close
శునకం దర్జా చూడు గురూ

శునకం దర్జా చూడు గురూ

జీవితమ్మీద విసుగొచ్చి ‘ఛీ... కుక్క బతుకైపోయింది...’ అనుకునే రోజులు పోయి, ‘కుక్కై పుట్టినా బాగుండేది’ అనుకునే రోజులొచ్చాయి. అవునుమరి, శునక ప్రేమికులు వాటిని అపురూపంగా పెంచుకోవడమే కాదు, వాటికీ విలాసవంతమైన జీవితాన్ని అందించాలని తెగ సరదాపడుతున్నారు. ఒక్కరాత్రికి రెండుమూడు వేల రూపాయలు చెల్లించడానికీ వెనుకాడటం లేదు. ఫలితమే గురుగ్రామ్‌లోని క్రిట్టెరాటి... దక్షిణాసియాలోకెల్లా విలాసవంతమైన పెట్‌ హోటల్‌..!ఆరు అంతస్తుల్లో సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ హోటల్‌, అచ్చంగా పెట్స్‌ కోసమే అంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. అక్కడికి వచ్చే టామీ, టఫీ, డూడ్‌, ఆస్కార్‌లను చూస్తే ఓ క్షణం ఎవరికైనా అసూయ కలగడమూ సహజమే. అంతేనా... పేరుకే అది హోటల్‌గానీ, అక్కడ వాటికి ఉండని సదుపాయం లేదు. పట్టు పరుపులూ, విదేశీరుచులూ, ఆటలూ, వైద్యసేవలూ, ఖరీదైన స్పా, బెల్జియన్‌ బీరూ... ఇలా ఒకటేమిటి, పెంపుడు కుక్కలకు వైభోగమే వైభోగం.ఎంత గదికి అంత సౌకర్యం..!
‘ఎంత జంతువులయినా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే బోర్‌ కొట్టదూ... అప్పుడప్పుడూ వాటికీ సరదాగా ఏ హోటల్‌కో వెళ్లి గడపాలనో విందు చేయాలనో అనిపించడం సహజమే కదా’ అన్న ఆలోచనతో దీపక్‌, జాన్వి చావ్లా దంపతులు కలిసి రూపొందించినదే ఈ విలాసాల విడిది.
అదీగాక సెలవుల్లో సరదాగా టూర్లకు వెళ్లేవాళ్లు అన్ని చోట్లకీ తమతో పెట్స్‌ని తీసుకుని వెళ్లలేరు. అలాంటప్పుడు వాటికోసం ఈ హోటల్లో రూమ్స్‌ బుక్‌ చేస్తే కొన్నిరోజులపాటు అవీ సరదాగా గడిపేలా అన్ని రకాల వసతులతో గదుల్ని డిజైన్‌ చేశారు. వాటిల్లో స్టాండర్డ్‌, డీలక్స్‌ రూమ్స్‌; జూనియర్‌, ఫ్యామిలీ, ట్విన్‌, క్రిట్టెరాటి సూట్స్‌... ఇలా రకరకాలు ఉన్నాయి. డాగీ బ్రీడూ, అక్కడ ఉండే రోజులూ, గదినిబట్టి ధర ఉంటుంది. గదుల్లో టీవీతోబాటు ప్రైవేటు వెబ్‌కామ్‌, బాల్కనీ, స్విమ్మింగ్‌పూల్‌ సౌకర్యంతోబాటు రక్తప్రసరణ మెరుగుపడేందుకు హెయిర్‌బ్ర వాటిని కాసేపు ముద్దు చేయడం... ఇలా సేవలన్నీ అందుబాటులో ఉంటాయి.
ఉదయాన్నే పాటీ బ్రేక్‌తో రోజు మొదలవుతుంది. తరవాత బ్రేక్‌ఫాస్ట్‌, మళ్లీ పాటీ బ్రేక్‌, ఆపై రెండు గంటలపాటు ఆటలు, స్విమ్మింగ్‌, మళ్లీ ఆటలు, తరవాత కెఫె ట్రీట్‌... ఇలా ఓ పద్ధతి ప్రకారం షెడ్యూల్‌ ఉంటుంది. ‘మా రూబోకి కొబ్బరినీళ్లన్నా విటమిన్‌ వాటరన్నా ఎంతో ఇష్టం, చికెన్‌ కూడా ఇష్టంగా తింటుంది’ అని ఒకరు చెబితే, మా రాకీకి మటన్‌ ఇష్టం’ అంటారు మరొకరు. అందుకే అక్కడ వాటికి నచ్చిన మెనూని ప్రత్యేకంగా అందిస్తారు. సదా మీ సేవలో అన్నట్లు వాటి సంరక్షణకోసమే 42 మంది ఉద్యోగులు ఉన్నారక్కడ. పైగా పెట్‌ లవర్సనే ఏరికోరి తీసుకుంటారు మరి.సౌందర్య పోషణ!
ఇంట్లో చూసేవాళ్లు లేని పెట్స్‌కోసం డే కేర్‌ సెంటర్‌నీ ఏర్పాటుచేశారు. పిల్లల డేకేర్‌లతో పోలిస్తే దీని ధర చాలా ఎక్కువే. గంటకి సుమారు రెండు వందల రూపాయలు. అయితేనేం... శ్రీమంతులైన పెట్‌ లవర్స్‌కి అదేమంత విషయం కాదు అంటున్నారు నిర్వాహకులు. పెట్స్‌కి సంబంధించిన అన్ని రకాల వస్తువులతో- అదీ డిజైనర్లతో రూపొందించిన వాటితో బొటిక్‌ కూడా ఉంది.. రొటీన్‌ జీవితంతో విసిగిపోయిన పెట్స్‌కోసం మసాజ్‌, స్నానం, డ్రైయింగ్‌, బ్రషింగ్‌, కళ్లు క్లీన్‌ చేయడం, ఫర్‌ మెరిసేలా చేయడం, పాదాలకు నేచురల్‌ థెరపీ, నెయిల్‌ కటింగ్‌, పెర్‌ఫ్యూమ్‌ రాయడం...వంటి సేవల్ని అందించే స్పా సదుపాయమూ ఉంది. ఇక,  వైద్యనిపుణుల సేవలూ చికిత్సలూ 24గంటలూ అందుబాటులో ఉంటాయి. ఆడుకోవడానికి ఆటస్థలం, విహరించడానికి లాంజ్‌ వంటివీ ఉన్నాయి. అక్కడికి వచ్చి దించే వీలులేని వాళ్లకి వాటిని ఇంటి నుంచి ఎక్కించుకుని, మళ్లీ సాయంత్రం ఇంట్లో వదిలేసేలా ప్రత్యేక రవాణా సదుపాయమూ ఉంది.డాగీ వేడుకలకోసం!
పుట్టినరోజు అందరికీ పండగే. మనిషీ జంతువూ అన్న తేడా ఏముంటుంది! అందుకే ఇటీవల అల్లారుముద్దుగా పెంచుకునే పెట్స్‌కీ భారీ ఎత్తున బర్త్‌డే పార్టీ చేస్తున్నారు కొందరు. తమ పెట్స్‌కి పెళ్లి చేసి, మరికొన్ని పెట్స్‌ని విందుకీ ఆహ్వానిస్తున్నారు మరికొందరు. అందుకే పార్టీలు చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తుంది క్రిట్టెరాటీ. ‘పెట్స్‌ యజమానులు తమ పెట్స్‌తో సహా వచ్చి కాసేపు సరదాగా గడపడంవల్ల పెట్స్‌కి కూడా సామాజిక జీవితం అనుభవంలోకి వస్తుంది. అదేసమయంలో తమ పెట్స్‌ గురించిన ముచ్చట్లతో వాటి యజమానుల మధ్యా స్నేహబంధం వెల్లివిరుస్తుంది’ అన్న ఆలోచనతో ‘ఫ్రెండ్స్‌ ‘ఎన్‌’ ఫర్‌’ అనే కెఫెనీ ఏర్పాటుచేశారు. అక్కడ ఈ కుక్కలు తమకిష్టమైన మఫిన్స్‌, టార్ట్స్‌, పేస్ట్రీస్‌, కుకీస్‌, సూప్స్‌, షేక్స్‌, పాన్‌కేక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, బెల్జియం బీర్‌... ఇలా రకరకాల రుచుల్ని ఆస్వాదించవచ్చు. ఇవేకాదు, నలుగురిలోకీ వెళ్లినప్పుడు క్రమశిక్షణతో ఎలా మెలగాలీ, ఇంట్లో ఉన్నప్పుడు యజమానులతోనూ కుటుంబసభ్యులతోనూ చుట్టపక్కాలతోనూ ఎలా ప్రవర్తించాలీ వంటివన్నీ చక్కగా నేర్పించే ట్రెయినింగ్‌ సెంటర్‌ కూడా ఉంది. ఇక, పెంపుడుజంతువులకోసం స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో ఫొటోషూట్‌ల ఏర్పాటూ ఉందండోయ్‌. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అనాథ జంతువుల్ని దత్తత తీసుకునే కేంద్రాన్నీ నిర్వహిస్తోందీ హోటల్‌.‘మా స్నూపీ మరీ చిలిపిగా తయారైంది... పళ్లు వస్తున్నట్లున్నాయి. కర్టెన్లూ సోఫాలూ కొరికేస్తోంది. ఓ నెల్లాళ్లు డేకేర్‌లో పడేయాల్సిందే. డిసిప్లిన్‌ వస్తుంది’. ‘ఔనండీ... మా స్నోయీ కూడా రోజంతా ఒక్కటే ఉండి బోరింగ్‌గా ఫీలవుతోంది. నేనూ పంపిస్తా. దానికీ కాలక్షేపంగా ఉంటుంది’ అని ఎవరైనా ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఆశ్చర్యపోకండి... మున్ముందు ఇవన్నీ సహజమే. దేశంలో పెట్స్‌ని పెంచుకునేవాళ్ల సంఖ్య ఇప్పటికే కోటిన్నర దాటింది. మరో రెండుమూడేళ్లకి ఈ సంఖ్య రెండున్నర కోట్లకి పెరగొచ్చని ఓ అంచనా. అంటే పెంపుడుజంతువుల జనాభాతోబాటు డాగీ స్టార్‌ హోటళ్ల సంఖ్యా ముందుముందు బాగా పెరగొచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.