close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మావారి మంచితనం

మావారి మంచితనం

- సి.ఎన్‌.చంద్రశేఖర్‌

రోజు మార్కెట్‌ దగ్గర సంపూర్ణ కనిపించింది’’ అన్నాడు సుకుమార్‌ భార్య గీతతో. ‘‘ఎవరు, మన సంపూర్ణా!’’ అడిగింది గీత. ‘‘అవును. తనకు మన ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అయిందట. నెలరోజుల క్రితమే ఆఫీసులో రిపోర్ట్‌ చేసిందట. మార్కెట్‌ దగ్గర్లోనే ఓ ఇల్లు బాడుగకు తీసుకుందట.’’ ‘‘నెలరోజులైతే మరి మన ఇంటికి రాలేదు. కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. అడగలేకపోయారా?’’ ‘‘లేదు. మన ఇంటికి రమ్మని మాత్రం చెప్పాను’’ ముభావంగా అన్నాడు సుకుమార్‌. సంపూర్ణ ప్రవర్తన భర్తను బాధించిందని అర్థమైంది ఆమెకి.సంపూర్ణ సుకుమార్‌ తల్లి తరఫున తమకు దూరపు బంధువు. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. తండ్రి బట్టల షాపులో క్యాషియర్‌. సంపూర్ణ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకుని చక్కగా చదువుకుంది. డిగ్రీ పాసయ్యాక సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలో పాసై రెవెన్యూ డిపార్ట్‌మెంటులో ఉద్యోగం సంపాదించుకుంది. కొన్నాళ్ళ తరవాత సహోద్యోగి కిరణ్‌ని ప్రేమించింది. ఇరువైపుల పెద్దలూ అంగీకరించటంతో పెళ్ళి కుదిరింది. తమకు కట్నకానుకలు వద్దనీ, పెళ్ళి మాత్రం సంప్రదాయ పద్ధతిలో జరిపించమనీ కిరణ్‌ తల్లిదండ్రులు కోరారు. తమవైపు బంధువులెవరూ లేకపోవడంతో వృద్ధుడైన తండ్రి ఈ పెళ్ళి ఎలా జరిపించగలడని సంపూర్ణ ఆలోచిస్తున్న తరుణంలో సుకుమార్‌ రంగంలోకి దిగాడు. కల్యాణ మండపం బుక్‌ చెయ్యడం దగ్గర్నుంచీ ఆమెను అత్తగారింటికి పంపేదాకా అన్ని పనులూ చూసుకున్నాడు.
సంపూర్ణ పెళ్ళయిన వారం రోజుల తర్వాత సుకుమారూ తనూ సంపూర్ణ ఇంటికెళితే నవ్వుతూ ఆహ్వానించింది.
తాము కూర్చున్నాక ‘‘మీ ఇద్దరికీ చాలా చాలా థ్యాంక్స్‌’’ అంది చేతులు జోడిస్తూ.
‘‘భలేదానివే. థ్యాంక్స్‌ ఎందుకు? ఆత్మీయులన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోరా’’ అన్నాడు సుకుమార్‌.
‘‘కానీ, నువ్వు చేసింది మామూలు సహాయమా అన్నయ్యా... నా పెళ్ళయినరోజే మా కొలీగ్‌ రజిత పెళ్ళయింది. ఆమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. పెళ్ళి పందిట్లో పనులు పంచుకోకుండా గొడవపడ్డారట. నావల్ల కాదంటే నావల్ల కాదని తప్పించుకు తిరిగారట. నిన్న లంచ్‌ రూములో పాపం ఏడుస్తూ చెప్పింది. ‘సుకుమార్‌ అన్నయ్య ముందుండి నా పెళ్ళి జరిపించాడు. ఇంతకూ అతను నా అన్న కాదూ తమ్ముడూ కాదు... ఎక్కడో దూరపు బంధుత్వం. అయినా, సొంత అన్న కంటే ఎక్కువగా చేశాడు’ అని నేను చెప్పాను. మా కొలీగ్స్‌ నిన్ను చాలా మెచ్చుకున్నారు’’ అంది సంపూర్ణ.
‘‘ఆయన నిన్ను సొంత చెల్లెలుగానే భావించారు సంపూర్ణా’’ అంది తను.
‘‘నాకు తెలుసు వదినా, పెళ్ళిలో భోజనాల దగ్గర గొడవ తలెత్తినప్పుడు అన్నయ్యని పిలిచి ‘విషయం ఏమిట’ని అడిగాను. ‘అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నీ పెళ్ళి ఎంజాయ్‌ చెయ్యి’ అన్నాడు. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి’’ అంది సంపూర్ణ.
‘మరి అంత సహాయం చేశాడని తనే ఒప్పుకున్న సంపూర్ణ... ఈరోజు సుకుమార్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? తను పుట్టింటికి వచ్చినప్పుడల్లా తమకు చెప్పాలని కాదు కానీ, ఇక్కడే ఉద్యోగంలో చేరి నెలరోజులైనా ఆ విషయం చెప్పకపోవడం ఏమిటీ...’ అనుకుంది గీత.
రాత్రి భోజనాలయ్యాక ఈజీ ఛైర్‌లో కూర్చున్న భర్తని చూసి ‘‘ఇంకా సంపూర్ణ గురించే ఆలోచిస్తున్నారా?’’ అని అడిగింది.
‘‘లేదు. విషయం తెలియగానే బాధేసింది, అంతే.’’
‘‘మీరు సంపూర్ణ నుంచి కృతజ్ఞత ఆశించారా?’’
‘‘ఛఛ... ఏదో ఆశించి చేసినదాన్ని సహాయం అనరు, వ్యాపారం అంటారు. నేనేది చేసినా వాళ్ళు బాగుండాలనే తపనతోనే చేస్తాను.’’
‘‘మరి ఎందుకు బాధపడ్డారు?’’
‘‘సంపూర్ణ మన మనిషి అనుకున్నాం. తను అలా అనుకోవడంలేదని తెలిసి బాధేసింది.’’
‘‘మీరు అలా అనుకోవడం మానేయండి. ఎవరి గురించీ ఎక్కువ ఆలోచించకండి. ఎవరితోనూ బంధాలు పెంచుకోకండి. ఎవరైనా సహాయం అడిగితే చేయండి. లేదంటే హాయిగా ఇంట్లో కూర్చోండి. మనుషులు వేగంగా మారిపోతున్నారు. మనమూ మారాలి’’ అంటూ లేచి బయట గేటు దగ్గరికి వెళ్ళివచ్చి ‘‘గేటు దగ్గర లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. మీరు ఆర్పేశారనుకుని నేనూ ఆ వైపు వెళ్ళలేదు. టైము తొమ్మిదయింది ఇప్పుడు’’ అంది గీత నిష్ఠూరంగా.
‘‘ఈరోజు ఎందుకో వీధి దీపాలు వెలగలేదు. మన వీధిలో నడిచే ఆడపిల్లలకు కాస్త ధైర్యంగా ఉంటుందని లైట్లు అలాగే ఉంచేశాను’’ అన్నాడు సుకుమార్‌.
గీతకు నవ్వు వచ్చింది. ఆమె ఎందుకు నవ్వుతుందో సుకుమార్‌కు అర్థమై అతనూ నవ్వేశాడు.  

* * * * * * * * * *

సుకుమార్‌, గీతలకు షష్ఠిపూర్తి ఉత్సవం జరిపించాలని వారి పిల్లలు గౌతమ్‌, రమ్యలు ఉత్సాహపడ్డారు. ఓ హోటల్‌లో ఆ వేడుకకు ఏర్పాట్లుచేసి, బంధుమిత్రుల్ని ఆహ్వానించి, గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు.
మరుసటిరోజు పార్టీ విశేషాలు - కొడుకూ కోడలూ కూతురూ అల్లుడూ ముచ్చటించుకుంటూంటే వింటూ కూర్చున్నారు గీత, సుకుమార్‌.
ఉన్నట్టుండి రమ్య ‘‘అమ్మా, నిన్న పార్టీకి రాజీ అక్క రాలేదు... గమనించావా?’’ అని అడిగింది తల్లిని.
‘‘అవును గమనించాను. బహుశా బెంగళూరు వెళ్ళిపోయిందేమో’’ అంది గీత.
‘‘లేదు. ఊర్లోనే ఉంది.’’
‘‘నీకెలా తెలుసు?’’
‘‘తనని నిన్న సినిమా థియేటర్‌లో చూశానని నా ఫ్రెండ్‌ శిరీష చెప్పింది.’’
ఆశ్చర్యంతో నోరు తెరిచింది గీత.
రాజీ అంటే సుకుమార్‌ చిన్న మేనమామ మురళి కూతురు రాజ్యలక్ష్మి. చాలా రోజులు ఆ అమ్మాయికి పెళ్ళి కాకపోతే సుకుమార్‌ బంగారం లాంటి సంబంధం తెచ్చాడు. రాజీ పెళ్ళి బాధ్యత అంతా నెత్తిన వేసుకుని ఎండనకా వాననకా తిరిగి జరిపించాడు. రాజీ భర్తతోపాటు పలు దేశాలు తిరిగింది. బెంగళూరులో రెండు ఇళ్ళు కొంది. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది.
‘రాజీ ఫంక్షన్‌కి ఎందుకు రాలేదు? సుకుమార్‌ వల్ల అంత మేలు పొంది, అతని ఫంక్షన్‌కి రాకుండా సినిమాకు వెళ్ళడమేమిటి? తాము ఫంక్షన్‌కి పిలవడానికి మురళి ఇంటికెళ్ళినప్పుడు రాజీ ఊరినుంచి వచ్చిందనీ అప్పుడు షాపింగ్‌కు వెళ్ళిందనీ తెలిసింది. ఫంక్షన్‌కి రాజీని కూడా పిలుచుకురమ్మనీ తాము తర్వాత తనకు ఫోన్‌ చేస్తామనీ మురళికి చెప్పి వచ్చారు. తర్వాత పనిలోపడి ఫోన్‌ చెయ్యడం మర్చిపోయారు. తాము పిలవలేదని రాజీ రాలేదా? తాము చేసిన చిన్న పొరబాటును అంతగా పట్టించుకోవాలా?’ అనుకుని బాధపడింది.
తర్వాత సుకుమార్‌ వైపు చూసింది. అతని ముఖంలోనూ ఒకింత ఆశ్చర్యం, కాసింత బాధ కనిపించాయి.  

* * * * * * * * * *

గీతకు సుకుమార్‌ చిన్నప్పట్నుంచే పరిచయం. ఇద్దరి తండ్రులూ రైల్వే డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసేవారు. రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండేవారు. బీకాంలో గీత, సుకుమార్‌ క్లాస్‌మేట్స్‌. చదువులో అతని చురుకుదనం, క్రికెట్‌లో అతని ప్రావీణ్యం చూసి అతనిపై హీరోవర్షిప్‌ పెంచుకుంది. ప్రయత్నపూర్వకంగా అతనికి దగ్గరైంది. అప్పుడు ఆమెకు అతనిలో ఉన్న మరో గుణం కనిపించింది. ఎవరికి ఏ అవసరమొచ్చినా ముందువెనకలు చూడకుండా వెంటనే స్పందించే తత్వం అతనిది. అంత చిన్న వయసులోనే ఆ తత్వం ఉండటం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అది అతనిపైన ఇష్టాన్ని మరింత పెంచింది. ఆమె ప్రేమకు అతనూ స్పందించాక విషయం పెద్దవాళ్ళకు తెలిసింది. వాళ్ళూ అభ్యంతరపెట్టలేదు. కాకపోతే చదువును నిర్లక్ష్యం చెయ్యొద్దని హెచ్చరించారు. ఇద్దరూ తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు.

అది నీ బలహీనత కాదు... బలం. నువ్వు ఇలా ఉండటమే నాకిష్టం సుకుమార్‌. నాకోసం నువ్వు మారనక్కరలేదు. నేను తమాషాకు అలా అన్నాను. నువ్వు నన్ను అడవిలో వదిలేసి వెళ్ళినా నా క్షేమం నేను చూసుకోగలను.

ఓసారి గీత బర్త్‌డేకి పార్టీ ఇస్తానని హోటల్‌కి పిలుచుకెళ్ళాడు సుకుమార్‌. డిన్నర్‌ ముగించబోతున్న సమయంలో ఓ స్నేహితుడు వచ్చి మరో స్నేహితుడికి యాక్సిడెంట్‌ అయిందని చెప్పగానే బుల్లెట్‌లా బయటికి వెళ్ళిపోయాడు సుకుమార్‌. అలా వెళ్ళినతను మళ్ళీ మూడు రోజుల తరవాత కనిపించాడు.
‘‘ఎలా ఉన్నాడు మీ ఫ్రెండు?’’ అని అడిగింది గీత.
‘‘కాలు ఫ్రాక్చరైంది. ఈ మూడు రోజులూ హాస్పిటల్‌లో వాడితోనే ఉన్నాను. కాశీకి వెళ్ళిన వాడి తల్లిదండ్రులు ఈరోజే వచ్చారు. నేను రిలీవ్‌ అయ్యాను’’ అన్నాడు సుకుమార్‌.
‘‘ఆరోజు హోటల్‌ బిల్లు ఎవరు కట్టారో తెలుసా?’’
‘‘ఓహ్‌ సారీ, నేను పార్టీ ఇస్తానని పిలిచి నీచేత బిల్లు కట్టించాను.’’
‘‘ఆరోజు నువ్వు పక్కనున్నావని నేను పర్సు తీసుకురాలేదు.’’
‘‘మరి ఏం చేశావు?’’
‘‘పిండి రుబ్బాను.’’
‘‘ఛ, నిజం చెప్పు.’’
‘‘మా నాన్న తన ఫ్రెండ్స్‌తో ఆ హోటల్‌లోనే కనిపించాడు. ఆయన దగ్గర తీసుకున్నాను.’’
‘‘ఫర్వాలేదు. మన పెళ్ళికి నాకివ్వబోయే కట్నంలో ఆ మొత్తం తగ్గించుకోమను’’ నవ్వుతూ అన్నాడు.
‘‘మా నాన్న కనిపించి ఉండకపోతే నా పరిస్థితి ఏమిటీ?’’ సీరియస్‌గా చూస్తూ అడిగింది.
సుకుమార్‌ ఏం మాట్లాడలేదు.
‘‘మన పెళ్ళయ్యాక మనం ఏ ఊటీలోనో కాశ్మీర్‌లోనో ఉన్నప్పుడు ఇలాంటి వార్త వస్తే, నువ్వు అలా పరుగెడితే... నా గతేంటి?’’
అతను బాధగా ఆమెవైపు చూస్తూ ‘‘ఇది నా బలహీనత. ప్రయత్నించినా మానుకోలేను. అయితే దీనివల్ల నువ్వు ఇబ్బందిపడకూడదు. లోకంలో మంచివాళ్ళకు కొదవలేదు. నిన్ను బాగా చూసుకునే మరో వ్యక్తిని చూసి పెళ్ళాడు’’ అన్నాడు.
నవ్వేసింది గీత.
‘‘అది నీ బలహీనత కాదులే... బలం. నువ్వు ఇలా ఉండటమే నాకిష్టం సుకుమార్‌. నాకోసం నువ్వు మారనక్కరలేదు. నేను తమాషాకు అలా అన్నాను. నువ్వు నన్ను అడవిలో వదిలేసి వెళ్ళినా నా క్షేమం నేను చూసుకోగలను. నీ మంచితనం నన్ను ఎటువంటి ఇబ్బందినుంచైనా కాపాడుతుంది’’ అంది గీత.
సుకుమార్‌ ముఖం ఆనందంతో వెలిగింది. ‘‘థాంక్యూ’’ అంటూ ఆమె చేయి అందుకుని సున్నితంగా నొక్కాడు.

* * * * * * * * * *

పెళ్ళయ్యాక కూడా సుకుమార్‌ సేవానిరతి నిరాటంకంగా కొనసాగింది. అతని తీరువల్ల తనకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ అతన్ని కోపగించుకోవడంగానీ, నిరుత్సాహపరచడంగానీ చేయలేదు. పిల్లలు కూడా అతని పద్ధతిని అర్థంచేసుకుని గౌరవించారు. ఇన్నేళ్ళ తరవాత అతనికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎవరినైతే తనవాళ్ళని భావించి పదేపదే ఆదుకున్నాడో వారే అతన్ని నిర్లక్ష్యం చెయ్యడం, అగౌరవపరచడం తట్టుకోలేకపోతున్నాడు. తాజాగా జరిగిన ఓ విషయం అతన్ని మరింత బాధపెట్టింది.
తమ వీధిలో ఉండే పరంధామయ్య కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంటులో పనిచేసేవాడు. ఆరునెలల కిందట ఆయన యాక్సిడెంట్‌లో మరణించాడు. భార్యా కొడుకూ ఉన్నారు ఆయనకు. సుకుమార్‌ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆయన టెర్మినల్‌ బెనిఫిట్సూ పెన్షనూ భార్య సుశీలకు వెంటనే వచ్చేందుకు ఆఫీసుల చుట్టూ తిరిగాడు. తనకు తెలిసిన అడ్వకేటుకు యాక్సిడెంట్‌ కేసు అప్పగించాడు. అంతా చేరి నలభై లక్షలు ఆ కుటుంబానికి అందింది. పరంధామయ్య డెత్‌ సర్టిఫికేట్స్‌ కోసం, కోర్టు ఖర్చుల కోసం తన డబ్బు పదివేలదాకా ఖర్చుపెట్టాడు సుకుమార్‌. వారికి రావలసిన డబ్బులన్నీ వచ్చాక పరంధామయ్య కొడుకు లోకేష్‌కు విషయం చెప్పి, ఆ వివరాలను ఓ కాగితంలో రాసిచ్చాడు.
నెలరోజుల తర్వాత లోకేష్‌ ఫోన్‌ చేసి ‘‘అంకుల్‌, డబ్బులు అమ్మ చేతికి ఇచ్చాను. మీరు వెళ్ళి తీసుకోండి’’ అని చెప్పాడు సుకుమార్‌తో.
సుకుమార్‌కు బాధ మాత్రమే కలిగింది, తనకైతే ఒళ్ళు మండింది. ఆ అబ్బాయిది హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.
అయితే ప్రతి వీకెండ్‌కీ తల్లి దగ్గరకు వస్తాడు. అలా వచ్చినప్పుడు తనే ఇంటికి వచ్చి డబ్బు ఇస్తే ఎంత మర్యాదగా ఉంటుంది? తనకన్నా వయసులో పెద్ద అయిన వ్యక్తితో అలా ఎలా మాట్లాడతారు’ అనుకుని రుసరుసలాడింది తను.
గత కొద్దిరోజులుగా మనుషుల తత్వాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్న గీతకి ఓ విషయం అర్థమైంది. గతంలో మనుషుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అందువల్ల మరో మనిషి సాయం అవసరమయ్యేది. అందుకే వారు మనుషుల విలువను గుర్తించారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలబడేవారు. తమకు సహాయం చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుని గౌరవించేవారు. పైగా కాలక్షేపం కోసం, తమ ఆలోచనలు పంచుకోవడం కోసం మనుషుల అవసరం ఉండేది. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బు ఉంది. అది ఇచ్చే భరోసా ఉంది. డబ్బుతో దేన్నైనా కొనగలమనే ధీమా ఉంది. అన్ని కార్యాలకూ కాంట్రాక్ట్‌లూ ప్యాకేజీలూ వచ్చేశాయి. ఇక స్నేహితులతో బంధువులతో పనేముంది? కాలక్షేపానికి టీవీ, మొబైల్‌ ఉన్నాయి. ఆలోచనలు పంచుకోవడానికి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నేను-నా కుటుంబం అంటూ గీత గీసుకుని, దాన్ని దాటి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఒకరికి సాయం చేయడం కాదు కదా... పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా వారు ఇష్టపడటం లేదు- అనుకుంది.

ఇన్నాళ్ళూ సుకుమార్‌ సేవలకు తను అడ్డు చెప్పకపోయినా పెద్దగా సాయపడింది లేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఎవరి ప్రవర్తనవల్ల సుకుమార్‌ బాధపడుతున్నాడో వారి ఆలోచనలో మార్పు కోసం ప్రయత్నించాలి.

అప్పుడే ఆమెకు తన కర్తవ్యమేమిటో కూడా బోధపడింది. ‘ఇన్నాళ్ళూ సుకుమార్‌ సేవలకు తను అడ్డు చెప్పకపోయినా పెద్దగా సాయపడింది లేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఎవరి ప్రవర్తనవల్ల సుకుమార్‌ బాధపడుతున్నాడో వారి ఆలోచనలో మార్పు కోసం ప్రయత్నించాలి. మంచి సంకల్పం తప్పక సత్ఫలితాల్ని ఇస్తుంది. ముఖ్యంగా సుకుమార్‌కి మనుషులపైన నమ్మకం పోకూడదు. అప్పుడే అతని సేవలు మరింత మందికి అందుతాయి. అతనూ సంతోషంగా ఉంటాడు’ అనుకుంది గీత.
వెంటనే సంపూర్ణకి ఫోన్‌ చేసి ‘‘ఏమిటి సంపూర్ణా, ఊరికి వచ్చి నెలరోజులయిందట, మా ఇంటికి రాలేదు... కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. పోనీ, నీ అడ్రస్‌ చెప్పు... మేమే వచ్చి నిన్ను కలుస్తాం. నాకు నిన్ను చూడాలని ఉంది’’ అంది.
‘‘వద్దు వదినా. నేనే ముందు మీ ఇంటికి రావాలి. ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. అఫ్‌కోర్స్‌ బద్ధకం కూడా ఓ కారణం. ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి తప్పకుండా వస్తాను. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి’’ అంది సంపూర్ణ.
‘‘అదేం అక్కర్లేదు. నువ్వు వస్తే ఇంటికి ఆడపడుచు వచ్చినట్లు ఫీలవుతాం మేమిద్దరం.’’
‘‘థాంక్యూ వదినా, థాంక్యూ సో మచ్‌.’’
తర్వాత రాజీకి ఫోన్‌ చేసి, క్షేమ సమాచారాలు విచారించి ‘‘నువ్వు మా షష్ఠిపూర్తి ఫంక్షన్‌కి రాలేదు. ఏదో ఇబ్బంది ఉంటే తప్ప రాకుండా ఉండవని నాకు తెలుసు. కానీ ఫంక్షన్‌లో నువ్వులేని లోటు ఫీలయ్యాం’’ అంది గీత.
‘‘సారీ వదినా, ఈసారి అనంతపూర్‌ వస్తే ముందు మీ ఇంట్లో దిగి తర్వాతే మా అమ్మా వాళ్ళ ఇంటికెళతా. సరేనా?’’ అంది రాజీ.
‘వాళ్ళు తప్పు చేశారని మనం దూరంగా ఉంటే ఆ దూరం అలాగే ఉండిపోతుంది. క్షమించి చొరవ చూపి మనమే దగ్గరైతే వాళ్ళలోనూ మార్పు వస్తుంది’ అనుకుని తృప్తిగా నిట్టూర్చింది గీత.
తర్వాత లోకేష్‌తో మాట్లాడదామని అనుకునేంతలో లోకేష్‌ గీతకి ఫోన్‌ చేశాడు.
‘‘ఆంటీ, అమ్మకు రెండు రోజులుగా జ్వరమట. డాక్టరు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతోందట. ఓసారి మీరు వెళ్ళి చూడండి ఆంటీ... ప్లీజ్‌...’’ అన్నాడు.
‘‘అలాగే. నువ్వేం కంగారుపడకు, మేము వెళ్ళి చూస్తాం.’’
‘‘ఆంటీ, అంకుల్‌ని అమ్మ దగ్గరికెళ్ళి డబ్బులు తీసుకోమన్నాను. అమ్మ నన్ను తిట్టేదాకా నేను చేసిన తప్పు నాకు తెలియలేదు. ఈ వీకెండ్‌ నేనే ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాను. అంకుల్‌కి సారీ చెప్పండి... ప్లీజ్‌!’’
‘‘అలాగే, తప్పకుండా.’’
భర్తను పిలిచి సుశీల ఆరోగ్యం గురించి చెప్పింది గీత.
డబ్బుల గురించి చెప్పేలోగానే చెప్పులేసుకుంటున్న భర్తని చూసి ‘‘మహానుభావా... కాస్త ఆగండి, నేనూ వస్తున్నాను’’ అంది పకపకా నవ్వుతూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.