో జనాభా కూడా పెద్దగా పెరగలేదు. గ్రామం నుంచి ఉద్యోగం పొంది ఒక్కొక్కరే బయటికి వెళ్తుంటే, మిగతా వారిలోనూ అలా ఉన్నత స్థానానికి వెళ్లాలన్న కోరికా ఎక్కువవుతోంది.

‘మా పిల్లలకు చిన్నప్పట్నుంచే గ్రామ చరిత్ర గురించి చెప్తూ చదువు విషయంలో కాస్త ఒత్తిడి పెడతాం. వూళ్లొ ప్రతి విద్యార్థీ తన వయసు పిల్లాడితో పోటీ పడతాడు. ఆ పోటీ వల్లే మొత్తం గ్రామమే ఇవాళ ప్రత్యేకంగా నిలిచింది’ అంటారు రామ్‌ నారాయణ్‌ మౌర్య అనే గ్రామస్థుడు. మదోపట్టిలో ఒక్కో వ్యక్తీ ఇంకొకరికి స్ఫూర్తినిచ్చినట్లే ఆ పల్లెను ఇంకొన్ని వూళ్లూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరమూ చాలా ఉంది.


గీతానికో గీత!

చ్చెరువొందించే అన్నమాచార్య కీర్తనలూ, భక్తిరసాల్లో ఓలలాడించే త్యాగరాయ కృతులూ, మదిని పులకరింపజేసే ముత్తుస్వామి దీక్షితార్‌ గీతాలూ, రామయ్యను సాక్షాత్కరింపజేసే రామదాసు పాటలూ... వీటన్నింటినీ ఆలకిస్తూ ఆనందానుభూతుల్ని పొందుతాం. అయితే, ఆ పాటలను చిత్రాల రూపంలోకి తీసుకువచ్చి వీనులకు మాత్రమే పరిమితమైన ఆ అనుభూతిని కళ్లకూ కలిగించేదే ‘చిత్రగానం’. అంటే, పాటలోని భావాన్ని బట్టి ఆ పాట మొత్తాన్నీ ఒక చిత్ర రూపంలో గీసే కళా ప్రక్రియ ఇది. పాట ప్రారంభంతో చిత్రం గీయడం మొదలు పెట్టి అది పూర్తయ్యేలోపు పాటను ప్రతిబింబించే చక్కటి చిత్రాన్ని కళ్లకు కట్టడమే ఈ విద్యలోని గొప్పదనం. ఈ అద్భుత కళలో అందెవేసిన చేయి అమలాపురానికి చెందిన కూచి సాయి శంకర్‌ది. కూచిగా సుప్రసిద్ధులైన ఈయన గీసిన వేల బొమ్మల్లో ఇక్కడ కనిపిస్తున్నవి కొన్ని.


 

10కె... స్టార్టప్‌ల పరుగు!

ఇంగ్లిష్‌ దోస్త్‌, హైరీ, బుక్‌ప్యాడ్‌... విజయవంతమైన స్టార్టప్‌లుగా ఇటీవల వార్తల్లో నిలిచిన సంస్థలివి. వీటిని స్థాపించిన వ్యక్తులు వేరు, ఇవి పనిచేసే విభాగాలు వేరు. కానీ ఈ కంపెనీలు ప్రారంభ దశలో ఉన్నపుడే గుర్తించి, అవి పూర్తిస్థాయిలో ఎదిగేందుకు అన్ని విధాలా సాయపడింది మాత్రం ఒకటే వేదిక ‘10000 స్టార్టప్స్‌’.

కార్పొరేట్‌ ఉద్యోగాలు కాదనుకుని క్యాంపస్‌ నుంచే కలల కంపెనీ ప్రారంభించే వారు కొందరు. లక్షల జీతాల్ని సైతం వదులుకుని అపార అనుభవంతో వ్యాపారంలోకి అడుగుపెట్టేవారు కొందరు. నిన్నటి సహోద్యోగి నేడు కోట్లు విలువ చేసే కంపెనీకి యజమానిగా మారడంతో ఆ స్ఫూర్తితో కొందరు... ఇలా ఎందరో కొత్త కంపెనీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాయెవరిదో పండెవరిదో! కానీ, అందరిదీ గట్టి ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో వారికి తోడుగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తోంది ‘నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌).’ 2023లోపు పదివేల కొత్త కంపెనీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో... 2013లో ‘10000 స్టార్టప్స్‌(10కె)’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నంలో వీరికి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, కొటాక్‌, ఐబీఎమ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలెన్నో తోడుగా నిలుస్తున్నాయి.

టెక్‌ కంపెనీలే ప్రధానం...
‘10కె’ కోసం ప్రధానంగా వీరు టెక్నాలజీ ఆధారిత కంపెనీలను ఎంచుకుంటారు. అలాగని పూర్తిగా టెక్‌ కంపెనీలే కానవసరంలేదు. టెక్నాలజీని ప్రధానంగా ఉపయోగించేవిగా ఉండాలంతే! వాణిజ్య సేవలు, నిర్మాణ రంగం, విద్య, ఫ్యాషన్‌, ఆరోగ్యం, ఇంధనం, కంప్యూటర్‌ ఆధారిత సర్వీసులు, మీడియా, నానో టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే ఎవరికైనా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ఎంపికచేసిన కంపెనీలు విజయవంతమయ్యేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలనీ కల్పిస్తుంది నాస్కామ్‌. ‘10కె’కు ఎంపికైన వారికి వివిధ నగరాల్లోని తమ స్టార్టప్‌ వేర్‌హౌసుల్లో తక్కువ ధరలో కార్యాలయాలు కేటాయిస్తారు. ఆరు నుంచి 12 నెలలపాటు ఆయా రంగాల్లోని నిష్ణాతులు మార్గనిర్దేశం చేస్తారు. లక్షల నుంచి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లూ నిత్యం ఇక్కడి కంపెనీలను పరిశీలిస్తారు. అంతేకాదు రూ.10లక్షలకు పైన విలువచేసే ‘స్టార్టప్‌ కిట్‌’ను దిగ్గజ కంపెనీల నుంచి పొందొచ్చు. వెబ్‌సైట్‌ ఏర్పాటు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు, విమాన ప్రయాణానికి టిక్కెట్లు లాంటివి స్టార్టప్‌ కిట్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి బెంగళూరులోని కంపెనీలకు మాత్రమే స్టార్టప్‌ కిట్‌ అందుతుంది. వేర్‌హౌసులకు ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆయా రంగాల్లో తాజా సమాచారం పంచుకునేలా సమావేశాలూ ఏర్పాటుచేస్తారు. 10 ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ లైన్‌, 24 గంటలూ పనిచేసుకునే సదుపాయం లాంటి ఇంకెన్నో ప్రత్యేకతలు వేర్‌హౌసులో ఉంటాయి. అన్నిటికీ మించి ఇక్కడుండే ప్రోత్సాహకరమైన వాతావరణం అసలు సిసలు ఆంత్రప్రెన్యూర్‌ని బయటకు తీసుకువస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యవస్థాపకులు కేవలం తమ ఉత్పత్తిమీద దృష్టి పెడితే చాలు, మిగతా వ్యవస్థాగత, మౌలిక సదుపాయాలు వాటంతట అవే దగ్గరకు వస్తాయి. పక్కనున్న కంపెనీల వాళ్లతో మాట్లాడటంవల్ల కొన్నిసార్లు ఒకరి సహాయం, అనుభవం ఒకరికి ఉపయోగపడతాయి కూడా.

అమెరికా పర్యటన
‘10కె’ స్టార్టప్‌ వేర్‌హౌసులు ప్రస్తుతం బెంగళూరుతోపాటు కోల్‌కతా, కొచ్చీలలో ఉన్నాయి. వీటి ప్రారంభం వెనుక ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు కూడా ఉంటుంది. త్వరలో ముంబయి, పుణె, చెన్నై, గుడ్‌గావ్‌లలో ప్రారంభించనున్నారు. బెంగళూరు, కోల్‌కతాలలో మరో రెండు వేర్‌హౌసులు రానున్నాయి. ‘10కె’లో చోటు కల్పించే ప్రక్రియ నిరంతరంగా సాగుతుంది. 10000 startups.com వెబ్‌సైట్లో వివరాలు నమోదుచేసుకుంటే నిర్వాహకులు వాటిని పరిశీలిస్తారు. అక్కడ పనిచేస్తున్న ఒక కంపెనీ విజయవంతంగా బయటకు వెళ్లగానే వరుసలో ఉన్న తర్వాత కంపెనీలకు సమాచారం అందుతుంది. బెంగళూరులో సీటుకి నెలకు రూ.3500, కోల్‌కతాలో సీటుకి రూ.2500 వసూలు చేస్తారు. ఒక్కో కంపెనీ నుంచి గరిష్ఠంగా అయిదుగురికి చోటు కల్పిస్తారు. ప్రతి కంపెనీలో కనీసం ఇద్దరు భాగస్వాములు ఉండాలి. ‘యాహూ సంస్థ రూ.50 కోట్లకు కొనుగోలు చేసిన బుక్‌ప్యాడ్‌ స్టార్టప్‌ ‘10కె’కు మొదటి దశలో ఎంపికైన సంస్థ. ‘‘బుక్‌ప్యాడ్‌ ప్రారంభదశలో ఇక్కడకు వచ్చాం. ఇక్కణ్నుంచే ఉత్పత్తిని మార్కెట్‌లోకి విడుదల చేశాం, ఖాతాదారుల్నీ పొందగలిగాం. ‘10కె’కి వచ్చాక మేం మరోచోటుకి పోలేదు. ఎందుకంటే, మా ఎదుగుదలకు అవసరమైన మార్గనిర్దేశకులూ, సాంకేతిక నిపుణులూ, ఇన్వెస్టర్లూ ఇక్కడికే వచ్చేవారు’’ అని చెబుతారు సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య. ‘ఇంగ్లిష్‌ దోస్త్‌’, ‘విష్‌బెర్రీ’, ‘టెస్ట్‌బుక్‌’, ‘దవాడాట్‌ఇన్‌’ లాంటి విజయవంతమైన సంస్థలు ‘10కె’ నుంచి వెళ్లినవే. ‘నాస్కామ్‌ ఇన్నోట్రెక్‌’ పేరుతో ఏడాదికోసారి ఎంపికచేసిన వ్యవస్థాపకుల్ని వారం రోజులపాటు సిలికాన్‌వ్యాలీ పర్యటనకు తీసుకువెళ్తుంది ‘10కె’. అక్కడ ప్రఖ్యాత కంపెనీల వ్యవస్థాపకుల్నీ, 500 స్టార్టప్స్‌, స్పింటా యాక్సెల్‌రేటర్‌, వై కాంబినేటర్‌ లాంటి సీడ్‌ యాక్సెల్‌రేటర్లనీ కలిసే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 39 స్టార్టప్‌లకు చెందిన వ్యవస్థాపకులు ఇన్నోట్రెక్‌కు వెళ్లారు.

‘10కె’లో ఇప్పటికి నాలుగు దశలు పూర్తయ్యాయి. అయిదో దశ ఎంపికలు జరుగుతున్నాయి. మరెందుకు ఆలస్యం ఈసారి మీకూ అవకాశం రావొచ్చేమో ప్రయత్నించండి!


 

ఆ కథే హాలీవుడ్‌ సినిమా!  

ఐదేళ్ల వయసులో భారత్‌లో రైల్లో తప్పిపోయిన షేర్‌ మున్సిఫ్‌ ఖాన్‌ అనే పిల్లాడు ప్రస్తుతం సరో బ్రియర్లీ అన్న పేరుతో ఆస్ట్రేలియాలో వ్యాపారవేత్తగా ఉన్నాడు. సొంత వూరినీ కన్నవారినీ చేరుకోవాలన్న తపనతో పాతికేళ్లపాటు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి గూగుల్‌, ఫేస్‌బుక్‌ల సాయంతో అతికష్టమ్మీద తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. హాలీవుడ్‌లో ‘లయన్‌’ పేరుతో తెరకెక్కిన అతడి కథ త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌ సినిమాగా విడుదల కానుంది.

కోల్‌కతా మురికివాడల్లో అనాథలుగా పెరిగే చాలా మంది పిల్లల వెనక ఏదో ఒక కన్నీటి కథ దాగుంటుంది. పాతికేళ్ల తన కష్టంతో అలాంటి కథను విజయగాథలా మార్చుకున్నాడు షేరూ. దాదాపు ముప్ఫయి ఏళ్ల క్రితం ఓ రోజు పక్క వూరిలో ఉన్న రైల్వే స్టేషన్లో ఆడుకోవడానికి అన్నతో కలిసి వెళ్లాడు షేరూ. ఇప్పుడే వస్తానని తమ్ముణ్ని ఓ బెంచీ మీద కూర్చోబెట్టి అన్న ఎక్కడికో వెళ్లిపోయాడు. కాసేపటి తరవాత చూస్తే అన్న కనిపించలేదు. ఎదురుగా కదులుతున్న రైల్లోకే అతడు వెళ్లాడనుకొని షేరూ ఆ రైలు ఎక్కేశాడు. అన్నయ్య కోసం ఒక్కో బోగీలో వెతుకుతూ అలసిపోయి ఓ సీటుమీద వాలిపోయాడు. కళ్లు తెరిచేసరికి దాదాపు పద్నాలుగు గంటలు గడిచాయి. రైలు వందల కిలోమీటర్లు ప్రయాణించి కోల్‌కతాలోని హౌరా స్టేషన్‌కు చేరుకుంది. రైలు దిగాక ఎటెళ్లాలో అర్థం కాలేదు. ‘బ’ అనే అక్షరంతో తాను రైలెక్కిన వూరి పేరు మొదలవుతుందన్న ఒక్క విషయం తప్ప షేరూకు మరేమీ గుర్తులేదు. అదీ నిజం కాదేమోనన్న సందేహమూ ఉంది. దిక్కుతోచని స్థితిలో రైల్వే స్టేషన్‌ చుట్టుపక్కల అడుక్కోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు చిత్తుకాగితాలు ఏరుకొని బతికాడు. ఇక అదే జీవితానికి అలవాటు పడుతోన్న సమయంలో ఓ రైల్వే కార్మికుడు అతడిని చేరదీశాడు. 

ఆస్ట్రేలియన్‌ జంటకు దత్తత
రైల్వే ఉద్యోగి దగ్గర కొన్ని రోజులు షేరూకు బాగానే గడిచాయి. కానీ ఓ రోజు అతడు షేరూని ఓ స్నేహితుడి దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లిద్దరి మాటల్ని బట్టి తనని ఎవరికో అమ్మేస్తున్నారన్న విషయం అర్థమైంది. ఎలాగోలా వాళ్ల దగ్గర్నుంచి తప్పించుకొని పారిపోయాడు. రోడ్డుమీద తిరుగుతున్న షేరూని ఓ కుర్రాడు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కణ్నుంచి ‘ఇండియన్‌ సొసైటీ ఫర్‌ స్పాన్సర్‌షిప్‌ అండ్‌ అడాప్షన్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు చేరుకున్నాడు. అదే షేరూ జీవితానికి మలుపు. ఎవరైనా పిల్లాణ్ని దత్తత తీసుకుందామని అక్కడికి వచ్చిన జాన్‌, సూ బ్రియర్లీ అనే ఆస్ట్రేలియన్‌ జంటకు షేరూ బాగా నచ్చాడు. దాంతో అతడిని తీసుకొని తాస్మేనియా వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లినా ప్రతి నిమిషం తన కుటుంబమే గుర్తొచ్చేది. కానీ ఇక వాళ్లు కనిపించడం అసాధ్యమని షేరూకి అర్థమైంది. తనకు మంచి భవిష్యత్తును ఇద్దామని తీసుకొచ్చిన వాళ్లను బాధపెట్టకూడదని నెమ్మదిగా షేరూ వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నించాడు. అతి కష్టమ్మీద ఇంగ్లిష్‌ నేర్చుకున్నాడు. స్కూల్లో చేరి క్రమంగా ఆస్ట్రేలియన్‌ పౌరుడిలానే పెరగడం మొదలుపెట్టాడు.

గూగుల్‌లో అన్వేషణ
తాస్మేనియాలోనే బిజినెస్‌ అండ్‌ హాస్పిటాలిటీలో డిగ్రీ పూర్తిచేసిన షేరూ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నా తన కుటుంబాన్ని కలుసుకోవాలన్న కోరిక మాత్రం తగ్గలేదు. గదిలో భారత చిత్రపటాన్ని అంటించుకొని తన వూరిని కనిపెట్టే ప్రయత్నం చేసేవాడు. కొన్ని రోజులకు తాను రైల్లో ప్రయాణించిన సమయం (దాదాపు 14గంటలు), రైలు సగటు వేగాన్ని లెక్కించి తన వూరు హౌరాకి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్న అంచనాకి వచ్చాడు. హౌరా స్టేషన్‌ చుట్టూతా 1200 కి.మీ పరిధిలో ఓ వృత్తం గీసుకొని, ఆ వృత్తానికి దగ్గరగా ‘బ’తో మొదలయ్యే వూళ్ల జాబితా సిద్ధం చేసుకున్నాడు. వూరికి దగ్గర్లో తనకు లీలగా గుర్తున్న జలపాతం, సినిమా హాలు, అడవిలాంటి కొన్నింటిని తీసుకుని ‘గూగుల్‌ ఎర్త్‌’ సాయంతో వెతకడం మొదలుపెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని ‘బర్హమ్‌పూర్‌’కు సమీపంలో ఉన్న ‘కండ్వా’ అనే గ్రామం తాను పెట్టుకున్న గుర్తులకు దగ్గరగా ఉందనిపించింది. ఫేస్‌బుక్‌లో ‘మై హోమ్‌టౌన్‌ కండ్వా’ అని ఓ పేజీ కనిపిస్తే, అందులోకి వెళ్లి తన కథ చెప్పి, తాను చెప్పిన గుర్తులు ఆ గ్రామానికి దగ్గరగా ఉన్నాయో లేదో తెలుసుకున్నాడు. క్రమంగా కండ్వానే తన సొంతూరన్న నిర్ధరణకు వచ్చాడు. వెంటనే ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యుల వేటలో కండ్వాకు బయల్దేరాడు.

ఆ కథే సినిమా
కండ్వాలో తనకు గుర్తున్న అన్ని ప్రాంతాలకూ వెళ్లి తన తల్లిదండ్రుల పేర్లు చెప్పి వాళ్ల గురించి వాకబు చేయడం మొదలుపెట్టాడు. ఓ పెద్దాయన షేరూ చెప్పిన విషయాలను గుర్తుపట్టి, నేరుగా అతడి తల్లి కమల దగ్గరికి తీసుకెళ్లాడు. అంతే... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో షేరూ పాతికేళ్ల నిరీక్షణకు తెరపడింది. కానీ తాను తప్పిపోయిన సమయంలో తన అన్నయ్య కూడా ఇంటికి చేరుకోలేదనీ, వారం రోజుల తరవాత వూరికి దగ్గర్లోని రైల్వేపట్టాల మీద అతడు శవమై కనిపించాడనే చేదు వార్త తెలిసింది. ఇక జీవితంలో కలవలేననుకున్న తల్లినీ, చెల్లినీ కలిసిన ఆనందంతో షేరూ ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. తరచూ సొంతూరికి వచ్చి వెళ్తూ వాళ్ల పోషణ బాధ్యతనూ చూసుకుంటున్నాడు. ‘ఏ లాంగ్‌ వే హోమ్‌’ పేరుతో తన అనుభవాలకు పుస్తక రూపమిచ్చాడు. షేరూ జీవితం ఆధారంగా ‘లయన్‌’ పేరుతో హాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రం త్వరలో విడుదల కానుంది. షేరూ పాత్రలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ హీరో దేవ్‌ పటేల్‌, ప్రఖ్యాత హాలీవుడ్‌ నటి నికోల్‌ కిడ్‌మన్‌ అతడి ఆస్ట్రేలియన్‌ తల్లి పాత్రలో నటించారు. తన కథ అంతర్జాతీయ స్థాయి సినిమాగా మారడం కంటే జీవితంలో చూడలేననుకున్న తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకోవడమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందంటాడు షేరూ.


 

టూత్‌బ్రష్‌లకన్నా సెల్‌ఫోన్లే ఎక్కువ!

తను పక్కన లేకపోతే నిద్రపట్టదు. పలకరించకపోతే మనసు మనసులో ఉండదు. తనను చూడకుండా అరగంట కూడా గడవదు. ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడికి వెళ్తున్నా తింటున్నా తాగుతున్నా తన ధ్యాస తప్ప మరొకటి ఉండదు... ఇంతలా ప్రేమించబడే అదృష్టం ఈరోజుల్లో ఇంకెవరికి ఉంటుంది... చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌కి తప్ప. నాలుగు దశాబ్దాల కిందట రూపుదిద్దుకుని ఇప్పుడు మన జీవన విధానాన్నే మార్చేసిన ఆ సెల్‌ఫోన్‌ వెనుక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 600కోట్లకు పైగా సెల్‌ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 90%. చిన్న పిల్లలూ వృద్ధులతో పాటు వినియోగంలో ఉన్న ల్యాండ్‌ ఫోన్లను తీసేస్తే ఈ సంఖ్య ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్లో 30శాతం వాటా భారత్‌ చైనాలదే.

* మొదటి సెల్‌ఫోన్‌ ‘మోటోరోలా డినటక్‌ 8000ఎక్స్‌’ 1983లో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఖరీదు అప్పట్లోనే 3,995 డాలర్లు (సుమారు రూ.2.68 లక్షలు). పొడవాటి రబ్బరు యాంటినాతో ఉండే ఈ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలం 30 నిమిషాలు. దానికోసం 10గంటలు ఛార్జింగ్‌ పెట్టాల్సొచ్చేదట.

* ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్‌ ‘సైమన్‌’ని ఐబీఎమ్‌ కంపెనీ 1993లో రూపొందించింది. దీని ధర సుమారు రూ.60వేలు.

* భారత్‌లో తొలి సెల్‌ఫోన్‌ సంభాషణ 1995లో జరిగింది. అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు, పీవీనర్సింహరావు ప్రభుత్వంలో కేంద్ర కమ్యునికేషన్ల మంత్రిగా పనిచేస్తున్న సుఖ్‌రామ్‌కి ఫోన్‌ చేశారు. అప్పట్లో ఫోన్‌ ఖరీదు రూ.25 వేల నుంచి 45వేల వరకూ ఉంటే కాల్‌ ఛార్జీలు నిమిషానికి ఫోన్‌ చేసినవారికి రూ.16 రూపాయలూ లిఫ్ట్‌ చేసి మాట్లాడిన వారికి రూ.8 చొప్పున పడేవి.

* స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 75శాతం వాటా ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లదే.

* స్మార్ట్‌ఫోన్‌ టెక్నాలజీ మీద 2.5 లక్షల పేటెంట్లు విడివిడిగా నమోదయ్యాయి.

  * ‘సెల్‌ఫోన్‌ దగ్గర లేకపోతే ఎలా, సిగ్నల్‌ దొరక్కపోతే ఏమైపోతాం’... ఇలా భయపడటాన్ని నోమోఫోబియా(నో మొబైల్‌ ఫోన్‌ ఫోబియా) అంటారు.

* ప్రపంచంలో టూత్‌బ్రష్‌లు వాడేవారికన్నా మొబైల్‌ ఫోన్లను వాడేవారి సంఖ్యే ఎక్కువ.

* సగటున ఒక్కొక్కరూ రోజుకి 60సార్లు సెల్‌ఫోన్‌ని చూసుకుంటారట. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారిలో అయితే ప్రతి ఐదుగురిలో నలుగురు ఉదయం నిద్ర లేచిన 15 నిమిషాల్లోపే చూసుకుంటున్నారట. వీరిలో 80శాతం లేవగానే చేసే మొదటి పని అదే.

* ఫోన్‌ ఉన్నవారిలో 90శాతం దాన్నెప్పుడూ చేతుల్లోనే ఉంచుకుంటున్నారట. 48శాతం తింటూ కూడా ఫోన్‌ని చూస్తున్నారనేది ఓ అధ్యయనం.

* చరిత్రలో అత్యధికంగా 25కోట్ల ఫోన్లు ‘నోకియా 1100’ మోడల్‌వి అమ్ముడయ్యాయి. అందుకే, అది అత్యుత్తమ ఎలక్ట్రికల్‌ గ్యాడ్జెట్‌గా పేరుపొందింది.

* 2015 జులై నాటికి అందుబాటులో ఉన్న మొబైల్‌ ఫోన్‌ ఆప్‌ల సంఖ్య ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో 16లక్షలు. కాగా ఆపిల్‌ వెర్షన్‌వి 15లక్షలు.

* ప్రతినెలా సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ని చూసే వారి సంఖ్య 139కోట్లు కాగా ట్విటర్‌ని వాడేవారి సంఖ్య 25కోట్లు. 91శాతం సామాజిక వెబ్‌సైట్ల కోసమే మొబైల్‌లో ఇంటర్నెట్‌ను వాడుతున్నారట.

* జపాన్‌లో 90శాతం మొబైల్‌ ఫోన్లు వాటర్‌ప్రూఫ్‌వే. ఎందుకంటే అక్కడ చాలామంది యువత స్నానాలగదుల్లోనూ ఫోన్లను వదలడంలేదు మరి.

* సెల్‌ఫోన్లద్వారా ప్రతి నెలా 35వేల కోట్ల మెసేజ్‌లు బదిలీ అవుతున్నాయి. వాటిలో 15శాతం మెసేజ్‌లు వ్యాపార సంబంధితమైనవి.

* ఒక్క ఫిలిప్పీన్స్‌లోని ప్రజలే రోజుకి వందకోట్ల మెసేజ్‌లను పంపిస్తున్నారు. స్థానికంగా మెసేజ్‌లకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్‌ ఎస్ట్రాడా అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన్ని పదవీచ్యుతిడిని చేసింది మెసేజ్‌ల ఉద్యమమే. మెసేజ్‌లను అంత ఎక్కువగా పంపించుకుంటారు కాబట్టే ఆ దేశాన్ని ‘టెక్స్ట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌’గా పిలుస్తారు.

* ఫిన్లాండ్‌లో మొబైల్‌ ఫోన్‌ని విసిరేయడమూ ఓ ఆటే. దీనికి సంబంధించి జాతీయస్థాయి పోటీలూ జరుగుతాయి.

* మూత్రంతో ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టే సరికొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

* కోటీముప్ఫైఏడు లక్షల రూపాయలు... ప్రపంచంలోనే అత్యధికంగా ఓ వ్యక్తికి వచ్చిన నెలవారీ ఫోన్‌ బిల్లు ఇది. ఫ్లోరిడాకు చెందిన సెలీనా ఆరన్స్‌కు వచ్చింది.

  ప్రస్తుతం మన జీవితాల్లో అతిముఖ్యమైన భాగంగా మారిపోయిన సెల్‌ఫోన్‌ ప్రస్థానం మొదలైంది 43 ఏళ్ల కిందట. మొదటి వైర్‌లెస్‌ ఫోన్‌ కాల్‌ని 1973లో మోటోరోలా కంపెనీ అధినేత మార్టిన్‌ కూపర్‌ చేశాడు. ఆ ఫోను బరువు 1.13కిలోలు. పొడవు 10 అంగుళాలు. బ్యాటరీ జీవితకాలం 20నిమిషాలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.