close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తపోవనం... ఓ సేవాలయం!

తపోవనం... ఓ సేవాలయం!

కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని ప్రకృతి ఒడిలో మూడున్నర ఎకరాల స్థలం... ఆ జాగాని స్థిరాస్తి వ్యాపారులు చూసుంటే ఇళ్ల స్థలాలుగా మార్చి మంచి లాభానికి అమ్మేసేవారే. ఎవరైనా శ్రీమంతుల కంటపడితే ఫామ్‌హౌజ్‌గా మారేదేమో. కానీ అది ఓ మనసున్న వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది, అందుకే అక్కడో ఆశ్రమం వెలిసింది!

కొండల అంచునున్న ఆ విశాలమైన ప్రదేశంలో ఏపుగా పెరిగిన వృక్షాలూ, పూల మొక్కలూ, పండ్ల చెట్లూ వాటి మధ్యలో ఖజానా బాతులూ, పర్ణశాలలను పోలిన నిర్మాణాలూ... ఆ వాతావరణం అచ్చంగా ఓ గురుకులాన్ని తలపిస్తుంది. కానీ, లోపలికి వెళ్లి చూస్తే వయోధికులు కనిపిస్తారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారూ, మతి స్థిమితంలేనివారూ, పూర్తిగా మంచానికే పరిమితమైనవారూ అంతా కలిసి ఓ 30 మంది వరకూ ఉంటారు. అలాంటివారికోసం ఏర్పాటుచేసిందే... ‘పరమాత్మ తపోవనాశ్రమం’. దీన్ని ప్రారంభించింది కడప నగర పోలీసు విభాగంలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న మలిశెట్టి వెంకటరమణ. పూర్వీకుల ఆస్తి నుంచి తనకు అందిన రూ.50లక్షలకు తోడు పైసా పైసా కూడబెట్టి పొదుపుచేసుకున్న రూ.10 లక్షలూ, మిత్రులు అందించిన రూ.20 లక్షలూ కలిపి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారాయన.

ఎప్పటికీ ఆశ్రమమే...
2011లో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో నిర్వాహకులూ, వృద్ధులూ ఉండేందుకు మూడు చిన్న చిన్న భవనాల్ని నిర్మించారు. వాటికి తోడు వంటశాల, పశువుల కొట్టాం, పర్ణశాల ఉంటాయి. మొక్కల పెంపకానికి వీలుగా అక్కడక్కడా నీటి పంపుల్నీ, పక్షుల కోసం చిన్న నీటి తొట్టెల్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడ కాసే ప్రతి కాయా, పండే ప్రతి ఫలమూ, పశువులు ఇచ్చే పాలు ఆశ్రమ వాసులకే. వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యాన్ని వెంకటరమణ అందిస్తారు. అప్పుడప్పుడూ బయట నుంచి వైద్యులు వచ్చి సేవలు అందిస్తారు. ‘నా జీతం రూ.45వేలలో కుటుంబ పోషణకు రూ.15వేలు సరిపోతుంది. మిగిలిన డబ్బు ఆశ్రమ నిర్వహణకు వెచ్చిస్తున్నాను’ అంటారు రమణ. ఆశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్ని చూసి సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ లెక్కల్ని పక్కాగా రాసి ఉంచుతారు. ఆశ్రమంలోని పచ్చదనాన్ని చూసిన ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థవారు రూ.2కోట్లు పెట్టి ఆ స్థలాన్ని కొనడానికి ముందుకు వచ్చారు. రమణ వారి ప్రతిపాదనను తిరస్కరించారు. ‘భవిష్యత్తులో మనసు మారితే’ అన్న ఆలోచన వచ్చి ఆ మర్నాడే ఆశ్రమ ఆస్తిని ‘పరమాత్మ తపోవనాశ్రమ ట్రస్టు’ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆశ్రమ ఆస్తుల్ని ఎవరూ విక్రయించడానికి వీలులేని విధంగా నిబంధన పెట్టారు. తన తర్వాత నిర్వహణకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆశ్రమంలో శ్రీగంధం చెట్లు నాటించారు. ‘భవిష్యత్తులో వాటిని అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. దాన్ని బ్యాంకులో పొదుపు చేయగా వచ్చే వడ్డీతో ఆశ్రమ నిర్వహణ’ అని చెబుతారు రమణ.

కాశీలో పిండ ప్రదానం...
తపోవనాశ్రమం ప్రారంభంకంటే ముందు, దాదాపు రెండు దశాబ్దాలుగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు వెంకటరమణ. 1993లో ఓసారి వృత్తిలో భాగంగా ఒక శవాన్ని చెరువులోంచి బయటికి తీయించి పంచనామా చేయించారు. ఆ శవాన్ని తీసుకువెళ్లేవారెవరూ 

లేకపోవడంతో గ్రామ నౌకరుతో కలిసి ఖననం చేశారు. ఆ తర్వాత ఒక సాధువుకు అంతిమ సంస్కారం జరిపేందుకు రమణ పూనుకోగా స్థానికులూ ముందుకు వచ్చారు. అప్పటి నుంచీ ప్రమాదాల్లో మరణించిన అనాథలూ, యాచకులూ, గుర్తు తెలియని శవాలెన్నింటికో అంతిమ సంస్కారాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ మిత్రబృందంతో కలిసి 400లకు పైగా శవాలకు దహన సంస్కారాలు చేపట్టానంటారు రమణ. అంతిమ సంస్కారం జరపడమే కాకుండా, బిడ్డలు తమ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేసినట్టే వారందరికీ వారణాసిలో పిండ ప్రదానం చేస్తున్నారు. తాను చేస్తున్న పనికి కుటుంబ సభ్యులూ అర్థంచేసుకొని సహకరిస్తున్నారనీ చెబుతారు రమణ. పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌ ఓసారి తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ రమణను ప్రశంసించారు.

ఆదిశంకరాచార్యుల శివానందలహరి, భగవద్గీత, వివేకానందుని రచనలు తనలో స్వార్థం తాలూకు ఆలోచనల్ని తగ్గించి, తనని సమాజానికి ఉపయోగపడే సాధనంగా మలిచాయని చెబుతారు రమణ. వృద్ధులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాసరే వారిని పితృదేవతల రూపాలుగానే భావించి సేవ చేస్తానని చెబుతారు. రమణ కూతురూ, కొడుకూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. తాను చేసే సేవలే తన కుటుంబానికి శ్రీరామ రక్షగా నిలిచాయనేది రమణ ప్రగాఢ విశ్వాసం!

- పసల జోజయ్య, కడప డెస్క్‌ ఫొటోలు: నాయుడు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.