close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏమిటీ... కంచరపాలెం

‘కంచరపాలెం... విశాఖనగరంలోని ఓ ప్రాంతం. దశాబ్దాల కిందట రైల్వేవాళ్లు ఇక్కడో లోకోమోటివ్‌ షెడ్‌ ఏర్పాటుచేశారు. దాంతో రైల్వే ఉద్యోగుల రాక మొదలైంది. అలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది...’ సెప్టెంబరు7 ముందువరకూ గూగుల్‌లో కంచరపాలెం అని టైప్‌ చేస్తే ఇది మాత్రమే కనిపించేది! మరి ఇప్పుడో... ఈ పేరు ప్రపంచవ్యాప్త తెలుగు సినీ అభిమానుల గుండెచప్పుడైంది. ఆన్‌లైన్‌ ‘ట్రెండింగ్‌’లో అగ్రస్థానాన నిలుస్తోంది. ‘తెలుగు సినిమాల్లో ‘స్థానికత’కు కొత్త నిర్వచనమిచ్చిన సినిమా ఇది!’  అంటున్నారందరూ ముక్తకంఠంతో! అంతగా ఆకట్టుకున్న ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా నిర్మాణం వెనకున్న కథేమిటంటే...2016 డిసెంబరు...
కంచరపాలెం ఎప్పట్లాగే తన పని తాను చేసుకుపోతోంది.
అక్కడి పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర ఏదో సందడి.
‘అర్‌ర్‌ర్రె... ఇక్కడేదో సినిమా షూటింగ్‌ తీత్తన్నార్రా!’
‘సినిమా కాదెహే... షార్టు ఫిల్ము! సినిమాకైతే ఇంకా పెద్ద కెమెరాలూ, లైట్లూ ఉండాలి. ఇవన్నీ పెళ్లికి వాడే లైట్లూ,  కెమెరాలూ!’ - ఇలా సాగిందో సంభాషణ. అంతేమరి...! ‘సినిమా షూటింగ్‌ అంటే స్టార్లుండాలి. స్టార్లు కాకున్నా మనకి తెలియని నటులెవరో వచ్చి ముఖానికి రంగేసుకోవాలి...’ ఇది కదా మన ఆలోచన. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు! సినిమాలో నటిస్తున్న వాళ్లంతా స్థానికులే. ఒకరిద్దరు బయటి నుంచి వచ్చినా... వాళ్లకి కారవాన్‌లాంటివీ లేవు. నటులందరూ వీధిలోని ఇళ్లలోనే స్నానాదికాలు కానిచ్చి వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు అది సినిమా షూటింగ్‌ అంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు చెప్పండి! కానీ గత రెండువారాలుగా నమ్ముతున్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా తమ కంచరపాలెం గురించి చెప్పుకుని ఆనందిస్తుంటే మురిసిపోతున్నారు. వినాయకచవితికి వారం ముందు నుంచే పండగ చేసుకోవడం మొదలుపెట్టారు.  ఈ సినిమాలో నటించినవాళ్లకి ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే...
‘కొండవలస’ ఇక్కడి నుంచే...
కంచర... అంటే కంచుపని చేసేవాళ్లు అని అర్థం. ఒకప్పుడు ఈ పనులకిది కేంద్రంగా ఉండటంతో దీన్ని కంచరపాలెం అని పిలవడం మొదలుపెట్టారు. ఇక్కడ రైల్వే చిరుద్యోగులు నివాసం ఏర్పరుచుకోవడం మొదలుపెట్టాక పంటభూములన్నీ ఇళ్లయ్యాయి. జనాభా పెరిగింది. ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీలాంటివి వచ్చాయి. వీటన్నింటితోపాటూ నిశ్శబ్దంగా మరో అద్భుతం కూడా జరిగింది. అదే... ఇక్కడి రామ్మూర్తి పంతులపేటలో ఏర్పడ్డ ‘మహాత్మాగాంధీ కళా సమితి’. నటులు కొండవలస లక్ష్మణరావు, వంకాయల సత్యనారాయణ, నటనా గురువు ఎల్‌.సత్యానంద్‌ వంటివాళ్లు ఇక్కణ్ణుంచి వచ్చినవాళ్లే. జె.వి. సోమయాజులు, మిశ్రోలాంటివాళ్లు ఇక్కడ వేదికెక్కి నాటకాలు వేసినవారే! కానీ కాలక్రమంలో రంగస్థలానికున్న ఆదరణ పడిపోయింది. అలా ప్రజల మనసుల్లో కనుమరుగైపోయిన నటనని అనుకోకుండా వెలికితెచ్చాడు మూడు పదులు దాటని యువకుడు... అతడే కేరాఫ్‌ కంచరపాలెం దర్శకుడు వెంకటేశ్‌ మహా!ఎలా వచ్చాడిక్కడికి...
అపర్ణ మల్లాది... పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో స్క్రీన్‌ప్లే పాఠాలు చెబుతుంటారు. ఆమె తన ఇంట్లో ప్రతి ఆదివారం ‘స్టోరీ నరేషన్‌’ సెషన్‌ నిర్వహిస్తుంటారు. ఔత్సాహిక సినిమా కథకులూ, దర్శకులూ అక్కడికొచ్చి తమ కథని వివరించి సలహాలు తీసుకుంటూ ఉంటారు. అలా సలహాలివ్వడానికి ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్‌లాంటివాళ్లు వస్తుంటారు. ఆ విషయం తెలిసి వెంకటేష్‌ తన ‘ఊహాలోకం’ షార్ట్‌ఫిల్మ్‌తో అక్కడికెళ్లాడు. ఆ ఫిల్మ్‌ చూసి అంతా మెచ్చుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ‘రంగస్థలం’ అనే కొత్త కథతో వచ్చాడు మహా. అది విన్న వారంతా అబ్బురపడ్డారు కానీ... ‘మీ కథలో సమాజంపైన ఓ వ్యతిరేక భావన ఉంది. నీ మొదటి సినిమా ఇలా ఉండటం మంచిదికాదు...’ అని చెప్పారు. ఆ మాటలు మహాని నిరాశపరిచాయి. అప్పటికే ఎనిమిదేళ్ల నుంచీ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడతను. నటుడు కావాలనే వచ్చినా మెల్లగా దర్శకత్వంపై ఆశపుట్టి షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించడం ప్రారంభించాడు. నిర్మాతల ఆఫీసులకి కథలు పట్టుకుని వెళితే మధ్యలోనివాళ్లు ‘సిఫార్సుంటే లోపలికి రండి!’ అనేవారట. వీటన్నింటితో విసిగి వేసారి కొద్దిరోజులు సినిమా లోకానికి దూరంగా ఉండాలనుకున్నాడు. హైదరాబాద్‌ రాకముందు తాను పనిచేసిన విశాఖ, అక్కడున్న తన స్నేహితుడు ఫణి గుర్తొచ్చారు. వాళ్లుండేది కంచరపాలెంలోనే. అతనికి ఫోనుచేసి బైకుమీదే వైజాగ్‌ వెళ్లిపోయాడు. ఫణీ, వాళ్లన్నయ్య మూర్తీల స్నేహం, ఆ ఇంటి వాతావరణం వెంకటేశ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడో చిన్న ఉద్యోగం కూడా వెతుక్కున్నాడు. వెంకట్‌కి పదహారేళ్లనుంచే ఇలాంటి చిన్నాచితక ఉద్యోగాలు చేయడం మామూలైనా... ఈసారి అతని కళ్లూ, మనసూ పూర్తిగా వేరు. సినిమా రంగం అతని కళ్లకి ప్రతివాళ్లలోనూ నటుల్ని వెతకడం నేర్పింది... మనసుకి ప్రతి చిన్న సంఘటన నుంచీ కథలు అల్లడం అలవాటుచేసింది. సాయంత్రం కాగానే అక్కడి లైబ్రరీ అరుగు మీద కూర్చుని మనుషుల్ని గమనించడం తన దినచర్య అయింది.
ఓ బిల్‌కలెక్టర్‌ గొడవ...
ఓ సాయంత్రం... రామ్మూర్తిపంతులు పేట వీధిలో నీళ్లు రావట్లేదేమిటని మున్సిపల్‌ సిబ్బందితో పెద్దగా గొడవ పెట్టుకున్నాడో వ్యక్తి. అతని గొంతులోని ఆవేశం, మాట్లాడే తీరూ చిత్రంగా అనిపించాయి వెంకటేశ్‌కి. అతనికి తెలియకుండానే ఫొటోలు తీసి ఫణికి చూపించి ‘ఎవర్రా ఇతను?’ అని అడిగాడు. ‘పేరు సుబ్బారావు. ఇక్కడి మున్సిపల్‌ ఆఫీసులో బిల్‌కలెక్టర్‌. వయసు అరవై ఉండొచ్చు, ముగ్గురబ్బాయిలు, భార్య పదిహేనేళ్లకిందట చనిపోయింది!’  చెప్పాడు ఫణి. వెంకటేశ్‌ మనసులో అప్పుడే ‘కేరాఫ్‌ కంచరపాలెం’ కథకి సంబంధించిన బీజం పడింది. ‘యాభై ఏళ్లొచ్చాక ఓ బ్యాచిలర్‌ జీవితం ఎలా ఉంటుంది? ఆ వయసులో అతన్ని ఎవరైనా ప్రేమిస్తే ఏమవుతుంది?’ ఇలా తనలోని రచయితకి పనిచెప్పి రాజు అనే యాభైయేళ్ల బ్యాచిలర్‌ కథ రాసుకున్నాడు. ఈ కథతోపాటూ మరో మూడు ప్రేమకథలూ వచ్చాయి. ఈ నాలుగు కథలూ వేటికవే బావున్నాయి. కానీ మొత్తంగా చూస్తే ఏదో వెలితి. ఆ నాలుగింటినీ కలిపే అంశం ఏదో ఉండాలనుకున్నాడు. ఎంత ఆలోచించినా దానిపైన స్పష్టత రాలేదు. ఓరోజు కాకతాళీయంగా ‘మసాన్‌’ సినిమాలో ఓ హిందీ పాట విన్నాడు. ‘మన్‌ కస్తూరి జగ్‌ దస్తూరి బాత్‌ హుయీ న పూరీ రే!’. ఇందులో ‘బాత్‌ హుయీ న పూరీ రే!’(కథ ఇంకా పూర్తికాలేదు...) అనే వాక్యాన్నే మళ్లీమళ్లీ వినడం మొదలుపెట్టాడట. ‘కథ పూర్తికాకపోవడమే’ అన్ని కథలనీ కలిపే అంతస్సూత్రంగా మారింది. అదే గొప్ప ట్విస్ట్‌గా అనిపించింది. ఆ ఆలోచన తనకొచ్చినందుకు ‘ఆహా’ అనుకున్నాడు మహా!
ఆ కథతో, కొత్త నమ్మకంతో హైదరాబాద్‌కి వచ్చి సినిమా మిత్రులకు తన కథని ఉద్వేగంతో చెప్పడం మొదలుపెట్టాడు. వింటున్నవాళ్లందరిలోనూ కన్నీళ్లు తన్నుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక, కథ క్లైమాక్స్‌ చెప్పగానే అందరూ ‘అద్భుతం’ అన్నారు నవ్వేస్తూ. అప్పుడే తన కథ మీద నమ్మకం కుదిరింది అతనికి. కంచరపాలెం వ్యక్తుల ప్రవర్తనా, హావభావాలూ ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే బయటవాళ్లని కాకుండా స్థానికులనే నటీనటులుగా ఎంచుకోవాలనుకున్నాడు. కంచరపాలెం వచ్చి ముందు రాజు పాత్రకి నటుల అన్వేషణ మొదలుపెట్టాడు. ఇద్దరుముగ్గుర్ని అనుకున్నాక... చివరికి సుబ్బారావు దగ్గరకే వెళ్లాడు. ‘నేను చేస్తా సార్‌... చిన్నప్పుడు ఇదే కంచరపాలెంలో నాటకాలేశా!’ అని చెప్పాడాయన. అలా రాజు పాత్రకి సుబ్బారావు సిద్ధమయ్యాక... ‘సలీమా’ కోసం మరో అమ్మాయిని ఎంపికచేశాడు. వాళ్లపైన కొన్ని ‘పిచ్‌’ వీడియోలు తీసిపెట్టుకున్నాడు. అందరూ కంచరపాలెంవాళ్లు నటిస్తున్నా... ఆపాటి ఖర్చుకైనా డబ్బు పెట్టేవాళ్లు కావాలి కదా! అందుకే నిర్మాతలని వెతకడం మొదలుపెట్టాడు.చూసింది ఒక్క షాట్‌...!
పరుచూరి ప్రవీణ... అమెరికాలో డాక్టర్‌. అయినా సినిమా దర్శకురాలిగా మారాలనే కోరిక ఆమెది. అమెరికాలోని డాక్టర్ల జీవితంపై ఓ థ్రిల్లర్‌ కథ కూడా రాసుకుంది. అపర్ణ మల్లాది గురించి తెలుసుకుని హైదరాబాద్‌లోని ఆమె ఇంటికే వచ్చేసింది ప్రవీణ. అదే సమయానికి మహా అక్కడికొచ్చాడు. దర్శకురాలు కావాలనుకున్న ప్రవీణని ‘కంచరపాలెం’ సినిమాకి నిర్మాతగా మార్చాలనే ఆలోచన అపర్ణకే వచ్చింది. ఆ విషయం అడిగితే ప్రవీణ ముందు ఆ వీడియోలు చూస్తానంది. మొదటి షాట్‌... కంచరపాలెంలోని రోడ్డు ఓవర్‌బ్రిడ్జి కింద స్తంభాల నడుమ ‘భొయ్‌’ అంటూ శబ్దం చేస్తూ రైలువెళ్లే దృశ్యం! చూడటానికి మనుషుల తలలపైనే రైలు వెళ్లినట్టు ఉంటుంది!! అది చూడగానే ‘ఈ సీన్‌ నువ్వే తీశావా!’ అని ఆశ్చర్యపోయిందామె. అప్పటికప్పుడు నిర్మాతగా ఉంటానని ఒప్పుకుంది. ఆ మర్నాడే వైజాగ్‌ తిరిగొచ్చి మిగతా నటుల్ని ఎంపికచేయడం ప్రారంభించాడు మహా. గ్రంథాలయం దగ్గర కూర్చుని... కనిపించిన ప్రతి ఒక్కర్నీ ‘నటిస్తావా?’ అని అడగడం మొదలుపెట్టాడు.

ఏ అంతరం లేదు...

అప్పారావుని కంచరపాలెంలో డానీ అంటారు ముద్దుగా. ఇక్కడే రిక్షా నడుపుతుంటాడు. 1960లలో ఎప్పుడో బర్మా నుంచి భారత్‌కి తిరిగొస్తూ ఓ తెలుగు దంపతులు ఆయన్ని తీసుకొచ్చేశారట. ఆయనకి నాటకాల అనుభవం కూడా ఉంది. అందువల్లే మహా అడగ్గానే ఒప్పేసుకున్నాడు. ఘంటసాలగా నటించాడు. ‘నా బర్మా మొహానికి ఘంటసాల పేరేంటని తెగ నవ్వుకున్నానండీ!’ అంటాడాయన. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ట్రైలర్‌తో తెగ ఫేమస్‌ అయిపోయిన వ్యక్తి రాజబాబు. గంటపట్టుకుని ‘ఓహోయ్‌.. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా!’ అని చాటింపేసేది ఈ ముసలాయనే. రోజూ ఉదయం ‘ఎవరైనా కూలీకోసం పిలిస్తే బాగుణ్ను’ అని కాచుక్కూచునే బడుగు జీవి ఆయన. ఆంజనేయస్వామి ఆలయ పూజారి సురేశ్‌, స్థానిక రాజకీయనాయకుడు అవినాశ్‌... ఇలా చాలామంది అనుకోకుండానే సినిమా నటులయ్యారు. ఈ సినిమాలో డైలాగులున్న నటులు 86 మంది ఉంటే... అందులో 80 మంది కంచరపాలెంవాళ్లే. వీళ్లందరికీ నెలరోజులపాటు వర్క్‌షాప్‌ కమ్‌ రిహార్సల్స్‌ చేయించాడు దర్శకుడు. వీళ్లందరిచేతా డబ్బింగ్‌ చెప్పించడం అసాధ్యం కనుక షూటింగ్‌ జరుగుతున్నప్పుడే యథాతథంగా డైలాగుల్ని రికార్డు చేసే సింక్‌ సౌండ్‌ పద్ధతిని ఎంచుకున్నాడు. కాకపోతే కంచరపాలెం రైల్వేలైనుకి పక్కనే ఉంటుంది. కాబట్టి... రైళ్ల రాకపోకలెక్కువ. ఆ చప్పుడు మధ్య సింక్‌-ఇన్‌ సౌండ్‌ చేయడం అసాధ్యం. అందుకే ముందుగా ఏ సమయానికి ఏ ట్రెయిన్‌ వస్తుందో చెప్పే రైల్వే ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుందీ చిత్ర బృందం! దాన్ని చూసుకుని రైళ్లు రాని సమయంలోనే షూటింగ్‌ చేసేది! స్థానికులు మాట్లాడే మాటలనే కాదు, అక్కడ వినిపించే పాటల్నీ సినిమాలో చేర్చాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో వినిపించే ‘ఏమి జన్మము ఏమి జీవనము!’ పాట ఉత్తరాంధ్రకు చెందిన తాత్వికుడు యడ్ల రామదాసు రాసింది, స్థానిక హరిదాసు వెంకటరావుచేత సినిమాలో ఆ పాట
పాడించారు. ఇకపోతే, ఈ సినిమా షూటింగ్‌ కోసం వేసిన ఏకైక సెట్‌... హీరో రాజు కనిపించే ఇల్లు! అది తప్ప ఇక్కడి వీధులూ, చెట్లూ, షాపులూ, గుడుల్ని యథాతథంగా చిత్రీకరించారు. మధ్యలో పిల్లీ, కుక్కలూ, పశువులొచ్చినా తోలకుండా వదిలేశారు. ఓ సీన్‌లో అదే కలిసొచ్చింది. రాజు పూటుగా తాగిన మత్తులో డైలాగులు చెబుతూ వచ్చే సీన్‌లో అతనింటి ముందున్న కుక్క కూడా చక్కటి టైమింగ్‌తో కనిపిస్తుంది.జైల్లో పెట్టారు...!
క్లైమాక్స్‌లో కనిపించే రైలు గేటు...
ఆ గేట్‌లోంచి వెళ్లి రైలు దృశ్యాన్ని షూట్‌ చేయడానికి నానా యాతనా పడింది కంచరపాలెం బృందం. ఓ చిన్న కెమెరా తీసుకుని అటువైపు మెల్లగా వస్తున్న రైలుని షూట్‌ చేస్తుండగా... ఆ గేట్‌మ్యాన్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులకి ఫోన్‌ చేశారట. వైజాగ్‌ స్టేషన్‌ నుంచి వాళ్లు వచ్చేలోగా షూట్‌ చేసేయాలని తొందరపడుతున్న బృందం ఆశలపైన నీళ్లు చల్లుతూ వర్షం మొదలైంది! ఇంతలో పోలీసులొచ్చి దర్శకుణ్ణీ, సహాయకుణ్నీ తీసుకెళ్లారు. ఒకరాత్రంతా స్టేషన్‌లోనే ఉంచి వదిలేశారు. వాళ్లటు వదలగానే వీళ్లు చేసిన మొదటి పని... అదే గేటు దగ్గర మరో రైలు వచ్చే దృశ్యాన్ని చిత్రీకరించడమే!
‘గ్లోబల్‌’ సినిమాగా...
2017 డిసెంబరుకి సినిమా పూర్తయింది. ఈ చిన్న బడ్జెట్‌ సినిమాలో ఒక్కరైనా తెలిసిన ముఖాలు లేరుకాబట్టి మౌత్‌ పబ్లిసిటీ కోసం సినీ ప్రముఖులకు చూపించాలనుకున్నారు నిర్మాత ప్రవీణ, దర్శకుడు మహా. రామానాయుడు స్టూడియో ప్రివ్యూ థియేటర్‌లో షో ఏర్పాటుచేశారు.
ఆ ప్రదర్శనకి సురేశ్‌బాబుని పిలిచారు. ఆయన రావడానికి కాస్త ఆలస్యమైంది. దాంతో ఇంకెప్పుడైనా మొదట్నుంచి చూద్దాంలే అని బయటే నిల్చుని దర్శకనిర్మాతలతో మాట్లాడుతూ ఉండిపోయారు. ఇంతలో లోపల సినిమా చూస్తున్న సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్‌ సిద్ధారెడ్డి నుంచి సురేశ్‌బాబుకి మెసేజ్‌ వచ్చింది... ‘ఈ సినిమాని మనం డిస్ట్రిబ్యూట్‌ చేద్దాం!’ అని. థియేటర్‌ లోపల అనూహ్యమైన క్లైమాక్స్‌ని చూస్తున్నవాళ్ల ఈలలూ, చప్పట్లు కూడా ఆయన్ని సినిమా చూడకుండానే పంపిణీకి ఒప్పుకునేలా చేశాయి. రానా చూశాక ఆయనే సమర్పకుడిగా చేస్తానని ముందుకొచ్చారు. దాంతోపాటూ ‘న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కి సెలక్ట్‌ అయింది. అమెరికాలోని తెలుగువాళ్లే కాకుండా... ప్రపంచ సినిమా అభిమానులందరూ వేనోళ్లా అభినందించారు! అచ్చమైన తెలుగుదనానికి దక్కిన ముచ్చటైన గౌరవం అది.
పసివయసు వలపు పాట, టీనేజీ ప్రేమ, మూడుపదుల్లోని నిస్వార్థ చెలిమి, నడివయసులో తోడు కోరే మనసు... ఇలాంటి కథలన్నీ తెలుగు సినిమాకి కొత్తకాదు. నుడికార సొగసు, మట్టివాసనలు కూడా ఇప్పటిదాకా ఎవ్వరూ పట్టించుకోని విషయాలేమీ కాదు. వీటన్నింటినీ మించి కేరాఫ్‌ కంచరపాలేన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నవి...ఇప్పటిదాకా ఎవ్వరూ చూపని సహజతా, అరమరికల్లేని జీవన వాస్తవికతలే!

* * * * * * * * * *

2018 సెప్టెంబరు 9
కంచరపాలెం కోలాహలంగా ఉంది.
ఒకరు కాదు ఇద్దరు కాదు... అందులో నటించిన 80 మంది స్టార్లయిపోయారక్కడ.
సుబ్బారావు, రాధ, ఉమామహేష్‌, కేశవ... వీళ్లైతే సూపర్‌స్టార్లే!
రిక్షాతోలే డానీ అప్పారావుకి ఫ్లెక్సీలు వెలిశాయి!
వైజాగ్‌లోని థియేటర్‌లలో ఈ సినిమా చూసినవాళ్లలో చాలామంది... కంచరపాలెం వచ్చి వెళుతున్నారు!
ఆ సినిమా నటులు ఎవరు కనిపించినా సెల్ఫీలు దిగుతున్నారు.
వారిలో తమని తాము చూసుకుంటున్నారు!

అనుకోకుండా ఓ రోజు..!
‘మహా’ అద్భుతం...

మెరికాలో డాక్టర్‌ని. సినిమా అంటే ఇష్టం. లవ్‌స్టోరీలు చూసి చూసి బోర్‌ కొట్టేసింది. నాకు ఆ కథలు నచ్చవని వెంకటేష్‌కి ముందే చెప్పాను. కథ వినిపించాక చాలా హ్యూమన్‌ లేయర్స్‌ ఉన్న లవ్‌స్టోరీ అనిపించింది. మహా ఒక ఊరిని డైరెక్ట్‌ చేసిన తీరు అద్భుతం!

- పరుచూరి ప్రవీణ, నిర్మాత

కష్టమంతా మర్చిపోయా

నేను బ్యుటీషియన్‌ని.  మొదట పిచ్‌ వీడియోలో సలీమా క్యారెక్టర్‌కి పనిచేయమని అడిగారు. అమ్మని అడిగితే సరేనంది. సినిమాలో నేను సుందరం తల్లి పాత్ర చేశాను. తెర వెనక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కాస్ట్యూమ్స్‌, ప్రాపర్టీస్‌ బాధ్యతలూ చూశాను. సినిమాని తెరపైన చూశాక, నా కష్టమంతా మర్చిపోయాను.

- శ్రావణి (లీల)

మరో సొంతూరు...

స్కూల్‌ రోజుల నుంచీ నాటకరంగంలో ఉన్నాను. బాలనటుడిగా నంది అవార్డు అందుకున్నా. ఈ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశాను. ఇప్పటివరకూ నా ఊరంటే హైదరాబాద్‌ ఒక్కటే. ఈ సినిమా తర్వాత కంచరపాలెం నాకు రెండో సొంతూరు అయింది.

- కార్తీక్‌(జోసెఫ్‌)

అప్పుడు టెన్త్‌...

కంచరపాలెంలో గ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌ ఆడుతుండగా నన్ను చూశారు. పిలిచి ‘సినిమాలో నటిస్తావా’ అని అడిగారు. ‘టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నా. నేను చదువుకోవాలి చేయన’న్నాను. మహా అన్నా, శ్రావణి అక్కా అమ్మానాన్నలతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడేమో నేను చదువుతున్న  పాలిటెక్నిక్‌ కాలేజీలో ఓ పెద్ద సెలబ్రిటీ అయిపోయాను.

- కేశవ(సుందరం)

‘కళ’ నిజమైంది...

చిన్నప్పట్నుంచీ కళలంటే ఇష్టం. పాటలు పాడతాను, డ్యాన్స్‌ చేస్తాను, మిమిక్రీ ఆర్టిస్టుని, ఇంద్రజాలికుణ్ణి కూడా. కళాకారుడిగా స్థిరపడలేదే అని బాధపడుతుండేవాణ్ని. నేను చేసిన నత్తి ఉండే రామ్మూర్తి పాత్రని అందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు. సినిమాలో రెండు పేరడీ పాటలు పాడాను కూడా.

- కిశోర్‌(రామ్మూర్తి)

చిన్న పాత్ర అన్నారు

నా మాతృ భాష ఒడియా. కుటుంబం గడవడానికి హాస్పిటల్‌లో ఆయాగా పనిచేస్తున్నాను. మహా వచ్చి మొదట మా పాప శ్రావణికి సినిమాలో చిన్న క్యారెక్టర్‌ ఉందని చెప్పారు. సుందరం తల్లిగా చేసింది మా అమ్మాయే. తర్వాత నన్ను కూడా నటించమన్నారు. నేనెప్పుడూ యాక్టింగ్‌ చేయలేదని చెప్పాను. మేం చెప్పినట్టు చేస్తే చాలన్నారు. ఈ పాత్ర ఇంత చక్కగా వస్తుందని అస్సలు ఊహించలేదు.

- రాధ బెస్సీ (రాధ)

జీవిత పాఠాలివి...

‘కంచరపాలెం’ నాకు జీవితపాఠంగానూ మారింది. హైదరాబాద్‌లో థియేటర్‌ ఆర్ట్స్‌ చదివి... సీరియళ్లూ, సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. కంచరపాలెం సినిమా షూటింగ్‌ అప్పుడు నేను ఓ బ్రేక్‌-అప్‌పై బాధపడుతున్నాను. ఆ పాత్రని పోషించాక... నా నుంచి విడిపోయిన అమ్మాయిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టా.

- మోహన్‌ భగత్‌(గడ్డం)

కాలేజీకి డుమ్మా!

మాది వైజాగ్‌లోని సీతమ్మధార. బీబీఏ చదువుతున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది..! మా కాలేజీ చాలా స్ట్రిక్ట్‌. ఆరోగ్యం బాగాలేదని చెప్పి అప్పుడప్పుడూ పదిరోజులు సెలవుపెట్టి షూటింగ్‌లో పాల్గొన్నా. దీన్ని కేవలం ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కోసం తీస్తున్న సినిమా అనుకున్నాకానీ... ఇక్కడే రిలీజై ఇంత పెద్ద హిట్టవుతుందని ఊహించలేదు!

- ప్రణీత పట్నాయక్‌(భార్గవి)

అన్నీ సింగిల్‌ టేక్‌లే 

మాది విశాఖలోని ఎంవీపీ కాలనీ. 8వ తరగతి చదువుతున్నా. ‘కేరాఫ్‌ కంచరపాలెం సినిమాలో చేస్తావా’ అని డైరెక్టర్‌ అడగ్గానే చేస్తానన్నాను. కొన్ని డైలాగులిస్తే వెంటవెంటనే చెప్పేశా. ఓ పాట పాడించారు. అదీ నచ్చడంతో సునీత పాత్రకు ఎంపిక చేస్తారు.

- నిత్యశ్రీ(సునీత)

నా వాయిస్‌ కావాలంటే... 

నేను న్యాయవాదిని. కంచరపాలెంలోని నా కార్యాలయంలో స్క్రిప్ట్‌ రాసుకునేవారు మహా. ‘అమ్మోరు’ పాత్రలో నటించమంటే మొదట నావల్లకాదని చెప్పా. ‘మీ గొంతు బాగుంది, అది నాకు కావాలి’ అని అడిగారు. ‘బయట ఎలా మాట్లాడతారో సినిమాలో కూడా అలాగే మాట్లాడండి చాలు’ అన్నారు. దాంతో నాలో కూడా కుతూహలం మొదలైంది.

- ఉమామహేశ్‌(అమ్మోరు)

నా స్వార్థం... వాళ్ల కష్టం 

మా సొంతూరు విజయవాడ. ఏడో తరగతప్పుడే నాన్న చనిపోయారు. టెన్త్‌ తర్వాత సొంతంగా బతకాలనుకుని ఇంటినుంచి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టా. అలా విజయవాడ నుంచి వైజాగ్‌ వెళ్లి కొన్నాళ్లు ఉన్నాను. చిన్నప్పట్నుంచీ సినిమాల్లోకి వెళ్లాలనే కల ఉండేది. 2009లో హైదరాబాద్‌ వచ్చి ప్రైవేటు జాబ్‌ చేస్తూనే నటుడిగా సినిమా ప్రయత్నాలు చేసేవాణ్ని. హీరో వెనకా, జనంలో ఒకడిగా కనిపించే పాత్రలొచ్చాయి. కొన్నాళ్లు సెట్‌బాయ్‌గానూ పనిచేశాను. అప్పుడే షార్ట్‌ఫిల్మ్స్‌ తీయడం మొదలుపెట్టాను. ఔత్సాహిక దర్శకుల్ని ప్రోత్సహించే ‘రన్‌వే రీల్‌’ సంస్థ షార్ట్‌ఫిల్మ్స్‌ పోటీ పెడితే పాల్గొన్నాను. తర్వాత ఆ సంస్థలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఉద్యోగమిచ్చారు. ఓ టీవీ డ్యాన్స్‌ షోకి కో-డైరెక్టర్‌గానూ పనిచేశాను. క్రమేణా నా మనసు డైరెక్షన్‌వైపు వెళ్లింది. కంచరపాలెం సినిమా నేను ఇండస్ట్రీలో నిలబడ్డానికి నా స్వార్థం కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు. కానీ అడగ్గానే వచ్చి నటించిన కంచరపాలెం ప్రజలు నాకు నిస్వార్థంగా సపోర్ట్‌ చేశారు. నేను మేడ ఎక్కి దూకమంటే దూకారు. కిందపడి దొర్లమంటే దొర్లారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాకి ఆ లోపాలేవీ కనిపించకుండా చేశారు సాంకేతిక నిపుణులు. కథ విషయానికొస్తే... ఇందులో నేను చూపిన సమస్యలు ప్రపంచమంతా ఉండేవే. ఆ సమస్యలకి కంచరపాలెంలోని సగటు మనిషి ఎలా స్పందిస్తాడో అదే చూపాను!

- వెంకటేశ్‌ మహా, దర్శకుడు
సహకారం: హిదాయతుల్లా, ఈనాడు, విశాఖపట్నం
ఫొటోలు: మధు, గోపీకృష్ణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.