close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవయవాలు... అచ్చు గుద్దినట్లు..!

అవయవాలు... అచ్చు గుద్దినట్లు..!

తీరైన ముక్కూ చెవులూ చూడచక్కని చేతులూ కాళ్లూ ఉండాలని కోరుకోని వాళ్లెవరూ ఉండరు. కానీ విధివశాత్తూ కొందరికి పుట్టుకతోనే ఆయా భాగాలు సరిగా ఏర్పడుండకపోవచ్చు. మరికొందరు ప్రమాదాలబారిన పడి అవయవాలను కొంతమేర కోల్పోవచ్చు. అలాంటివాళ్లు ఏమాత్రం కుంగిపోకుండా అసలు వారికి లోపం ఉందని తెలిసే అవకాశమే లేకుండా అత్యంత సహజంగా ఉండి శరీరంలో కలిసిపోయేలాంటి కృత్రిమ అవయవాల్ని తయారుచేస్తోంది ఓ కంపెనీ.చాలా తెలివైన వాళ్లూ ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా చేతికో కాలికో చిన్న అవకరం ఉందని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. కానీ ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా ఒకసారి పోయిన అవయవం అచ్చుగుద్దినట్లూ అలాగే పుట్టుకురావడం అసాధ్యం. కాళ్లూ చేతులూ విరిగినపుడు కృత్రిమ కాళ్లనూ చేతుల్నీ పెడుతున్నారు కానీ అవి చూడగానే ప్లాస్టిక్‌వి అని తెలిసిపోతుంటాయి. ఇక, ఒకటీ రెండు వేళ్లు కొంత భాగం తెగిపోయిన సందర్భాల్లో వాటికి తొడగడానికి రబ్బరు వేళ్లు దొరుకుతున్నా అవీ కృత్రిమమైనవని తెలిసిపోతున్నాయి. అలాంటపుడు ‘అన్ని వేళ్లలా ఆ వేలూ ఉంటే ఎంత బాగుంటుందో, ఉంగరాలు పెట్టుకున్నా గోళ్ల రంగు వేసుకున్నా ఆ చిన్న అవకరం వల్ల అందం తగ్గిపోతుందే...’ అని అబ్బాయిలూ అమ్మాయిలూ బాధపడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగానే మెక్సికోకు చెందిన ‘డియాన్‌సెట్‌ (వెబ్‌సైట్‌...manosydedos.com) కంపెనీ సిలికాన్‌ ప్రోస్థెసిస్‌ పేరుతో చాలా సహజంగా ఉండేలా కాలి వేళ్లూ చేతి వేళ్లతో పాటు ముంజేతులూ పాదాలూ ముక్కూ చెవుల్లాంటి విడిభాగాలను తయారుచేస్తోంది. ప్రత్యేకమైన ఎలాస్టోమర్‌ పదార్థంతో రూపొందించే ఈ అవయవాల పైన నిజమైన శరీర భాగాలను పోలి ఉండేలా రంగులద్దుతారు. ఉదాహరణకు ఏదైనా వేలునే తీసుకుంటే... దానిపక్కనుండే వేళ్లూ రెండో చేతి వేళ్ల ఫొటోలనూ సైజుల్నీ తీసుకుని కృత్రిమంగా రూపొందించే వేలుని వాటి మధ్యలో సహజంగా ఇమిడిపోయేలా తీర్చిదిద్దుతారు. కృత్రిమ వేళ్ల చర్మం రంగుతో పాటు వేలి మీద ఉన్న ముడతలూ గోళ్లు కూడా అచ్చుగుద్దినట్లూ పక్కనున్న వేళ్లలా ఉండేలా జాగ్రత్తపడతారు. ఈ సిలికాన్‌ వేళ్లమీద వేలిముద్రలు కూడా ఉంటాయంటేనే అవెంత సహజంగా కనిపిస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఎలాస్టోమర్‌తో తయారైన ఈ వేళ్లు మామూలు వాటిలానే మెత్తగా ఉండడంతోపాటు తెగిన వేలుకి తొడిగితే సక్షన్‌కప్‌లా దానికి గట్టిగా అతుక్కుపోతాయి. కాబట్టి, ఏదైనా పనిచేస్తున్నపుడు కృత్రిమ వేలు ఊడిపోతుందన్న భయం కూడా అవసరం లేదు. ముంజేతులూ పాదాల్లాంటి వాటిని కూడా చర్మంమీద నరాలూ రోమాలు కూడా కనిపించేలా చాలా సహజంగా రూపొందిస్తారు. అందుకే, ఒక్కో అవయవం తయారీకి కొన్నినెలలు పడుతుందట.
వేడినీ తట్టుకోగలవు
ముక్కూ చెవుల్లో కొంతభాగం కోల్పోయినవారికి ఆయా అవయవాలనూ తయారుచేసిస్తారు. అయితే, వీటిని తొడగడానికి కుదరదు కాబట్టి, మెడికల్‌ జిగురుని అందిస్తారు. దీంతో అంటిస్తే చాన్నాళ్లపాటు అతుక్కునే ఉంటాయి. స్నానం చేసినా ఊడిపోవు. ఈ సిలికాన్‌ అవయవాలు వేడిని తట్టుకోగలవు. ఎసిటోన్‌, ఆల్కహాల్‌, గ్యాసోలీన్‌, గ్రీజు... లాంటి ద్రావకాలు వీటికి ఎలాంటి హానీ చెయ్యలేవు. అయితే, ఈ కృత్రిమ అవయవాలు మన చర్మంలానే మెత్తగా ఉంటాయి కాబట్టి, పదునైన వస్తువుల్ని ఉపయోగించేటపుడు జాగ్రత్తగా ఉంటే చాలు. పదీపదిహేనేళ్లపాటు ఎంచక్కా ధరించొచ్చట. కృత్రిమ అవయవాల్ని  సహజంగా కనిపించేలా తయారుచేసే కంపెనీలు మరికొన్ని ఉన్నాయి. కానీ అవయవాల్ని అత్యంత సహజంగా రూపొందిస్తూ డియాన్‌సెట్‌ సంస్థ వార్తల్లోకెక్కింది. నిజంగా గొప్ప విషయం కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.