close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోదావరిపిలిచింది

గోదావరిపిలిచింది
- తోలేటి సుబ్రహ్మణ్యం

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం. 

కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.

తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని! భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.

అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు ‘‘మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ’’ అని.

‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పన్జేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.

1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడు. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళొనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.

కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు. ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా? మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా? వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?

‘‘కడియంలో కాసేపు ఆపాలయ్యా’’ డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు... ఎరుపూ నలుపూ పసుపూ నీలం, తెలుపు గులాబీలూ చామంతులూ... అదొక పూల సామ్రాజ్యం.

కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. ‘‘నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం’’ దక్షిణామూర్తి కూతురు అంది.

‘‘సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా’’ అంది దక్షిణామూర్తి భార్య హైమ.

‘‘అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని’’ కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.

బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- ‘‘అది ఎవరి విగ్రహం మామయ్యగారూ’’ అని.

హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పన్జేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా! చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.

దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.

అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.

మ్యూజియం ముందుభాగంలో 1840లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు. కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్‌ ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.

‘‘ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం... ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.

అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.

ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572లతో పని పూర్తిచేసి చూపించాడు’’ దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.

‘‘మన వూళ్ళొ పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ’’ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.

ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.

మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.

‘‘వెళ్ళొస్తాం మామయ్యగారూ’’ అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.

‘‘సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి’’ కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.

ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.

దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, వూరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.

సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు ‘‘ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...’’

దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.

‘‘నాన్నా, బావున్నారా?’’
‘‘బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?’’
‘‘ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...’’
ఫోన్‌ అల్లుడికిచ్చింది.
‘‘మామయ్యగారూ బావున్నారా?’’

‘‘బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?’’

‘‘అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా’’ మాటల్లో ఏదో తటపటాయింపు.

‘‘చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు’’

‘‘నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...’’ కిరణ్‌ చెబుతున్నాడు.

దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది.

‘‘అలాగే అల్లుడూ. మన వూరు వచ్చి, మన వూళ్ళొ బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను’’ సంతోషంగా అన్నాడు.

‘‘థాంక్స్‌ మామయ్యా’’

‘‘సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే’’ దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.

‘‘మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా. మీరు మీ వూరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా.’’

దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ.

‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...

నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా!

కాటన్‌ దొరా... నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.

దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.