close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రహమాన్‌ ఆశ... ‘సన్‌షైన్‌’

రహమాన్‌ ఆశ... ‘సన్‌షైన్‌’

చిన్ని చిన్ని ఆశ... అంటూ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఏ.ఆర్‌.రహమాన్‌ పాతికేళ్లుగా తన ఆశల్ని నిజం చేసుకుంటూ వస్తున్నారు. రెండు ఆస్కార్‌లనూ నాలుగు జాతీయ అవార్డుల్నీ సొంతం చేసుకున్న రహమాన్‌ మనసులో చిగురించిన మరో ఆశ... ‘సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా’.

హమాన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారంటే దాని వెనుక ఆయన బృందంలోని మిగతా వాద్యకారుల పాత్ర కూడా ఉంటుంది. ఆ బృందంలోని భారతీయ వాద్యకారుల్లో చాలామంది 50-60 ఏళ్లు నిండినవాళ్లే తప్ప, యువకులు లేరు. అంటే యువతరం అటువైపు వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదన్నమాట. ఇదే విషయం రహమాన్‌ని ఆలోచింపజేసింది. దానికో పరిష్కారం వెదకాలనుకున్నారాయన. 2008లో రహమాన్‌ ‘కేఎమ్‌ కన్జర్వేటరీ’ని ప్రారంభించడం వెనుక కారణం కూడా ఇదే. అయితే, అందులో చేరుతున్నవారిలో చాలామంది పియానో లేదా గాత్రానికి సంబంధించిన కోర్సులనే ఇష్టపడుతున్నారు ఎవరూ ‘వయొలిన్‌’, ‘సెలో’ కోర్సుల్లో చేరడంలేదు. సంగీతంలో ఈ వాద్యాలు ఎంతో కీలకం. అందుకే కొన్నిసార్లు ఈ విభాగాలకు చెందిన విదేశీ కళాకారుల్ని పిలిపించుకునేవారు. ‘తీగలతో కూడిన వాద్య పరికరాలను నేర్చుకోవడం కష్టమైన పని. ఎంతో అంకితభావం ఉండాలి. అందుకే వాటిపై తక్కువ ఆసక్తి చూపుతారు. ఆ కారణంగానే, ఈ వాద్య పరికరాలను నేర్చుకునేవారికి ఉచిత శిక్షణ ఇవ్వాలనుకున్నాను. అది కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకి మాత్రమే’ అని చెబుతారు రహమాన్‌.

  స్కూల్‌ విద్యార్థులతో...
తన కొత్త ప్రాజెక్టుకి రహమాన్‌ పెట్టిన పేరు ‘సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా’. దీనికోసం మొదట చెన్నైలోని తన ఇంటికి దగ్గర్లోని ఎంజీఆర్‌ ఉన్నత పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ఆ స్కూల్‌ నుంచి కొందరు పిల్లలు ఆసక్తి చూపారు. వారి నుంచి మొదటిదశలో 12 మంది విద్యార్థుల్ని ఎంపికచేశారు. అంతా 10-13 ఏళ్ల మధ్య వారే. తర్వాత మిగతా కార్పొరేషన్‌ పాఠశాలల పిల్లల్నీ తీసుకోవడం మొదలుపెట్టారు. వీరంతా రోజూ ఉదయం ఏడు గంటలకు సంగీతం క్లాసుకు వచ్చేవారు. వీరికి టిఫిన్‌ కూడా రహమాన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసేది. రెండు గంటల సంగీత పాఠాల తర్వాత స్కూల్‌కి వెళ్లేవారు. నాలుగేళ్ల తర్వాత ఒకరోజు రహమాన్‌ పిల్లల సామర్థ్యాన్ని పరీక్షించి చూస్తే, వారు నేర్చుకున్నది అంతంత మాత్రమే... ‘నేను చాలా అసంతృప్తికి లోనయ్యాను. అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నప్పటికీ ఏదో లోపం ఉందనిపించింది. అది గురు శిష్యుల మధ్య బంధం ఏర్పడకపోవడమేనని కొద్దిరోజులకు తెలుసుకున్నాను’ అంటారు రహమాన్‌. అందుకు కారణం అక్కడ పాఠాలు చెబుతున్నవారిలో చాలామంది విదేశీయులు. వారంతా అద్భుతమైన వాద్యకారులే కానీ, విద్యార్థులకీ వారికీ మధ్య భాష, సంస్కృతి పరమైన అంశాల్లో బేధాలుండేవి. అప్పుడు రహమాన్‌ తనతో చాలా కాలం నుంచి పనిచేస్తున్న సీనియర్‌ వయొలినిస్ట్‌, ఆర్కెస్ట్రా నిర్వాహకుడు... శ్రీనివాస్‌ మూర్తికి శిక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలల్లోనే విద్యార్థుల్లో మార్పు వచ్చింది. గురుశిష్యుల మధ్య బంధం మెరుగుపడటమే దీనికి కారణం.

పదేళ్ల ప్రాజెక్టు...
టైలరింగ్‌ చేస్తూనో, టీ దుకాణం నడుపుతూనో, కుటుంబాన్ని పోషిస్తున్న తల్లిదండ్రుల పిల్లలే సన్‌షైన్‌ ఆర్కెస్ట్రాలో ఎక్కువగా కనిపిస్తారు. చాలామంది విద్యార్థులు పన్నెండో తరగతి తర్వాత తమ సమయాన్ని పూర్తిగా సంగీతానికే కేటాయిస్తున్నారు. చదువూ ఉండాలనుకునేవారు మాత్రం దూరవిద్యలో డిగ్రీ చేస్తున్నారు. పదో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకున్న బాలాజీ ‘సెలో’ నేర్చుకుంటున్నాడు. తన భవిష్యత్తు సంగీతంతోనేనని చెబుతాడు. ‘అందరూ ఇంజినీర్లూ, డాక్టర్లే ఎందుకు అవ్వాలి’ అంటారు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలాజీ తండ్రి మనోహరన్‌. ‘ఒకరోజు మా క్లాసు టీచర్‌ వచ్చి రహమాన్‌ స్టూడియోకి తీసుకువెళ్లారు. నాకు మొదట్లో చదువుకోవాలనీ పెద్ద ఉద్యోగం చేయాలనీ ఉండేది. కానీ ఇలాంటి అవకాశం ఎంత మందికి వస్తుంది. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతం తర్వాతే చదువు’ అని చెబుతుంది 17 ఏళ్ల జయమాలిని. పన్నెండు మందితో కూడిన సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా సీనియర్‌ బ్యాచ్‌లో ఈమె ఒకరు. ఈ బ్యాచ్‌ సభ్యులు ఇప్పటికే చాలా కచేరీలు ఇచ్చారు. వీరిలో పది మంది రహమాన్‌తోపాటు సంగీత వేదికల్ని పంచుకున్నారు కూడా! ‘లింగా’ సహా వివిధసినిమాలకూ పనిచేశారు. మరో రెండేళ్లలో సీనియర్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఇతర సంగీత దర్శకుల దగ్గరా అవకాశాలు పొందగలరని చెబుతారు మూర్తి. ఆర్కెస్ట్రాలో చేరిన సభ్యులకు 10-15 ఏళ్లపాటు ఉచితంగా సంగీతం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ కోసం రహమాన్‌ ఫౌండేషన్‌ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. లక్షల జీతాలు చెల్లిస్తూ దేశవిదేశాలకు చెందిన శిక్షకుల్ని పెడుతోంది. స్కూల్లో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల్ని విదేశాల్లోనూ శిక్షణకు పంపిస్తున్నారు. సీనియర్‌ బ్యాచ్‌లో ఉన్నవారికి వారు నేర్చుకుంటున్న వాద్య పరికరాలతోపాటు ఒక స్మార్ట్‌ఫోన్‌నీ, ల్యాప్‌టాప్‌నీ ఫౌండేషన్‌ అందించింది. ఇప్పటివరకూ దాదాపు 80 మంది విద్యార్థులు ఈ సంగీత శిక్షణకు ఎంపికయ్యారు. దేశంలోని ప్రతి నగరంలోనూ సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా బృందాల్ని తయారుచేయడం, ఆ బృందాల్ని ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు ఇచ్చేలా తీర్చిదిద్దడం తన ఆశగా చెబుతారు రహమాన్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.