close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరుగెడదాం... ఈరోజు నుంచే..!

పరుగెడదాం... ఈరోజు నుంచే..!

ఫిట్‌నెస్‌కోసమైతేనేం, బరువు తగ్గేందుకయితేనేం... చాలామంది జిమ్‌లని ఆశ్రయిస్తుంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా జిమ్‌తో వచ్చే లాభాలన్నీ పరుగెత్తడం ద్వారా పొందవచ్చు అంటున్నారు వ్యాయామ నిపుణులు. పైగా దీనికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాల్సిన పని లేదు. ఉదయం, సాయంత్రం... ఎప్పుడు వీలయితే అప్పుడు కాలనీలోనో పార్కులోనో పొలంగట్టునో ఓ అరగంటో గంటో పరుగెడితే మాటిమాటికీ డాక్టర్ని సంప్రదించక్కర్లేదు. అయితే సాయంత్రం కన్నా ఉదయం పరుగెడితే రోజంతా చురుకుగా అనిపిస్తుంది. ఆ సమయంలో సూర్యకిరణాలవల్ల విటమిన్‌-డి లోపమూ తలెత్తకుండా ఉంటుంది. తాజాగాలిలోని ఆక్సిజన్‌, శ్వాస సమస్యలు లేకుండా చేస్తుంది. దాంతో రక్తసరఫరా మెరుగుపడటంతో గుండె ఆరోగ్యమూ బాగుంటుంది.
* పరుగువల్ల శరీరం మొత్తానికీ వ్యాయామం అవుతుంది. దీనివల్ల జీవక్రియా వేగం పెరిగి, క్యాలరీలన్నీ కరిగిపోతాయి. బరువూ తగ్గుతారు. కొలెస్ట్రాలూ ఉండదు. పొట్ట అసలే రాదు. పరుగెత్తేవారిలో మధుమేహ సమస్యలూ తక్కువే. బీపీ కూడా అదుపులో ఉంటుంది. పరుగు ఎముకలకీ కండరాలకీ కూడా మంచిదే. అవి బలంగా ఉండేలా చేస్తుంది. చిన్నప్పటినుంచీ పరుగెత్తే అలవాటు ఉన్నవాళ్లకి భవిష్యత్తులో కీళ్లసమస్యలూ ఆర్థ్రయిటిస్‌ సమస్యలూ రాకుండా ఉంటాయి. అయితే గతంలో అలవాటు లేకున్నా ఏ వయసులోనయినా పరుగును ప్రారంభించవచ్చు. ముందు బ్రిస్క్‌ వాక్‌తో మొదలెట్టి క్రమంగా జాగింగ్‌లోకి మారాలి. ఆ తరవాతినుంచీ పరుగును వ్యాయామంగా అలవాటు చేసుకోవాలి.* ఆరోగ్యమూ ఫిట్‌నెస్‌తోబాటు పరుగు మానసిక ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. పరుగెత్తేవాళ్లలో ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవడంతో నిత్యం సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. పరుగెత్తడంవల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలూ తగ్గుతాయి. పైగా పరుగెత్తే అలవాటు ఉన్నవారిలో పట్టుదల, ఏకాగ్రత... వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
పరుగు అనేది మనిషిని శారీరకంగానే కాదు, మానసికంగానూ బలవంతుల్ని చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనయినా సమర్థంగా ఎదుర్కొనే స్థైర్యాన్నీ, లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్నీ అందిస్తుంది. మొత్తమ్మీద పరుగు జీవితాన్ని ఆనంద మయం చేస్తుంది.


తీపి తింటే చుండ్రు..?

కొందరికి చుండ్రు ఓ పట్టాన తగ్గదు. అలాంటప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. తలమీద ఉండే నూనెగ్రంథుల నుంచి నూనె అధికంగా విడుదల కావడంతో చుండ్రు పెరుగుతుంది. ఆహారంలో జింక్‌ తీసుకోవడం వల్ల ఇది నియంత్రణలో ఉంటుంది. అయితే ఆహారంలోని జింక్‌ శరీరానికి అందాలంటే విటమిన్‌ బి6 అవసరం. ఇందుకోసం చిక్కుడు జాతికి చెందిన గింజలూ, నట్స్‌ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
* కొన్ని రకాల ఆహారపదార్థాలు ఒంటికి సరిపడవు. అలాంటివి కూడా చుండ్రుని పెంచుతాయి. కాబట్టి పడని వాటికి దూరంగా ఉండాలి. ఇడ్లీ, డోక్లా, పెరుగు... వంటి ప్రొబయోటిక్స్‌నీ; ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే నట్స్‌నీ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. తీపి పదార్థాలనూ ప్రాసెస్డ్‌ పదార్థాలనూ తక్కువగా తినాలి. ఎందుకంటే వాటిల్లో చుండ్రుని పెంచే గుణాలు అధికం. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, ఉల్లికాడలు ఎక్కువగా తీసుకుంటే వాటిల్లోని ఎలిసిన్‌ అనే పదార్థం చుండ్రు కారక బ్యాక్టీరియానూ, ఫంగస్‌నూనిరోధిస్తుంది.


తండ్రే స్నేహితుడయితే...

చాలామంది పిల్లలకు తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నప్పుడు తండ్రి దగ్గరే ఎక్కువ గారాలు పోయినా పెద్దయ్యేకొద్దీ తల్లికే దగ్గరవుతారు. అలాకాకుండా తండ్రితో అనుబంధం ఎక్కువగా ఉండే ఆడపిల్లలు జీవితంలో ఎప్పుడూ ఒంటరితనాన్ని ఫీలవ్వరని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఇందుకోసం వీళ్లు కొన్ని కుటుంబాలను ఎంపిక చేసుకుని పరిశీలించారట. సాధారణంగా పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రులతో మంచి బంధాలనే కలిగి ఉన్నప్పటికీ పెద్దయ్యేకొద్దీ స్నేహితులు పెరగడంతో తల్లిదండ్రులతో గడిపే సమయం
తగ్గిపోతుంది. దాంతో చాలామంది పిల్లలు ఏ కారణంతోనయినా స్నేహితులు దూరమైతే ఒంటరితనంతోనూ ఆత్మన్యూనతతోనూ బాధపడుతుంటారట. అదే తండ్రితో చనువుగా ఉండే అమ్మాయిల్లో ఆ దిగులూ విచారం కనిపించలేదట. తల్లితో చనువు ఉన్నప్పటికీ అది సామాజికంగా వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించలేకపోయిందనీ, తండ్రితో గాఢ అనుబంధం ఉన్న అమ్మాయిల్లోనే ఆ ధైర్యం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట. అయితే తల్లిదండ్రులతో ఉండే దగ్గరితనం అనేది అబ్బాయిల సామాజిక జీవితం మీద పెద్దగా ప్రభావం చూపించలేదని వారు చెబుతున్నారు.


టూకీగా...

ధూమపానం, చెడు కొలెస్ట్రాల్‌, ఆనువంశికత... వంటి వాటి వల్లే 80 శాతం హృద్రోగాలు వస్తే, మిగిలిన 20 శాతం పెళ్లికాకపోవడం, భర్త/భార్య చనిపోవడం లేదా విడిపోయి ఒంటరిగా జీవించడం వల్ల వస్తున్నాయని బ్రిటన్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు.
* నగరాల్లో రోజురోజుకీ పెరుగుతోన్న వాయుకాలుష్యం,  పిల్లల మెదడుమీద ప్రభావం చూపించడంతో వాళ్లు గణితం, భాష... వంటి పాఠ్యాంశాలను సరిగ్గా నేర్చుకోలేకపోతున్నారని పేర్కొంటున్నారు చైనా పరిశోధకులు.


దెబ్బకు విరిగింది

సుజాత ఫోన్‌ కొనుక్కుని, సిమ్‌కార్డు వేయించుకుంది. భర్తను సర్‌ప్రైజ్‌ చేద్దామని కిచెన్‌లోకి వెళ్ళి భర్తకు ఫోన్‌ చేసింది.
భర్త ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే ‘హాయ్‌ డార్లింగ్‌’ అంది.
భర్త కంగారుపడిపోతూ ‘తర్వాత చెయ్యి, మా రాక్షసి ఇంట్లోనే ఉంది’ అన్నాడు. అంతే... కాలు విరిగి ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.