close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కర్రదెబ్బే ఆశీర్వాదం!

కర్రదెబ్బే ఆశీర్వాదం!

భక్తజన వరదుడిగా, ఆపన్నులకు అభయ ప్రదాతగా, దుష్టపీడలను పారదోలే మహోగ్రమూర్తిగా నారసింహుడికి పేరుంది. ఆ స్వామి దండాన్ని చేతబూని సంకల్ప సిద్ధిదాతగా రంగారెడ్డి జిల్లా చీర్యాలలో పచ్చని పొలాల మధ్య కొలువుదీరాడు.

కోరదవడలతో కోటిసూర్యతేజముతో
హారకేయూర భూషణాంబరాలతో
చేరి బ్రహ్మాదులెల్లాను సేవలు సేయగాను
మేర మీరిన సిరుల మేడతో నున్నాడు

వాడే ప్రహ్లాదవరదుడూ వాడే భక్తవత్సలుడూ... అని కీర్తించారు అన్నమాచార్యుల వారు నారసింహుడిని. ‘నువ్వే సమస్తం’ అనుకున్న భక్తుడిని కాచడానికి తానే తరలివచ్చిన పరమాత్మ స్వరూపం అంటే బ్రహ్మకూ భక్తే మరి. సిరిమహాలక్ష్మితో పాటూ భక్తజనసిరినీ కలిగి ఉన్న లక్ష్మీనారసింహుడు ఎంత మంది కుబేరులకు సరితూగుతాడో! ఉగ్రనారసింహుడిగా, జ్వాలా నారసింహుడిగా, లక్ష్మీనారసింహుడిగా ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్న ఆ నృసింహమూర్తి రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని చీర్యాలలో సంకల్పసిద్ధి నారసింహుడిగా భక్తులకు కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు.

స్వామి చెప్పినట్టే...
హైదరాబాద్‌ మహానగరానికి 23 కిలోమీటర్ల పరిధిలో పచ్చటి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉంటుంది చీర్యాల గ్రామం. అక్కడే పంటపొలాల మధ్య లక్ష్మీసమేతంగా కొలువై ఉంటాడు సంకల్పసిద్ధి లక్ష్మీనారసింహుడు. స్వామిని తలచుకొని ఏదైనా సంకల్పం చేసుకుంటే దాన్ని తప్పక నెరవేరుస్తాడని భక్తుల నమ్మిక. ఈ దేవాలయ నిర్మాణం వెనుక ఓ గాథ ఉంది. ఆలయ ఛైర్మన్‌ లక్ష్మీనారాయణకు ఒకనాడు స్వామి కలలో కనిపించాడట. ఆయనకు సంబంధించిన పంటపొలాలలోకి తోడ్కొని పోయి ఇక్కడే ఆలయ నిర్మాణం జరపమని ఆదేశించాడట. దాంతో 2008లో దాతల సహాయంతో స్వామి చెప్పిన చోటే ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఎడమతొడమీద లక్ష్మి అమ్మవారితో ఉండే ఈ స్వామి విగ్రహాన్ని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానపు ప్రధాన అర్చకులు జె.నృసింహాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేశారు.

కర్రతో కొడతారు!
మామూలుగా రెండు కళ్లూ మూసి చేతులు జోడించి ప్రార్థించడం మన సంప్రదాయం. కానీ ఇక్కడి స్వామిని దర్శించుకునేప్పుడు కళ్లు మూయవద్దని చెబుతుంటారు అర్చకులు. కళ్లు తెరచి నిశ్చలంగా స్వామి నయనాలలోకి చూస్తూ ప్రార్థన చేయాలని సూచిస్తారు. అలా స్వామి మనలోని సమస్యల్నీ, బాధల్నీ అవగతం చేసుకుని వాటిని ఉపశమింపజేస్తాడనేది ఇందులోని పరమార్థం. ఇక్కడి స్వామి దగ్గర ఓ దండం కనిపిస్తుంది. తీర్థప్రసాదాలను స్వీకరించేప్పుడు ఈ కర్రతో భక్తుల వీపుమీద తట్టడం ఆనవాయితీ. అలా చేస్తే మేలు జరుగుతుందని నమ్ముతారు. కాశీలో కాలభైరవుని దగ్గరా, యాదగిరిగుట్ట నారసింహుని దగ్గరా ఇలాంటి దండాలు ఉంటాయి.

ఉపాలయాలు
ఇక్కడ ఏర్పాటు చేసిన స్వామి పుష్కరిణిలో శేషపానుపు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి కనిపిస్తాడు. దేవాలయంలో ప్రదక్షిణ చేసే దారంతా స్వామి తైలవర్ణ చిత్రాలతో అలంకరించి ఉంటుంది. అక్కడే విష్వక్సేసుని ఆలయం దర్శనమిస్తుంది. ప్రాంగణంలో స్వామీ అమ్మవార్లతో పాటు గణపతి, ఆంజనేయుడు, నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ, వల్లీ దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యస్వామి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడి నృసింహుడికి 41 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి మనసులో ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. సమస్యలు అధికంగా బాధించేవారు 41 రోజులు ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచిదంటారు. శని, ఆది వారాలూ... అమావాస్య పౌర్ణమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. స్వామి భక్తులైన సుదర్శనాళ్వార్‌, తిరుమురాళ్వార్‌, నమ్మాళ్వార్‌, వనమాల మహాముని సహా గోదాదేవి, తాండవ కృష్ణుడి విగ్రహాలూ శ్రీరామానుజులవారి శ్రీచక్రం, సాలగ్రామాలూ తదితరాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు దగ్గరలో వెలసిన సుప్రసిద్ధ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామినీ దర్శించుకుని వెళతారు. కీసరగుట్టకు రామచంద్రమూర్తి సీత, హనుమలతో కలిసి వచ్చాడని చెబుతారు. రాముని ప్రార్థన మేరకు పరమశివుడే శివలింగంగా మారాడనీ, ఆ లింగాన్నే సాక్షాత్తూ రామచంద్రమూర్తి ఇక్కడ ప్రతిష్ఠించాడనేది స్థలపురాణం.

బ్రహ్మోత్సవం
సత్యనారాయణ వ్రతాలూ అన్నప్రాసనా అక్షరాభ్యాస కార్యక్రమాలు సహా వారాన్ని బట్టి వివిధ దేవతలకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ చైత్ర బహుళ దశమి రోజు నుంచి మూడు రోజుల పాటు స్వామికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు. ఆలయ సమీపంలో విశ్రాంతి గదుల సౌకర్యం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆలయాభివృద్ధికి రూ.13 కోట్ల అంచనా వ్యయంతో చక్కని ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉన్నందువల్ల ఆలయ రహదారిని నాలుగు వరుసల దారిగా చేయడంతో పాటూ ఇక్కడి చెరువు కట్టను వెడల్పు చేసి దేవాలయానికి వచ్చే దారిలో దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. స్వామి ఆలయం ఎదురుగా తులసి తోటతో పాటూ పచ్చటి అరటి తోటలూ ఉన్నాయి. నారసింహుడిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి తోటల మధ్య ప్రశాంత వాతావరణాన్నీ ఆస్వాదించవచ్చు.

- మడూరి రవిందర్‌, న్యూస్‌టుడే, కీసర

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.