close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అల్పాహారం ఇలా తిందాం

అల్పాహారం ఇలా తిందాం 

చాలామంది అల్పాహారం అనగానే ఓ నాలుగు ఇడ్లీలో దోసెలో లాగించేసి అమ్మయ్య అనుకుంటారు. కానీ అల్పాహారం తీసుకునే విధానం అది కాదు అంటున్నారు పోషకనిపుణులు. ఇడ్లీలూ దోశెల్లో పిండిపదార్థాలే ఎక్కువ. అందుకే అవి ఒకటో రెండో తీసుకుని, వాటికి జతగా ఫ్యాటీఆమ్లాలూ యాంటీఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉండే గుడ్లూ నట్సూ పండ్లతోబాటు కాఫీ లేదా టీ కూడా తీసుకోవాలి అంటున్నారు. ఎందుకో చూద్దామా...
* ఇడ్లీ, ఉప్మా ఏది తిన్నా వాటితోబాటు గుడ్డూ తినాలి. గుడ్డులో ప్రొటీన్‌ శాతం ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం, హృద్రోగాలు ఉన్నవాళ్లు ఓ గుడ్డు తింటే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ పెరిగి, బరువు తగ్గుతారు.
* ఉదయాన్నే యాంటీఆక్సిడెంట్లూ; మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలూ; ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ ఉండే బాదం, వేరుసెనగ వంటి గింజలూ తినేవాళ్లలో మరణాల రేటు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది.
* తక్కువ క్యాలరీలూ ఎక్కువ పీచూ, యాంటీఆక్సిడెంట్లూ ఉండే స్ట్రాబెర్రీలూ బ్లూబెర్రీలూ బ్లాక్‌బెర్రీలూ... వంటివి తినడం వల్ల హృద్రోగాలు రావని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. వీటిని ఓట్‌మీల్‌తో కలిపి తిన్నా మంచిదేనట. అలాగే పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండును అల్పాహారంలో చేర్చడం బీపీ రోగులకి చాలా మంచిది. ప్రొటీన్లూ, ఫ్యాటీ ఆమ్లాలూ ఉండే అవిసె గింజలపొడిని కూడా అల్పాహారం మీద చల్లుకుంటే క్యాన్సర్లూ షుగర్‌ రాకుండా ఉంటాయి.
* అల్పాహారంతోబాటు కాఫీ లేదా టీ తాగడమూ మంచిదే. వాటిల్లోని కెఫీన్‌, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్ల కారణంగా పొట్టలో మంట తగ్గుతుంది. అదే సమయంలో మధుమేహం కూడా త్వరగా రాదు అని తేలిందట. సో, ఇవన్నీ కలిసినదే సంపూర్ణ అల్పాహారం అన్నమాట.


పిల్లల్ని శాసించకండి..!

కౌమారదశలో ఉన్న పిల్లలమీద తల్లిదండ్రులు తమ ఇష్టాయిష్టాలను బలవంతంగా రుద్దుతుంటారు. టీనేజీలో పిల్లలను అలా శాసించడంవల్ల అప్పటికి వాళ్లు అవన్నీ చేసినప్పటికీ ఆ తరవాతి దశలో చాలా ఇబ్బందులకి గురవుతారనీ ఓరెగాన్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. టీనేజీలో మెదడు మీద పడే ఒత్తిడి కారణంగా పెద్దయ్యాక కూడా వాళ్లు ఏ విషయంలోనైనా చిన్న రిస్కు తీసుకోవాలంటే కూడా భయపడుతుంటారని తేలిందట. ఇందుకోసం వీళ్లు 11 నుంచి 18 ఏళ్ల వయసులోని పిల్లల్ని ఎంపిక చేసి వాళ్లతో ఇష్టంలేని పనుల్ని చేయిస్తున్నప్పడు మెదడు పనితీరుని నిశితంగా గమనించారట. ఆ తరవాత మరో పదేళ్లకి వాళ్ల ప్రవర్తననీ భావోద్వేగాల్నీ పరిశీలించగా ఆ వయసులో అధిక ఒత్తిడికి గురయిన పిల్లలు తరవాత కూడా సరైన నిర్ణయం తీసుకోవడానికీ సాహసంతో కూడిన పనిచేయడానికీ భయపడుతున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి పిల్లలతో ఏ పని అయినా బలవంతంగా చేయించడం వల్ల దుష్ఫలితాలే ఎక్కువ అంటున్నారు సదరు పరిశోధకులు.


ఊబకాయులకి రుచి తెలియదా?

సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఊబకాయంతో బాధపడేవాళ్లలో రుచి మొగ్గలు తగ్గిపోతాయని కార్నెల్‌ విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తేలింది. ఇందుకోసం వీళ్లు ఎలుకల్లో చేసిన అధ్యయనంలో ఊబకాయం ఉన్న ఎలుకల్లో టేస్ట్‌బడ్స్‌ 25 శాతం తక్కువగా ఉన్నాయని గుర్తించారు. అదెలా అంటే- ముందుగా వీళ్లు కొన్ని ఎలుకల్ని తీసుకుని రెండు విభాగాలుగా చేసి, దాదాపు ఎనిమిది వారాలపాటు ఒక గ్రూపు ఎలుకలకి అధిక కొవ్వులు ఉండే ఆహారాన్నీ, మరో గ్రూపు ఎలుకలకి సాధారణ ఆహారాన్నీ పెట్టారట. అయితే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్న ఎలుకల్లో రెండు నెలలకే టేస్ట్‌ బడ్స్‌ 25 శాతం తగ్గినట్లు గుర్తించారు. రుచిమొగ్గలు అనేవి నరాల చివరి భాగంలో ఉండే కణాలు అన్నది తెలిసిందే. ఇవి సాధారణంగా 50 నుంచి 100 వరకూ ఉంటాయి. ఊబకాయం కారణంగా జీవక్రియావేగం దెబ్బతినడంతో వాటి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ శాతం పెరిగి, ఆయా కణాలు నశించినట్లు తెలుసుకున్నారు. ఆ కారణంగానే ఊబకాయులు వంటల్లో రుచికోసం మరికాస్త నెయ్యీ, ఉప్పూ వేసుకుంటారనీ ఫలితంగా మరింత బరువు పెరుగుతుంటారనీ వివరిస్తున్నారు.


ఉపవాసం మంచిదే

వారానికోరోజు ఉపవాసం చేయడం మంచిదనీ క్రమం తప్పక ఉపవాసం చేసేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారనీ అనడం తెలిసిందే. అందుకుగల కారణాన్ని శాస్త్రపూర్వకంగా వివరిస్తున్నారు అట్లాంటాలోని జార్జియా స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పైగా ఉపవాసంవల్ల వృద్ధాప్యం దరిచేరదనీ ఎప్పటికీ యౌవనోత్తేజంతో ఉంటారని కూడా చెబుతున్నారు. ఈ విషయమై చేసిన పరిశోధనల్లో- ఉపవాసం చేయడం లేదా తక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల వాటిల్లో బీటా-హైడ్రాక్సీబ్యుటిరేట్‌ అనే కీటోన్‌ ఉత్పత్తి అవుతుందని తేలింది. ఇది రక్తనాళాలమీద వయసు ప్రభావం పడకుండా కాపాడుతుందనీ, దాంతో వృద్ధాప్యం ఆలస్యం కావడంతోబాటు వయసుతోపాటు వచ్చే హృద్రోగం, క్యాన్సర్‌, ఆల్జీమర్స్‌... వంటివన్నీ రావడం కూడా తగ్గుతుందనీ వారు చెబుతున్నారు. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.