close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిచ్చర పిడుగులు వస్తున్నారు!

చిచ్చర పిడుగులు వస్తున్నారు!

బ్యాడ్మింటన్‌లో సైనా షాట్లు తెలుసు. మరి సిరిల్‌ మెరుపుల సంగతేంటి? క్రికెట్‌లో ధోనీ ఉతుకుడు పరిచయమే. మరి సర్ఫరాజ్‌ ఖాన్‌ కొట్టుడు విషయమేంటి? టెన్నిస్‌లో సానియా సూపర్‌ స్టారే. మరి ప్రాంజల మాటేంటి? అంతర్జాతీయ క్రీడాకారులుగా అందరి అభిమానాన్నీ అందుకుంటోన్న వాళ్లే కాదు, ఆ స్థాయికి ఒకట్రెండు అడుగుల దూరంలో ఉండి మన దేశ కీర్తి పతాకను ప్రపంచ స్థాయిలో రెపరెపలాడిస్తున్నవాళ్లూ ఉన్నారు. వాళ్లలో తెలుగు తేజాలే ఎక్కువ.

నంబర్‌ వన్‌

  సైనా, సింధూ, శ్రీకాంత్‌ లాంటి బ్యాడ్మింటన్‌ స్టార్ల తరవాత గోపీచంద్‌ అకాడమీ నుంచి దూసుకొస్తోన్న మరో చిచ్చరపిడుగు సిరిల్‌ వర్మ. పదిహేడేళ్ల సిరిల్‌ మూడేళ్ల క్రితం జరిగిన ఏషియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌ ద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తన ముద్ర వేశాడు. టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకొని ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఈ మధ్యే జరిగిన బ్యాడ్మింటన్‌ జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకుని దేశంలోని మేటి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల సరసన చేరాడు. ప్రస్తుతం ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానం సిరిల్‌దే. ఇదే ఫామ్‌ కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికే ఓ మంచి క్రీడాకారుడు గ్యారంటీ.

మైదానంలో చిచ్చరపిడుగు

   వండర్‌ బాయ్‌... విరాట్‌ కోహ్లి సర్ఫరాజ్‌ ఖాన్‌కి పెట్టిన పేరిది. టీనేజ్‌ కూడా దాటని ఈ కుర్రాడు, దేశవాళీ క్రికెట్‌లో చుక్కలు చూపిస్తున్నాడు. పదిహేనేళ్ల వయసులోనే అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడిన సర్ఫరాజ్‌ జట్టును ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. పదహారేళ్ల వయసులో ఐపీఎల్‌లో యాభై లక్షల రూపాయలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టుకు ఎంపికై, అత్యంత పిన్న వయసు ఐపీఎల్‌ ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతోన్న అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోన్న అతడు త్వరలోనే భారత జట్టు తలుపూ తడతాడన్నది విశ్లేషకుల మాట.

టీటీలో మేటి!

మూడేళ్ల క్రితం జరిగిన దక్షిణాసియా జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ఎంపికైన ఏకైక తెలుగమ్మాయిగా పేరు తెచ్చుకుంది ఆకుల శ్రీజ. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో చాలా టైటిల్స్‌ గెలుచుకుంది. హైదరాబాద్‌లోని గ్లోబల్‌ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ పొందుతోన్న ఈ అమ్మాయి ఈమధ్య జరిగిన జాతీయ టీటీ టోర్నీలో మూడు బంగారు పతకాలు నెగ్గింది. మూడు నెలల క్రితం క్రొయేషియా ఓపెన్‌లోనూ భారత్‌ సాధించిన మూడు కాంస్య పతకాల్లో భాగం పంచుకుంది. ప్రస్తుతం అండర్‌ 21 విభాగంలో దూసుకెళ్తొన్న శ్రీజ భారత టీటీ స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తోంది.

ఒలింపిక్స్‌లో పోటీ

  చెయిన్‌ సింగ్‌... అభినవ్‌ బింద్రా, గగన్‌ నారంగ్‌ల తరవాత ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న క్రీడాకారుడిగా ఈ కుర్రాడు పేరు తెచ్చుకున్నాడు. గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఏషియన్‌ గేమ్స్‌లోనూ కాంస్య పతకాల్ని అందుకున్న సింగ్‌ ఏడాదిగా నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్నాడు. ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పోటీ పడటానికి ఇప్పటికే చోటు ఖాయం చేసుకున్నాడు.

‘బంగారు’ బుల్లోడు

రాగాల వెంకట్‌ రాహుల్‌... యూత్‌ ఒలింపిక్స్‌లో జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించిన తెలుగు తేజం. చైనాలో జరిగిన ఏషియన్‌ యూత్‌ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన ఈ గుంటూరు కుర్రాడు, యూత్‌ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని భారత ప్రతిష్ఠను పెంచాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు నలభై బంగారు పతకాలు గెలుచుకున్న రాహుల్‌, రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పంట పండించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.

రింగ్‌లో కింగ్‌

  బాక్సింగ్‌ రింగ్‌లో ఇటీవలి కాలంలో సంచలనాలు సృష్టిస్తోన్న క్రీడాకారుడు శివ థాపా. 22 ఏళ్ల ఈ కుర్రాడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేందర్‌ సింగ్‌, వికాస్‌ కృష్ణల తరవాత కాంస్య పతకం అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఏషియన్‌ జూనియర్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని అందుకున్న శివ, ఈ ఏడాది ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. గతేడాది ప్రపంచ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ టూగా నిలిచి, భారత్‌ ఆశారేఖగా మారాడు.

గ్రాండ్‌ స్లామే లక్ష్యంగా...

  భారత టెన్నిస్‌ని ప్రపంచ స్థాయికి చేర్చిన హైదరాబాదీ సానియా మీర్జా. అదే బాటలో నడుస్తోన్న తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల. ఆరేళ్ల వయసులోనే రాకెట్‌ పట్టి జూనియర్‌ టెన్నిస్‌లో దూసుకెళ్తొన్న ఈ యువ క్రీడాకారిణి ఆ విభాగంలో ప్రపంచ టాప్‌-20లో కొనసాగుతోంది. గతేడాది జూనియర్‌ డబుల్స్‌లో ‘ఆరెంజ్‌ బౌల్‌’ టైటిల్‌ను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇటీవల ఏషియన్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లలో సింగిల్స్‌, డబుల్స్‌ టైటిల్స్‌నీ చేజిక్కించుకుంది. ఐటీఎఫ్‌ టోర్నీలలో సత్తా చాటుతున్న ప్రాంజల, గ్రాండ్‌ స్లామ్‌లో ఆడటమే లక్ష్యం అంటోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.