close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీలకంఠుడికి... నెలరోజుల జాతర!

నీలకంఠుడికి... నెలరోజుల జాతర!

ఏ జాతర అయినా, ఒకరోజో రెండ్రోజులో జరుగుతుంది. మహా అయితే పక్షం రోజులు నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం మాత్రం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఈ నెలంతా బంధుమిత్రులతో, అతిథులతో పట్టణం కళకళలాడిపోతుంది.

ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి. ఏటా పుష్యమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. చుట్టుపక్కల సుమారు ఎనభై గ్రామాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే జాతర ఇది. ఆడపిల్లలకు బట్టలు పెట్టాలన్నా, బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేయాలన్నా, పాడి పశువులు కొనాలన్నా, జోడెడ్లు బేరం చేయాలన్నా, వ్యవసాయ పనిముట్లు చేయించుకోవాలన్నా...ఇదే శుభ సమయమని భావిస్తారు. అటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు ప్రాంతాల నుంచీ ఇటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు.

అనగనగా...
కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఎమ్మిగనూరు ఒకటి. ఒకప్పుడు ఇదో కుగ్రామం, చేయితిరిగిన చేనేతకారులకు చిరునామా. నీలకంఠేశ్వరుడి మీద భక్తితో నేతకార్మికులంతా కలసి కాశీ నుంచి ఎడ్లబండి మీద లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతారు. అప్పట్లో ఓ రైతు పొలంలో తవ్వుతుండగా శివలింగం బయటపడిందనీ, అదే నీలకంఠేశ్వరుడిగా పూజలందుకుంటోందనీ మరో ఐతిహ్యం. స్వామి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తిని పాలిస్తున్న సంస్థానాధీశులకు ఎమ్మిగనూరు చేనేతలంటే మహా మక్కువ. అలా పాలకులు కూడా నీలకంఠేశ్వరుడికి దాసానుదాసులైపోయారు. మెల్లగా రథోత్సవ సంప్రదాయమూ మొదలైంది. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తుతో స్వామి రథాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. పురాణ గాథలకు సంబంధించిన బొమ్మలతో మహాగంభీరంగా దర్శనం ఇస్తుందీ తేరు. దీన్ని తయారు చేసేందుకు సుమారు ఏడాదికాలం పట్టిందని చెబుతారు.

ఘనంగా రథోత్సవం...
జనవరి 24న నీలకంఠేశ్వరుడి ఆలయంలో జరిగే శివపార్వతుల కల్యాణంలో...పార్వతీదేవి తరఫున బండ వంశీకులూ పరమేశ్వరుడి తరఫున గడిగె వంశీకులూ పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. మహారథోత్సవం నాడు (జనవరి 26) పార్వతీపరమేశ్వరులను రథంలో కూర్చోబెట్టి తేరుబజారు వీధిలో ఘనంగా వూరేగిస్తారు. ఆ సమయానికి లక్షలమంది భక్తులు పోగవుతారు. జయజయధ్వానాలతో రథాన్ని లాగుతారు. ఇక, నాటి నుంచీ నెల రోజుల పాటూ నిత్యోత్సవమే! తేరుబజారు ప్రాంతం బహిరంగ షాపింగ్‌మాల్‌లా మారిపోతుంది. మట్టి గాజుల నుంచి గృహోపకరణాల దాకా జాతరలో దొరకని వస్తువంటూ ఉండదు. నవదంపతులు కొత్త కాపురానికి అవసరమైన సామగ్రిని జాతరలోనే కొనుక్కోవడం ఓ ఆచారం. ఎద్దుల సంత ఈ జాతర ప్రత్యేకత. ఒంగోలు గిత్తలూ దేశవాళీ పశువులూ అమ్మకానికి ఉంటాయి. బండ్లూ నాగళ్లూ వగైరా వ్యవసాయ సామగ్రిని కూడా విక్రయిస్తారు. జాతర రోజుల్లో ‘గయోపాఖ్యానం’, ‘కురుక్షేత్రం’ తదితర పౌరాణిక నాటకాల ప్రదర్శనా ఉంటుంది. ‘అదిగో ద్వారకా....’, ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ - తదితర పద్యాలు రంగస్థల వేదికల మీద మారుమోగిపోతాయి. రాష్ట్రస్థాయి ఎద్దుల బలప్రదర్శన పోటీలు నాలుగురోజుల పాటు వైభవంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచీ వచ్చిన ఎద్దులు పోటీలో పాల్గొంటాయి. ప్ర¾భుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో అంతర్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరుగుతుంది. కబడ్డీ, వాలీబాల్‌ పోటీలూ నిర్వహిస్తారు.

నాటి ఎనమలూరే...
నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలసిన ప్రాంతాన్ని ఒకనాడు ఎనమలూరుగా పిలిచేవారు. పూర్వం ఈ వూరి సంతలో ఎనుములను (గేదెలు) భారీగా విక్రయించేవారు. లావాదేవీల కోసం కర్నూలు, వనపర్తి, గద్వాల, కంప్లీ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికొచ్చేవారు. అలా ఎనమలూరు అన్న పేరు స్థిరపడిపోయిందంటారు. హెమ్మె అంటే .. కన్నడంలో గర్వం. విజయనగర గజపతులను ఓడించిన కృష్ణదేవరాయలు జైత్రయాత్రను కొనసాగిస్తూ... ఎమ్మిగనూరు సమీపంలో కొంతకాలం విడిది చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే తనలోని అహాన్ని తొలగించమంటూ పరమశివుడిని ఉద్దేశించి ఓ యాగం నిర్వహించాడని చెబుతారు. స్థల మహత్యం వల్లా కావచ్చు... రాయలలోని గర్వం నశించిపోయింది. రాయలవారి అహాన్ని కరిగించిన వూరు కాబట్టి.. ఆ పల్లె హెమ్మెగనూరుగా, ఎమ్మిగనూరుగా ప్రఖ్యాతమైందని చరిత్రకారుల అభిప్రాయం. రాయలవారికి తన తల్లి అంటే మహా గౌరవం. చంద్రగిరి దగ్గర ఆమె పేరుతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అచ్చంగా అలాంటిదే మరో గ్రామాన్ని... ఎమ్మిగనూరు ప్రాంతంలోనూ నిర్మించాడు. ఈ పల్లె పేరు కూడా నాగలాపురమే. రాయలు ప్రత్యేక శ్రద్ధతో దీన్నో వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాడు. అప్పట్లో ఇక్కడ భారీ స్థాయిలో ఏనుగులూ గుర్రాల సంత జరిగేదట. దీంతో, నాగలాపురం కాస్తా సంత నాగలాపురంగా స్థిరపడింది. సంతకొచ్చే మూగజీవాల కోసం రాయలవారు ఓ చెరువునూ తవ్వించారు. ఇష్టదైవమైన చెన్నకేశవస్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఆ శాసనాలు దర్శనమిస్తాయి.

చుట్టుపక్కల గ్రామాల్లో ముఠా తగాదాలు రాజ్యమేలిన రోజుల్లోనూ, జిల్లాలో రక్తం ఏరులై ప్రవహించిన సమయంలోనూ ఎమ్మిగనూరులో ప్రశాంతత రాజ్యమేలింది. ఇక్కడి ప్రజలు స్వతహాగా శాంతి ప్రియులు. ఇదంతా రాయలవారి యజ్ఞ మహత్యమేనని చెబుతారు.

- యు.రామకృష్ణ, న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.