close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తాతగారి పేరే... తారక మంత్రం!

తాతగారి పేరే... తారక మంత్రం!

‘పాతిక సినిమాలు...అప్పుడే అయిపోయాయా! నేనొచ్చి పదిహేనేళ్లు గడిచిపోయాయా! ఏదో చిటికేసినట్టు... చకచకా ఏళ్లు నడిచి వెళ్లిపోయాయ్‌... అవన్నీ రివైండ్‌ చేసుకుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది’ అంటూ తారక్‌గా మొదలై తారా ప్రపంచంలో అగ్రస్థాయికి చేరే దాకా తన ప్రయాణాన్నంతా గుర్తుచేసుకుంటున్నారు ఎన్టీఆర్‌...

ఎన్‌... టీ... ఆర్‌...
ఈ మూడక్షరాలే మా తాతగారు నాకిచ్చిన ఆస్తి.. ఐశ్వర్యం..!!

దీంతో పాటు మోయలేనంత భారం కూడా.

ఆ పెద్దాయన పేరు పెట్టుకున్నాం, భగవంతుడి దయ వల్ల కొద్దో గొప్పో ఆయన రూపు రేఖలూ వచ్చాయి.. ఆ పేరుని నిలబెట్టాలి కదా?

ఒకళ్లా ఇద్దరా...లక్షల మంది అభిమానులు నేనంటే ప్రాణం పెట్టేస్తున్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి కదా..?

అనునిత్యం.. అడుగడుగూ ఇదే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ నా ప్రయాణం సాగిస్తున్నా.

పాతిక సినిమాలైపోయాయి. ఈ ప్రయాణంలో హిట్లుండొచ్చు, ఫ్లాపులుండొచ్చు... కొన్ని కథలు నచ్చొచ్చు.. కొన్ని ఆకట్టుకోకపోవొచ్చు.. కానీ ప్రతీ చిత్రంలోనూ అభిమానుల్ని సాధ్యమైనంత వరకూ అలరించడమే నా కర్తవ్యం. అందులో ఎంతో కొంత విజయం సాధించాననే అనుకుంటున్నా!

పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లోనే.  చిన్నప్పుడు నా అల్లరి మామూలుగా ఉండేది కాదు. ‘గుడ్‌ బాయ్‌’ అని పిలిపించుకోవడం అస్సలిష్టం లేనట్టు ప్రవర్తించేవాడ్ని. స్కూలూ, క్రికెట్టూ, ఫ్రెండ్స్‌తో గొడవలూ, సినిమాలూ..షికార్లూ...కాలు ఒక్కచోట నిలబడితే ఒట్టు. అందుకే మా అమ్మ శాలిని చేతిలో నాకు రోజూ చావు దెబ్బలే. ఆడవాళ్లు సున్నితంగా ఉంటారంటారు. కానీ మా అమ్మ మాత్రం నా ముందు శివతాండవం ఆడేసేది. అల్లరి చేస్తే మామూలుగా కొట్టేది కాదు. చేతికి ఏది దొరికితే దానితోనే బడిత పూజ. ఓసారి అమ్మని బాగా విసిగించేశా. దాంతో బెల్టు తెగే దాకా కొట్టింది. అప్పటికీ తన కోపం చల్లారలేదు.. హ్యాంగర్‌ పట్టుకుని బాదేసింది. ఆ దెబ్బలు తట్టుకోలేక గోడ దూకి పక్కనే ఉన్న గుళ్లొ దాక్కున్నా. అందులోంచి బయటకు వచ్చే వరకూ ఎదురుచూసి బయటకొచ్చాక మళ్లీ కొట్టింది. కొంతసేపయ్యాక.. ఒంటికి మందు రాసి, భోరున ఏడ్చేసింది.  నేనంటే అంత ప్రాణం మా అమ్మకు. అలాగని గారాబం చేసేది కాదు. వాస్తవంలో బతకడం నాకు అమ్మే నేర్పింది.

‘ఇదీ మన పరిస్థితి.. ఇలా ఉండాలి.. ఇలా చేయాలి..’ అంటూ నా తొలి గురువుగా మారిపోయింది. నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి అమ్మే కారణం.

‘జీవితంలో ఏదో ఒకటి చెయ్‌.. నిరూపించుకో.. లేదంటే మనుగడ కష్టం’ అంటూ హితబోధ చేసింది. ఆ మాటలు బాగా పనిచేశాయ్‌. కాకపోతే ఏం చేయాలో, ఏం చేస్తే నిరూపించుకోగలనో నాకు అర్థమయ్యేది కాదు. అమ్మ నాకు అమ్మ మాత్రమే కాదు.. ఇంకా చాలా. నా బలం, బలగం అంతా తనే. 
 నా పదకొండో ఏట అనుకుంటా..  పొద్దున్నే మంచం ఇంకా దిగలేదు. అప్పుడు ఒంట్లో కూడా బాలేదు. అమ్మ సడన్‌గా నా గదిలోకి వచ్చి.. తట్టి లేపింది. ‘ఏంటమ్మా... ఇంత పొద్దుటే...’ అని విసుక్కున్నా. ‘తాతగారు నిన్ను రమ్మంటున్నారు..’ అంది అమ్మ. నిజంగానే నాకేం అర్థం కాలేదు. ‘తాతగారేంటి? నన్ను పిలవడం ఏమిటి?’ అనుకున్నా. తాతయ్యంటే నాకు దైవం. అసలు నా ప్రపంచమే ఆయన. కానీ అప్పటి వరకూ తాతయ్యని ప్రత్యక్షంగా చూసింది లేదు. ఆయన గురించి తలచుకోవడమే తప్ప.. కలుసుకోలేదు.

‘తాతయ్య నిన్ను చూడాలట’ అంటూ అప్పటికప్పుడు స్నానం చేయించి, నన్ను ముస్తాబు చేసింది అమ్మ.

అప్పట్లో తాతయ్య అబిడ్స్‌లో ఉండేవారు. కార్లో.. తాతయ్య ఇంటికెళ్లా. ఆయన గది ముందు వదిలిపెట్టారెవరో. తలుపు చాటు నుంచి తాతయ్యని తొలిసారి చూశా.

‘రండి..’ అన్నారు గంభీరంగా.

భయం, ఆశ్చర్యం, ఆనందం.. అన్నీ ఒకేసారి కలిగాయి.

‘పేరేంటి’ అని అడిగారు. ఆయన నాతో మాట్లాడిన తొలిమాట అదే.

‘తారక్‌ రామ్‌’ అన్నాను. వెంటనే నాన్నగార్ని పిలిచి.. ‘పేరు మార్చండి... నందమూరి తారక రామారావు.. అని పెట్టండి’ అంటూ ఓ ఆజ్ఞలాంటిది వేశారు. అప్పటి నుంచి తారక్‌ రామ్‌ని.. కాస్తా ఎన్టీఆర్‌ అయిపోయా. ఆ క్షణం నుంచీ నేను తాత చేయి వదల్లేదు.. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు. చిత్రం ఏంటంటే నన్ను ఆయన ‘తాతా..’ అని పిలిచేవారు. అప్పటికే నేను కాస్త బొద్దుగా ఉండేవాడ్ని. తాతగారు ఇంకా బొద్దుగా మార్చేశారు. నాకు నెయ్యి పడేది కాదు. మా అమ్మ ముద్ద నోట్లో పెడితే కక్కేసేవాడ్ని. తాతగారు మాత్రం ఇడ్లీని నేతిలో ముంచి.. ‘తినండి’ అనేవారు. నాకు తప్పేది కాదు. అప్పటి నుంచీ తాతయ్య భోజన అలవాట్లన్నీ నాకొచ్చేశాయ్‌. దాంతో రోజు రోజుకీ లావైపోయేవాడ్ని.

అన్నింటికంటే మరో ముఖ్య విషయం.. నన్ను నటుడిగా మార్చిందీ తాతయ్యే. ఓసారి ‘మేజర్‌ చంద్రకాంత్‌’ షూటింగ్‌ జరుగుతుంటే అక్కడికి వెళ్లా. అప్పట్లో తాతగారి దగ్గర ముత్తు అని మేకప్‌మేన్‌ ఉండేవారు. ఆయన్ని పిలిచి.. ‘మా తాతకు మేకప్‌ వేయండి’ అన్నారు. అరగంటలో నన్ను రెడీ చేశారు. అద్దంలో చూసుకుంటే ఏం అర్థం కాలేదు. మేకప్‌ అయ్యాక తాతగారి దగ్గరకు వచ్చా. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని హిందీలోకి తీస్తున్నాం. అందులో భరతుడు మీరే’ అన్నారు. ‘నేనేంటి? సినిమాల్లో నటించడం ఏమిటి?’ అనుకున్నా. కానీ తాతగారు చెప్పారు కదా...చేసేశా. అలా నటనలో నాకు ఓనమాలు నేర్పించారు తాతయ్య. నా తొలి దర్శకుడు ఆయన. ఎన్టీఆర్‌ మనవడిగా పక్కన పెడితే.. ఓ నటుడిగా అంతకంటే ఏం కావాలి?

ఆ తరవాత నటనలో ప్రత్యేకమైన శిక్షణేదీ తీసుకోలేదు. నందమూరి అనే నటనాలయంలో ఎన్టీఆర్‌ అనే ప్రిన్సిపల్‌ దగ్గర నటన నేర్చుకున్నా... మరో మాస్టారెందుకు?? అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆయన పేరే నా తారకమంత్రం!

ఆ తరవాత ‘రామాయణం’... నిజంగానే అదో గొప్ప అనుభవం. కెమెరా అంటే ఏంటో.. నటన అంటే ఏమిటో తెలియని పిల్లలతో తీర్చిదిద్దిన ఓ అద్భుతం. సినిమా చూస్తుంటే ‘ఆహా.. ఓహో’ అనుకుంటాంగానీ.. మేం వేసిన కోతి వేషాలకు అంతూ, పొంతూ లేదు. చదువు అటకెక్కుతోందని రామాయణం తరవాత.. సినిమాల జోలికి వెళ్లలేదు.  ప్రాథమిక విద్య విద్యారణ్య స్కూల్లోనే. ‘మా అబ్బాయి కదా అని ప్రత్యేకంగా చూడకండి.. అందరితో పాటే వాడూనూ..’ అని యాజమాన్యానికి నాన్నగారు చెప్పేశారు. దాంతో.. వాళ్లలో ఒకడిగానే ఉండే అవకాశం దక్కింది. స్కూలు వాతావరణం నాకు భలే నచ్చేది. విద్యార్థుల్ని తీర్చిదిద్దే విధానం బాగుండేది. అక్కడ చదువుకున్నవాళ్లకు కమ్యునికేషన్‌ స్కిల్స్‌ బాగా ఒంటబట్టేవి. బట్టీ చదువులు ఉండేవి కావు. మాస్టార్లూ మంచోళ్లే. మరీ ఫస్టు మార్కులు వచ్చేవి కావు.. అలాగని అత్తెసరు మార్కులూ కావు.. బాగానే చదివేవాడ్ని. జాగ్రఫీ అంటే ఇష్టం. మ్యాపులూ, వాటికి రంగులు వేయడం కాస్త ఆసక్తిగా ఉండేది. అప్పటి నుంచే ప్రకృతిని ఆరాధించడం మొదలైంది. నా చుట్టూ వాతావరణం పచ్చగా ఉంటే.. నచ్చుతుంది. విద్యారణ్యలో దొరికిన స్నేహితుల్నీ, వాళ్ల స్నేహాన్నీ... ఇప్పటికీ పదిలంగా కాపాడుకుంటున్నా.

కొన్నాళ్లు బోర్డింగ్‌ స్కూల్లో వేసేశారు. నాకేమో అక్కడ ఉండబుద్ధి అయ్యేది కాదు. ఎలాగోలా బయటపడాలని చాలాసార్లు ప్రయత్నించా. ఓసారి కావాలని కాలు విరగ్గొట్టుకున్నా. అప్పుడైనా ఇంటికి పంపేస్తారని.. కానీ కట్టుకట్టి.. అక్కడే పడేశారు.

ఆ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడ్ని. సంధ్య థియేటర్లో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ రిలీజ్‌ రోజున టికెట్లు దొరకలేదు. నాకు టికెట్టు ఇవ్వనందుకు మేనేజర్‌తో గొడవ పెట్టుకున్నా. సినిమా చూస్తేగానీ ఇంటికి రానని చెప్పేశా.

దాంతో నాన్నగారు ఫోన్‌ చేసి.. ‘వాడికో కుర్చీ వేసి చూపించండి’ అన్నారు. దాంతో ప్రత్యేకంగా ఓ కుర్చీ తీసుకొచ్చారు.

మరోసారి టికెట్లు లేక ప్రొజెక్టర్‌ రూమ్‌లో కూర్చుని సినిమా చూశా. జనం మధ్య, ఆ గోలని ఆస్వాదిస్తూ.. సినిమా చూడడం భలే కిక్కు. ఆ అవకాశం నాకిప్పుడు దొరకడం లేదు. సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్తే.. అందరూ సినిమా మానేసి నన్ను చూస్తున్నారు. దాంతో వాళ్లకీ నాకూ సినిమా చూసే మూడ్‌ పోతోంది. అందుకే థియేటర్లకు వెళ్లడం తగ్గించేశా.

అమ్మ ప్రోద్బలంతోనే సుధాకర్‌ మాస్టారు దగ్గర కూచిపూడి నేర్చుకున్నా. ఒకటా, రెండా.. ఏకంగా పన్నెండేళ్ల సాధన అది. దేశవ్యాప్తంగా వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చా. ‘స్టేజీ అనుభవం ఉంటే.. కెమెరా భయం ఉండదు..’ అన్నది అమ్మ నమ్మకం. అందుకే వీలైనన్ని ప్రదర్శనల్లో పాల్గొన్నా. నిజంగానే ఆ అనుభవం నాకు చాలా పనికొచ్చింది. ఇంటర్‌ తరవాత చదువు అట్టే కొనసాగలేదు.
2001లో ‘నిన్ను చూడాలని’ వచ్చింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి చిత్రమది. తొలి పారితోషికంగా రూ.3.5 లక్షలు నా చేతుల్లో పెట్టారు. అన్ని డబ్బులు చూశాక.. చేతులు ఒణకడం మొదలెట్టాయి.

'ఇంటికెళ్లి తలుపులేసుకొని లెక్కపెట్టాను. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. నెల రోజులూ అదే పని. ఇంట్లో మూల మూలల్లో దాచేవాడ్ని. అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనుకొన్నా. ఎవరైనా కాజేస్తారేమో అనే భయం కూడా వేసేది. అలా దాచీ దాచీ చివరికి మా అమ్మ చేతుల్లో పెట్టేశా... ఎంత సంపాదించినా తన కోసమే కదా అనిపించింది.

ఇక సినిమా విడుదలయ్యాక చూడాలి.. ఉషామయూరి థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. కెమెరా భయం లేకపోవడంతో.. నాకేం కొత్తగా అనిపించలేదు. కానీ.. థియేటర్లో ఆ సినిమా చూసుకున్నాక కంగారొచ్చింది. ‘ఏంట్రా బాబూ ఇంత వెరైటీగా ఉన్నా’ అనుకున్నా. సినిమాలకు పనికొస్తానా అనే సందేహం కూడా కలిగింది. కానీ ‘స్టూడెంట్‌ నెం.1’తో నాలో నమ్మకాన్ని పెంచాడు రాజమౌళి. ఆ సినిమాతోనే నా బలాబలాలేమిటో తెలిసొచ్చింది. ‘ఆది’ నా కెరీర్‌కి మరో మలుపు.. ఇక ఆ తరవాత చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

నూనూగు మీసాల వయసది. ఇరవై కూడా నిండలేదు. ఆ వయసులో ఎవరైనా ఆడుతూ పాడుతూ గడుపుతారు. నేను మాత్రం..స్టార్‌డమ్‌, విజయాలు, అభిమానలు - వీటి చుట్టూ తిరిగా. యవ్వనం మిస్‌ అవుతోంది అని అస్సలు అనుకోలేదు. ఎంతమందికి వస్తుందీ అవకాశం అని సర్దిచెప్పుకునేవాడ్ని. ‘నేను మీకంటే ముందు జీవితంలో స్థిరపడిపోయా చూడండి’ అంటూ నా స్నేహితులతో చెప్పేవాడ్ని.

నాకు దొరికిన అద్భుతమైన వరం.. నా స్నేహితులు. స్నేహల్‌, లవ్‌రాజ్‌, రాజీవ్‌ కనకాల.. ఇలా ఏడెనిమిదిమంది ఉన్నారు.

ఎన్టీఆర్‌లా కాకుండా.. తారక్‌లా, నన్ను నన్నుగా చూస్తారు. స్నేహల్‌ అయితే తిడతాడు, కొడతాడు... అది నాకిష్టం.

నాకు చుట్టూ మనుషులు ఉండాలి.. ఎంతమంది ఉంటే అంత సంతోషం.

వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం రెండూ వేరు. వాటిని కలపడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా స్నేహితులతో కూడా పని గురించి ఎక్కువగా మాట్లాడుకోను. కలిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇంట్లోనే క్రికెట్‌ ఆడేసుకుంటాం. కాకపోతే బ్యాటింగ్‌ ఎప్పుడూ నేనే. అవుట్‌ అయినా.. ఒప్పుకోను. ఎందుకంటే అది నా రాజ్యం. రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌.. మేమంతా సరదాగానే ఉంటాం. అయితే.. మా స్నేహాన్ని బయటపెట్టుకునే అవకాశం ఎప్పుడో గానీ రాదు. ఇక అందరికంటే మంచు మనోజ్‌గాడు... నా రాక్షస స్నేహితుడు. ఇద్దరం ఒకే రోజు పుట్టాం. వాడికంటే నేను ఐదుగంటలు ముందు పుట్టానంతే. దానికే వాడు ‘అన్నయ్య.. బాబాయ్‌’ అని పిలుస్తుంటాడు. వాడి అల్లరి అంతా ఇంతా కాదు.. వంద కోతులతో సమానం..
 
నా సిద్ధాంతం కొత్తగా వింతగా ఉంటుంది. ‘ఇదేంటి ఎన్టీఆర్‌ ఇలాక్కూడా ఆలోచిస్తాడా’ అనిపిస్తుంది.

మా అమ్మ పడుకునేటప్పుడు ‘పొద్దుట టిఫిన్‌ ఏం చేయను’ అని అడిగేది.‘పొద్దున్న లేవాలి కదమ్మా.. ఎవరికి తెలుసు..? ఇదే చివరి నిద్రేమో’ అనేవాడ్ని. నా ఆలోచనలు అలా ఉంటాయి. ‘ఆశ’ అనే ఓ చిన్న రేఖపై బతుకుతున్నాం మనం. ఏమో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ చిన్న జీవితంలో ఇన్ని గొడవలెందుకు?

నా కోరిక ఒక్కటే.. చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవ్వకూడదు. ‘చావూ వచ్చావా? తీసుకెళ్లిపో..’ అనేలా ఉండాలి. అంతే తప్ప... ‘ఒక్క రోజు బతికితే అది చేసేవాడ్ని కదా, ఇది చేసేవాడ్ని కదా’ అనుకోకూడదు. అంత పరిపూర్ణ జీవితం అనుభవించాలి. అప్పుడు చావుని ఆహ్వానించాలి...

2009 మార్చి 26న జరిగిన కారు ప్రమాదం నా ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణాలు ఇంకా గుర్తు.. కన్నుమూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయింది. ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు విరిగాయో నాకే స్పష్టంగా తెలిసిపోయింది. ఒళ్లంతా రక్తం. సూర్యాపేట ఆసుపత్రికి వెళ్తుంటే.. నా జీవితమంతా కళ్ల ముందు కదిలింది.

నా సినిమాలు, అమ్మ, అభిమానులు, నా వస్తువులు, చివరికి నేను పెంచుకుంటున్న కుక్కపిల్ల.. అన్నీ! ‘ఏంటి? జీవితం అయిపోయిందా?’ అనిపించింది. చచ్చిపోతానన్న భయం లేదు గానీ... ‘సాధించాల్సింది ఇంకా ఉంది కదా’ అనిపించింది.

అమ్మ దీవెనలు, అభిమానుల ఆశీర్వాదం, తాతయ్య ఆశీస్సులతో బతికి బట్టకట్టగలిగా.

ఆ రోజు రెండోసారి పుట్టాను...

అన్నట్టు మర్చిపోయా.. నా శ్రీమతి ప్రణతి పుట్టిందీ అదే రోజు. అందుకే ప్రతీ ఏడాదీ మా ఇంట్లో మార్చి 26న రెండు పుట్టిన రోజులు జరుగుతాయి.

ఆ ప్రమాదం నన్ను చాలా మార్చింది.. చాలా కూల్‌ అయ్యా. జీవితంపై దృక్పథం మారింది. బాధలో ఉన్నప్పుడు కూడా నవ్వడం నేర్చుకున్నా.

ప్రణతి జీవితంలోకి వచ్చాక.. నాలోంచి కొత్త ఎన్టీఆర్‌ బయటకు వచ్చాడు. స్పీడు తగ్గి.. ఆలోచన పెరిగింది. ‘నాకంటూ ఇంట్లో ఒకళ్లున్నారు..’ అన్న జాగ్రత్త అది. ఇప్పుడు అభయ్‌ వచ్చాడు.. ఇంకాస్త కామ్‌ అయిపోయా.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు.. నిజంగానే ప్రణతి నాకు దేవుడు పంపిన వరంలా దొరికింది. పెళ్లికి ముందు తనని కలిసింది లేదు, మాట్లాడింది లేదు.. కానీ చూడగానే నాకోసమే పుట్టింది అనిపించింది.

సినీ పరిశ్రమలో రకరకాల పుకార్లు.. నాపై కూడా కొన్ని వచ్చాయి. వాటన్నింటి గురించీ క్లియర్‌గా తనకు చెప్పేశా. ‘నా పరిస్థితి ఇది, నా చుట్టూ ఇలాంటి మనుషులు ఉంటారు..’ అంటూ అన్నీ పూసగుచ్చినట్టు వివరించా. అందుకే మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ ఎలాంటి సందేహాలూ, అనుమానాలూ చోటు చేసుకోలేదు.

తనకి వంట చేయడం రాదు. చేస్తానన్నా.. ‘వద్దు’ అంటా. ఎందుకంటే ఓసారి కేక్‌ చేయమంటే.. మాడ్చేసింది. బొగ్గులా తయారైంది.. ఆ అనుభవంతో జాగ్రత్త పడిపోయా. నేను మాత్రం వంటింట్లో దూరితే ఓ చిన్నసైజు నలభీముడ్నే. అన్నిరకాల వంటలూ చేస్తా. అందులోనూ నాన్‌వెజ్‌ స్పెషలిస్టుని. పదిరకాల పలావులు వండుతా..రోటి పచ్చళ్లు.. పులుసులు... అమ్మతో పోటీ పడి మరీ తయారు చేస్తా. పిజ్జా, బర్గర్లు, మటన్‌ పచ్చడి, నాటుకోడి పచ్చడి.. ఇలా ఒకటా రెండా? 
వండడమే కాదు, అలానే తినేవాడ్ని. అందుకే బరువు కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయా. తగ్గాలి.. తగ్గాలి అని చాలాసార్లు అనుకున్నాగానీ.. దానిపై శ్రద్ధ పెట్టలేదు. ‘రాఖీ’ సినిమా చూశాక మాత్రం నా మీద నాకు కోపం వచ్చింది. కొంతమంది ‘హరికృష్ణ నాన్నలా ఉన్నావ్‌’ అనేవారు. దాంతో ‘ఇప్పుడు తగ్గకపోతే అనవసరం’ అనుకున్నా. ‘యమదొంగ’ కథ చెప్పడానికి రాజమౌళి నా దగ్గరకు వచ్చాడు. ‘ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నామండీ.. ఇంత లావుగా ఉంటే.. అమ్మాయిలు థియేటర్లకు రారు’ అనేశాడు. తగ్గడం ఎంత అత్యవసరమో అర్థమైంది. తానిచ్చిన ప్రోత్సాహంతోనే లైపో సక్షన్‌ చేయించుకొన్నా.

‘యమదొంగ’లో నన్నూ ‘రాఖీ’లో నన్నూ పక్కపక్కన పెడితే ఎవ్వరూ గుర్తుపట్టలేరు.

అందుకే ‘మా అమ్మకు కవలపిల్లలు. రాఖీ వరకూ అన్నయ్య నటించాడు. ఆ తరవాత తమ్ముడిగా నేనొచ్చా..’ అని సరదాగా అంటుంటా. ఇప్పుడు వర్కవుట్లూ చేసి బరువుని అదుపులో పెట్టుకోగలిగా.

సింపుల్‌గా ఉండడం నాకిష్టం. మనసులో ఒకటి.. బయటకు మరొకటి చేతకాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా.

కుటుంబం అంటే ప్రాణం. సినిమాలకంటే నాకు నా కుటుంబమే ముఖ్యం. అందుకే.. బయట ఎక్కువగా కనిపించను.

పండగొస్తే, నాలుగు రోజులు షూటింగ్‌ లేకపోతే ఇంట్లోనే మకాం. అందరం కలిసి పాత సినిమాలు చూస్తాం.

తాతయ్య సినిమాల్ని అస్సలు వదలను. నటుడిగా, వ్యక్తిగా, రాజకీయ నేతగా నాకు ఆయనే ఆదర్శం. నా అభిమాన కథానాయకుడూ.. ఆయనే. ఇక కథానాయిక అంటారా.. వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీదేవి. అసలు 

ఆమె అందం ఎవ్వరికీ రాదు. ఇప్పటికీ మెరిసిపోతూ కనిపిస్తారామె. నిజం చెబుతున్నా... శ్రీదేవిగారు ఓకే అంటే. ఆమెతో నటించడానికి నేను సిద్ధమే. ఆ తరవాత అంతగా ఆకట్టుకున్న కథానాయిక.. రమ్యకృష్ణగారు. బాబాయ్‌ సినిమాల్నీ చూస్తుంటా. ‘దానవీర శూర కర్ణ’ చిత్రానికి నేను వీరాభిమానిని. ప్రపంచ సినిమాల్లోని అత్యుత్తమ చిత్రాల్ని ఎంపిక చేయాల్సొస్తే.. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. ‘గుండమ్మ కథ’ని నాగచైతన్యతో కలిసి రీమేక్‌ చేయాలని ఉంది. ఎప్పటికి కుదురుతుందో చూడాలి.

జీవితంలో ఏం సాధించినా. ఎంత సంపాదించినా.. ఏం కోల్పోయినా...చివరికి నాతో ఎప్పటికీ ఓ అపురూపమైన ఆస్తి ఉంటుంది..

అది కావల్సినంత ధైర్యాన్ని ఇస్తుంది.. ముందుండి నడిపిస్తుంది.. వేయి జీవితాలకు సరిపడేంత ఉత్సాహాన్నిస్తుంది. అదే...

‘‘ఎన్‌... టీ... ఆర్‌...’’ - అన్న పేరు.

కారు నంబర్‌ 9999

సెంటిమెంట్స్‌పై పెద్దగా నమ్మకం లేదుగానీ.. ‘9’ అంకె అంటే ప్రత్యేకమైన ఇష్టం. తాతగారి కారు నం.. 9999. మా నాన్నగారి కారుకీ ఆ నంబరే కనిపించేది. వాళ్లిద్దర్నీ అమితంగా ఇష్టపడే వ్యక్తిగా.. నేనూ ఆ నంబర్‌పై మక్కువ పెంచుకున్నా. పైగా ఈ అంకె నాకు బాగా కలిసొచ్చింది కూడా. విదేశాలకు వెళ్లినప్పుడు షాపింగ్‌ చేస్తుంటా. టీషర్టూ, జీన్స్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. వాచీలూ, కూలింగ్‌ గ్లాసెస్‌ అయితే ఎక్కడ కనిపించినా కొనేస్తా. మా ఇంట్లో ఓ వాచీల షాపే ఉంది. ఖరీదైనవి కానక్కర్లేదు.. చూడ్డానికి బాగుంటే చాలు. ఓసారి దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్నా. ‘దుబాయ్‌లో కొనడానికి ఇదే దొరికిందా?’ అని స్నేహితులంతా ఆటపట్టించారు. ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ప్రపంచం మొత్తం చుట్టేయాలన్నది నా కోరిక. అన్ని దేశాల వీసాలూ సిద్ధంగా ఉంటాయి. కనీసం పది రోజుల ఖాళీ దొరికితే చాలు.. ఏదో ఓ దేశం చెక్కేస్తా. టర్కీ, ఇస్తాంబుల్‌ నా ఫేవరెట్స్‌

ఆది

వినాయక్‌ అన్నతో ఎప్పుడు సినిమా చేసినా... హాయిగా ఉంటుంది. తనేదో దర్శకుడనీ , నేనేదో కథానాయకుడిననీ అనుకోం. తన దగ్గర అంత స్వేచ్ఛ ఉంటుంది. నా మూడో సినిమా.. ‘ఆది’. నా కెరీర్‌కి మేలి మలుపు అని చెప్పొచ్చు. మాస్‌కి నన్ను బాగా దగ్గర చేసింది. ‘అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా’ అనే డైలాగ్‌ ఎంత పాపులరో చెప్పక్కర్లేద్దు.

సింహాద్రి

నా సినీ ప్రయాణంలో మర్చిపోలేని చిత్రమిది. కొన్నాళ్ల పాటు... ఆ పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలూ నన్ను వెంటాడాయి. నటుడిగా, స్టార్‌గా ఒక్కసారిగా వంద మెట్లు ఎక్కించింది.

నాన్నకు ప్రేమతో

నా 25వ చిత్రమని కాదుగానీ...నా మనసుకి బాగా దగ్గరైన కథ ఇది. కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు నిజంగానే ఏడ్చేశాను. వెంటనే నాన్నని చూడాలనిపించేది. మా నాన్నకే కాదు, నాన్నలందరికీ అంకితమిచ్చేంత గొప్ప చిత్రమిది.

టెంపర్‌

చాలా కాలంగా నా ఖాతాలో విజయాల్లేవు. ఆ దశలో నా అభిమానులు మళ్లీ గర్వపడేలా, కాలర్‌ ఎగరేసేలా ఓ సినిమా చేయాలనుకొన్నా.. ఆ దశలోనే ‘టెంపర్‌’ వచ్చింది. మంచి సినిమాలు తీస్తే జనం తప్పకుండా చూస్తారన్న భరోసా ఇచ్చింది.

రాఖీ

నాలోని నటుడికి అత్యంత సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘రాఖీ’. కృష్ణవంశీ అంటేనే నటుల్ని పిండేసే దర్శకులు. నన్నూ అలానే తీర్చిదిద్దారు. అభిమానుల్ని చెల్లెమ్మలుగా మార్చిన చిత్రమిది.

నాన్నగా మారిన క్షణాలు


స్విట్జర్లాండ్‌లో ‘రభస’ షూటింగ్‌లో ఉన్నా. తనకి నొప్పులొస్తున్నాయని తెలిసి, షూటింగ్‌ మొత్తం ఆపేసి, విమానం ఎక్కి.. హైదరాబాద్‌లో కాలుపెట్టా. అలా వెళ్లానో, లేదో.... కాన్పు జరిగిపోయింది. బాబుని తీసుకొచ్చి చేతిలో పెట్టినప్పుడు.. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ అనుభూతిని వర్ణించలేను.. నిజానికి అమ్మాయి పుడుతుందేమో అనుకునేవాడ్ని. అమ్మాయి పుట్టాలని లోలోపల ఆశ. తీరా చూస్తే.. బాబు. మొత్తానికి నాన్ననైపోయా. ‘అభయ్‌’ అనే పేరుపెట్టుకున్నాం. అభయ్‌ అంటే భయం లేనివాడు, అభయమిచ్చేవాడు.. ఇలా రెండు అర్థాలూ వస్తాయి. ఇప్పుడు వాడితోనే నా లోకం. స్టార్‌ కిడ్‌ అనే బరువు... వాడికొద్దు. నలుగురితో కలిస్తేనే ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. చిన్నప్పుడు నేనూ అంతేగా..

- మహమ్మద్‌ అన్వర్‌
ఫొటోలు: మధు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.