close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ మంచుకొండల్లో నీళ్లు దొరకవు!

ఆ మంచుకొండల్లో నీళ్లు దొరకవు!

ప్రపంచంలోకెల్లా ఎత్తైన భూభాగంలో ఉన్న యుద్ధభూమి సియాచెన్‌, భారత్‌-పాక్‌ దేశాలకు భౌగోళికంగా కీలకమైన భూభాగం. మధ్య ఆసియాను భారత ఉపఖండం నుంచీ పాక్‌ను చైనా నుంచీ వేరు చేసే ముఖ్య ప్రదేశమే సియాచెన్‌ గ్లేషియర్‌. గడ్డి మొక్క కూడా మొలవని కఠినమైన మంచు ప్రాంతమిది. అలాంటి ప్రదేశాన్ని సందర్శించే అరుదైన అవకాశం వచ్చిందంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పాలిక శ్రీనివాసరావు.

ముద్రమట్టానికి సుమారు 12 వేల అడుగుల నుంచి 23 వేల అడుగుల ఎత్తులోని శీతల ప్రదేశమే సియాచెన్‌. దాదాపు 76 కిలోమీటర్ల పొడవుగల ఈ హిమనీనదానికి పడమటన సాల్టొరొ రిడ్జ్‌, తూర్పున కారకోరం పర్వతశ్రేణి ఉన్నాయి. సరిహద్దుల్లోని ఈ గ్లేషియర్‌కోసం దాయాది దేశాలు నాలుగువేలమంది సైనికులను కోల్పోయాయి.

బాల్టి భాషలో సియా అంటే గులాబీ జాతికి చెందిన ఓ మొక్క, చెన్‌ అంటే విరివిగా దొరికే ప్రదేశం. గ్లేషియర్‌కి కిందిభాగంలో ఉన్న లోయల్లో ఆ ముళ్లపువ్వులు ఎక్కువగా పూస్తాయి కాబట్టి దీనికా పేరు వచ్చింది.

భారత ప్రభుత్వం సియాచెన్‌ సివిల్‌ ట్రెక్‌ను ఏటా ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆర్మీ అడ్వెంచర్‌ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. సియాచెన్‌ సందర్శించాలనుకునే సామాన్య పౌరులకు ఇది ఒక్కటే మార్గం. ఇందులో 30-40 మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. వివిధ రక్షణదళాలు, ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌లు ఎంపిక చేసిన ఔత్సాహికులకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. సివిల్‌ట్రెక్‌- 2015లో పాల్గొనేందుకు భారతీయ రైల్వేల తరపున మేం ఎంపిక అయ్యామని తెలుసుకున్న వెంటనే మా ప్రయాణానికి కావలసినవి ఏర్పాటుచేసుకున్నాం. దిల్లీ నుంచి లేహ్‌కి విమానంలో ప్రయాణించాం.

లేహ్‌ నుంచి శిక్షణ మొదలు... 
హిమాలయాల మీదుగా విమానప్రయాణం నయనానందకరం. హిమశిఖర సౌందర్యాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. దేశంలోని వివిధ నగరాల నుంచి ఎంపిక అయిన మొత్తం 36 మందికీ మిలటరీ అధికారులు కెప్టెన్‌ అభిషేక్‌, కెప్టెన్‌ అర్పిత్‌ ఖెరా, కెప్టెన్‌ స్వాతి స్నెగర సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సాహసయాత్ర లేహ్‌లో 11,562 అడుగుల ఎత్తులో మొదలై సియాచెన్‌ బేస్‌ క్యాంప్‌ మీదుగా కుమార్‌ పోస్టు వరకూ అంటే 16,000 అడుగుల ఎత్తు వరకూ ఉంటుంది. శిక్షణ మూడు విడతలుగా ఉంటుంది. సెప్టెంబరు 15- 21 వరకూ తేలికపాటి వ్యాయామాలూ నడకా చేయించారు. మొదటి రెండు రోజులూ హోటల్‌కే పరిమితమయ్యాం. తరవాత శాంతిస్తూపం, వార్‌ మెమోరియల్‌, జొరావర్‌ సింగ్‌కోట, కాళీమాత గుడి, పత్తర్‌ సాహిబ్‌ గురుద్వారా, మాగ్నటిక్‌ హిల్‌, డిక్సే మొనాస్ట్రీ... ఇలా లేహ్‌లో సందర్శించదగ్గవన్నీ చూశాం.

20 నిమిషాలకు మించి ఉండలేం! 
లేహ్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోగల కర్దుంగ్‌ లా పాస్‌ 18,379 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వ్యవస్థ కలిగినటువంటి ప్రదేశం. లేహ్‌లో టూరిస్టులు అత్యధికంగా సందర్శించే ప్రదేశమిదే. అక్కడ ఆక్సిజన్‌ అందక ఇబ్బందిపడే అవకాశం ఉంది. 20 నిమిషాలకు మించి ఉండకూడదు. మేం అక్కడ దొరికే బుల్లెట్‌ వాహనాలు అద్దెకు తీసుకుని ఈ ప్రాంతాన్ని సందర్శించాం. మేం వెళ్లినప్పుడు మంచు కురుస్తోంది. అయినా అలాగే తడుస్తూ వెళ్లి ఫొటోలు తీసుకున్నాం.

తరవాత వైద్యపరీక్షలు చేశారు. ప్రతిరోజూ బీపీ, నాడి, ఆక్సిజన్‌ శాతం చెక్‌ చేస్తారు. ఇవి స్థిరంగా ఉండాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. మంచినీళ్లు రోజుకి ఐదారు లీటర్లు తాగాలి. లేహ్‌లో ఆరోగ్య పరీక్షలో నలుగురు ఉత్తీర్ణులు కాలేకపోయారు.

బూట్ల బరువే మూడు కిలోలు! 
రెండో విడత శిక్షణ కోసం సెప్టెంబరు 22 ఉదయాన్నే సియాచెన్‌ బేస్‌క్యాంప్‌నకు బయలుదేరాం. వర్షంవల్ల దారిపొడవునా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నీటి ప్రవాహం కొన్నిచోట్ల ఎక్కువగా ఉండటంవల్ల మా వాహనాలు పలుమార్లు ఇరుక్కుపోవడం జరిగింది. వాటిని మిలటరీ వాహనాలకు కట్టి తాళ్లతో బయటకు తీశారు. 210 కిలోమీటర్ల ప్రయాణించడానికి 13 గంటలు పట్టింది.

ఈ ప్రయాణం లేహ్‌ నుంచి సౌత్‌పుల్లు, కర్దుంగ్‌ లా పాస్‌, నార్త్‌పుల్లు, కర్దుంగ్‌ గ్రామం, సుముర్‌, పనమిక్‌, ససోమా, దర్శి గ్రామాల మీదుగా నుబ్రా లోయలోకి సాగుతోంది. నుబ్రాలోయ అందాలు ఎంత చూసినా తనివి తీరదు. ఒకవైపు ష్యోక్‌ నది, మరోవైపు పర్వతాలూ కొంతదూరం ఎడారి వాతావరణం కనువిందు చేస్తాయి.

సియాచెన్‌ బేస్‌క్యాంప్‌ను గ్లేషియర్‌ ముఖద్వారం వద్ద ఉన్న కొండల మధ్యలో నిర్మించారు. మేం అక్కడకు చేరుకునేసరికి విపరీతమైన చలి... బేస్‌క్యాంప్‌ నుబ్రా నది ఒడ్డున 12 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి ప్రయాణం మరింత కఠినంగా ఉంటుందని అర్థమైంది. అనుకున్నట్లుగానే సెప్టెంబరు 22-28 వరకూ ఇచ్చిన శిక్షణ చాలా కఠినంగా ఉంది. దీన్ని తట్టుకోవడం సాధారణ వ్యక్తులకు ఒకింత కష్టమే అయినా గ్లేషియర్‌కి వెళ్లాలనే కుతూహలం ప్రతి ఒక్కరినీ ఉత్సాహంగా పాల్గొనేలా చేసింది. బేస్‌ క్యాంప్‌ దగ్గరే ఖరీదైన మౌంటెనీరింగ్‌ పరికరాలు ఇచ్చారు. బూట్లు కనీసం మూడు కిలోల బరువు ఉన్నాయి. మంచుమీద నడవడానికి ఈ బూట్లకింద క్రాంపాన్లు ధరించాలి. అవి మరో అరకిలో బరువు. రెండో విడత శిక్షణ ఈ రకమైన సామగ్రికి అలవాటు పడ్డానికే ఉంటుంది. ఎత్తు ప్రదేశాల్లో వచ్చే వ్యాధుల గురించి డాక్టర్‌ వివరించారు. అవలాంచె వస్తే తప్పించుకునే పద్ధతి గురించీ అందులో తప్పిపోయినవాళ్లను వెతికే పద్ధతుల గురించీ వివరించారు. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ముందు ఎలాంటి బరువూ లేకుండా కొండ ఎక్కడం, దిగడం చేశాం. మూడోరోజు నుంచి పది కిలోల బరువుతో ఎక్కాల్సి వచ్చింది. కొండ దిగి రాగానే రాక్‌ క్రాఫ్టింగ్‌, ఐస్‌ క్రాఫ్టింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది చాలా క్లిష్టమైనది. వాలుల్లో మంచు దాటడానికి ఉపయోగపడుతుంది.

శీతాకాలంలో -60 డిగ్రీలు! 
సియాచెన్‌ గ్లేషియర్‌ దగ్గర ఏడాదిపొడవునా కాపలా ఉండాల్సిందే. ఏ క్షణాన ఏ ప్రమాదం ఎటునుంచి ముంచుకు వస్తుందో తెలియదు. ప్రత్యర్థులనుంచే కాదు, ప్రకృతి నుంచీ కావచ్చు. గాలులు గంటకి 125 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -60 డిగ్రీలకు పడిపోతుంటాయి. ఇక్కడ ప్రధాన శత్రువు ప్రకృతే. మంచువాన 30 అడుగుల మేర కురుస్తుంటుంది. రాత్రివేళ కురిసే మంచును ఇద్దరు వ్యక్తులు ఎప్పటికప్పుడు తీసేస్తుంటారు. లేదంటే అందులోనే కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఫ్రాస్ట్‌బైట్‌, స్నోబ్లైండ్‌నెస్‌, సెరిబ్రల్‌ ఈడెమా లాంటి వ్యాధులు వస్తాయి. రాత్రంతా సుఖంగా నిద్రపోవడం అరుదు. ఒక్కసారి మెలకువ వస్తే తిరిగి నిద్రపట్టదు. ఇక్కడ ఉండి తిరిగివెళ్లే సైనికులు కనీసం 15 శాతం బరువు కోల్పోతారు. మనకి నీళ్లు లేందే నిమిషం గడవదు. కానీ సియాచెన్‌లో నీళ్లే దొరకవు. మంచుని పగులకొట్టి వేడి చేసుకోవాల్సిందే. ఈ వేడి ఎక్కువసేపు ఉండదు. త్వరగా చల్లబడిపోతుంది. మళ్లీ మళ్లీ వేడిచేసుకోవాల్సిందే.

సెప్టెంబరు 30న మూడో విడత శిక్షణ కోసం నార్త్‌పుల్లు చేరుకున్నాం. ఇది 15,380 అడుగుల ఎత్తులో ఉంటుంది. బేస్‌క్యాంప్‌తో పోలిస్తే ఇక్కడ సౌకర్యాలు తక్కువే. గ్లేషియర్‌లోకి వెళ్లే సైనికులు కూడా శిక్షణ అనంతరం ఎత్తు ప్రదేశాల్లో అలవాటు పడ్డానికి ఇక్కడికి రావలసి ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. చలి కూడా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కూడా మరో నలుగురు వైద్యపరీక్షలు దాటలేకపోయారు. అక్టోబరు 3న తిరిగి బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నాం.

ఇరవై రోజుల నుంచీ ఆతృతగా ఎదురుచూసిన రోజు ఎట్టకేలకు వచ్చింది. పూర్తిస్థాయి ఆర్మీ దుస్తులు ధరించి గ్లేషియర్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యాం. గ్లేషియర్‌కి వెళ్లే ప్రతి సైనికుడూ అధికారులూ ముందుగా దర్శించుకునేది ఒ.పి బాబా మందిర్‌. దారిలో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా చూడమని కోరుకుంటారు. 1980లలో మాలాన్‌ పోస్ట్‌లో ఓం ప్రకాశ్‌ అనే సైనికుడు ఒంటరిగా పాక్‌ సైనికులతో పోరాడి అమరుడయ్యాడు. అప్పటినుంచి ఆయన్ని దేవుడిగా కొలుస్తారు.

ఎంత బరువైనా మోస్తారు..! 
గ్లేషియర్‌లో నడిచేటప్పుడు అందరూ రోప్‌-అప్‌ విధానంలో తాళ్లతో అనుసంధానించి వెళ్లాల్సి ఉంటుంది. మేం 24 మంది ఉన్నాం. 42 మంది పోర్టర్లూ నలుగురు అధికారులూ నలుగురు సైనికులూ, హాఫ్‌ లింక్‌ కమాండర్‌ (ఇతను సగం దారివరకూ పోర్టరు సాయంతో వస్తాడు. తరవాత మరో హాఫ్‌ లింక్‌ కమాండర్‌కి అప్పగిస్తాడు) మావెంట వచ్చారు. సియాచెన్‌లో కొందరు స్థానికులు పోర్టర్లుగా సైనికులతోబాటు తమ సేవలు అందిస్తున్నారు. ఇక్కడి వాతావరణం తట్టుకోవడం వీళ్లకి చాలా సులభం. మాతో వచ్చిన పోర్టర్లు కుమార్‌ పోస్టు వరకూ మా లగేజీ మెడికల్‌ కిట్లూ మిగిలిన సరంజామా అంతటినీ చేరవేశారు. ఎంత బరువుతోనైనా పరుగులాంటి నడక వీరి సొంతం.

బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్టు వరకూ మధ్యలో 3 ట్రాన్సిట్‌ క్యాంపులు ఉన్నాయి. గ్లేషియర్‌పైకి వెళ్లి తిరిగి వచ్చే సైనికులకు ఆహారపానీయాలు, రాత్రి బస ఏర్పాటు చేయడం వీళ్ల ముఖ్య ఉద్దేశం. సాధారణంగా ఇక్కడ నలుగురైదుగురు సైనికులూ వాళ్లకు సహాయ పోర్టర్లూ మాత్రమే ఉంటారు. సియాచెన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి మొదటి ట్రాన్సిట్‌ క్యాంప్‌కి 12 కి.మీ., అక్కడ నుంచి రెండో క్యాంప్‌కి 14 కి.మీ., మూడోక్యాంప్‌కి 16 కి.మీ., కుమార్‌ పోస్టుకి 18 కి.మీ. దూరం ఉంటుంది. బేస్‌క్యాంప్‌ నుంచి క్యాంప్‌-1కి మధ్యలో క్రేవేసెస్‌ ఎక్కువగా ఉన్నాయి. సుమారు 40-50 అడుగుల వెడల్పు ఉండే ఈ గుంతల్ని దాటడానికి నిచ్చెనలు వేశారు. వీటిని జాగ్రత్తగా దాటాల్సి వచ్చింది. తరవాత క్యాంప్‌-2 వరకూ ప్రయాణించాం. ఇందులో 6 కి.మీ. అచ్చంగా మంచుమీదే నడిచాం. మిగిలిన దారంతా పెద్ద పెద్ద రాళ్ల మధ్యే నడవాల్సి వచ్చింది. తెచ్చుకున్న నీళ్లు త్వరగా అయిపోయి విపరీతంగా అలసిపోయేవాళ్లం.

క్యాంప్‌-2 నుంచి క్యాంప్‌-3 వరకూ ఉన్న దారి ఏటవాలుగా ఉంది. ఎంత నడిచినా తరగదు. క్యాంప్‌-3 నుంచి కుమార్‌ పోస్టు దూరం ఎక్కువైనా మిగతా దారులతో పోలిస్తే ఒకింత సులువే. కుమార్‌ పోస్టు దగ్గర నుంచి సియాచెన్‌ గ్లేషియర్‌ను ఆసాంతం ఆస్వాదించి వెనుతిరిగాం. ఈ మూడు క్యాంపుల్లో మాకోసం విడిగా టెంట్‌లు ఏర్పాటుచేశారు. రుచికరమైన భోజనం పెట్టారు.

పోస్టుల్లో ఉండే సైనికులు పెరిగిన గడ్డాలతో నలుపురంగులోకి మారిన దుస్తులతో ఖైదీల్లా కనిపిస్తారు. తమ కుటుంబాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్లు ప్రతి పనీ తామే చేసుకుంటారు. పర్వతాలు అన్నీ నేర్పిస్తాయన్నది నిజం. అక్టోబరు 12న తిరిగి బేస్‌క్యాంప్‌నకు చేరుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పి మాకు ఇచ్చిన పర్వతారోహణ సామగ్రి తిరిగి ఇచ్చి 13న లేహ్‌కి తిరిగి చేరుకున్నాం. 14న మాకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. నెలరోజుల తరవాత లేహ్‌ విమానాశ్రయంలో తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.