close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వెనక్కి చూచి ముందుకెళ్ళు

వెనక్కి చూచి ముందుకెళ్ళు

- జయంతి వెంకటరమణ

ఉదయం ఎనిమిది గంటల వేళ - రావలసిన టైముకే వచ్చాడు గోవిందు. ‘‘అదిగో వచ్చాడు, మీ కాబులీవాలా’’ అంటూ మూతి మూడు వంకర్లు తిప్పి లోపలికి వెళ్ళిపోయింది మా శ్రీమతి మాలతి.

‘‘నమస్తే సారూ!’’ అంటూ గడపెక్కాడు గోవిందు.

‘‘రా రా గోవిందు... నీకోసమే ఎదురుచూస్తున్నా’’ అంటూ ఇంట్లోకి వెళ్ళి బీరువా తీస్తూంటే-

‘‘ఇంకా ఎంతివ్వాలి?’’ అంది మాలతి నా దగ్గరకొచ్చి.

‘‘గోవిందు వెళ్ళనీ, చెప్తా’’ అంటూ క్యాష్‌ పట్టుకుని వీధి అరుగు మీదికొచ్చాను.

గోవిందు ఇంకా నిలబడే ఉన్నాడు. గోవిందు అంతే... నేనంటే గౌరవం. అవకాశం వచ్చిందని మా ఆఫీసులో ఉద్యోగం వేయించిన కృతజ్ఞత అది. అందుకే నాకు తక్కువ వడ్డీకే అప్పు ఇస్తాడు. నేనిచ్చింది తీసుకుని అసలూ, వడ్డీ లెక్క రాసి పుస్తకం నాముందు పెట్టాడు.

గోవిందు వెళ్ళిన తరవాత ‘‘ఇప్పుడు చెప్పండి’’ అంది మాలతి.

‘‘యాభై´!’’ అన్నాను.

‘‘యాభై వేలే! ఈ అప్పు ఎప్పటికి తీరేను’’ అంది బెదురుగా.

తీరుతుందిలే అన్నా మాలతి వదల్లేదు. ‘‘అయినా ఎందుకింత అప్పు చేశారు?’’ అడిగింది.

‘‘నీకు తెలియదా, మన బాబీగాడిని కాలేజీలో చేర్పించటానికి అప్పు చేశామని. వీడికి వచ్చిన టెన్తు మార్కులకి, ఏ గవర్నమెంటు కాలేజీలో సీటు రాకపోతే కార్పొరేట్‌ కాలేజీలోనూ చేర్పించడానికి అప్పు చేశామని తెలీదా? పిల్లవాడిని గాలికి వదిలేయలేక.’’

‘‘అంతా తెలుసు. కానీ, గెజిటెడ్‌ ఆఫీసరైన మీకు అప్పు చేసే అవసరమేమొచ్చింది?’’

‘‘గెజిటెడ్‌ అయినంత మాత్రాన జీతం లక్షల్లో ఉండదు. పై ఆదాయానికి ఆశపడే మనిషిని కాననీ నీకు తెలుసు. ఇంటి ఖర్చులెలా ఉన్నాయో నీకు తెలీదా?’’

‘‘మీ జీతం లక్షల్లో ఉందని నేననలేదు. పైఆదాయానికి ఆశపడమనీ అనలేదు. వచ్చే జీతంతో మనమెందుకు సరిపెట్టుకోలేకపోతున్నాం. ఒక వస్తువు కొనుక్కున్నట్టు లేదు, ఒక నగ చేయించుకున్నట్టు లేదు - పైగా ఈ అప్పులు..?’’

‘‘నిజమే. నిత్యావసరాల ధరలెలా ఉన్నాయో చూస్తున్నావా? అన్నీ నెలనెలా పెరుగుతున్నాయి.’’

‘‘ధరలు మనకే కాదు, అందరికీ పెరుగుతున్నాయి. మీతోటి జీతగాడే ‘త్రిమూర్తులు’. అతనికెందుకు లేవు అప్పులు. మన పెద్దవాడికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా, ఇంజినీరింగ్‌ కోర్సుకి పంపలేక బీఎస్సీలో చేర్పించాం. త్రిమూర్తులు చక్కగా కొడుకుని ఇంజినీరింగ్‌లో చేర్పించగలిగాడు. మనవాడు మనసులో ఏడ్చుకున్నాడేగానీ నోరెత్తలేదు. అప్పుడే పెద్దమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని, తొందరపడి పెళ్ళి చేశాం. వాడి చదువుకని పెట్టిన పీఎఫ్‌ లోను అలా ఖర్చయింది.’’

‘‘మరి అది పొరపాటు కాదా? మీ నాన్న పెళ్ళి ఖర్చు అంతా తానే పెట్టుకుంటానని అన్నాడని పెళ్ళికి దిగాం. అప్పటికీ మా నాన్నగారు ‘చిన్నపిల్లకి పెళ్ళేమిటిరా’ అన్నా మనం వినలేదు. పైగా తానెక్కడ డబ్బు పెట్టవలసి వస్తుందోనని అలా వెనక్కి లాగుతున్నాడని వ్యాఖ్యానించావు. పెళ్ళి చేసిన గొప్ప మీ నాన్నకి దక్కిందేమోగానీ, పీఎఫ్‌ సొమ్ము కాస్తా పెళ్ళికి ఖర్చు అవనే అయింది.’’

‘‘ఆ పొరపాటు మనం దిద్దుకోవడం కుదరనే లేదు, మళ్ళీ ఈ గోవిందు దగ్గర అప్పు. మనం ఈ అప్పుల వూబి నుండి ఎప్పుడు బయటపడతామో నాకర్థం కావటం లేదు’’ అంది నిర్వేదంగా.

‘‘గత జలసేతుబంధనం వల్ల ప్రయోజనముంటుందా? అప్పులు నెమ్మదిగా తీరిపోతాయి. ఉండిపోవు. ఆ ఏడుకొండలవాడే అప్పు చేశాడు, ఇక మనమెంత?’’ అన్నా మాలతిని నవ్వించాలని.

‘‘ఆయన చేసిన అప్పులు తీర్చడానికి భక్తులున్నారు. మనకెవరున్నారు?’’

‘‘ఆ ఏడుకొండలవాడే!’’

‘‘ఆహా! ‘మీరు అప్పులు చేస్తూండండి, నేను తీరుస్తూ ఉంటాను’ అని స్వామి అన్నాడా, అంటాడా?’’

‘‘అయితే ఏం చేద్దాం?’’ అడిగాను.

‘‘నా గాజుల జత బ్యాంకులో పెట్టి గోవిందు అప్పు తీర్చేయండి.’’

‘‘మళ్ళీ అప్పేగా. గోవిందు అయితే ప్రతి నెలా జీతం రాగానే మన గడపలో కూర్చుని అసలూ, వడ్డీ తీసుకెళ్తున్నాడు. కాబట్టి నెమ్మదిగానైనా అప్పు తీరుతుంది. అదే బ్యాంకులో అయితే ‘తీర్చొచ్చులే’ అని ధీమా వచ్చి వెనక్కి పెడతాం. సమయానికి ఆ అప్పు తీర్చలేం. గాజులు బ్యాంకువాళ్ళవయిపోతాయి. అప్పు అప్పుగానే ఉంటుంది. నీ చేతులు బోసిగా ఉండిపోతాయి’’ వివరించి చెప్పాను.

‘‘గోవిందు అప్పు తీరుస్తున్నట్టు, బ్యాంకు అప్పు తీర్చలేమని మీకు అధైర్యమయితే ఓ పని చేయండి... గాజులు అమ్మేయండి. బంగారం అవసరానికికాక సింగారానికా. గోవిందు అప్పూ తీరుతుంది, బాబీగాడి చదువుకూ పనికొస్తుంది’’ అంది.

‘‘నీకో గమ్మత్తు చెప్పనా... డబ్బు చేతిలోపడగానే మేమున్నామంటూ ఖర్చులొస్తాయి. అప్పుడేమయింది... డి.ఎ., ఎరియర్సు వచ్చాయని సంబరపడుతూ ఏవో వూహలు చేస్తూంటే ఏమయ్యాయి మన అంచనాలు..? మన రెండోపిల్ల పెద్దమనిషైందని... వీరన్నారూ వారన్నారనీ... ఈ ముచ్చటా ఆ ముచ్చటా అంటూ ఎంతో ఖర్చు చేశాం. అప్పు కూడా చేశాం. ఆ అప్పు ఎలాగో తీరిందిగానీ, నాకొకటి అర్థంకావటం లేదు. డబ్బుందని ఖర్చులొస్తున్నాయా... ఖర్చులుంటాయని డబ్బు వస్తోందా?’’

మాలతి ఏమీ మాట్లాడలేకపోయింది.

నేను ఆలోచనలోపడ్డాను. నాకున్నట్టే త్రిమూర్తులుదీ పెద్ద సంసారమే. మా ఇద్దరిదీ ఒకే హోదా, ఒకే జీతం. నాలాగే పైఆదాయానికి కక్కుర్తిపడని వ్యక్తి త్రిమూర్తులు. అతనికి అప్పులు లేవు. మరి నాకెందుకున్నాయి- ఆలోచనలతో నిద్రపట్టలేదు.

మర్నాడు త్రిమూర్తుల్ని పార్కుకు తీసుకెళ్ళి నా సమస్య చెప్పాను. విని నవ్వి అన్నాడు- ‘‘చెప్తానుగానీ, నా సలహాలు నీకు సరిపడవచ్చూ, సరిపడకపోవచ్చూ’’ అని.

‘‘చెప్పు, ఎలా అన్వయించుకోవాలో నేనాలోచిస్తాను’’ అన్నాను.

‘‘అయితే చెప్తాను’’ అని ప్రారంభించబోతూంటే, నేను రిలీఫ్‌కి సిగరెట్‌ తీసి వెలిగించబోయాను.

త్రిమూర్తులు వెంటనే ‘‘చూశావా, నీకూ నాకూ తేడా ఏమిటో. సిగరెట్‌ పొగ పీల్చడం అంత అవసరమా... గాలీ, నీరూ, అన్నంలాగా. ఈ సిగరెట్ల కోసం నెలకి ఇంతో అంతో ఖర్చు చేస్తూనే ఉన్నావు కదా. మరి, ఈ సిగరెట్‌ లేకపోతే నీకు ఇంతో అంతో పొదుపేగా.’’

‘‘ఏమిటో బ్రదర్‌, అలా అలవాటు అయింది. మానేస్తాలే’’ అంటూ సిగరెట్టు ప్యాకెట్టులో ఉంచేశాను.

‘‘మాటమీద నిలబడ్డవాడికే మంచి మనుగడ. సరే, అసలు విషయానికొస్తా... ఇప్పుడు మనం మంచి హోదాల్లో ఉన్నాం. నీ సంగతేమోగానీ, నేను పుట్టిపెరిగిన వాతావరణం వేరు. నేను కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగాను. నా అయిదేళ్ళ వయసులో ఈ వూరికి వలస కూలీలుగా వచ్చాం. రైతుగా ఉండే మా నాన్న, పంటలు పండక, పంటల కోసం పెట్టిన పెట్టుబడికి దిగుబడి రాక, అప్పుల మీద అప్పులు చేసుకుని ఇల్లూ పొలం అమ్మేసుకున్నాడు. వలస కూలీలై వచ్చాం. పని దొరికిననాడు తిండీ లేనినాడు పస్తే. అవసరానికి చేతిలో డబ్బుండేది కాదు. మా అమ్మా, నాన్నా, అన్నా, నేనూ, చెల్లీ, చిన్న తమ్ముడూ... ఇది మా సంసారం. అనుకోకుండా మా చిన్న తమ్ముడికి జబ్బు చేసింది. డాక్టరు చూసి మందులు రాసి, వెంటనే వాడకపోతే ప్రమాదం అని చెప్పాడు. అప్పుడు ఆ మందుల విలువ వంద రూపాయలు మాత్రమే. వూరుకాని వూరిలో డబ్బెవరిస్తారు. అప్పు పుట్టలేదు. మందులు కొనలేకపోయాం. మా తమ్ముడు చచ్చిపోయాడు. ‘మందులిప్పించలేక నిన్ను చంపుకున్నాం’ అని అమ్మా నాన్నా చాలా రోజులు ఏడ్చారు. చివరికి వాడికి అంతే రాసిపెట్టి ఉందని సమాధానపడ్డారు. నేనలా సమాధానపడలేకపోయాను. డబ్బు ఎంత బలమైందో నాకు తెలిసింది. ఆ చిన్న వయసులో డబ్బు సంపాదించే ఆలోచనలో పడ్డాను. అప్పుడు నా వయసు ఎనిమిది. స్కూలు అయిపోగానే, మా స్కూలు పక్కనే ఉన్న సైకిల్‌ షాపులో, సైకిల్‌ టైర్లకి గాలికొట్టి, లోషన్‌ రాసి రబ్బరు ట్యూబులకు పాచెస్‌ వేసే పనిచేసి ఎంతోకొంత సంపాదించి, పావలా అర్ధ ఉంచుకుని, మిగతా మా అమ్మకిచ్చి దాచమనేవాడిని. అమ్మ బాధపడుతూనే ఆనందపడేది. ‘డబ్బు సంపాదన కోసం కానిపనులేవీ చేయటంలేదు కదా’ అనేది. నా దగ్గర మిగుల్చుకున్న డబ్బుని మా ఆచారి మాస్టారికిచ్చేవాడిని. ఆయన లెక్కరాసి దాచేవారు. ఉదయాన్నే అద్దె సైకిలు తీసుకుని ఏభై ఇళ్ళకు పేపరు వేసేవాడిని. మా అన్న నాకన్నా భిన్నం. వాడికీ సంపాదన మీద దృష్టి ఉండేది. రాత్రికి రాత్రి లక్షాధికారి కావాలని వాడి ఆలోచన. ఇంటి నుండి ఒక పనికి రూపాయి పట్టుకెళ్తే అర్ధ రూపాయి అప్పు చేసుకొచ్చేవాడు. మేం గవర్నమెంటు స్కూల్లోనే చదివాం. వాడు టెన్తు పరీక్ష రెండుసార్లు ఫెయిలయి, చదువు మానేసి మా నాన్నతో కూలీ పనికి వెళ్ళేవాడు. నేను టెన్తు మంచి మార్కులతో పాసయ్యాను. గవర్నమెంటు కాలేజీలో నాకు సీటు వచ్చింది. ఇంటర్‌ మంచి మార్కులతో పాసయ్యాను. కానీ ఏం లాభం? పైకి చదివించే స్తోమత మా నాన్నకు లేదని ఉద్యోగ ప్రయత్నాల్లో పడి చివరికి ఈ ఉద్యోగం సంపాదించుకుని ఇంతవాడినయ్యాను. మా అన్నయ్య బాధ్యత తెలుసుకుని, మిలటరీలోకి వెళ్ళాడు. రిటైరై ఎక్స్‌-సర్వీసర్‌గా ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాడు ఈ వూళ్ళొనే. అందరం ఒకేచోటనే ఉండి, పిల్లపాపలతో హాయిగా ఉన్నాం. ఏ ఖర్చు చేయాలన్నా, అందరం ఆలోచించే చేస్తాం. అమ్మా నాన్నలను సుఖపెడుతున్నాం. చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం. హాయిగా ఉన్నాం. ఇక్కడో మాట... మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డామనీ, ఆ కష్టాలు మన పిల్లలు పడకూడదనీ వాళ్ళడిగినవన్నీ ఇస్తాం. అదే పొరపాటు. వాళ్ళ కోర్కెలు తీర్చడానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో వాళ్ళు పట్టించుకోరు. అడిగినవన్నీ సాధించుకోవడమే హక్కుగా భావిస్తారు. కొందరు సరదాలకు పోయి దారి తప్పుతారు. చదువులు మూలపడతాయి. ఈ అనర్థాలన్నింటికీ మన ఆలోచనలు సరిగా లేకపోవటమే కారణం. పక్కనున్న వారికున్నవన్నీ మనకుండాలని ఆర్భాటాలకు పోవడం తప్పు. అప్పులు లేకపోవడమే పెద్ద ఆస్తి. అదే ఆరోగ్యం. దానివల్లే మనకు మనశ్శాంతి. ఇప్పుడు నువ్వూ మీ శ్రీమతీ కలిసి మాట్లాడుకుని, ఏం చేయాలో ఆలోచించుకోండి. ఏ పనైనా కలిసే చేయండి’’ అంటూ ఉపన్యాసం ముగించాడు.

ఆ రాత్రి భోజనాల అనంతరం త్రిమూర్తులు గురించి అంతా చెప్పాను మాలతికి. మాలతి జాగ్రత్తగా విని ఆలోచనల్లో పడింది. ఆ రాత్రి మాలతి సరిగా నిద్రపోలేదు.

ఉదయం మాలతి అంది ‘‘ఇద్దరం తప్పులు చేశాం, సరిదిద్దుకునే బాధ్యత మనదే’’ అంటూ కాఫీ అందిస్తూ తన ప్రణాళిక చెప్పింది.

నాకంతగా నచ్చకపోయినా ‘వూ’ అన్నాను.

బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర పిల్లలతో అంది ‘‘ఇవాళ్టి నుంచీ ఎవరిపనులు వాళ్ళు చేసుకోవాలి. పనిమనిషిని మాన్పిస్తున్నాను’’ అని.

‘‘అదేంటి మమ్మీ, ఇంత సడన్‌గా’’ అంది చిన్నమ్మాయి.

‘‘అవును. తప్పదు. ఇప్పటివరకూ మేం ఎన్నో అప్పులు చేశాం. ఆ అప్పుల తప్పులు ఇప్పుడు సవరించుకోవాలి’’ అంటూ అప్పుల చిట్టా పెట్టింది వాళ్ళముందు మాలతి.

‘‘ఇవన్నీ చదువుల కోసమే కదా అయ్యాయి. మరి అవవా?’’ అన్నాడు రెండోవాడు.

‘‘అందుకే ఈ అప్పుల నుండి బయటపడాలంటే కొన్ని సంస్కరణలు చేయాలిగా.’’

‘‘మేమేమైనా ఉద్యోగాలు చేస్తున్నామా... అప్పులు తీర్చడానికి. అయినా అప్పులు చేయాల్సిన అవసరాలేమొచ్చాయి. నాన్నకు బోలెడు జీతమొస్తోందిగా’’ అన్నాడు రెండోవాడు.

మాలతి నావైపు చూసింది. అప్పుడు నేనన్నాను ‘‘సరిగ్గా అడిగావురా. ఎంతసేపూ నీకు నా జీతమే కనిపిస్తోంది గానీ, ఇంటి అవసరాలు మాత్రం తెలియటం లేదు. మీ పాకెట్‌మనీ, బయట తిరుగుళ్ళూ, పిక్నిక్కులూ, ఫ్రెండ్సు ముందు గొప్పకోసం మీరు చేసే ఖర్చులూ, మీ బ్రాండెడ్‌ డ్రస్సులూ, మీ సెల్‌ రీఛార్జింగులూ, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, పుస్తకాలూ వగైరా వగైరా...’’

‘‘అవి మీకే కాదు, అందరు అమ్మా నాన్నలకీ ఉన్నాయి. ఆర్‌ వీ పూర్‌? చెప్పండి... మనం బీదవాళ్ళమా? మీకంత కష్టంగా ఉంటే మామీద పెట్టిన ఖర్చులన్నీ రాసిపెట్టండి. మా ఉద్యోగాలు రాగానే... అన్నీ... అన్నీ తీర్చేస్తాం’’ అన్నాడు.

‘‘అది కాదురా తమ్ముడూ, నాన్న అన్నదానిలో తప్పేముంది. అనవసరమైన ఖర్చులెన్నో చేస్తున్నాం మనం. అడిగిన వెంటనే అడిగినంతా ఇస్తున్నారు నాన్న. ‘ఎందుకు’ అని ఏనాడైనా అడిగారా? నాన్న అడగటంలేదని డిమాండు చేసి మరీ పట్టుకెళ్ళి ఇష్టమొచ్చినంతగా ఖర్చుపెడుతున్నాం. ఒక పని చెయ్యి. ఇవాళ్టి నుంచీ నాన్న ఎంత ఇస్తున్నారు... దేనికిస్తున్నారు... మనం దాన్ని ఎలా ఖర్చుపెడుతున్నాం... అంతా ఒకచోట రాయి, దాపరికం లేకుండా. అప్పుడు నీకే తెలుస్తుంది’’ అన్నాడు పెద్దవాడు.

‘‘రాస్తాను. ప్రతి రూపాయీ రాస్తాను. నేనెంత మినిమమ్‌లో ఉన్నానో నీకు తెలుసా? నేనేమైనా మా ఫ్రెండ్సుకున్నట్టు బైకు అడిగానా... బ్రాండెడ్‌ షూస్‌ అడిగానా?’’

అప్పుడు మాలతి అందుకుంది ‘‘అవన్నీ మీ నాన్న కొనిస్తారు. ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకో. ఎంసెట్‌లో మంచి ర్యాంకుతో బీటెక్‌లో సీటు సంపాదించుకో. అప్పుడడుగు.’’

‘‘అలాగే’’ అంటూ తల ఎగరేసుకుంటూ వెళ్ళాడు. వాడిని వెనక్కి పిలిచి అన్నాను ‘‘మనం బీదవాళ్ళమా అని అడిగావు చూడు... చెప్తున్నా విను. నిజంగా మనం బీదవాళ్ళమే- అప్పులున్నంతవరకూ. హక్కులు సాధించుకోవాలంటే బాధ్యతలు నిర్వహించాలి’’ అన్నాను.

‘‘అవును, నిజం’’ అంటూ చిన్నమ్మాయిని పిలిచి ‘‘వచ్చే ఏడాది నుంచీ నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. బాగా చదువుకుని మంచి మార్కులతో పాసవ్వాలి. అప్పుడే పైచదువులు - అదైనా గవర్నమెంటు కాలేజీలోనే. కార్పొరేట్‌ కాలేజీలో వేలకు వేలు పోసి చదివించే స్తోమత మాకు లేదు. ఈరోజు నుంచీ మీ బట్టలు మీరే ఉతుక్కుని, ఐరన్‌ చేసుకోవాలి. వాషింగ్‌మెషీన్‌ వాడకూడదు. మీ డ్రస్సులు మీరే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే పనిమనిషి పనులు కూడా నేనే చేసుకోవలసి వస్తోంది కాబట్టి’’ అంది మాలతి. చిన్నమ్మాయి ‘వూ’ అనలేదు.

‘‘పిల్లల ముందు అప్పుల లిస్టు చదవడం న్యాయమా... వాళ్ళెంత బాధపడతారు’’ అన్నాను రాత్రి.

‘‘న్యాయమే. మనమేదో భాగ్యవంతులమయినట్టూ, నాన్న ఒక ఏటీఎం అని వాళ్ళు అనుకుంటున్నప్పుడూ ఇది న్యాయమే. మనం నేలమీద ఉన్నాం, ఆకాశంలో లేం’’ అంది మాలతి.

‘‘చిన్నపిల్లల్ని మనమిలా దండిస్తే ఎలా?’’ దీనంగా అడిగాను.

మాలతి ఇంకా కఠినంగానే అంది ‘‘దండించడం కాదు, బాధ్యతలు తెలియజేయడం, వాళ్ళను బాగుచేయడం. చదువుకుంటూ ఇంటిపనులు చేస్తూ తల్లిదండ్రులకు సాయపడే పిల్లలున్నప్పుడు ఇది దండన కాదు. ఉదయం లేవగానే కాఫీ కప్పు అందుకుంటూ ‘పేపరు వచ్చిందా?’ అని అడుగుతారేగానీ, దాన్ని నాలుగు గంటలకల్లా మన గడపలో వేసేదెవరో ఎప్పుడైనా చూశారా? సైకిల్‌ సీటు మీద కూడా కూర్చోలేని చిన్నపిల్లాడు పెడల్సు మీదే సైకిలు తొక్కుతూ వచ్చి పేపరు మన గడపలో పడేస్తాడన్న నిజం మీకు తెలుసా? ఏం వాడికి అమ్మా నాన్నా లేరా? వాడికి ముద్దూముచ్చట తీర్చుకోవాలన్న కోరిక ఉండదా? ఇంట్లో సాయపడుతూ, స్కూలుకెళ్తున్నాడు వాడు... అలాంటి వాళ్ళెందరో. బరువు బాధ్యతలు తెలియాల్సింది చిన్న వయసులోనే. ఇప్పుడు తెలుసుకోకపోతే వాళ్ళు ఎదిగే దారే ఉండదు. నేనిలా కఠినంగా ఉండకపోదును. పిల్లల తీరుచూసే అన్నాను. పెద్దవాడు ఎంత బాధ్యతగా ఉంటున్నాడు- బస్సులో వెళ్తాడు, బస్సులో వస్తాడు. వాడివన్నీ సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాలే. వాడి దృష్టి ఎంతసేపూ మనల్ని బాధపెట్టకూడదనే.’’

‘‘వాళ్ళనలా పక్కనపెట్టు, మనం చేసిన తప్పులూ...’’ అన్నాను.

‘‘సరిదిద్దుకుందాం. హంగులూ ఆర్భాటాలూ తగ్గిద్దాం. చేతిలో డబ్బుంది కదాని, కనిపించిన ప్రతీ వస్తువూ కొనడం మానేద్దాం. మనది చిన్న సంసారమే కాదు, ఒకే సంపాదన. ‘ఇంత పెద్ద సంసారానికి ఖర్చులుండవా’ అని సమర్థించుకోవద్దు. అప్పులు చేయడం సహజమే. ఇది అందరూ చేస్తున్న పనే అని సమర్థించుకోవద్దు. అది పెద్ద తప్పు. ముందు ఈ అప్పుల వూబిలోంచి బయటపడే మార్గం చూడాలి. వెనక్కి చూస్తేనేగానీ ముందుకెళ్ళలేం’’ అంటూ ఆలోచనలోపడి చివరికి ఒక నిర్ణయానికొచ్చాం.

పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. జీతం రాగానే వాళ్ళ పాకెట్‌ మనీ తగ్గించాను. నేను సిగరెట్‌ మానేశాను. స్కూటరు ఇంట్లో ఉంచి బస్సులో వెళ్ళడం మొదలుపెట్టాను. వరలక్ష్మీ వ్రతం వస్తోంది. అణాకాసు అయినా కొందామన్నాను. బంగారం కొనే ఆలోచన కొంతకాలం వరకూ చేయొద్దంది మాలతి.

పిల్లలకి మాత్రమే బట్టలు కొనడం, కుట్టించడం తప్ప మనకు వద్దంది. చిన్నవాడు ఇంట్లో వస్తున్న మార్పుల్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏమడగాలన్నా జంకుతున్నాడు. ఆడపిల్ల తల్లికి సాయపడటం మొదలుపెట్టింది. మంచి మార్కులు తెచ్చుకుంటేనే కాలేజీ చదువు, లేకపోతే చదువులేదని చిన్నమ్మాయికి చెప్తోంది మాలతి.

‘‘మనీ సేవ్డ్‌ ఈజ్‌ మనీ ఎర్న్‌డ్‌’’ అనే స్లోగన్‌ని పెద్దక్షరాల్లో రాసి అందరి గదుల్లో ఉంచాడు పెద్దవాడు. ‘డబ్బు పొదుపు చేయడమే డబ్బు సంపాదించినట్టు’ అని వాడి భావం. చిన్నవాడు చదువుల్లో పడ్డాడు.

‘డబ్బు సంపాదించడం గొప్పకాదు - నిలబెట్టుకోవడం గొప్ప’ అనేది పిల్లలకి అర్థమైంది.

త్వరలో అప్పులు తీరతాయన్న నమ్మకం కలిగింది. త్వరలో ధనవంతుడినవుతానన్న ధైర్యమూ నాకేర్పడింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.