close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊరు ఊరంతా కళ్లు దానమిచ్చింది!

ఊరు ఊరంతా కళ్లు దానమిచ్చింది!

దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు... కానీ ఆ పూట కడుపునింపే అన్నదానం కంటే జీవితాంతం వెలుగునిచ్చే నేత్రదానం ఇంకెంతో గొప్పదని గుర్తించారు ఆ గ్రామస్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఊరు ఊరంతా నేత్రదానం చేసింది. పత్రాల మీద రాసివ్వడమే కాదు, ఇచ్చిన మాటమీద నిలబడుతూ, చనిపోయినవాళ్ల కళ్లను దానంగా ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవునిఎర్రవెల్లి కథ ఇది...మామూలుగా బట్టలో, డబ్బులో, బియ్యమో దానంగా ఇవ్వడం వేరు. కానీ శరీరంలోని ఒక అవయవాన్ని దానంగా ఇవ్వాలనుకోవడం వేరు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దామనుకున్న వ్యక్తే కాదు, ఆ ఇంటి మనుషులూ ఆ దానానికి ఒప్పుకోవాలి. చనిపోయిన బాధలో ఉండి ఆసుపత్రులకు ఫోన్‌ చేసి కళ్లను తీసుకెళ్లండని చెప్పాలంటే చాలా పెద్ద మనసే ఉండాలి. కానీ ఒక కుటుంబమో ఒక వ్యక్తో కాదు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవునిఎర్రవెల్లి ఊరు ఊరంతా ఈ దానానికి ముందుకొచ్చింది. తమ ఊళ్లో చనిపోయిన ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి వెలుగు దారులు చూపే అవకాశాన్నిచ్చేలా ఆలోచన చేసింది.చిన్నా పెద్దా...
దేవునిఎర్రవెల్లి గ్రామ జనాభా దాదాపు 2360 మంది. ఈ ఊరిలో చిన్నా.. పెద్దా.. అందరూ కలిసి తమ నేత్రాలను దానం చేస్తామంటూ ముందుకొచ్చారు. మనిషి చనిపోయాక 6 నుంచి 8 గంటల్లోపు నేత్రాలను తీయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం జరిగినా అవి పనికి రాకుండా పోతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనసులోని బాధను దిగమింగుకుని తమవారి నేత్రాలను దానం చేసి స్ఫూర్తిని చాటుతున్నారు. 2010లో మొదలైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ చనిపోయిన 23 మంది నేత్రాలను వారి కుటుంబసభ్యులు దానం చేశారు.
అడుగు పడిందిలా..
నిజానికి 2006కు ముందు గ్రామం రెండు వర్గాలుగా విడిపోయి గందరగోళంగా ఉండేది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన చింపుల సత్యనారాయణరెడ్డి గ్రామాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ఊళ్లో కావలి చంద్రయ్య అనే వ్యక్తి చూపు లేక ఇబ్బందిపడుతుండేవాడు. 2010 జులైలో ఒకరోజు చాకలి ఎల్లయ్య అనే వ్యక్తి గ్రామంలో చనిపోయాడు. అతని శవయాత్ర జరుగుతున్న సమయంలోనే చంద్రయ్య చూపు లేక ఇబ్బంది పడుతూ ఎదురుగా వచ్చాడు. అదే సమయంలో సత్యనారాయణరెడ్డికి ఓ ఆలోచన వచ్చింది. చనిపోయిన వ్యక్తి నేత్రాలను వృథాగా మట్టిలో కలిపేకంటే నేత్రదానం చేస్తే చంద్రయ్య లాంటి వారెందరికో చూపు వస్తుంది కదా అని అనుకున్నాడు. ఆ ఆలోచనను తర్వాత జరిగిన గ్రామసభలో ఊరి వాళ్లతో పంచుకున్నాడు. అయితే... నేత్రదానం అనేసరికి ముందుగా గ్రామస్థులు అయిష్టత చూపారు. కళ్లను తీసి దహనం చేస్తే అది పాపమంటూ కొందరు వెనుకడుగు వేశారు. కానీ సత్యనారాయణరెడ్డి వదల్లేదు. సాధ్య పరివార్‌ సంస్థ, యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులతోపాటు చదువుకున్న యువతను ఒకచోట చేర్చి వాళ్లకు ఇందులోని మంచిని విడమరిచి చెప్పి... వారి ద్వారా ఇంటింటికీ వెళ్లి నేత్రదానం పట్ల అవగాహన కల్పించాడు. కళ్లను దానం చేస్తే కలిగే ప్రయోజనాలు వివరించాడు. క్రమంగా అందరిలోనూ మార్పు వచ్చింది. చిన్నపిల్లలు మొదలుకుని పెద్దవాళ్ల వరకూ 2010 సెప్టెంబరు 7న హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి వచ్చి నేత్రదానం చేస్తున్నట్లు తమ అంగీకారపత్రాలను అక్కడి వైద్యాధికారులకు అందించారు.ఇచ్చిన మాటకు కట్టుబడి...
అదే ఏడాది డిసెంబరులో పాటి అంతిరెడ్డి అనే వ్యక్తి గ్రామంలో చనిపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం అతని కుటుంబసభ్యులు అంతిరెడ్డి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వెంటనే సరోజినీ దేవి ఆసుపత్రికి సమాచారం అందించారు. వాళ్లు వచ్చి నేత్రాలు సేకరించుకుని వెళ్లారు. అలా మొదలైన ప్రక్రియ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ 23 మంది నేత్రదానం చేశారు. తొలుత సరోజినీ దేవి ఆసుపత్రికి సమాచారం అందిస్తుండగా తర్వాత అక్కడ వైద్య సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దానకిశోర్‌ చొరవతో ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రికి సమాచారం అందించారు. అప్పట్నుంచీ వారు వచ్చి నేత్రాలు సేకరిస్తున్నారు.అదే స్ఫూర్తి...
నేత్రదాన కార్యక్రమం కేవలం దేవునిఎర్రవల్లికే పరిమితం కాలేదు. ఆ గ్రామ స్ఫూర్తితో చేవెళ్ల మండలానికి చెందిన ఇక్కారెడ్డిగూడ గ్రామస్థులందరూ నేత్రదానం చేశారు. రెండున్నరేళ్ల కిందట ఈ గ్రామస్థులు తమ నేత్రాలు దానం చేస్తామంటూ అంగీకారపత్రాలు ఇచ్చారు. ఇప్పటివరకూ చనిపోయిన ఆరుగురి నేత్రాలను వారి కుటుంబసభ్యులు దానం చేశారు. అంతేకాదు, హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లి, చిలుకూరుల గ్రామస్థులూ ఈ సత్కార్యపు స్ఫూర్తిని అందుకుని హామీ పత్రాలు ఇచ్చారు.

- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.